** హౌస్‌ఫుల్-2
తారాగణం: అక్షయ్‌కుమార్, జాన్ అబ్రహాం, రీతీష్ దేశ్‌ముఖ్, అసిన్, జాక్విలిన్, ఫెర్నాండెజ్, రిషీకపూర్, రణధీర్‌కపూర్, మిథున్ చక్రవర్తి తదితరులు.
సంగీతం: సాజిద్- వాజిద్.
దర్శకత్వం: సాజిద్ ఖాన్
హిందీలో మైండ్‌లెస్ కామెడీలనే సినిమాలు క్రమం తప్పకుండా వస్తున్నాయి. గోల్‌మాల్ సిరీస్, అప్నాసప్నా, మనీ మనీ, హౌస్‌ఫుల్ లాంటి సినిమాలు ఓ అర్థంపర్థం వుండని కామెడీలుగా విజయం సాధించడం ఆశ్చర్యం కల్గించే విషయం. బహుశా వీటిలో పాపులర్ స్టార్లు ఉండడం వీటి విజయానికి కారణమవుతోంది. ఈ కోవలో ‘హౌస్‌ఫుల్’కి సీక్వెల్‌గా తీసిన మరో మైండ్‌లెస్ కామెడీయే ‘హౌస్‌ఫుల్-2’.
ఈ సీక్వెల్‌లో మంద మరీ పెరిగింది. నల్గురు తండ్రులు (రణధీర్ కపూర్, రిషీ కపూర్, మిథున్ చక్రవర్తి, బొమన్ ఇరానీ), వాళ్ళ నల్గురు కూతుళ్ళు (అసిన్, జాక్విలిన్ ఫెర్నాండెజ్, షాజన్ పదసీ, జరీన్ ఖాన్), వీళ్ళ నల్గురు ప్రేమికులు (అక్షయ్‌కుమార్, జాన్ అబ్రహాం, రీతీష్ దేశ్‌ముఖ్, శ్రేయాస్ తల్పాడే)... వీళ్ళంతా కామెడీ పేరుతో సృష్టించే గందరగోళమే ఈ సినిమా.
అలాగే ఈ సినిమాకి ఎందరో సాజిద్‌లు... నిర్మాత సాజిద్ నాడియావాలా (ఈయనే కథ రాశాడు), దర్శకుడు సాజిద్ ఖాన్, సంగీత దర్శకులు సాజిద్-వాజిద్, మాటల రచయితలు సాజిద్-్ఫర్హాద్... ఇంతా చేస్తే ఈ సీక్వెల్ తెలుగులో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ‘హంగామా’కి చాలా మార్పులు చేసిన రీమేక్.
ఇందులో లండన్‌లో ఇద్దరు అన్నదమ్ములు- దాబా (రణధీర్ కపూర్), చింటూ (రిషీకపూర్)లకి అస్సలు పడదు. ఇద్దరికీ ఇద్దరు కూతుళ్ళు. హీనా (అసిన్), బాబీ (జాక్విలిన్ ఫెర్నాండెజ్)లుంటారు. ఇద్దరికీ లండన్‌లో అత్యంత ధనవంతుడైన యువకుడికిచ్చి పెళ్ళిచేయాలని కోరిక- పోటీ ఏర్పడుతుంది. ఓ పెళ్ళిళ్ళ బ్రోకర్ (్ఛంకీపాండే)ని ఈ పనికి పురమాయిస్తారు. ఈ బ్రోకర్ జై (శ్రేయాస్ తల్పాడే) అనే యువకుడి తండ్రిని చింటూ దగ్గరికి తీసుకుపోతాడు. చింటూ ఇది బోడి సంబంధమని అవమానిస్తాడు. ఇది మనసులో పెట్టుకున్న జై, చింటూ మీద పగదీర్చుకోవాలనుకుని మిత్రుడు జాలీ (రీతీష్ దేశ్‌ముఖ్)ని సంప్రదిస్తాడు. ఇద్దరూ కలిసి మాక్స్ (జాన్ అబ్రహాం) అనే చిల్లర దొంగని, జాలీ తండ్రి జేడీ (మిథున్‌చక్రవర్తి) కొడుకుగా నటించి, నమ్మించి, చింటూ కూతురు బాబీని పెళ్ళిచేసుకుని అన్యాయం చేసి పారిపొమ్మని పురమాయిస్తారు.
పొరపాటున మాక్స్, చింటూ ఇల్లనుకుని దాబా ఇంట్లోకెళ్ళి అక్కడ కథ మొదలెడతాడు. దీంతో తలపట్టుకున్న జాలీ, జైలిద్దరూ సన్నీ (అక్షయ్‌కుమార్) అనే మరొకడ్ని పట్టుకుని చింటూ ఇంట్లోకి దింపుతారు. అటు మాక్స్, ఇటు సన్నీ ఇద్దరూ లండన్‌లో అపర కుబేరుడు జేడీ కొడుకులమని చెప్పి ఒకరికి తెలీకుండా ఒకరు నమ్మించి ఓకే అన్పించుకుంటారు. అయితే అమ్మాయిలు హీనా, బాబీలకి వీళ్ళంటే ఇష్టముండదు.
ఇలా ఉండగా ఇటు జై, జాలీలకి ఫ్లాష్ బ్యాక్స్‌లుంటాయి. ఆ ఫ్లాష్‌బ్యాక్‌లోంచి జాలీ గర్ల్‌ఫ్రెండ్ జేలో (జరీన్‌ఖాన్) వచ్చేసి సంగతి తేల్చుకుందామని జాలీ తండ్రి జేడీ దగ్గరికొచ్చేస్తుంది. మరోవైపు జై పాపం కూడా పండి అతడి గర్ల్‌ఫ్రెండ్ పారుల్ (షాజన్‌పదసీ) కూడా వచ్చి పడుతుంది.
ఇక్కడ్నించీ గందరగోళం పెరిగిపోతుంది. ఈ పెళ్లిళ్లు ధనికుడైన జేడీయే కేంద్ర బిందువు అయిడియా కాబట్టి అంతా కలిసి అతడింట్లో పడతారు. ఈ హౌస్‌ఫుల్ సిట్యుయేషన్‌లో చిక్కుముళ్ళు ఎలా విప్పారన్నది మిగతా మైండ్‌లెస్ కామెడీ.
లాజిక్‌ని కాస్సేపు పక్కనపెట్టి ఈ కామెడీని ఎంజాయ్ చేసే వీలుంది. అయితే ఆ కామెడీ పేలవంగా వుండడంతో, ముప్పాతిక శాతం పేలకపోవడంతో జాలిపుడుతుంది. ఇంతమంది స్టార్లతో దమ్ములేని కామెడీ తీసిన సాహసానికి మాత్రం ఆశ్చర్యపోతాం.
పాటల్లో ‘‘అనార్కలీ డిస్కో చలీ’’ పాట టాప్. హీరోలు మాత్రమే చెలరేగి, హీరోయిన్లకి పనిలేకుండా పోయిన ఈ సీక్వెల్‌ని ఓసారి మాత్రం చూడవచ్చు.
హిందీలో మైండ్‌లెస్ కామెడీలనే సినిమాలు క్రమం తప్పకుండా వస్తున్నాయి.
english title:
housefull-2
Date:
Thursday, April 12, 2012