నెల్లూరు , ఆగస్టు 12: జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన మద్యం దుకాణాల వ్యవహారం ఒక కొలిక్కి రావడం లేదు. జిల్లాలో లైసెన్స్ మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించి ఇంకా 22 ఖాళీలు అలాగే ఉన్నాయి. మూడు పర్యాయాలుగా దరఖాస్తులు, లక్కీడిప్‌లు నిర్వహించినా ఈ షాపులు భర్తీకాలేదు. దీంతో ప్రభుత్వ ఆదేశాల నేపధ్యంలో ఎక్సైజ్‌శాఖ తరఫునే దుకాణాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో తొలి విడతగా రెండు దుకాణాల్ని ఎక్సైజ్‌శాఖ ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని భావించింది. ఇందుకోసం 64 లక్షల రూపాయల లైసెన్స్‌ఫీజుతో దరఖాస్తులు ఆహ్వానించినా ఔత్సాహికులు ఎవరూ ముందుకు రాని నెల్లూరు నగరంలోని చిన్నబజార్, జాతీయ రహదారిపై ఉన్న కోవూరు మండలం పడుగుపాడు దుకాణాల్ని తామే నిర్వహించాలని ఎక్సైజ్ అధికారులు భావించారు. ఇందుకోసం సంబంధిత సరంజామా అంతటితో కలిపే ఇచ్చే రెండు గదుల కోసం టెండర్లు నమోదు చేసుకోవచ్చంటూ ఎక్సైజ్‌శాఖ పత్రికాముఖంగా వ్యాపార ప్రకటన జారీ చేసింది.గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉండే గది, బ్రాందీ దుకాణాలకు ఏర్పాటయ్యే ఇనుప కంచె అమరిక, స్టాకును నిల్వ చేసేందుకు ఫ్రిజ్, కుర్చీలు, టేబుళ్లు, డస్క్, తదితర ఫర్నిచర్ అంతటితో కలిపి గదులు కావాలని టెండర్లను ఆహ్వానించారు. ఇందుకు బాడుగ మొత్తాన్ని దరఖాస్తుదారులే కోడ్ చేసుకోవచ్చంటూ పోటాపోటీగా టెండర్లు వస్తే తక్కువ మొత్తానికి అందజేసే టెండర్‌దారుడికి షాపు కేటాయిస్తామంటూ ఎక్సైజ్‌శాఖ ప్రకటించింది. అయితే ఆ రెండు చిరునామాల నుంచి ఒక్క దరఖాస్తుదారుడు కూడా ముందుకు రాలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని మరలా తమ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తున్నట్లుగా నెల్లూరు ఎక్సైజ్ డిసి నాగేశ్వరరావువెల్లడించారు. రాష్ట్రంలోని సుమారు 17 జిల్లాల్లో జిల్లాల్లో ఇలా భర్తీకాని లైసెన్స్ దుకాణాల స్థానంలో బేవరేజిస్ డిపోల వద్ద రిటైల్ అవుట్‌లెట్లను నిర్వహిస్తున్నారు. అయితే నెల్లూరు బేవరెజెస్ డిపో నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం. అంతేగాకుండా అక్కడ జనసంచారం అంతంత మాత్రంగానే కావడం, పుణ్యక్షేత్రాలైన దేవాలయాలకు దగ్గరగా స్థానిక డిపో ఉండటంతో రిటైల్ అవుట్‌లెట్‌గా నిర్వహించేందుకు వీలుపడటం లేదని ఎక్సైజ్ ఉప కమిషనర్ నాగేశ్వరరావు చెపుతున్నారు. ఈ క్రమంలో భర్తీగాని 22 దుకాణాలకు సమీపంలో ఉండే వ్యాపారులకు కాసుల పంట పండుతోంది. సవరించిన మద్యం దుకాణాల కేటాయింపువిధానం వలనే ఇలా దుకాణాల భర్తీకి గుదిబండగా పరిణమిస్తోంది.
ఉదాహరణకు నగర పరిధి నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వరకు కూడా ఒకే లైసెన్స్ ఫీజు విధానాన్ని రూపొందించారు. అయితే అంతటి ఫీజుతో తాము నిర్వహించలేమంటూ పడుగుపాడు దుకాణాన్ని స్వీకరించేందుకు మద్యం వ్యాపారులెవరూ ముందుకురావడం లేదు. అది పూర్తిగా గ్రామీణ ప్రాంతం కావడంతో సహా హైవే వ్యాపారం కూడా అటుగా లేకపోవడంతో ఔత్సాహికులెవరూ ముందుకు రావడం లేదు. అయితే జిల్లా పరిధిలోకి వచ్చే కలకత్తా - చెన్నై జాతీయ రహదారిపై, నెల్లూరు -ముంబయి ప్రధాన రహదారిపై ఉన్న వివిధ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పది వేల జనాభా నివాసిత ప్రాంతాల్లో 32లక్షల రూపాయల లైసెన్స్‌ఫీజుకే దుకాణాలు కేటాయించడం గమనార్హం. సాధారణంగా మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టవిరుద్ధమంటారు. కాని హైవేపై వెళ్లే వాహనచోదకుల్లో అధికశాతం మద్యం సేవించి వెళ్లేవారే కనిపిస్తుంటారు. మద్యం సేవించి వాహనాలు నడిపే చోదకుల్ని అయినా అదుపుచేయాలి లేకుంటే ఎక్కువ వ్యాపారం జరుగుతున్న దృష్ట్యా ఆయా దుకాణాలకు లైసెన్స్‌ఫీజులైనా పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.
జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన మద్యం దుకాణాల వ్యవహారం
english title:
liquor shops
Date:
Monday, August 13, 2012