న్యూఢిల్లీ, ఆగస్టు 24: 2జి స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ గడువును పొడిగించే అవకాశం వుంది. రద్దయిన స్పెక్ట్రమ్ లైసెన్స్‌లకు తిరిగి వేలం ప్రక్రియను ఈనెల 31లోగా పూర్తిచేయాలన్న గడువును పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రకటించింది. సుప్రీం నిర్దేశించిన ఆగస్టు 31లోగా వేలం పూర్తయ్యే అవకాశాలు లేక వ్యవధి పొడిగించాలని కోరుతూ ప్రభుత్వం న్యాయస్థానానికి అభ్యర్థన చేసుకున్న సంగతి తెలిసిందే. గడువు పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామని అయితే తీర్పును అమలుచేస్తామని టెలికాం కార్యదర్శి ఆమేరకు హమీ పత్రం సమర్పించాలని కోర్టు నిబంధన పెట్టింది.
కార్యదర్శి స్థాయికన్నా తక్కువ అధికారుల నుంచి ఎలాంటి హామీని కోర్టు ఆమోదించబోదని జస్టిస్ జి. ఎస్.సింఘ్వి, జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్‌తో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ప్రభుత్వం తమ అభ్యర్థనలో పేర్కొ న్న కొత్త డెడ్‌లైన్‌లోగా తప్పక వేలం ప్రక్రియ పూర్తిచేయాల్సి వుంటుందని బెంచ్ తెలిపింది. దీనిపై తదుపరి విచారణ ను సోమవారానికి వాయిదా వేసింది. వేలం ప్రక్రియ ప్రారంభానికి నవంబర్ 12వరకు, ఆ తర్వాత ప్రక్రియ పూర్తిచేసి లైసెన్స్‌లు కేటాయించే పనులకు మరో 40 రోజుల వ్యవధి కావాలని టెలికాం శాఖ తమ దరఖాస్తులో కోర్టును కోరింది. స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియకు గడువు పొడిగించాలని సుప్రీం కోర్టును కోరాలని ఈనెల 7న జరిగిన టెలికాంపై సాధికార మంత్రుల బృందం సమావేశంలో నిర్ణయించారు. యావత్ ప్రక్రియను మూడునెలల 23 రోజుల్లో పూర్తిచేస్తామని ప్రభుత్వం దరఖాస్తులో పేర్కొంది. కాగా, సుప్రీం కోర్టు తొలు త నిర్ణయించిన జూన్ 2తేదీ గడువును ఈనెల 31కి పొడిగించిన విషయం తెలిసిందే.
* ప్రభుత్వ అభ్యర్థనపై పరిశీలనకు సుప్రీం సుముఖం
english title:
2 g spectrum
Date:
Saturday, August 25, 2012