** రచ్చ
తారాగణం: రామ్ చరణ్, తమన్నా , కోట శ్రీనివాసరావు, నాజర్, దేవ్‌గిల్, ముఖేష్ రుషి, పార్తీబన్, అజ్మల్, బ్రహ్మానందం, అలీ, జయప్రకాష్‌రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీశ్రీరాం, రఘుబాబు, కృష్ణ్భగవాన్, రవిబాబు, శ్రీనివాసరెడ్డి, ఉత్తేజ్, ఫిష్‌వెంకట్, తాగుబోతు రమేష్, గీత, ప్రగతి, సుధ, ఝాన్సీ, హేమ, సత్యకృష్ణన్, గీతాసింగ్ తదితరులు
సంగీతం: మణిశర్మ,
నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, పారస్‌జైన్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్ నంది
‘ఎలా తీసాం, ఏం తీసాం, ఎందుకు తీసాం అన్నది కాదు ముఖ్యం, నాలుగు డబ్బులు చేసుకున్నామా లేదా అన్నది పాయింట్’ ఇదీ టాలీవుడ్ లేటెస్ట్ ట్రెండ్. ఇదే తరహాలో వచ్చిన సినిమా రామ్‌చరణ్ ‘రచ్చ’. సినిమాను వీలయినంత కలర్‌ఫుల్‌గా, భారీగా తీయడంపై పెట్టిన దృష్టి కథ, కథనాలపై పెట్టకుండా చేసిన పేలవ ప్రదర్శన, కేవలం అభిమాన జనానికి తప్ప మిగిలిన వారికి అంతగా పట్టని వైనం ‘రచ్చ’.
కథ విషయానికి వస్తే, స్నేహితుడు సూర్యనారాయణ(పార్తీపన్) కోరిక మన్నించి, తన భూములన్నీ పేదలకు పంచివ్వాలనుకుంటాడు భూస్వామి నాజర్. తీరా చేసి ఆ భూముల్లో ఖరీదైన ఇనుపఖనిజం వుందని తెలుసుకున్న అతగాడి బంధు బలగం, కుట్ర చేసి, సూర్యనారాయణ దంపతులను, నాజర్ దంపతులను, చంపేస్తారు. ఈ దారుణకాండలో బతికిబట్టకట్టింది నాజర్ కుమార్తె, హీరోయిన్ చైత్ర(తమన్నా), సూర్యనారాయణ కుమారుడు హీరో రాజ్(రామ్‌చరణ్). రాజ్ ఓ తాగుబోతు(ఎమ్‌ఎస్‌నారాయణ) కుటుంబానికి దగ్గరై, పెరిగి బెట్టింగ్ రాజ్‌గా మారతాడు. ఇదంతా ఫ్లాష్‌బ్యాక్. తెరతీసేసరికి బెట్టింగ్ రాజ్ తెగింపుతో సినిమా ప్రారంభమవుతుంది. పందెం కోసం ఎంతకయినా సిద్ధమయ్యే రాజ్, తన పెంపుడుతండ్రిని కాపాడుకునేందుకు ఓ అమ్మాయిపై ప్రేమ వల విసిరేందుకు సిద్ధపడతాడు. తీరాచేస్తే ఆ అమ్మాయి ఎవరో కాదు చిన్నప్పటి నేస్తం చైత్ర. ఆమె తన మామయ్య బళ్లారి (ముఖేష్‌రుషి)దగ్గర బంగరు పంజరంలో వుంటుంది. దీంతో సహజంగానే బళ్లారికి, రాజ్‌కు మధ్య భారీ ఘర్షణ ప్రారంభమవుతుంది. చివరకు ఏం జరిగిందనన్నది మిగిలిన కథ. కథ, కథనాలు, డైలాగులు, మెలోడ్రామా, డ్యాన్సులు, పాటలు ఇలా ఏ ఒక్క విషయంలోనూ సినిమా సాంకేతిక బృందం మొత్తం ఎటువంటి రిస్క్ తీసుకోదల్చినట్లు లేదు. అభిమాన జనాలు సినిమా చూసి, డబ్బులిచ్చేస్తే చాలు అన్నది ఒక్కటే కానె్సప్ట్‌గా కనిపించింది. అందుకే సినిమా అంతా ఎయిటీస్‌లో వచ్చిన సినిమాల కథ, స్క్రీన్‌ప్లేలను గుర్తుకు తెస్తుంది. పరుచూరి డైలాగుల్లో పంచ్‌ల కన్నా, హీరో, అతగాడి వంశం, తదితర స్వోత్కర్షలే ఎక్కువ వినిపించాయి. పాటల్లో కూడా అదే తరహా.
దర్శకుడు సంపత్‌నంది అనుభవం తక్కువైనా, సినిమాను వైవిధ్యంగా తీర్చి దిద్దలేకపోయినా, భారీ ప్రాజెక్టును బాగానే డీల్ చేయగలిగాడు. అయితే కథ సంగతి ఎలా వున్నా సన్నివేశాల్లో అయినా కాస్త కొత్తదనం తేవడానికి ప్రయత్నించి వుంటే బాగుండేది. ట్రయిన్‌కు ఎదురెళ్లే సన్నివేశం టేకింగ్, చైనా వెదురు అడవుల్లో ఫైట్‌లాంటి సీన్ల ఐడియాలు మెచ్చుకోదగ్గవి. కానీ, ఆలీ పోలీస్ లాకప్, హీరోహీరోయిన్ల అడవి సన్నివేశాలు కాస్త బోరనిపించాయి. సినిమాకు భారీతనం తేవడంలో మాత్రం నిర్మాతల పెట్టుబడికి తగ్గట్లు, దర్శకుడి కృషి కొంతవరకు తోడు కావడం సినిమాను కొంతవరకు రక్షించింది.
ఫైట్లు, పాటలు రెండూ మాస్ జనాలకి పట్టేలా రూపొందాయి. ముఖ్యం గా పాటల్లో హీరోయిన్ తమన్నాను బాగానే ఎలివేట్ చేయగలిగారు. సినిమాలో వీరు వున్నారు, వారు లేరు అనేంతగా నటీనటుల జాబితా వుంది. కానీ మహా అయితే అరడజను మందికి మినహా వేరెవరికీ స్క్రీన్ టైమ్ చాలా తక్కువే. హేమ, కృష్ణ్భగవాన్, ధర్మవరపు, రఘుబాబులకు మరీ తక్కువ. ఉన్నంతలో బ్రహ్మానందం, రవిబాబు కనిపించారు. కానీ బ్రహ్మానందం పాత్రలు మరీ రొటీన్ అవుతున్నాయన్న సంగతిని ఆయన గమనించాలి.
రామ్‌చరణ్ సినిమాను నిలబెట్టుకోవడానికి బాగా కష్టపడ్డాడు. ఫైట్లు, డ్యాన్సులు అన్నింటా. కానీ డైలాగ్ డెలివరీ ఇంకా మెరుగుపర్చుకోవాలనే చెప్పాలి. పైగా గత మూడు సినిమాల మాదిరిగా కాకుండా, ఈ సినిమాలో చిరంజీవిని గుర్తుకుతెచ్చే ప్రయత్నాలు చేసాడు. అది అభిమానులకు నచ్చొచ్చు. తమన్నా పాటల్లో జనానికి కనువిందు చేయడానికి పనికివచ్చింది. ముఖేష్ రుషి, కోటా తదితరులు మామూలే. మొత్తానికి ‘రచ్చ’కు అభిమాన జనమే రక్ష.