వారసత్వం వరం అనుకుంటాం గానీ... ఆ కిరీటం మోయడం కష్టమే. ఎన్నో అంచనాలుంటాయ్.
బాధ్యతలుంటాయ్. వాటిని ప్రతిసారీ
నిలబెట్టుకుంటూ నెగ్గుకురావడం
అనుకొన్నంత సులభం కాదు. గెలిస్తే
ఆ క్రెడిట్ ఫాదర్లకూ.. గాడ్‌ఫాదర్‌లకూ
వెళ్లిపోతుంది. ఓటమి మాత్రం ఒంటరిగా మోయాలి. అల్లువారి పిల్లగాడిగా అడుగుపెట్టిన అల్లు అర్జున్‌కూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.
ఇతనేంటి? హీరో ఏంటి? అనుకొన్నవారిచేతే... బన్నీ ఈజ్ ది బెస్ట్ అనిపించుకొన్నాడు. ఆ క్రెడిట్ మెగా కుటుంబానిది కాదు.. పూర్తిగా అతనిదే. పదేళ్ల నటన ప్రయాణం పూర్తయిన సందర్భంగా అల్లు అర్జున్ సినీ ప్రయాణాన్ని విశే్లషించుకొంటే.. ఫస్ట్‌లుక్ ఈజ్ బెస్ట్ లుక్ అంటారు...!
తొలిచూపులోనే ఆకట్టుకుంటే ఇక తిరుగులేదన్నమాట. కానీ ‘గంగ్రోతి’లో నూనూగు మీసాల బన్నీని చూస్తే... తెలుగు సీమలో హేమాహేమీల మధ్య రాణించడం కష్టం అనుకొన్నారంతా. ఎందుకంటే హీరోకు ఉండాల్సిన దేహదారుఢ్యం లేదు.. డైలాగు చెబితే ఇంకా పసిపిల్లాడు మాట్లాడుతున్నట్లే ఉంది. ఆ సినిమాలో బిల్డప్‌లు లేవు. చాలా సన్నివేశాల్లో లాగూవాలాగానే కనిపించాడు. ఓ సరదా ఘట్టంలో అమ్మాయిగానూ మారిపోయాడు. ఆ సినిమా హిట్ ఖాతాలో చేరినా క్రెడిట్ అంతా రాఘవేంద్రుడికీ, కీరవాణికీ చేరిపోయింది. అలా బన్నీకి విజయం దక్కినా... ఏ మూలో చిన్న డౌట్!
అదికాస్తా రెండో సినిమా ‘ఆర్య’తో పటాపంచలైపోయింది. ఓ హీరో, ఓ హీరోయిన్, ఓ విలన్ అనే మామూలు కమర్షియల్ సూత్రాలకు విరుద్ధంగా నడిచిన ఈ సినిమా బన్నీలోని నటుడిని బయటపెట్టింది. నృత్యాలు, పోరాటాలు, సంభాషణా చాతుర్యం, హావభావాలూ.. అన్నిటా మొదటి మార్కులు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పతాక సన్నివేశాలు అల్లు అర్జున్‌లోని నటుడ్ని తొలిసారి కెమెరా ముందుకు తీసుకువచ్చాయి. ‘్ఫల్ మై లవ్’ అనే కానె్సప్ట్ సుకుమార్ సృష్టే అయినా దానికి జీవం పోసింది బన్నీనే. తొలిసారి బన్నీలోని హీరోయిజాన్ని మొదటిసారి ప్రేక్షకులు ఫీలయింది ఈ సినిమాతోనే.
హీరోకు మాస్ ముద్ర కావాలి! మాస్ హీరో అనిపించుకొంటే- అలాంటి కధ ఒకటి తగిలితే.. ఇక తిరుగులేదు. బన్నీకి ఇలానే అనిపించింది. సొంత సంస్థ గీతా ఆర్ట్స్ ఉండనే ఉంది. అల్లు అర్జున్‌ను మాస్ హీరోగా నిలబెట్టే దమ్ము.. వి.వి.వినాయక్‌కు మాత్రమే ఉందని గీతా ఆర్ట్స్ నమ్మింది. దాంతో బన్నీ సినిమా పట్టాలెక్కింది. కొత్తదనం పేరు చెప్పి నేలవిడిచి సాము చేయలేదు. మాస్ కమర్షియల్ సూత్రాల అనుగుణంగా అల్లుకొన్న కధే ఇది. కధను వినాయక్ తీర్చిదిద్దిన విధానం బన్నీ జోష్, దేవిశ్రీ సంగీతం వెరశి సినిమా సక్సెస్‌బాట పట్టింది. బన్నీని మాస్ హీరోగా నిలబెట్టింది. ఇక యువతరానికి నచ్చాలి అంటే పక్కా ప్రేమకధను ఎంచుకోవాలి. ప్రేమకధలకు చిరునామా కరుణాకరన్. అంతే.. ‘హ్యాపీ’ వచ్చేసింది. ఆ సినిమా వ్యాపార పరంగా అంతగా సంతృప్తినివ్వకపోయినా బన్నీని యువతరానికి దగ్గర చేసింది. ‘దేశముదురు’లో ‘సిక్స్‌ప్యాక్’ చూపించి బాలీవుడ్ హీరోల్ని మరపించాడు. హీరో అంటే పాటల్లో చిందులు వేయడం, ఫైట్లు చేయడమే కాదు.. స్టైల్‌కూడా ఉండాలనేది బన్నీ సిద్ధాంతం. దాంతో కేశాలంకరణపై కూడా దృష్టిపెట్టాడు. ‘దేశముదురు’లో బన్నీ చూపిన స్టైల్ యువతరానికి బాగా నచ్చింది. ఆ తరువాత ‘పరుగు’తో ఫ్యామిలీని బుట్టలో వేసుకున్నాడు. మల్టీస్టారర్ చిత్రాలు ఇకరావు అనుకున్న తరుణంలో ‘వేదం’ వచ్చింది. పరిశ్రమలో యువకధానాయకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉందని ఈ సినిమాతో రుజువుచేశాడు.
‘ఆర్య-2’ లాంటి సినిమా ఒప్పుకుని ఓ మాస్ హీరోగా అల్లు అర్జున్ సాహసం చేశారనే చెప్పాలి. ఎందుకంటే ఆ పాత్రలో హీరో లక్షణాలు ఏ మాత్రం కనిపించవు. దాదాపు ప్రతినాయక ఛాయలే ఉంటాయి. అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర ‘ఆర్య-2’ పల్టీలు కొట్టినా బన్నీ నటనను, కష్టాన్ని తేలిగ్గా తీసిపారేయలేం. ముఖ్యంగా నృత్య విభాగంలో బన్నీతో పోటీపడగలిగే సత్తా.. అతికొద్దిమంది హీరోలకే ఉందని ఈ సినిమాతో చాటి చెప్పారు. కేరళలో బన్నీకి వున్న అభిమానగణం ఈ సినిమాతో రెట్టింపైంది. ‘బద్రీనాధ్’ ఫలితం ఇక్కడ కొంచెం కంగారు పెట్టినా.. కేరళలో మాత్రం మంచి వసూళ్లే అందాయి. ఈ ప్రయాణంలో కొన్ని తప్పటడుగులూ పట్డాయి.
గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘వరుడు’ బన్నీ కెరీర్‌లో మైనస్ మార్క్. గుణశేఖర్ ట్రాక్ రికార్డ్‌పై పెట్టిన దృష్టి కధపై పెట్టలేదు. దాంతో ఘోర పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. బద్రీనాధ్ కూడా అంచనాలను అందుకోలేదు. ఇప్పుడు అల్లువారి పిల్లగాడిపై పెద్ద భారమే ఉంది. తొందరగా ఓ కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోవాలి. ఆ లక్ష్యంతో చేస్తున్న సినిమా ‘జులాయి’. పూర్తిగా త్రివిక్రమ్ శైలిలో సాగిపోయే సినిమా బన్నీ కెరీర్‌లో ఓ మైలురాయిలా మిగిలిపోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ‘జులాయి’ ఎంత అల్లరి చేస్తాడో చూడాలి!