నెల్లూరు , ఆగస్టు 11: రాష్ట్రంలో మరో సరికొత్త న్యూస్ ఛానల్ టెన్ టీవీ ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఇది పూర్తిగా వామపక్ష భావజాలంతో నడపనున్న టీవీ ఛానల్ కావడం గమనార్హం. ఇప్పటికే సిపిఎం తరఫున ప్రజాశక్తి, సిపిఐ నుంచి విశాలాంధ్ర దినపత్రికలు ప్రచురితం కావడం తెలిసిందే. దినపత్రికలతో టీవీ ఛానల్ కూడా ఏర్పాటు ఆవశ్యకత ఉందని వామపక్షాలు భావిస్తున్నాయి. ఈ కోవలోనే 10టీవి ఆవిర్భావానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటి వరకు ప్రజాశక్తి, విశాలాంధ్ర దినపత్రికల నూతన ఎడిషన్లకు, వివిధ ఆధునీకరణ, అభివృద్ధి పనుల నిమిత్తం ప్రజల నుంచి విరాళాలు సేకరించడం కద్దు. దీనికి భిన్నంగా టెన్ టీవీ ఏర్పాటుపరంగా కమ్యూనిస్టులు పంథా మార్చారు. ఈ సంస్థ ఏర్పాటుకు ఏభై కోట్ల రూపాయల మూలధన సేకరణ లక్ష్యంగా ఎంచుకున్నారు. ఇందుకోసం ముందునుంచే వాటాల విక్రయానికి నిర్ణయించుకున్నారు. ఒక్కో షేర్ పది రూపాయల ముఖ విలువగా తెలుపుతున్నారు. ఔత్సాహికులెవరైనా కనీసం (రూ.500 పెట్టుబడితో) ఏభై వాటాలు కొనుగోలు చేయాలనే నిబంధన విధించారు. ఈ వినూత్న విధానానికి స్పందన బాగానే కనిపిస్తోంది. ప్రస్తుతం సిపిఎం నెల్లూరుజిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ టెన్ టీవి వాటాల విక్రయాల పరంపరలో మునిగిపోయారు. తాను వెయ్యి షేర్లను కొనుగోలు చేస్తున్నట్లుగా తెలుపుతూ ఇందుకోసం జిల్లాలోని అన్ని శాఖలతో గోప్యంగా సమావేశమవుతూ వాటాల వ్యవహారంపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో చిన్నాచితక కార్యకర్త కూడా కనీసం ఏభై షేర్ల కొనుగోలుకు సుముఖంగా ఉన్నారు. ఆర్థికంగా అనుకూలించే నాయకులు, సానుభూతిపరులు వెయ్యి ఆపైగా షేర్లను రూ. పదివేల రూపాయల పెట్టుబడి నిధిగా మలిచేందుకు ముందుకు వస్తున్నారు. 2013 జనవరి 14న టెన్ టీవి ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ న్యూస్ ఛానల్‌కు చైర్మన్‌గా ప్రొఫెషర్, మాజీ ఎంఎల్‌సి కె నాగేశ్వర్ వ్యవహరిస్తున్నారు. స్ఫూర్తి కమ్యూనికేషన్స్, ప్రగతి బ్రాడ్‌కాస్టింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతోపాటు అభ్యుదయ బ్రాడ్‌కాస్టింగ్ లిమిటెడ్ పేరిట టెన్ టీవి ఛానల్ రూపొందిస్తున్నారు. ఈ సంస్థకు సలహా మండలికి సమన్వయకర్తగా మీడియా విశే్లషకులు తెలకపల్లి రవి, ప్రముఖ రచయతలు దేవీప్రియ, ఓల్గా, ఎంఎల్‌సి, విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రముఖ చరిత్రకారులు వకుళాభరణం రామకృష్ణ, ప్రముఖ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు, సినీ దర్శకులు బి నర్సింగరావు, సినీ గేయరచయతలు చంద్రబోస్, సుద్దాల అశోక్‌తేజ, సంగీత దర్శకులు సుద్దాల అశోక్‌తేజ, ప్రజా గాయకులు వందేమాతరం శ్రీనివాసరావు, ప్రజా వాగ్గేయకారులు గోరటి వెంకన్న, తెలుగు అకాడమి పూర్వ సంచాలకులు విజయభారతి, సామాజిక పరిశోధకులు జావేద్ ఆలం, పూర్వ ఎంఎల్‌సి ఉపాధ్యాయ నేత దాచూరి రామిరెడ్డి, విద్యావేత్త రాజేశ్వరరెడ్డి, విద్యావేత్త మువ్వా శ్రీనివాస్‌లున్నారు.
అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సొంతం
* నాణ్యత లోపిస్తే ఫిర్యాదు చేయండి
* ఎమ్మెల్యే ముంగమూరు
నెల్లూరు , ఆగస్టు 12:నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ ప్రజల సొంతమని వాటిలో నాణ్యత లోపించిందని భావిస్తే తమ దృష్టికి తీసుకురావాలని నగర శాసనసభ్యుడు ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి పేర్కొన్నారు. స్థానిక వేప దొరువు ప్రాంతంలో 11 లక్షల 70వేల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సిసిరోడ్డు పనులను రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, ముంగమూరు పరిశీలించారు. ఈసందర్భంగా శ్రీ్ధరకృష్ణారెడ్డి మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్‌లో కోటి నుండి రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పైపు లైన్లు, రోడ్లు, కల్వర్టర్లు, డ్రైన్లు, ప్యాచ్‌వర్కులు, సబ్‌స్టేషన్ల నిర్మాణం, లైట్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రజలకు అవసరమైన మంచినీటి కోసం వాటర్ ట్యాంకు నిర్మిస్తున్నామని చెప్పారు. గతంలో ఎన్టీఆర్‌నగర్‌లో నిర్మించిన వాటర్ ట్యాంకు కూలేందుకు సిద్ధంగా ఉందని దాని స్థానంలో కొత్తది నిర్మిస్తామన్నారు. నగరంలో ప్రజలకు రెండుపూట్లా నీరు సరఫరా చేస్తున్నామని, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సహకారంతో ఏ కార్పోరేషన్‌కు అందనంతగా ఎక్కువ ఫండ్స్ తెచ్చి నగరాభివృద్ధికి ఉపయోగిస్తున్నామన్నారు. లోవోల్జేట్ సమస్యలు రాకుండా వీలైనచోట్ల సబ్‌స్టేషన్ల నిర్మాణం చేస్తున్నామని శ్రీ్ధరకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ శివారు ప్రాంతాల అభివృద్ధికి ఇందిరమ్మ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని నిధులను నగరాభివృద్ధికి ఉపయోగిస్తున్నామని చెప్పారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ పార్టీ నాయకులు నగరాన్ని భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకుల ప్రవృత్తి ప్రజాసేవైతే జగన్‌పార్టీ నాయకుల ప్రవృత్తి బ్లాక్‌మెయిలింగ్,ఆక్రమణలు అని చెప్పారు. ఈకార్యక్రమం ఊటుకూరు ఆదిశేషయ్య, చంద్ర, కొట్టె వెంకటేశ్వర్లు, శీలం మల్లి, ననే్నసాహెబ్, మదార్, సురేఖ, సుధాకర్‌రెడ్డి, వంశీకృష్ణా, ఖాజామోహిద్దీన్, శీనయ్య తదితరులు పాల్గొన్నారు.