వాషింగ్టన్, అక్టోబర్ 18: విశ్వశాంతి కోసం విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ అమెరికాలో జరుపుతున్న యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం ఇక్కడి యూదుల మందిరాన్ని (సైనోగోగ్) సందర్శించారు. ఈ సందర్భంగా అమెరికా యూదుల సంఘానికి చెందిన రబ్బీ (మతాచార్యుడు) గిల్ స్టీన్‌లాఫ్‌తో, ఆయన సిబ్బందితో సమావేశమై శాంతి, మానవాళి ఐక్యతను గురించి చర్చించారు. సైనోగోగ్‌లో శాంతియుత వాతావరణంలో జరిగిన సమావేశంలో గిల్, ఆయన సిబ్బంది స్వామీజి జరుపుతున్న యాత్రను ప్రశంసించారు. సమావేశంలో స్వామీజీ దైవశక్తిని గురించి వివరిస్తూ దేవుడు నిరాకారుడని, మానవులు తమ మనసుని లగ్నం చేయడం కోసం ఒక్కోరూపంలో కొలుస్తుంటారని, అందువల్ల మతం పేరిట వివాదాలు వద్దని అన్నారు. దేహమే దేవాలయమని, హృదయం దేవుని పీఠమని, మానవ దేహం, భూమాత పంచభూతాల మిశ్రమమని, ఈ పంచభూతాల మధ్య సమతుల్యత ఉన్నప్పుడే దేహం, పృధ్వి ఆరోగ్యంగా, శాంతియుతంగా ఉంటాయని విశ్వంజీ అన్నారు. దసరా ఉత్సవాలలో మనం శక్తిని పూజిస్తామని, తద్వార శక్తిని సముపార్జించుకోగలమని, అదే ఆధ్యాత్మికత అని స్వామీజీ అన్నారు. ఆధ్యాత్మిక భావన సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుపోవాలని తద్వారా అందరినీ బలవంతులను, శాంతికాములను చేయాలని అన్నారు. శాంతి స్థాపనకోసం అమెరికా యూదుల సంఘం జరుపుతున్న కృషిని అభినందిస్తూ వారికి ఆయన తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా విశ్వంజీ యూదుల మతాచార్యుణ్ణి సన్మానించారు.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్ దుర్గ గుడిలో అదేరోజు జరిగిన చండీ హోమాన్ని విశ్వంజీ పర్యవేక్షించారు.
విశ్వశాంతి కోసం విశ్వయోగి విశ్వంజీ అమెరికాలో జరుపుతున్న యాత్రలో
english title:
viswamji
Date:
Friday, October 19, 2012