Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

దసరా బంపర్ ఆఫర్ ఉంటుందా!

$
0
0

ఏలూరు, అక్టోబర్ 17 : దసరాకి బంపర్ ఆఫర్ ప్రకటిస్తారన్న ప్రచారం సర్వత్రా జరుగుతూనే వుంది. అయితే ఇది మార్కెట్‌లో బంపర్ ఆఫర్ కానే కాదు. అధికార పార్టీలో నామినేటెడ్ పోస్టుల పందేరం ఇక కొలిక్కి వచ్చిందన్న ప్రచారం సాగుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఫైళ్లతో ఢిల్లీ పయనం కావడంతో రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియకు అధిష్టానం దాదాపు గ్రీన్‌సిగ్నల్ చూపినట్లేనని తెలుస్తోంది. అయితే ఈసారైనా తగిన గుర్తింపు లభిస్తుందా లేక కొద్దిపాటి విదిలింపుతో దీన్ని సరిపెడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా మరోసారి అధికార కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టులపై చర్చ పెద్ద స్థాయిలోనే జరుగుతున్నట్లు చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం వున్న సంకేతాలు మాత్రం ప్రచారం జరుగుతున్న రేంజ్‌లో పదవుల పందేరం ఉండకపోవచ్చునన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలు మాత్రం అధికార పార్టీ కేడర్‌లో తీవ్ర నిరాశను నింపుతున్నాయనే చెప్పుకోవాలి. వాస్తవానికి తాజా పరిణామాల్లో జిల్లాకు సంబంధించి ఇద్దరు ముగ్గురు నాయకులకు నామినేటెడ్ పోస్టులు దక్కవచ్చునని తెలుస్తోంది. వారికి కూడా రాష్టస్థ్రాయి కార్పొరేషన్లలో కొన్ని పదవులు దక్కుతాయన్న ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కొందరు పెద్ద నేతలకు మాత్రమే ఈ పదవుల పందేరం పరిమితమవుతుందన్న అనుమానాలు లేకపోలేదు. కానీ బూత్ స్థాయిలోనూ, నియోజకవర్గ స్థాయిలోనూ కూడా కీలకంగా నిలిచే ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల విషయంలో మాత్రం పెద్దగా ఈ పందేరం ప్రభావం ఉండకపోవచ్చునని ప్రచారం జరుగుతూనే వుంది. దీనికి తగ్గట్టుగానే పదవుల పందేరం విషయంలో ఇప్పటికిప్పుడు ప్రక్రియ చేపట్టినా అవి పూర్తయ్యే సరికి పుణ్యకాలం కాస్త గడచిపోతుందన్న ఆందోళన కూడా లేకపోలేదు. వాస్తవానికి ఏలూరు నియోజకవర్గం పరిస్థితిని పరిశీలించినా ఇక్కడ ఏ మాత్రం పార్టీ ఆశాజనకంగా లేదనే చెప్పుకోవాలి. స్వయంగా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పార్టీని వీడి వెళ్లిపోయిన నేపధ్యంలో దానికి తగ్గట్టుగా నాయకత్వాన్ని ప్రోత్సహించే బృహత్తర యత్నం దాదాపు కరువైంది. ఈ నేపధ్యంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వం ఇప్పటికే పూర్తి నిరాశలో కొట్టుమిట్టాడుతోంది. ఈ పరిస్థితుల్లో కొద్దికాలం క్రితం నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గుళ్లు, గోపురాలు, పాఠశాలలు ఇతరత్రా సంస్థలకు పాలకవర్గాలను ఏర్పాటు చేసే ప్రక్రియ ఆ విధంగా మొదలైంది. దీని వల్ల భారీ ఎత్తున ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వానికి పోస్టులు దక్కే అవకాశం లభించేది. అయితే ఈ ప్రక్రియ మొదలైన కొద్దికాలం తరువాత నివేదికలు రూపొంది కమిటీలు తుది దశకు చేరుకున్న తరుణంలో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. అప్పటి నుంచి ఈ వ్యవహారం డోలాయమానంలోనే ఉండిపోయింది. అయితే మళ్లీ ఇప్పటికిప్పుడు ఈ పదవుల భర్తీకి ప్రక్రియ ప్రారంభించి పూర్తిచేయడం ఇప్పట్లో సాధ్యం కాదన్న ప్రచారం జరుగుతోంది. ఆ సమయం నుంచి ఈ నాయకత్వం పార్టీ పట్ల తీవ్ర అసహనం, అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వచ్చినా కనీసం పార్టీ పదవులను కూడా పూర్తిస్థాయిలో భర్తీ చేసే ప్రయత్నం లేకుండా పోయింది. దీనికి తోడు జిల్లాస్థాయిలోనూ, అటు నియోజకవర్గ స్థాయిలోనూ కూడా పార్టీ కమిటీలు కూడా ఏర్పాటు కాలేకపోయాయి. దీంతో చాలా మంది పూర్తి నిరాశతో ఉండిపోగా మరికొంతమంది ఇతర పార్టీలవైపు మళ్లిపోతూ వచ్చారు. ఈ పరిణామాన్ని కూడా పార్టీ నేతలు పట్టించుకోలేదనే చెప్పుకోవాలి. దీంతో రోజురోజుకూ పార్టీ పరిస్థితి గత వైభవాన్ని కోల్పోతూ వచ్చినా దాన్ని తిరిగి నిలబెట్టే ప్రయత్నం లేకుండా పోయింది. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ త్వరలోనే చేపడతారన్న ప్రచారం నేపధ్యంలో ఈసారైనా తమకు అవకాశం లభిస్తుందన్న ఆశతో మరికొంతమంది వేచి వుండిపోయారు. అయితే తాజా పరిణామాలు మాత్రం వారిని కూడా నిరాశలోకి నెట్టివేసే సంకేతాలనే పంపుతున్నాయని చెబుతున్నారు. కొంతమంది పెద్ద నాయకులకు మాత్రమే పదవుల పందేరం పరిమితమవుతుందని, ఇతర శ్రేణి నేతలకు ఇప్పట్లో పదవులు దక్కే అవకాశం దాదాపు లేకపోవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం అధికార పార్టీని ఏ దిశగా నడిపిస్తుందో వేచి చూడాలి.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు పటిష్ఠంగా నిర్వహించాలి
కలెక్టర్ వాణీమోహన్
ఏలూరు, అక్టోబర్ 17 : జిల్లాలో ఖరీఫ్ దిగుబడులు ఆశాజనకంగా ఉన్న దృష్ట్యా రైతులకు కనీస మద్దతు ధర కల్పించడానికి వంద ధాన్యం కొనుగోలు కేంద్రాలను పటిష్టవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ అధికారులను ఆదేశించారు. స్థానిక టిటిడిసిలో బుధవారం ఖరీఫ్ ధాన్యం కనీస మద్దతు ధర కల్పనపై రెవిన్యూ, వ్యవసాయం, ఇందిరా క్రాంతి పధం మహిళలకు అవగాహనా సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ ఈ సీజనులో 100 కోట్ల రూపాయలకు విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచే విధంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు. రబీ పంట కాలంలో 165 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యాన్ని నిర్ధేశించడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. ఈ నెల నుండి ధాన్యం విక్రయాలు ప్రారంభమయ్యాయని నవంబరు నెలలో మరింత ముమ్మరంగా ఈ కార్యక్రమం సాగుతుందన్నారు. ఈ ఏడాది 100 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతోపాటు మరో 12 కేంద్రాలు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పటిష్టవంతంగా నిర్వహించేందుకు ఆర్‌డివోలు, తహశీల్దార్లు, తదితర అధికారులంతా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సాయంత్రం లోగా కొనుగోలు కేంద్రాలకు అవసరమైన గోనెసంచులను సరఫరా చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో ప్రత్యేక పర్యవేక్షణా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని నిబంధనలకు అనుగుణంగా శాంపిల్స్ నాణ్యతా ప్రమాణాలను తూచ తప్పకుండా పరిశీలించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులతో దురుసుగా ప్రవర్తించకుండా సంయమనంతో వ్యవహరించి వారు కనీస మద్దతు ధర పొందేలా చూడాలన్నారు. సేకరించిన ధాన్యం తరలించడానికి సంబంధిత మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లతో వాహనాలు ఏర్పాటుకు ముందస్తుగానే చర్యలు తీసుకోవాలన్నారు.
కనీస మద్దతు ధరపై రైతుల్లో అవగాహన కలిగించాలి
రైతు పండించిన ధాన్యానికి ఇటీవల ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతు ధరపై అవగాహన కలిగించాలన్నారు. గ్రేడ్- ఎ వంద కేజీల ధాన్యానికి 1280 రూపాయలు, కామన్ రకం వంద కేజీల ధాన్యానికి 1250 రూపాయలు కనీస మద్దతు ధరగా నిర్ణయించడం జరిగిందని చెప్పారు.
గోదాములు ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వండి
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతీ మండలంలో గోదాముల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికపై ప్రతిపాదనలు పంపాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం శాంపిల్ నాణ్యతా ప్రమాణాలను సంబంధిత రైతుల సమక్షంలోనే చేయడం ద్వారా రైతుల్లో ఉన్న అపోహలు నివృత్తి చేయవచ్చన్నారు. కౌలు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసే సందర్భాలలో రుణ అర్హత కార్డులను చూపించాలని దీనివల్ల మధ్య దళారులను నిరోధించవచ్చునని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు మాట్లాడుతూ రైతు శ్రమకు తగ్గ ఫలితం రావాలని దళారులకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం కల్పించకూడదన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో రెవిన్యూ, వ్యవసాయ, ఐకెపి కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు ఎదురైతే టోల్‌ఫ్రీ నెంబరు 1800-425-8848కు గానీ, సెల్ నెంబరు 98666 56729కు చేసి తెలియజేయవచ్చన్నారు. పంట ఏ రోజుల్లో కోత కోస్తే తేమ శాతం తక్కువగా ఉంటుందో రైతులకు తగు అవగాహన కలిగించాలని ఆయన కోరారు. వ్యవసాయ శాఖ జెడి కృపాదాస్ మాట్లాడుతూ ఖరీఫ్‌లో 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగలదని అంచనా వేసామని ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. సమావేశంలో డి ఆర్‌డి ఎ పిడి వై రామకృష్ణ, డి ఎస్‌వో లక్ష్మీనారాయణ, సివిల్ సప్లయిస్ డి ఎం సలీంఖాన్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటేశ్వరరావు, మార్కెటింగ్ శాఖ పిడి రమణారావు, ఆర్‌డివోలు కె నాగేశ్వరరావు, వసంతరావు, సూర్యారావు, సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. సమావేశంలో జిల్లాలోని మండల తహశీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, ఐకెపి మహిళలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ ఆర్‌ఎంగా రామారావు బాధ్యతల స్వీకరణ
ఏలూరు, అక్టోబర్ 17 : ఆర్టీసీ రీజనల్ మేనేజర్‌గా బుధవారం ఆర్ రామారావు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి శాఖలో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న రామారావు ఆర్టీసీ జిల్లా రీజనల్ మేనేజర్‌గా బదిలీపై వచ్చారు. గతంలో ఆర్టీసీలో పనిచేసిన రామారావు పర్యాటక శాఖలో డిప్యుటేషన్‌పై బాధ్యతలు నిర్వహించి తిరిగి మాతృసంస్థకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆర్టీసీని లాభాల బాటలో పయనింపచేయడమే తమ లక్ష్యమన్నారు. కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తూనే సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. నష్టాలను అధిగమించేందుకు కృషి చేయడం జరుగుతుందని, ఇందుకు సిబ్బంది, కార్మికుల సహకారం అవసరమని చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన ఆర్ ఎం రామారావును పలువురు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.

గాయత్రీదేవిగా అంబికా దేవి దర్శనం
ఏలూరు, అక్టోబర్ 17 : సత్రంపాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో కొలువైన అంబికాదేవి ఆలయంలో సప్తమ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠపాలిత అంబికా దేవి దైవసన్నిధానం ట్రస్టు కన్వీనర్ అంబికా ప్రసాద్ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించినా, పూజించిన వేదమాత వలన సంపూర్ణ ఆరోగ్యం, జ్ఞాన సిద్ధి కలుగుతుందని చెప్పారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. అమ్మవారికి పూజలను అనిల్ దంపతులు, హరికృష్ణ దంపతులు, రఘు దంపతులతో పాటు రత్నకుమారిలు నిర్వహించారు. అమ్మవారికి శర్కరపొంగలి, క్షీరాన్నం, కట్టుపొంగలి, దద్దోజనం, చిత్రాన్నం నైవేధ్యంగా సమర్పించారు. గురువారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు.

కొనసాగిన శ్రీ అష్టలక్ష్మీ యాగం
తణుకు, అక్టోబర్ 17: స్థానిక జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అష్టలక్ష్మీ పీఠం వ్యవస్థాపక ఆచార్యుడు, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకులు పీతాంబరం రఘునాధాచార్యస్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరవ శ్రీ అష్టలక్ష్మీ యాగం బుధవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలోని తారతమ్యాలు పోయేందుకు ఆధ్యాత్మికత ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అలాగే మానవుల్లో వున్న అశాంతిని, అసంతృప్తిని ఆధ్యాత్మిక విషయాలు తీర్చగలవన్నారు. ప్రతి ఒక్కరు దైవచింతనతో జీవనం సాగించాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, నిర్వహణ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

నేటి నుండి శాసనసభా కమిటీ పర్యటన
ఏలూరు, అక్టోబర్ 17 : స్ర్తి శిశు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం అమలుపై ఏర్పాటైన రాష్ట్ర శాసనసభా కమిటీ ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణీమోహన్ తెలిపారు. కమిటీ ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది నుండి బయలుదేరి శివకోడు అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం పాలకొల్లులోని ప్రభుత్వ వికలాంగ బాలికల వసతిగృహాన్ని, నర్సాపురంలోని లేసు పార్కును సందర్శిస్తారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు ఏలూరు చేరుకుని రాత్రి బస చేస్తారు. 19వ తేదీ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఏలూరు పరిసర ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు, వికలాంగుల సంక్షేమ వసతిగృహాలను సందర్శిస్తారు.
అనంతరం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ శాఖల్లో మహిళలకు, వికలాంగులకు నిర్ధేశించిన పోస్టుల రిజర్వేషన్ విధానాన్ని వివిధ శాఖల అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ఏలూరులో శిశు గృహ, స్వధార్ హోంలను సందర్శిస్తారు. 20వ తేదీ ఉదయం 9 గంటలకు భీమడోలు మండలం గుండుగొలనులోని అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శిస్తారు. 11 గంటలకు ద్వారకాతిరుమలలోని అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు దెందులూరు చేరుకుని చిల్డ్రన్ హోంను సందర్శిస్తారు. అదే రోజు రాత్రి 10 గంటలకు గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ఏలూరు నుండి సికింద్రాబాద్ బయలుదేరి వెళతారు.

ఎమ్మెల్యే బాలరాజుకు శస్తచ్రికిత్స
బుట్టాయగూడెం, అక్టోబర్ 17: పోలవరం శాసనసభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజుకు ఎపెండిసైటిస్ శస్తచ్రికిత్స జరిగింది. సోమవారం టి.నరసాపురం మండలంలో రాజన్నబాట కార్యక్రమంలో పాల్గొన్న బాలరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల కొంత అనారోగ్యానికి గురైన బాలరాజును వైద్యులు విశ్రాంతి తీసుకోవలసిందిగా సూచించినప్పటికీ అశ్రద్ధ చేసి, పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ వచ్చారని కార్యకర్తలు తెలిపారు. అనారోగ్యానికి గురైన బాలరాజును హైదరాబాదులోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు బాలరాజుకు ఎపెండిసైటిస్ శస్తచ్రికిత్స చేశారు. ప్రస్తుతం బాలరాజు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆపార్టీ జిల్లానేత ఆరేటి సత్యనారాయణ చెప్పారు.

యువతను తీర్చిదిద్దడమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యం
రాష్ట్ర కార్యదర్శి అనంత భాస్కర్
ఏలూరు, అక్టోబర్ 17 : మంచి సంస్కారం, వ్యక్తిత్వంతో కూడిన యువతను తీర్చిదిద్దడమే ఆర్ ఎస్ ఎస్ లక్ష్యమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి నండూరి అనంతభాస్కర్ చెప్పారు. ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో స్థానిక కెపిడిటి హైస్కూల్‌లో వారం రోజులపాటు నిర్వహిస్తున్న వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులలో బుధవారం రాష్ట్ర కార్యదర్శి నండూరి అనంత భాస్కర్ పాల్గొని ప్రసంగించారు. స్వయం సేవకులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆసేతు హిమాచలం భారతదేశంలోని ప్రతీ అణువు పవిత్రమైనదని భావించిన మన వీరసైనికులు కార్గిల్ యుద్ధం చేసి విజయం సాధించారన్నారు. అటువంటి పోరాట పటిమ భారతీయుల సొంతమన్నారు. అప్పుడే వివాహమైన ఒక యువతి కార్గిల్ యుద్ధ సహాయ నిధికి తన బంగారం మొత్తం అర్పించి త్యాగభావన చాటిందని చెప్పారు. అటువంటి త్యాగభావన కలిగి ఉండటం భారతీయ మహిళలకే సాధ్యమన్నారు. ప్రతీ ఒక్కరూ దేశభక్తులుగా తయారుకావాలన్నారు. వారం రోజులపాటు జరిగే శిక్షావర్గలో ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి సూర్య నమస్కారాలు, యోగాసనాలు, నీ యుద్ధ, కర్రసాము, కవాతు, ఆటలు, దేశభక్తి గీతాలు, స్వాతంత్య్ర వీరుల గాధలు, భజన కార్యక్రమాలు, దేశభక్తుల సిడి ప్రదర్శన వంటి పలు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ నెల 20న నగరంలో శిక్షణ పొందిన యువకులతో పద సంచలనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, చివరి రోజైన 21వ తేదీ సాయంత్రం ముగింపు కార్యక్రమం జరుగుతుందని నగర కార్యవాహ సుదర్శన రాఘవాచారి తెలిపారు.

కృష్ణబాబు వెళ్లినా... నేనున్నా
టిడిపి కార్యకర్తలకు అచ్చిబాబు భరోసా
కొవ్వూరు, అక్టోబర్ 17: ఆనాడు మా కుటుంబ సభ్యులు రాజకీయరంగంలో ప్రవేశిస్తే కొందరు వ్యక్తులు జమిందార్లు రాజకీయాల్లోకి వస్తారు, వెడతారని ఎగతాళి చేశారని, కాని 25 సంవత్సరాల వయస్సులో తెలుగుదేశం పార్టీలో చేరిన తాను ఆ పార్టీ పటిష్టతకు అంకితభావంతో పనిచేస్తున్నానని, ఇకముందు కూడ పనిచేస్తానని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పి వి కృష్ణారావు సోదరుడు, పారిశ్రామికవేత్త, టిడిపి నాయకులు పెండ్యాల అచ్యుతరామయ్య (అచ్చిబాబు) అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక లిటరరీ క్లబ్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో వుంటానన్నారు. బేధాభిప్రాయాలు విడనాడి పార్టీ కోసం పనిచేయాలని 2014 ఎన్నికల్లో అధికారం తెలుగుదేశం పార్టీదేనని అచ్చిబాబు అన్నారు. కృష్ణబాబు వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీని విడిచి వెళ్లినా నేనున్నానంటూ పార్టీ నాయకులు మనోధైర్యం కల్పించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసానని అచ్చిబాబు అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే టివి రామారావు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం అంటే అచ్చిబాబు నేనున్నాను మీకోసమని పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు రావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చిందన్నారు. పార్టీ నాకేమీ చేయలేదని అలిగి ఎవరూ వెళ్లవద్దని ఆయన కోరారు. పార్టీ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, పి శ్రీనివాస్, పి ఉమామహేశ్వరరావు, కె బ్రహ్మాజీ, ఎ హరిబాబు, వేమగిరి వెంకట్రావు, రాజాని శ్రీనివాస్, మర్ల శ్రీనివాస్‌తో పాటు సుమారు 500 మంది నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో అచ్చిబాబు మాట్లాడుతూ పదవులు, బంగారు గనుల కోసం పార్టీలో పని చేయడం లేదని, పెద్దలు ఇచ్చిన ఆస్తులు, పరిశ్రమలు తమకున్నాయని, పార్టీ పటిష్టతే ధ్యేయంగా గత 30 సంవత్సరాల నుండి పార్టీలో పనిచేస్తున్నానని అచ్చిబాబు అన్నారు.

ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి
24న టిడిపిలో చేరిక:అల్లూరి విక్రమాదిత్య
తాళ్లపూడి, అక్టోబర్ 17: పదవులను ఆశించి తెలుగుదేశం పార్టీలోకి రావడం లేదని, ప్రజా సేవ కోసమే రాజకీయ ప్రవేశం చేస్తున్నానని తాళ్ళపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన అల్లూరి విక్రమాదిత్య పేర్కొన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో రాజకీయపరంగా తెలుగుదేశం పార్టీలో ఇటీవల చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల సందర్భంలో అన్నదేవరపేటకు చెందిన అల్లూరి సర్వారాయ జమిందార్ మనుమడు విక్రమాదిత్య తెలుగుదేశం పార్టీలోకి రావడం విశేషం సంతరించుకుంది. ఈ సందర్భంలో అన్నదేవరపేటలో ఆయన స్వగృహంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 24న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. రాజకీయాల్లో తమ వంశస్థులకు ఎవరూ పోటీ కాదని, అలాగే తమకు ఎవరూ వ్యతిరేకం కాదన్నారు. టీం వర్క్ చేసి టిడిపిని ముందుకు నడిపిస్తానని ఆయన తెలిపారు. ఆదిత్య రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు వస్తున్న నేపధ్యంలో పలు మండలాలకు చెందిన టిడిపి వర్గీయులు ఆయనను కలిసి వెడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు ఆయన అనుయాయులతో ఏర్పాటు చేసుకున్న సమావేశానికి తాళ్లపూడి, కొవ్వూరు, నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం తదితర మండలాల నుండి నాయకులు విచ్చేశారు. స్థానిక నాయకులు కొఠారు వెంకట్రావు ఆధ్వర్యంలో సీనియర్ టిడిపి నాయకులు నామా శ్రీరాములు, అనపర్తి పరమేశ్వరరావు, తాళ్లపూడి మండల టిడిపి అధ్యక్షులు కైగాల శ్రీనివాసు, మండల తెలుగుయువత అధ్యక్షులు బి శేషు, ఇతర మండలాలకు చెందిన ఎం రత్నాజీ, పిన్నమనేని శ్రీమన్నారాయణ, కొయ్యలమూడి చినబాబు, దొడ్డపనేని శ్రీహరి, వడ్లమూడి రమేష్, ఎం సుధాకర్, పల్లి ప్రకాష్, జొన్నలగడ్డ చౌదరి, కూచిపూడి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

*ఈసారైనా గుర్తింపా..లేక విదిలింపేనా..! *నామినేటెడ్‌పై సాగుతున్న చర్చలు
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>