ఏలూరు, సెప్టెంబరు 2 : జిల్లా పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులకు సోమవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు విద్యుత్ కోతలను విధించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఇ టివి సూర్యప్రకాశరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి వారం మూడు రోజులు పవర్ హాలిడే (గురు, శుక్ర, శని) పాటించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సెప్టెంబరు నెలలో 6, 7, 8, 13, 14, 15, 20, 21, 22, 27, 28, 29 తేదీల్లో పవర్‌హాలిడే వుంటుందని ఆయన తెలిపారు. నిరంతర పరిశ్రమలు, సాధారణ పరిశ్రమలు (30 హెచ్‌పి కంటే పైన పరిశ్రమలకు) వారంలో మూడు రోజులు పవర్‌హాలిడేగా నిర్ణయించి విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పీక్ లోడ్ అవర్స్ (18.30 గంటల నుంచి 22.30 గంటల వరకు) నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. ఐటి పరిశ్రమలు, పబ్లిక్ వాటర్ వర్క్స్, రైల్వే ట్రాక్స్, ప్రభుత్వాసుపత్రులకు పవర్‌హాలిడే లేదన్నారు. జూట్‌మిల్లులకు పవర్ హాలిడే లేదని, అయితే పీక్‌లోడ్ అవర్స్ నిబంధనలు వర్తిస్తాయన్నారు. కోళ్ల పెంపకం, కోల్డ్ స్టోరేజీ, మిల్క్ చిల్లింగ్ యూనిట్, రైస్‌మిల్లు, ఐస్‌ప్లాంట్ 60 శాతం విద్యుత్ ఉపయోగించుకోని వాటికి పీక్ లోడ్ అవర్స్‌లో 10 శాతం పీక్‌లోడ్ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి పెరిగిన వెంటనే ఈ విధానంలో మార్పులుంటాయని టివి సూర్యప్రకాశరావు తెలిపారు.
కుట్రపూరిత రాజకీయాలతో కుంటుపడిన ప్రగతి
*వైఎస్సార్ కాంగ్రెస్ కన్వీనర్ బాలరాజు
ఏలూరు, సెప్టెంబరు 2 : దివంగత నేత డాక్టర్ వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి హఠాన్మరణం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని, కాంగ్రెస్, టిడిపిల కుట్రపూరిత రాజకీయాలతో రాష్ట్రప్రగతి పూర్తిగా కుంటుపడిందని జిల్లా వై ఎస్ ఆర్ పార్టీ కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎన్ ఆర్ పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి బాలరాజు, ఆళ్ల నాని తదితరులు దివంగత నేత వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలరాజు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రైతులు, రైతుకూలీలు, కార్మికులు, ఉద్యోగులు ఇలా ప్రతీ వర్గం ప్రజల సంక్షేమాన్ని కాంక్షించిన వై ఎస్ కారణజన్ముడని అన్నారు. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ మనుషుల్లో దేవుడు వై ఎస్ అన్నారు. పేద ప్రజల జీవితాల్లో ఆనందం వెల్లివిరిసిందంటే అందుకు వై ఎస్ సువర్ణపరిపాలనే కారణమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఊదరగొండి చంద్రవౌళి, మీడియా కో ఆర్డినేటర్ బివి రమణ, సిటీ కన్వీనర్ బొద్దాని శ్రీనివాస్, నాయకులు డాక్టర్ దిరిశాల వరప్రసాద్, గంపల బ్రహ్మావతి, మాజీ కార్పొరేటర్లు గుడిపూడి రవి, బొర్రా హనుమాన్, మున్నుల జాన్‌గురునాధ్, అక్కిశెట్టి చందు, మాకినేని వెంకటేశ్వరరావు, పుప్పాల సూర్యనారాయణ, దాట్ల అన్నపూర్ణాదేవి తదితరులు పాల్గొన్నారు.
రెండవ ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మాణంతో రైతులకు నష్టంలేదు
తాడేపల్లిగూడెం, సెప్టెంబరు 2: తాడేపల్లిగూడెం మండలం కుంచెనపల్లి కడియపుచెరువులో రెండవ ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మాణంతో ఆ చెరువు ఆయకట్టు రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఎమ్మెల్యే ఈలి నాని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో రెండవ ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మాణం కోసం ఆదివారం ఇరిగేషన్ ఛీఫ్ ఇంజనీర్ బి లక్ష్మణరావు, ఇతర అధికార్లతో కుంచెనపల్లి కడియపుచెరువు పరిశీలించారు. అనంతరం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈలి నాని మాట్లాడుతూ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో మంచినీటి అవసరాలకు మరో ఎస్‌ఎస్ ట్యాంకు అవసరమన్నారు. మాజీ ఎమ్మెల్యే యర్రా, మాజీ మున్సిపల్ ఛైర్మన్ కరణం నేతృత్వంలో హడ్కో నిధులు రూ.8.23 కోట్లతో ఒక ప్రాంతాన్ని రెండో ఎస్‌ఎస్ ట్యాంకుకు ప్రతిపాదించారన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కొట్టు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ తాతాజీ సమయంలో మరో ప్రాంతాన్ని ప్రతిపాదించారన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ధరపై రైతులు కోర్టుకు వెళ్లడంతో కుంచెనపల్లిలోని కడియపుచెరువును రెండవ ఎస్‌ఎస్ ట్యాంకుగా రూపొందించేందుకు సి ఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళామన్నారు. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్ అధికార్లు ఆ చెరువును పరిశీలించారన్నారు. కుంచనపల్లి కడియపుచెరువు 128 ఎకరాల మైనర్ ఇరిగేషన్ చెరువు అన్నారు. 399 ఎకరాలు ఆయకట్టు ఉందన్నారు. ప్రస్తుతం వేసవిలో 45 రోజులకు సరిపడే నీటిని ఎస్‌ఎస్ ట్యాంకులో నిల్వ చేస్తున్నామని, గోదావరి జలాలు 100 రోజులు వదలకపోయినా మున్సిపాలిటీలో మంచినీటి సమస్య లేకుండా ప్రజలకు మంచినీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. మట్టి నమూనాలు పరీక్ష చేసి చెరువు తవ్వటానికి అనుకూలమైందిగా అధికార్లు సూచించారన్నారు. రైతులను కొంతమంది భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ప్రజా అవసరాల కోసం అందరూ సహకరించాలన్నారు. కడియపుచెరువు రైతులతో ఒక సమావేశం ఏర్పాటుచేసి అందరి ఆమోదం మేరకు చెరువు తవ్వుతామన్నారు. కొన్ని శాఖల నుండి ఇంకా అనుమతి రావల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్, మైనర్, మేజర్ ఇరిగేషన్ మంత్రుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. పట్టణాభివృద్ధికి మాజీ మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, వివిధ పార్టీల ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి పట్టణాభివృద్ధి చేస్తామన్నారు.
కడియపుచెరువు గర్భంలో మరో రిజర్వాయర్
తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో రానున్న 30 సంవత్సరాలలో రోజుకు 10 కోట్ల క్యూబిక్ లీటర్ల నీరు అవసరం ఉంటుందని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ బి లక్ష్మణరావు పేర్కొన్నారు. కడియపుచెరువు పరిశీలించిన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. చెరువు మట్టి పరీక్షలు, డిజైన్ తయారీకి పనులు ప్రారంభమయ్యాయన్నారు. 90 రోజులు వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకొనేలా రెండవ ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మాణం చేపట్టనున్నామన్నారు. కడియపుచెరువులో 50 హెక్టార్ల వైశాల్యంలో చెరువు నిర్మాణం చేస్తామన్నారు. చెరువు గర్భంలో మరో రిజర్వాయర్ నిర్మిస్తామన్నారు. 10 నుండి 11 మీటర్లు ఎత్తులో గట్లు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. 1.8 కిలోమీటర్లు ఎర్త్ డ్యాం దెబ్బతినకుండా నిర్మాణం చేపడతామన్నారు. కడియపుచెరువు ఆయకట్టు రైతులకు, ఆక్రమణలో వున్న రైతులకు ఎలాంటి సమస్య లేకుండా రెండవ ఎస్ ఎస్ ట్యాంకు నిర్మాణం చేపడతామన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్లు కరణం అప్పారావు, ఈతకోట తాతాజీ, ఇరిగేషన్ ఈ ఈ చంద్రశేఖర్, మున్సిపల్ కమీషనర్ సిహెచ్ నాగనరశింహారావు పాల్గొన్నారు.
నేడు పెట్రో ఉత్పత్తులపై వర్క్‌షాపు
*మూడు జిల్లాల పోలీసు అధికారుల హాజరు*రెవెన్యూ, ఇతర శాఖలు కూడా
ఏలూరు, సెప్టెంబర్ 2: పెదపాడు మండలం వట్లూరులోని సర్ సిఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఉదయం పెట్రో ఉత్పత్తులపై పారిశ్రామికవేత్తలు, పోలీసు, రెవిన్యూ, ఇతర శాఖల అధికారులకు వర్క్‌షాపును నిర్వహిస్తున్నారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాపును ఏలూరు రేంజ్ డిఐజి జి సూర్యప్రకాశరావు ప్రారంభించనున్నారు. జిల్లా కలెక్టరు డాక్టరు జి వాణిమోహన్, జిల్లా ఎస్పీ ఎం రమేష్ తదితరులు హాజరవుతారు. దీనికి మూడు జిల్లాల పోలీసు, రెవిన్యూ, ఇతర శాఖల అధికారులు హాజరవుతారు. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో పెట్రోలియం ఉత్పత్తుల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెల్సిందే. అయితే ఈసందర్భంగా ఎక్కడైనా అనివార్యంగా ప్రమాదాలు చోటుచేసుకుంటే ఆ సమయంలో వివిధ శాఖలు ఏవిధంగా స్పందించాలన్న అంశం ఈ వర్క్‌షాపు ప్రధాన ఉద్దేశ్యం.
మైనార్టీలకు మేలు చేస్తున్న ప్రభుత్వం
ముస్లిం యువతీ యువకులకు సామూహిక వివాహ మహోత్సవం
భీమవరం, సెప్టెంబరు 2: జిల్లాలోని పేద ముస్లిం యువతీ యువకులకు భీమవరంలో సామూహిక వివాహ మహోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. స్థానిక అల్లూరి సీతారామరాజు భవనం ఈ వివాహ వేడుకలకు వేదికైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఈ సామూహిక వివాహ మహోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వివాహ జంటలను ఆశీర్వదించారు. వారికి పవిత్రమైన ఖురాన్‌ను మైనార్టీ నాయకులు షేక్ మీరాఖాసీమ్ అందచేశారు. వధూవరులను కమిషనర్ జివివి సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎఎంసి ఛైర్మన్ ఎఎస్ రాజు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి.రామాంజనేయులు మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యేకంగా అమలుచేస్తుందన్నారు. వాటిని సద్వినియోగపరుచుకుని ఆర్థికంగా బలపడాలని పిలుపునిచ్చారు. భీమవరంలో 11 జంటలకు ఏర్పాటుచేసిన వివాహవేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఒక్కో జంటకు రూ. 25 వేలు విలువ చేసే గృహోపకరణాలు అందజేస్తామన్నారు. భీమవరంలో జరిగే సామూహిక వివాహాలకు వెరశి రూ. 2.75 లక్షలు వంట సామాగ్రి, బీరువా, మంచాలు తదితర సామాన్లను అందజేశామని తెలిపారు. ముస్లిం, మైనార్టీల కోసం విద్య, ఉపాధిలో రిజర్వేషన్లను ప్రభుత్వం అమలుచేస్తుందని, విద్యనభ్యసించినప్పుడు వారికి ఉపకార వేతనాలు, ఉచిత శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటుచేస్తారని అన్నారు. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ ఎ.ముబారక్ అలీ, ఉపాధ్యక్షులు షేక్ ఖాసీమ్, మైనార్టీ ఎంప్లారుూస్ ఉపాధ్యక్షులు ఎండి ఉమర్ అలీ, సభ్యులు ఎండి.కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.
ఏలూరులో ఆదర్శ వివాహం
ఏలూరు, సెప్టెంబర్ 2 : హైదరాబాద్‌కు చెందిన రెండు మతాలకు చెందిన ఇమ్రాన్ ఆలీఖాన్, గనబోయిన జ్యోతి ముదిరాజుల ఆదర్శ వివాహం ఆదివారం ఏలూరులోని బౌద్ధ ధర్మ ప్రచార ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించారు. వీరిద్దరూ గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. తల్లిదండ్రుల అంగీకారం లేకపోవడంతో ఏలూరు వచ్చి ఎ ఐటియుసి నాయకులను సంప్రదించారు. వారిరువురు మేజర్లు కావడంతో బౌద్ధ్ధర్మం ప్రకారం వివాహం జరిపించారు. దంపతులను బౌద్ధ ధర్మ ప్రచార ట్రస్టు ఛైర్మన్ డాక్టర్ వామనానంద, సిపి ఐ సీనియర్ నాయకులు కనకం రామ్మోహనరావు, రెడ్డి శ్రీనివాసడాంగే, బండి వెంకటేశ్వరరావు, అర్జి ప్రసాద్, బోడెం వెంకట్రావు, ధనియాల ఈశ్వరరావు, అర్జి దుర్గాప్రసాద్, ధనియాల శంకర్, అర్జి సురేష్‌లు అభినందించారు.