అనంతపురం, ఏప్రిల్ 11 : ఈనెల 15వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకూ ప్రజాపథం కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి యన్. రఘువీరారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు వేసవిలో ఎదుర్కొనే ప్రధాన సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్దితో కృషి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. బుధవారం స్థానిక డ్వామా సమావేశ మందిరంలో కలెక్టర్ వి. దుర్గాదాస్ అధ్యక్షతన ప్రజాపథం కార్యక్రమం, జిల్లా కరవు పరిస్థితులపై చేపట్టవలసిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాతంలో లాంఛనంగా ప్రజాపథం కార్యక్రమం ప్రారంభిస్తారన్నారు. ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, మండల అధికారులు ప్రజాపథం కార్యక్రమం ప్రణాళికాబద్దంగా నిర్వహించడానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత నియోజకవర్గాల శాసనసభ్యులతో చర్చించి షెడ్యూల్ నిర్ణయించుకుని ఆ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించేందుకుగానూ ప్రజా ప్రతినిధులను ప్రతి విషయంలోనూ భాగస్వాములను చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రజాపథం కార్యక్రమానికి ఎటువంటి అవరోధం జరగకుండా చూడాలని ఈ సమయంలో సంబంధిత అధికారులకు ఎటువంటి సెలవులూ మంజూరు చేయరాదని కలెక్టరుకు సూచించారు. కరవును దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు తమ శాఖల తరపున నిర్వహించాల్సిన విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలందరికీ సెల్ప్ ఆఫ్ వర్క్స్ ద్వారా పనులు కల్పించాలని ఏ ఒక్కరూ కూలీ దొరకక వలసలు వెళ్లారన్న విషయం రాకూడదన్నారు. కూలీలకు గతంలో రూ. 80 కూలీ అందుతుండగా ప్రస్తుతం రూ. 137 లకు పెరిగిందన్నారు. అదేవిధంగా తాగునీరు, గడ్డపారలు ఇతరత్ర వాటి కోసం రూ. 13లు ప్రభుత్వం మంజూరు చేసిందని పథకం పారదర్శకంగా, పటిష్టంగా అమలు పరచాలన్నారు. కూలీలకు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ పంపిణీకి అందుబాటులో ఉన్న నిధుల నుంచి వ్యయం చేసి పంపిణీ చేయాలని కలెక్టరుకు సూచించారు. అదేవిధంగా మండుటెండలు కారణంగా నీడను ఏర్పాటు చేసే అంశంలో శ్రమశక్తి సంఘాల ద్వారా బట్టలతో తయారుచేసిన సరఫరాలకు తగు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో గ్రామాలలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజాపథం నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అందు కోసం పంపిన ప్రతిపాదనలు మొత్తం రూ. 100 కోట్లను ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తుందన్నారు. ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరాను ఎటువంటి ఆటంకాలు లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. 150 ఫీడర్ ఛానల్స్ ద్వారా ఏడు గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని మిగిలిన ప్రాంతాల్లో రెండు దఫాలుగా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలో విద్యుత్ శాఖకు అవసరమైన వస్తువుల కొనుగోలుకు గానూ ప్రభుత్వాన్ని అడిగిన రూ. 1.6 కోట్లను త్వరలోనే మంజూరు చేయిస్తామన్నారు. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన వైద్య సంబంధిత ఖర్చుల విషయం, ఆపరేషన్లు సరిగా నిర్వహిస్తున్నారని తెలిపారు. అత్యవసర వైద్య సేవల నిమిత్తం ఏర్పాటుచేసిన 108, 104 వాహనాలు జిల్లాలో సత్వర వైద్యసేవలు అందిస్తున్నాయన్నారు. వీటిపై ప్రజలలో మరింత అవగాహన కల్పించాలన్నారు. డిసెంబరు మాసాంతం వరకూ పావలావడ్డీకి సంబంధించి బకాయిలు త్వరలో చెల్లించగలమని తెలిపారు. పావలావడ్డీకి సంబంధించి రెండు కోట్లు మాత్రమే పెండింగులో ఉన్నాయన్నారు. పావలావడ్డీ పెండింగ్ బకాయిలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జనవరి 2012 నుంచి వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తామని ఈ అంశంపై ప్రజల్లో క్రమంగా అవగాహన కల్పించాలన్నారు. 2011-12 వ ఆర్థిక సంవత్సరంలో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ రూపేణా రూ. 398.17 కోట్లు, బీమా కింద రూ. 127 కోట్లు మొత్తం రూ. 525 కోట్లను ఈ నెల 15వ తేదీ లోపల ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. వచ్చిన మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని తెలిపారు. ఇన్‌పుట్ సబ్సిడీని పారదర్శకంగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడంలో మన జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. బ్యాంకర్లకు సరైన దిశా నిర్దేశం చేయాలని రైతుల ఖాతాల్లోకి జమ కావడంలో జాప్యం జరగకుండా చూడాలని కలెక్టర్‌కు సూచించారు. ఈ సందర్భంగా అనంతపురం పార్లమెంటు సభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ .. ట్రాన్స్‌ఫార్మర్లు కోరుతూ డిడిలు చెల్లించిన వారికి డిడిలు చెల్లింపుతేదీకి ప్రాధాన్యత ఇచ్చి సీనియారిటీ ప్రాతిపదికన సీరియారిటీ రిజిస్టరు చేసుకునేలా సంబంధిత ఏడిలకు ఆదేశాలు ఇవ్వాలని ట్రాన్స్ కో యస్‌ఈకి సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి నివారణ చర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మూడు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ మూడు ప్రత్యేక బృందాలు అధికారుల పర్యవేక్షణలో వారం వారం సమీక్షలు నిర్వహించి సమస్యల నివారణకు పరిష్కారాలు తీసుకుంటాయన్నారు. సమావేశంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ అనితారామచంద్రన్, అదనపు జెసి బిఎల్ చెన్నకేశవరావు, ఆర్‌డిఓ యం. సుదర్శనరెడ్డి, డిఆర్‌డిఏ, డ్వామా పిడిలు రంగయ్య, మురళి, మున్సిపల్ కమిషనర్ నీలకంఠారెడ్డి, అనంతపురం, ధర్మవరం ఆర్‌డిఓలు గౌతమి, ప్రభాకర పిళ్ళై, వ్యవసాయ శాఖ జెడి సాంబశివరావు, మెప్మా పిడి మల్లేశ్వరి, డిపిఓ ఈశ్వరయ్య, సిపిఓ నాగేశ్వరరావు, డిఎం అండ్ డిహెచ్ పూల వెంకట్రమణలతో పాటు పలువురు జిల్లా అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఎన్నికల స్టంట్!
హిందూపురం, ఏప్రిల్ 11: త్వరలో రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనుండటంతో ఆ ప్రాంతానికి అమలు పరుస్తున్న శ్రీరామరెడ్డి తాగునీటి పథకంపై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి వహిస్తున్నారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం అమలులో భాగంగా రాయదుర్గం ప్రాంతంలో నాల్గో విడత పనులు కొద్ది రోజులుగా విస్తృతంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు జరగనుండటంతో వీలైనంత త్వరలో రాయదుర్గం ప్రాంతానికి పిఏబిఆర్ డ్యాం నుండి తుంగభద్ర జలాలు అందించాలన్న ఉద్దేశంతో మరింత ప్రత్యేక చర్యలు సాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో నీటి పథకానికి సంబంధించి పంప్‌లను బిగిస్తుండటంతో మడకశిర, హిందూపురం తదితర ప్రాంతాలకు శనివారం నుండి సోమవారం వరకు మూడు రోజుల పాటు నీటి సరఫరాను అధికారికంగానే నిలిపివేస్తున్నట్లు స్థానిక మున్సిపల్ అధికారులకు సమాచారం అందింది. అయితే నాల్గో విడత పనులు రాయదుర్గం ప్రాంతంలో సాగుతుండటంతో పంప్‌లను బిగించేందుకు సంప్‌లకు రంధ్రాలు వేయాల్సి ఉన్నందున నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చెబుతున్నారు. సంప్‌లకు వేసే రంధ్రాలను మూసేందుకు మూడు రోజుల పాటు సమయం పడుతున్నందున హిందూపురం తదితర ప్రాంతాలకు మూడు రోజుల పాటు నీటి సరఫరాను నిలిపి వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటున్నారు. అసలే హిందూపురంలో శ్రీరామరెడ్డి తాగునీటి పథకం అమలు అంతంత మాత్రంగానే సాగుతోంది. తరచూ ఏదో ఒకచోట లీకేజీలు ఏర్పడటం, విద్యుత్‌కోత తదితర సాంకేతిక కారణాలవల్ల రోజుల తరబడి నీటి సరఫరా ఆగిపోతోంది. తాజాగా రాయదుర్గం ఉప ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఆ ప్రాంతానికి వీలైనంత త్వరలో నీటిని అందించేందుకు చర్యలు సాగిస్తుండటంతో ఇక వేసవిలో హిందూపురం తదితర ప్రాంతాలకు మూడు రోజుల పాటు నీటి కొరత ఏర్పడనుంది. రాయదుర్గం ప్రాంతంలో తీవ్ర నీటిఎద్దడి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను కలుసుకొనే ముందు నీటిని అందించాలని భావించి ఈ దిశగా చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాయదుర్గం ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం కావడంతో ఇంకా నోటిఫికేషన్ వెలువడక ముందే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇదిలా ఉండగా మూడు రోజులపాటు నీటి సరఫరా బంద్ కానుండటంతో స్థానిక మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారిస్తున్నారు. సమస్య తీవ్రంగా ఉన్న వార్డుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని భావిస్తున్నారు. మున్సిపల్ బోర్ల ద్వారా ట్యాంక్‌లకు నీటిని మళ్ళించి అక్కడ ఫిల్లింగ్ పాయింట్‌లను ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రజలకు సరఫరా చేయాలని నిర్ణయించి ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు.
జోరుగా దొంగనోట్ల చెలామణి !
హిందూపురం, ఏప్రిల్ 11: వాణిజ్య కేంద్రమైన హిందూపురంలో ఇటీవల కాలంగా దొంగనోట్ల చలామణి జోరుగా సాగుతోంది. తరచూ స్థానిక బ్యాంకుల్లో నకిలీ నోట్లను అధికారులు గుర్తిస్తున్నారు. కర్నాటక రాజధాని బెంగళూరు నగరానికి సరిహద్దుగా ఉంటున్న హిందూపురంలో నకిలీ నోట్ల దందా సాగుతుండటం వ్యాపార వర్గాలను తీవ్ర విస్మయానికి గురి చేస్తోంది. బెంగళూరులోని ఎటిఎం కేంద్రాల్లో కూడా నకిలీ నోట్లు వస్తుండటంతో ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు. బెంగళూరుకు తరచూ పెద్ద సంఖ్యలో స్థానిక వ్యాపార, ఉద్యోగ వర్గాలు లావాదేవీల కోసం వెళ్లి వస్తుండటం జరుగుతోంది. ఇందులో భాగంగా హిందూపురానికి చెందిన ఆయా వర్గాలకు వ్యాపార లావాదేవీల్లో నకిలీ నోట్ల బెడద తీవ్రంగా ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు హిందూపురంలో కూడా నకిలీ నోట్ల ముఠా కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదే విషయమై పోలీసు వర్గాలు కూడా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అసలు నోటుకు ఏమాత్రం తీసిపోకుండా నకిలీ నోట్లు ఉండటంతో చదువుకున్న వారు సైతం గుర్తించలేకపోతున్నారు. ఇక అమాయకుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. లేజర్ ప్రింటర్ల ద్వారా అసలు నోటును జెరాక్స్ తీసి నకిలీ నోట్లను చలమణి చేస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో స్థానిక ఓ లాడ్జిలో నకిలీ నోట్ల ముఠా మకాంవేసి పోలీసులకు దొరికిపోయారు. అప్పట్లో ఒకటికి నాలుగింతలు నకిలీ నోట్లు ఇస్తామని మభ్యపెట్టి కొందరిని ఆ ముఠా మోసగించింది. హిందూపురంలో పట్టుగూళ్లు, పట్టుచీరలు, చింతపండు, ఎండుమిర్చి తదితర వ్యాపార లావాదేవీలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొన్న నకిలీ నోట్ల ముఠా విచ్చలవిడిగా నకిలీ నోట్లను చలామణి సాగిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీని కారణంగా అటు వ్యాపారులతోపాటు ఇటు కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు మోసాలకు గురవుతున్నారు. ఏకంగా రూ.1000, రూ.500లతోపాటు రూ.100 నకిలీ నోట్లు ప్రస్తుతం మార్కెట్‌లో చలామణి అవుతున్నాయి. సాధారణంగా నోటుకు ఎడమ వైపు భారత మూడు సింహాల చిహ్నం పైభాగాన ముద్రించే నకిలీ నోట్లకు ఆయా విలువ కలిగిన అంకెలు ఉండవు. అసలు నోట్లకు ఆ విలువ ఉన్న అంకెలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే లేజర్ ప్రింటర్ల ద్వారా జెరాక్స్ తీస్తుండటంతో అసలు నోట్ల తరహాలోనే ఆయా అంకెలు కనబడుతుండటంతో ఎందరో మోసపోతున్నారని బ్యాంకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు నోట్ల తయారీకి ఉపయోగించే కాగితాన్ని బట్టి గుర్తించవచ్చని చెబుతున్నారు. నకిలీ నోట్లను బ్యాంకర్లు తప్ప మిగిలిన చదువుకున్న వారు సైతం గుర్తించే పరిస్థితులు లేకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలే 7ఎఎఫ్ 493971 నెంబర్ గల రూ.1000 నోటు, 9 బిఆర్ 799583 నెంబర్ గల రూ.500, 4 సిపి జె 30550 నెంబర్ గల రూ.100ల నకిలీ నోట్లను బ్యాంకర్లు గుర్తించారు. ఇదే తరహాలో రోజూ ఏదో ఒక బ్యాంక్‌లో నకిలీ నోట్లు బహిర్గతం అవుతుండటం స్థానికులను అయోమయానికి గురి చేస్తోంది. పోలీసు వర్గాలు నకిలీ నోట్ల చలామణి ముఠాపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి అరికట్టకపోతే ఆయా కార్యకలాపాలు మరింత విచ్చల విడిగా తయారై ప్రజలను మరింత మోసగించే అవకాశాలు ఉన్నాయి.
జిల్లాలో భూ ప్రకంపనలు
తాడిపత్రి, తాడిపత్రి రూరల్, ఏప్రిల్ 11:జిల్లాలో బుధవారం స్వల్పంగా భూమి కంపించింది. తాడిపత్రి పట్టణం, యల్లనూరు మండలాల్లో భూమి కంపించడంతో జనం భయంతో వణికిపోయారు. తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురం, యల్లనూరురోడ్డు, నందలపాడు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లలోని టివిలు, ఫ్రిజ్‌లు, గాజుపాత్రలు కొద్దిసేపు కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఏదో జరుగుతోందని భయపడ్డ జనం ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. యల్లనూరు రోడ్డులోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం గోడలు బీటలుబారాయి. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.యల్లనూరు మండలంలోని బిసి కాలనీలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ఇళ్లలోని వస్తువులు, టివిలు, ఫ్రిజ్‌లు కదిలినట్లు స్థానికులు తెలిపారు. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
రైతులకు రూ. 525 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ
పుట్టపర్తి రూరల్, ఏప్రిల్ 11: ఖరీఫ్‌లో పంట నష్టపోయిన అనంత రైతులకు రూ.525కోట్ల బీమా వచ్చిందని రెవెన్యూ శాఖామంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని పెడపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారు రూ.11లక్షలతో నిర్మించిన భవనం ప్రారంభోత్సవాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెడపల్లి పిఎస్‌సిఎస్ సహకార సంఘ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి స్వాతంత్య్ర సమరయోదుడు చితంబర్‌రెడ్డి పేరు పెట్టడం చాలా సంతోషంగా వుందన్నారు. హంద్రీనీవా నీటిని త్వరలో ఉరవకొండ వరకు రానున్నాయని మూడు సంవత్సరాల్లో జిల్లా అంతటా నీరుఅందేలా చూస్తామన్నారు. ఈ నెల 15 నుంచి మే 5వరకు ప్రజాపథం గ్రామాల్లో నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాల్లో ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు రూ.525కోట్లు చెక్కుల రూపంలో పంపిణీ చేస్తామన్నారు. గతంలో సబ్సిడీ ఎకరాకు రూ.500 ఇచ్చేవారని, అందులో రూ.200 పక్కదారి పట్టేదని, రైతులకు మాత్రమే రూ.300 మాత్రమే చేతికి అందేదన్నారు. అయితే ఎక్కడాలేదని విధంగా ప్రస్తుతం మొట్టమొదటి సారిగా మన రాష్ట్రంలో రైతులకు వచ్చే మొత్తాన్ని వారి వ్యక్తిగత ఖాతాల్లో జమచేస్తున్నామన్నారు.
సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోండి
- ఎమ్మెల్యే పల్లె
5, 6 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను తగినంత సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే పల్లె రఘునాథ్‌రెడ్డి మంత్రి రఘువీరాను కోరారు. 2010-11 సంవత్సరాల్లో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎడిసిసి బ్యాంకు చైర్మన్ తరిమెల కోణారెడ్డి, డిజిఎం చెంచయ్య, సిఇఓ నరసింహారెడ్డి, స్పెషలాఫీసర్ వెంకటేషం, ఆర్‌డిఓ ఈశ్వర్, తహశీల్దార్ కోదండరామిరెడ్డి, ఎంపిడిఓ మంజునాథ్‌రావు, కాంగ్రెస్ నాయకులు కోటా సత్యం, చలపతి, మాజీ ఎంఎల్‌ఎ నాగరాజారెడ్డి, మాజీ ఎంపి ఖాసీం ఖాన్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ గెలుపే అభివృద్ధి పనులకు మలుపు
కణేకల్లు, ఏప్రిల్ 11: రాబోయే ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి పనులకు మలుపుగా ఉంటుందని శాసన మండల విప్ వై.శివరామిరెడ్డి పెర్కొన్నారు. కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ విప్ శివరామిరెడ్డి బుధవారం మండల పరిధిలోని పుల్లంపల్లి, పూలచర్ల, నల్లంపల్లి, నక్కలవడికి, ఎర్రగుంట, గనిగేర తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్రగుంట గ్రామాంలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహాసముద్రమని, పార్టీ ప్రజల కోసం ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ దారిద్య్ర రేఖకు దిగువనవున్న ప్రజలను ప్రజల సంక్షేమం కోసం అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. అందులో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, ఆరోగ్య శ్రీ, మహిళలకు పావుల వడ్డీ రుణాలు, రైతులకు వడ్డీలేని రుణాలు, రుణమాఫీ తదితర అమూల్యమైన కార్యక్రమాలు అమలులోకి తెచ్చిందన్నారు. ఉప ఎన్నికలలో రాయదుర్గం నియోజక వర్గం తరుపున అధిష్టానం, పార్టీ టికెట్ పాటిల్ వేణుగోపాల్‌రెడ్డికి కేటాయించిందన్నారు. పాటిల్ వేణుగోపాల్ రెడ్డిని గెలిపించడం వల్ల మండలంలో సమస్యలను తీర్చడం వీలవుతుందన్నారు. మాజీ ఎంపిపి రాజగోపాల్‌రెడ్డి, మాజీ జడ్పీటిసి నాగిరెడ్డి, మాజీ ఎంపిటిసి మోహన్‌రెడ్డి, ఉరవకొండ మాజీ ఎంపిపి ఎర్రిస్వామి, మార్కెట్ యార్డు చైర్మన్ రమణ, మార్కెట్ కమిటీ సభ్యులు హనుమాపురం తిమ్మప్ప పాల్గొన్నారు.
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
కొత్తచెరువు, ఏప్రిల్ 11: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో సమస్యలను అధిగమించి రైతులకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ లక్ష్యమని రెవెన్యూ శాఖామంత్రి రఘువీరారెడ్డి అన్నారు. మండల పరిధిలోని తలమర్ల గ్రామంలో నూతనంగా రూ. 1.20కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రి రఘువీరారెడ్డి బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. అదేవిధంగా తలమర్ల గ్రామంలో రూ. 7.5లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,600కోట్లు సబ్సిడీ అందిస్తోందని అవసరమైన విద్యుత్ ఉత్పత్తి లేనందున ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను యూనిట్‌కు రూ. 9దాకా వెచ్చించి కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నామని, 7 గంటలపాటు రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఇదే పద్ధతి భవిష్యత్తులో కూడా అనుసరిస్తామన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తలమర్ల గ్రామానికి ఎన్నికల ప్రచారం కోసం వచ్చామని తమకు విద్యుత్ విద్యుత్ సబ్‌స్టేషన్ కావాలని అప్పట్లో ప్రజలు కోరారని, వారికి మంజూరు చేస్తానని హామీ ఇచ్చానని, ఆ హామీ మేరకు విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించామన్నారు. ఈ నిర్మాణం వల్ల దాదాపు 10 గ్రామాల ప్రజలకు లో వోల్టేజీ సమస్య తీరుతుందన్నారు. ఇండ్ల వెంకటంపల్లి గ్రామంలో ప్రవాసభారతీయుడు చెన్నారెడ్డి కోట్లాది రూపాయల వ్య యంతో నిర్మించిన చెన్నకేశవ ఆలయా న్ని మంత్రి పరిశీలించారు. మారుమూ ల గ్రామంలో దేవాలయాన్ని నిర్మించిన చెన్నారెడ్డిని అభినందించారు. ఇతర దేశాల్లో స్థిరపడ్డ భారతీయులకు చెన్నారెడ్డి ఒక ఆదర్శమని గ్రామంలో ఆల యం నిర్మించడం కాకుండా గ్రామంలోని ప్రజలను ఐక్యపరిచి వారికి ఆర్థికసాయం అందించడం, వౌలిక సదుపాయాలు కల్పించడంలో చెన్నారెడ్డి చేసిన కృషిని ఆయన శ్లాగించారు. ప్రతి గ్రామం నుంచి ఒకరో ఇద్దరో ఇతర దేశాల్లో స్థిరపడ్డారని, అలాంటి వారు స్వగ్రామం గురించి ఆలోచిస్తే గ్రామంలోని సమస్యలు మాయమవుతాయన్నారు. ఆ తరువాత కొత్తచెరువుకు వస్తున్న మంత్రి రఘువీరారెడ్డిని మరకొండపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో మంచినీటి ఎద్దడి నెలకొన్నా పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని మంత్రి ఎదుట మహిళలు వాపోయారు. తమకు తక్షణమే మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరారు.ఇందుకు స్పందించిన మంత్రి యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్తచెరువులో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.
సిపిఎం నాయకుల అరెస్టు
మంత్రి రఘువీరారెడ్డి పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన సిపిఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొత్తచెరువులో 8 నెలల క్రితం మంత్రి రఘువీరా ఇళ్లపట్టాలు మంజూరు చేశారని, స్థలాలను చూపించడానికి అధికారులు నిరాకరించడం వల్ల మంత్రి పర్యటనను అడ్డుకోవడానికి సిపిఎం నాయకులు సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సిపిఎం డివిజన్ కార్యదర్శి కొండారెడ్డి, మండల కార్యదర్శి లాజం తదితరలతో పాటు పలువురుని అరెస్టుచేసి మంత్రి పర్యటన ముగిసేవరకు స్టేషన్‌లో నిర్బంధించారు.
తలమర్లలో జరిగిన కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్యే పల్లె రఘునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగరాజారెడ్డి, హిందూపురం కాంగ్రెస్ ఇన్‌చార్జి ఖాసీంఖాన్, దేశం కన్వీనర్ మైల చంద్రశేఖర్, కాంగ్రెస్ కన్వీనర్ శ్రీనివాసులు, సర్పంచు క్రిష్ణవేణమ్మ, మాజీ సర్పంచు చెన్నారెడ్డి, పత్తి చలపతి, సాముకోట ఆది, కోటా సత్యం, కాంగ్రెస్ లీగల్ సెల్ కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్సీ రమణమూర్తి, ఎంపిడిఓ నిహానియా, ఎంఆర్‌ఓ హరిలాల్ నాయక్, అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.
రూ. 1900 కోట్లతో ఉపాధి హామీ ప్రణాళిక
హిందూపురం రూరల్, ఏప్రిల్ 11: అనంతపురం జిల్లాలో ఈ ఏడాది రూ.1900 కోట్లతో ఉపాధి హామీ పనులు చేపట్టడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ మురళి తెలిపారు. బుధవారం స్థానిక డ్వామా కార్యాలయంలో హిందూపురం, మడకశిర, పుట్టపర్తి క్లస్టర్లకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడి మురళి విలేఖరులతో మాట్లాడుతూ, 2012-13 సంవత్సరంలో జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యానవన తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. జిల్లాలో భూగర్భజలాలు పెంపొందించడానికి వివిధ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత ఏడాది 10 వేల ఎకరాల్లో పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టామన్నారు. ఈ ఏడాది 20 వేల హెక్టార్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పిడి చెప్పారు. భూగర్భజలాలు పెంపొందించడంలో భాగంగా గత ఏడాది రూ.286 కోట్లతో 12 వేల ఊట చెరువులు నిర్మించి, 2 కోట్ల క్యూబిక్ మీటర్ల కందకాలు తవ్వినట్లు తెలిపారు. ఈ ఏడాది ఈ పనుల కోసం రూ.350 కోట్లు కేటాయించామన్నారు. జూలై నెలలోపు జిల్లా వ్యాప్తంగా చెట్లునాటే కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు.ఈ నెల 16వ తేదీ నుండి ప్రజాపథం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, శ్రమశక్తి సంఘాలకు నూరు శాతం పనులు కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ నెల 15వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు 60 రోజుల్లో ఉపాధిహామీ ద్వారా కూలీలకు కనీసం 50 రోజుల పాటు పని కల్పించే విధంగా క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ సమావేశంలో అదనపు పిడి రమేష్‌రెడ్డి, ఎంఐఇ ప్రకాష్, ప్లాంటేషన్ మేనేజర్ మధుబాబు, జిల్లా అటవీ శాఖ అధికారి సుబ్రమణ్యం, రేంజ్ అధికారి, ఎపిఓలు, ఫీల్డ్ సిబ్బంది పాల్గొన్నారు.
గుర్తు తెలియని మహిళ శవం లభ్యం
చెనే్నకొత్తపల్లి, ఏప్రిల్ 11: సుమారుగా 40ఏళ్లు వయస్సు కల్గిన ఓ గుర్తుతెలియని మహిళ శవం బుధవారం బయటపడింది. వివరాల మేరకు 44వ జాతీయ రహదారి పక్కన హంద్రీనీవా కాలువ పనులకు సమీపంలో మహిళ శవం బయటపడింది. అయితే సదరు మహిళ దాదాపు పదిరోజుల క్రితమే మృతిచెందడంతో గుర్తించడానికి వీలులేకుండాపోయింది. బుధవారం అటువైపుగా వెళ్లిన పశువుల కాపర్లు, స్థానికులకు కుక్కలు పీక్కుతింటున్న శవాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ దస్తగిరి హుటాహుటీగా సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఆటో బోల్తా విద్యార్థి మృతి
బెళగుప్ప, ఏప్రిల్ 11: మండలంలోని బుధవారం ఆటో బోల్తాపడిన సంఘటనలో పదవ తరగతి విద్యార్థి హరీష్‌నాయుడు మృతి చెందాడు. ఎర్రగుడికి చెందిన హరీష్‌నాయుడు(16) ఇటీవల పదవతరగతి పరీక్షలు రాశాడు. బుధవారం తగ్గుపర్తి నుంచి బెళగుప్పకు ఆటోలో వస్తుండగా ప్రమాదవశాత్తు ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆటోలో ఉన్న హరీష్‌నాయుడు తీవ్రంగా గాయపడ్డాడు.ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. ఎస్‌ఐ రఫీ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత అదృశ్యం
లేపాక్షి, ఏప్రిల్ 11: మండల పరిధిలోని చోళసముద్రం గ్రామానికి చెందిన వివాహిత మహిళ శివమ్మ (23) ఈ నెల 9వ తేదీ నుండి కనిపించడం లేదని భర్త చిన్న నరసింహప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 9వ తేదీన భర్త ఎదుట మరొకరితో శివమ్మ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా ఆమెను చీవాట్లు పెట్టాడు. దీంతో ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. శివమ్మ కోసం బంధువుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో లేపాక్షి పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్ర వాహనాలు ఢీకొని ఐదుగురికి గాయాలు
అమరాపురం, ఏప్రిల్ 11: మండల పరిధిలోని మద్దనకుంట గేట్ సమీపంలో బుధవారం ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. కెంకర గ్రామానికి చెందిన రామన్న, దొడ్డక్కలు అమరాపురం నుండి కెంకరకు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ఉదగూరు నుండి ఎంజారప్ప, నాగరాజు, రామలింగప్పలు వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకొంది. ఎంజారప్ప, నాగరాజు, రామలింగప్పలకు కాలు, చేయి, తలలకు రక్తగాయాలయ్యాయి. గాయపడ్డ బాధితులను చికిత్సల నిమిత్తం అమరాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే దొడ్డక్కకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెకు మెరుగైన చికిత్సలు అవసరమైనట్లు వైద్యులు చిదంబరం తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ నక్సలైట్ అరెస్టు
అమరాపురం, ఏప్రిల్ 11: మండలంలోని బసవనపల్లిలో సెంటు ఫ్యాక్టరీని పేల్చివేసిన కేసులో నిందితుడిగా ఉన్న మాజీ నక్సలైట్ గొల్ల అక్కులప్పను అరెస్టు చేసినట్లు మడకశిర సిఐ హరినాథ్ తెలిపారు. 1998లో బసవనపల్లి వద్ద ఉన్న సెంటు ఫ్యాక్టరీని పేల్చి వేసిన సంఘటనలో అక్కులప్ప పాల్గొన్నట్లు సిఐ తెలిపారు. మంగళవారం సాయంత్రం పావగడ తాలూకా కెబి హళ్ళి వద్ద అక్కులప్పను అరెస్టు చేసి మడకశిరలో కోర్టులో హాజరు పరచినట్లు సిఐ తెలిపారు.
గడ్డివాములు దగ్ధం
గోరంట్ల, ఏప్రిల్ 11: మండల పరిధిలోని వెంకటరమణపల్లిలో బుధవారం రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. వెంకటరామప్ప, పెద్దాయప్పలకు చెందిన సుమారు రూ.30 వేలు విలువచేసే గడ్డివాములు దగ్ధమయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
లేపాక్షి, ఏప్రిల్ 11: మండల పరిధిలోని మానేపల్లికి చెందిన మద్దిలేటి, నరసింహులు కర్నాటక బాగేపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురయ్యారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మానేపల్లి నుండి పెళ్లి పత్రికలు ఇవ్వడానికి బాగేపల్లి సమీపంలోని కడపల్లికి మద్దిలేటి, నరసింహులు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బాగేపల్లి సమీపంలోని బ్రిడ్జికి ప్రమాదవశాత్తు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో మద్దిలేటి తీవ్ర గాయాలకు గురై అక్కడే స్పృహ కోల్పోయాడు. నరసింహులు స్వల్ఫ గాయాలకు గురయ్యాడు. అక్కడి నుండి కారులో వీరిని చికిత్సల నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
జైపూర్- మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం
గుంతకల్లు, ఏప్రిల్ 11: ట్రెన్ నెంబర్ 12876 జైపూర్- మైసూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంబవించింది. పెను ప్రమాదం నుండి బయట పడిన ప్రయాణీకులు కోచ్ మార్చాలని రైల్వే అధికారులను డిమాండ్ చేశారు. ప్రయాణీకులను భయాందోళనలకు గురి చేసిన సంఘటనకు సంబందించి ప్రయాణీకులు తెలిపిన వివరాల మేరకు.... జైపూర్ నుండి మైసూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని డోన్ రైల్వేస్టేషన్ దాటిన కొంతసేపటికి ఎసి బి4 కోచ్ నుండి మంటలు చెలరేగినట్లు ప్రయాణీకులు తెలిపారు. రైలు వేగంగా వెళ్తుండటంవల్ల మంటలు తీవ్ర రూపం దాల్చాయన్నారు. మంటల ఎగసి పడటంతో ప్రయాణీకులు భయంతో పరుగులు తీస్తు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా రైలును ఎద్దుల దొడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో నిలిపి వేశారు. దీన్ని గమనించిన ఆర్పీఎఫ్ ఎఎస్సై ఇబ్రహీమ్ సకాలంలో స్పందించి రైలులో వున్న అగ్ని మాపక యంత్రాలలోని కెమికల్ ఉపయోగించి మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. లేకుంటే ప్రమాదం తీవ్ర స్థాయికి చేరి ప్రాణాలకు ముప్పు వాటిల్లి వుండేదని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేశారు. రైలు గుంతకల్లు రైల్వే స్టేషన్ చేరుకోగానే రైల్వే అధికారులు, సాంకేతిక సిబ్బంది, ఎలెక్ట్రికల్ తదితర విబాగాలకు చెందిన సిబ్బంది కోచ్‌ను పరిశీలించారు.
ఎసి కోచ్‌లో నిర్లక్ష్యంగా సిగరెట్ తాగి వేయడం వల్ల ప్రమాదం సంబవించిందని వారు నిర్ధారించారు. అయితే పెనుప్రమాదం తప్పిందని, లేని పక్షంలో ప్రాణ నష్టం సంబవించే అవకాశం వుండేదని వారు తెలిపారు. సకాలంలో రైలును నిలిపివేసి మంటలను అదుపు చేయడంవల్ల పెను ప్రమాదం తప్పిందని వారు తెలిపారు. అయితే ప్రయాణీకులు మాత్రం సంభవించిన కోచ్ వెంటనే మార్చాలని వారు డిమాండ్ చేశారు. అయితే గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో ఎసి కోచ్‌లు లేవని, దీంతో కోచ్ మార్పు సాధ్యం కాదని ప్రయాణీకులకు సర్దిచెప్పారు. రానున్న బెంగళూర్ స్టేషన్‌లో కోచ్‌ను మార్చడం సాధ్యం కావచ్చునని ప్రయాణీకులకు నచ్చ చెప్పారు.