నెల్లూరు, జూన్ 13: సర్కారు స్కూళ్లలో చదివే చిన్నారులకు యూనిఫారమ్‌ల పంపిణీ కార్యక్రమం ఈ విద్యాసంవత్సరంలో కూడా సకాలంలో పంపిణీ జరిగే అవకాశాలు కన్పించడం లేదు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిర్బంధ విద్యాహక్కు చట్టం అనుసరించి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎనిమిదవ తరగతి విద్యార్థుల వరకు ఏటా రెండు జతల సమదుస్తుల్ని ఉచితంగా పంపిణీ చేయాలి. గత రెండేళ్లనుంచి సమ దుస్తుల వితరణ జరుగుతుండగా అనేకానేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. తొలి పర్యాయం అందజేసిన దుస్తులకు సంబంధించి సైజుల్లో వివిధ సమస్యలు తలెత్తి విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఎనిమిదవ తరగతి పిల్లోడికి కూడా ఒకటి రెండు తరగతుల విద్యార్థుల సైజ్‌లోనే దుస్తులుండటంతో ఈ కార్యక్రమం కాస్తా అభాసుపాలైంది. దీంతో మరుసటి సంవత్సరం స్థానికంగానే కుట్టించి అందించేలా కార్యాచరణ రూపొందించారు. ముందుగానే విద్యార్థుల శరీర కొలతల్ని సేకరించారు. ఈ నేపథ్యంలో యూనిఫారమ్ గుడ్డను తాన్ల రూపేణా పంపిణీ చేశారు. అయితే ఆ గుడ్డ తాన్ల రూపంలోనే నెలల తరబడి మండల విద్యావనరుల కేంద్రాల్లో మూలిగింది. జాతీయ టెక్స్‌టైల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన గుడ్డను ఆ సంస్థకు చెందిన ప్రతినిధులే వచ్చి విద్యార్థులవారీగా విభజించి ముక్కలు చేసి వెళ్లేందుకే చాలా కాలం పట్టడం శోచనీయం. ఆ తరువాత స్థానికంగా ఉన్న దర్జీలతో కుట్టించాలని విద్యాశాఖ ఉన్నతాధికార్లకు ఆదేశాలు అందాయి. ఇందుకుగాను ఒక్కో జతకు నలభై రూపాయలు మంజూరు చేశారు. అయితే బహిరంగ మార్కెట్‌లో ఒక్కో విద్యార్థి యూనిఫారమ్ కుట్టు చార్జీ ఎంత లేదన్నా వంద నుంచి 150 రూపాయలకు పైమాటే. ఈ నేపథ్యంలో స్థానికంగా ఎవరూ దర్జీలు ముందుకు రాలేదు. దీంతో మండల విద్యాధికారులు గుడ్డను కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేయలేక సతమతమయ్యారు. అయితే టోకుగా ఆర్డర్ ఉన్నందున ఎవరో ఒకరు ముందుకు వచ్చేలా చూడాలని ప్రాథమిక విద్యాశాఖ ఉన్నతాధికార్ల ఒత్తిడి చేయడంతో చాన్నాళ్ల తరువాతగాని ఈ వ్యవహారానికి తెరపడ లేదు. ఇలా యూనిఫారమ్‌ల పంపిణీ చేపట్టాల్సిన వ్యవహారం కార్యాచరణలో తీవ్రజాప్యంతో సహా వివిధ సమస్యలకు లోనవుతోంది. కాగా, మరో ఇరవై రోజుల్లో నూతన విద్యాసంవత్సరం ఆరంభం కానుండటం తెలిసిందే. ప్రారంభంలో జరిగే విద్యాపక్షోత్సవాల్లోనే సమ దుస్తుల పంపిణీ చేసేలా పకడ్బందీ చర్యలుండాలని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా ఇదే ఆదేశిస్తున్నారు. అందువల్ల వేసవి సెలవుల్లోనే వీటిని సిద్ధం చేయడం సముచితం. ఇదిలాఉంటే నిర్భంద విద్యాహక్కు చట్టం రూపొందించి నాలుగేళ్లు పూర్తవుతోంది. ఏదేమైనా ఇలా అనేక ధోరణులతో కొనసాగితే విద్యాహక్కు చట్టం సమగ్రరూపం దాల్చాలంటే మరెనే్నళ్లవుతుందనేది విద్యావేత్తలు విస్మయం వ్యక్తపరుస్తున్నారు. ఇదిలాఉంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల బోధనతో కొనసాగే ఎయిడెడ్ విద్యార్థులకు యూనిఫారమ్‌లు పంపిణీ చేయడం లేదు. వాస్తవంగా ప్రభుత్వ ఎయిడెడ్ విద్యాసంస్థల్లోనూ ఎక్కువగా చదివేది పేద విద్యార్థులే. అలాంటప్పుడు వారికి కూడా యూనిఫారమ్‌లు అందజేయాలనే విద్యావేత్తల వాదనలున్నాయి. విద్యార్థుల, ఉపాధ్యాయుల రేషనలైజేషన్ అంశంలోనూ ఎయిడెడ్ స్కూళ్లలో ఉన్న టీచర్లను ఎంతో చక్కగా అధికారులు ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్లపై పంపే యోచనలో ఉన్నారు. నో వర్క్ నో పే కింద ఎయిడెడ్ ఉపాధ్యాయుల్ని కూడా ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై పంపనున్న దృష్ట్యా ఆయా స్కూళ్లలో చదివే విద్యార్థులకు మాత్రం ఎందుకు యూనిఫారమ్‌లు పంపిణీ చేయరనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇప్పటినుంచైనా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోకుంటే చిన్నారులకు సమదుస్తులు ఈ ఏడాది కూడా హుళక్కే అనిపిస్తోంది.
అనుమతి లేని ప్రైవేటు వైద్యశాలలపై
వైద్యాధికారి కనె్నర్ర
నాయుడుపేట, జూన్ 13: పట్టణంలో అనుమతులు లేకుండా వైద్యశాలలపై జిల్లా ఇంచార్జి వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈదూరు సుధాకర్ కనె్నర్ర చేశారు. గురువారం ఆయన ప్రభుత్వ వైద్యశాలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పట్టణంలోని ఎస్‌బిఐ ఏటీఎం వద్దగల ఓ ప్రైవేటు వైద్యశాలను తనిఖీ చేశారు. ఈ వైద్యశాలలో స్కానింగ్‌కు ప్రభుత్వం అనుమతి లేదని నిర్ధారించుకొని దానిని సీజ్ చేశారు. పట్టణంలో గల మిగిలిన వ్రైవేటు వైద్యశాలలకు ఉన్న ప్రభుత్వ అనుమతులపై క్షుణ్ణంగా పరిశీలించాలని, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వాటిని వెంటనే సీజ్ చేయాలని అక్కడ ఉన్న క్లస్టర్ అధికారి డాక్టర్ సాయిబాబాను ఆదేశించారు.
పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కంప్యూటర్ సైన్స్ కోర్సు మంజూరు
నాయుడుపేట, జూన్ 13: పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతనంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సు మంజూరైందని ప్రిన్స్‌పాల్ డాక్టర్ ఆదూరు శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు ఉన్న కోర్సులకు అదనంగా ఇంటర్మీడియట్ విద్యాకమీషనర్ ఈ కోర్సును మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ఈ ప్రాంత విద్యార్థులు సద్వినియోగ పరుచుకోవాలని కోరారు.
ప్రజలకు మేలు చేయని ప్రభుత్వం
వెంకటాచలం, జూన్ 13: ప్రస్తుతం రాష్ట్రం, కేంద్రంలో పరిపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయటం లేదని వైఎస్‌ఆర్‌సిపి కేంద్ర కమిటీ సభ్యులు కాకాణి గోవర్దన్‌రెడ్డి ఆరోపించారు. ఆయన వెంకటాచలంలో గురువారం ప్రజాదీవెన యాత్ర చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను అదుపు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. నిత్యావసరమైన విద్యుత్‌పై సర్‌చార్జీలు విధించటం వల్ల విద్యుత్‌ను వినియోగించుకునేందుకు ప్రజలు భయపడుతున్నారని అన్నారు. పురుగుపట్టి నాణ్యతలేని వస్తువులను రేషన్‌దుకాణాలో అమ్మహస్తం పథకం ద్వారా పంపిణీ చేయటం చూస్తే ప్రభుత్వానికి ప్రజలపై ఉన్న ప్రేమ తెలుస్తుందన్నారు. పథకాలను రూపొందించి ప్రజల చెంతకే ప్రభుత్వమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ చేసే ప్రకటనలు బూటకమని అన్నారు. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు లబ్ధిచేకూర్చితే, నేటి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల వల్ల ప్రజలకు లబ్ధిచేకూరటం లేదని అన్నారు. ప్రజా సమస్యలు చర్చించి, పరిష్కారం కోసం మార్గాలను ఎంచుకునేందుకు కొలువైన అసెంబ్లీలో పాలకపక్షం, ప్రతిపక్షం ఏకమైన సభను కొనసాగనీయటం లేదని వాపోయారు. ప్రజాసమస్యలు పట్టిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పరిపాలించే అర్హత లేదన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు మేలు చేసే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు.
ఐదు నెలల చిన్నారి కిడ్నాప్- హత్యాయత్నం?
గూడూరు, జూన్ 13: గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ సమీపంలో ఓ గుర్తు తెలియని ఐదు నెలల బాలుడు ఏడుస్తుండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గూడూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్‌నగర్ సులభ్ కాంప్లెక్స్ వెనుక భాగంగా రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఐదు నెలల బాలుడు గురువారం ఉదయం ఏడుస్తుండటాన్ని ఆ ప్రాంతానికి చెందిన ప్రశాంత్, తేజ, ప్రేమ్ అనే యువకులు వాకింగ్‌కు వెళుతుండగా గమని ంచారు. వెంటనే దగ్గరకు వెళ్లి పరిశీలించి విషయాన్ని వారు స్థానిక టౌన్ సిఐ ఉప్పాల సత్యనారాయణ దృష్టికి తీసుకొని వెళ్లారు. ఆయన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బిడ్డను స్వా ధీనం చేసుకొని బిడ్డ ఆచూకీ కోసం విచారణ నిర్వహించారు. ఎవరి వద్ద నుండి ఎటువంటి ఫిర్యాదు అందక పోవడంతో వెంటనే ఈ విషయాన్ని ఐసిడిఎస్ గూడూరు అర్బన్ సిడిపివో ఉమామహేశ్వరికి, ఐసిపిఎస్ జిల్లా అధికారి సమతకు సమాచారం అందించారు. వారు కూడా గూడూరుకు చేరుకొని బిడ్డ వివరాలు ఆరా తీశారు. తెలియ రాక పోవడంతో బిడ్డకు పాలు పట్టే క్రమంలో పాలు తాగలేక పోతుండటంతో వైద్య పరిక్షల నిమిత్తం చిన్నారికి ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా బిడ్డ గొంతులో బబుల్‌గమ్, దాని రేపర్‌ను కూడా ఉండటంతో బిడ్డను ఎవరో కిడ్నాప్ చేసి చంపే ప్రయత్నం చేసినట్టు అనుమానిస్తున్నామని సిఐ తెలిపారు. బాబును ఐసిడిఎస్ సంరక్షణకు నెల్లూరుకు పంపినట్టు సిఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు ఆయన తెలిపారు.
రేషన్ డీలర్లకు రుణాలు:జెసి
పొదలకూరు, జూన్ 13: జిల్లాలోని రేషన్‌షాపు యజమానులకు త్వరలో రుణాలు మంజూరు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ బి లక్ష్మీకాంతం పేర్కొన్నారు. పొదలకూరులోని సివిల్ సప్లయిస్ గోడౌన్‌ను గురువారం ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందుకోసం ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సాధిస్తామన్నారు. పునరావాస కేంద్రాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా పౌర సరఫరాల అధికారి ఉమామహేశ్వరరావు, తహశీల్దార్ రామకృష్ణ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
ఎర్రచందనం పట్టివేత
రాపూరు, జూన్ 13: రాపూరు అటవీరేంజ్ పరిధిలోని పుణ్యక్షేత్రమైన పెంచలకోన దగ్గరలోవున్న పెంచలయ్యబావి వద్ద ఒక వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు గురువారం పట్టుకున్నారు. జిల్లా ఫ్లయింగ్ స్వ్కాడ్ అటవీ అధికారి ఎ వేదయ్య కథనం మేరకు ముందస్తు సమాచారం రావటంతో బుధవారం నుండే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని చెప్పారు. గురువారం ఉదయం అనుమానాస్పదంగా వస్తున్న ఒక వాహనాన్ని నిలిపే ప్రయత్నం చేయగా, దూరం నుండి తమను చూసిన నిందితులు వాహనాన్ని వదిలి పరారయ్యారన్నారు. దగ్గరకు వెళ్లి వాహనాన్ని పరిశీలించగా, అందులో 10 ఎర్రచందనం దుంగలు ఉన్నాయని చెప్పారు. పట్టుకున్న ఎర్రచందనం దుంగలు, వాహనంతో సహా 6 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. పట్టుకున్న వాహనం, దుంగలను వెంకటగిరి ఎర్రచందనం నిల్వ గిడ్డంకి తరలించినట్టు తెలిపారు. ఈదాడులలో ఫ్లయింగ్ స్క్వాడ్ అటవీ అధికారులు పివి కృష్ణయ్య, రవీంద్రబాబు, కె మురళీ, గోనుపల్లి అటవీ బీట్ అధికారి గోపాల్‌లతోపాటు గోనుపల్లి డిఆర్‌ఓ డివి రమణయ్య ఉన్నారని తెలిపారు.
మనీస్కీమ్ బాధితులకు న్యాయంచేయడంలో
జాప్యం ఎందుకు?
నెల్లూరు అర్బన్, జూన్ 13: మనీస్కీమ్ బాధితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలంటూ తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు పమిడి రవికుమార్ కోరారు. స్థానిక కలెక్టరేట్ వద్ద గురువారం జరిగిన భారీ ధర్నా సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనం సోదరులు, సిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్ కృష్ణారెడ్డి మనీస్కీమ్ బాధితులకు న్యాయం చేయటంలో విఫలమయ్యారని విమర్శించారు. 285 కోట్ల మనీస్కీమ్ వెనుక ఆనం సోదరుల పాత్ర ఉందని ఆరోపించారు. 53 కోట్ల రూపాయలు రికవరీ చేసిన ప్రభుత్వం దాన్ని బాధితులకు ఇవ్వటంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. ఇది జరిగిన ఆరు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పిన ఎమ్మెల్యేలు పత్తాలేకుండా పోయారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి, నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు.
రెండు సంవత్సరాల నుండి ఈప్రభుత్వం సేవ చేయటంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని స్పష్టం చేసారు. చంద్రబాబు పరిపాలనను ప్రజలు కోరుకుంటున్నారన్నారు. టిడిపిని ప్రజలు గెలిపిస్తారని, తప్పక గెలుస్తుందని జోస్యం చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు అంచెల వాణి, నూనె మల్లికార్జునయాద్, ధర్మవరపు సుబ్బారావు, కిలారి వెంకటస్వామినాయుడు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభమైన విద్యా సంబరాలు
చిల్లకూరు, జూన్ 13: మండలంలోని వల్లిపేడు, ఉడతావారిపాలెం గ్రామాల్లో గురువారం మండల విద్యాశాఖాధికారి జిసి మదుసూధనరావు అధ్యక్షతన విద్యాసంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్సులు, పెన్నులు, జామెంట్రీ బాక్సులు వల్లిపేడు గ్రామానికి చెందిన నందకుమార్ ఆర్ధిక సహకారంతో అందచేశారు. ఉడతవారిపాలెం గ్రామంలో ఫణీంద్ర అనే వ్యక్తి ఆర్ధిక సహకారంతో చదువుకున్న విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్లు విజయకుమార్, తిరుపాల్, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు .
పనులను నిలిపి వేసిన సబ్ కలెక్టర్
చిల్లకూరు, జూన్ 13: మండలంలోని నక్కలవారికండ్రిగ సర్వేనంబర్ ఓ సర్వే నంబర్‌లోని 18 ఎకరాల భూములలో సిపి ఆక్వా కంపెనీ నిర్మాణం చేపట్టేందుకు యంత్రాల సాయంతో పనులు చేస్తుండగా స్థానికుల ఫిర్యాదు మేరకు సబ్ కలెక్టర్ నివాస్ ఆ ప్రాంతానికి వెళ్లి పనులను నిలుపుదల చేశారు. గతంలో ఈ భూములకు సంబంధించి సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో గుడిసెలను ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలను సంప్రదించకుండా పంచాయతీ తీర్మానం లేకుండానే రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శించి రాజకీయ నాయకుల మద్దతుతో కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారని, స్థానికులు సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
హౌసింగ్ కార్యాలయానికి భూమి పూజ
చిల్లకూరు, జూన్ 13: మండల కేంద్రమైన చిల్లకూరు తహశీల్దార్ కార్యాలయం వెనుక 2 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హౌసింగ్ కార్యాలయాన్ని ఎస్‌ఇ వెంకటేశ్వరరెడ్డి గురువారం భూమిపూజ చేశారు. గత కొనే్నళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతున్న ఈ కార్యాలయం స్వంతంగా నిర్మించనున్నారు. ఈయన వెంట ఇఇలు నగేష్, సాయిరాం, నిరంజన్, ఎఇ మహ్మద్ అక్రంలున్నారు.
హౌసింగ్ కార్యాలయానికి భూమి పూజ
దొరవారిసత్రం, జూన్ 13: మండల కేంద్రంలో నూతన గృహ నిర్మాణశాఖ కార్యాలయానికి తహశీల్దార్ బాల కృష్ణారెడ్డి గురువారం భూమిపూజ నిర్వహించారు. గత కొంత కాలంగా అద్దె భవనంలో ఈ కార్యాలయం నిర్వహిస్తుండే వారు. ఈ నేపధ్యంలో ఈ భవన నిర్మాణానికి 1.96 లక్షలు ప్రభుత్వం మంజూరు చేయగా తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఈ భవనం నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎండివో సురేష్‌బాబు, హౌసింగ్ డిఇ నటరాజ్, ఎఇ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
జాబ్‌కార్డుల్లో వివరాలు నింపక పోతే చర్యలు
దొరవారిసత్రం, జూన్ 13: జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల వివరాలను తప్పని సరిగా వారి వారి జాబ్ కార్డుల్లో నమోదు చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని డ్వామా పిడి గౌతమి హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ మండలంలో కొత్తపల్లి పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఎల్లయ్య సుమారు 50వేల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు సోషల్ ఆడిట్‌లో వెలుగు చూసిందన్నారు. ఇతనిని విధుల నుండి తప్పిస్తున్నట్టు పిడి తెలిపారు. వేణుంబాక, తనయాలీ, బూదూరు తదితర గ్రామాల్లో టేకు మొక్కలు నాటినట్టు రికార్డుల్లో చూపించి వాస్తవంగా అక్కడ ఎటువంటి చెట్లు లేవని ఆడిట్ సిబ్బంది తెలిపారన్నారు. దాంతో అక్కడ విచారణ నిర్వహించి చర్యలు తీసుకొనడం జరుగుతుందన్నారు. గతంలో కన్నా ఇటీవల కాలంలో నిధులు దుర్వినియోగం చాలా వరకు తగ్గిందని పేర్కొన్నారు. ప్రస్తుతం మండలంలో 2.40 లక్షల వరకు నిధులు రికవరీ చేయాల్సివుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ ఎడి దయాకర్ రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ డిఇ వెంకటయ్య, ఎస్‌ఆర్‌పి కూనయ్య, ఎండివో సురేష్‌బాబు, ఎపివో విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోఉంటా
సైదాపురం, జూన్ 13: ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీర్చే వ్యక్తిగా మంచి పేరున్నందునే ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలునీరాజనాలు పలుకుతున్నారని వెంకటగిరి నియోజక వర్గ వైఎస్‌ఆర్‌సిపి సమన్వయకర్త , మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు అన్నారు. మండల కేంద్రమైన సైదాపురంలో గురువారం జరిగిన కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొని మండల నాయకులు, కార్యకర్తలను కలుసుకొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అది వారికి తగదన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కలసి కట్టుగా కృషి చేయాలన్నారు. పార్టీని బలహీన పర్చే కార్యక్రమాన్ని వీడాలని, ఏదైనా మాట్లాడాలంటే పార్టీ హైకమాండ్ వద్దే తేల్చుకొనాలన్నారు. జగన్, విజయమ్మ ఆశీస్సులతో అధిష్ఠానం తనను నియోజక వర్గ సమన్వయకర్తగా నియమించారన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అందరం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేద్దామన్నారు. అనంతరం సైదాపురం ఇంటింట తిరిగి ప్రజాదీవెనలో పాల్గొన్నారు. ఆయన వెంట మండల పార్టీ కన్వీనర్ కృష్ణారెడ్డి, జనార్ధన్ రాజు, రాఘవరెడ్డి, శంకరరాజు, మహేంద్ర, శేషయ్యలు, మండలంలోని పలు గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.
సైదాపురంలో అంగన్‌వాడీ బాట
సైదాపురం, జూన్ 13: స్థానిక ఎస్‌టి కాలనీ అంగనవాడీ కేంద్రంలో గురువారం అంగనవాడీ బాట కార్యక్రమం జరిగింది. గ్రామంలోని అన్ని అంగనవాడీ పిల్లలను ఈ కార్యక్రమంలో బరువులు చూడటం, వారి సంక్షరణకు తీసుకొంటున్న చర్యలను సూపర్‌వైజర్ లీలావతీ వివరించరు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.
సైదాపురంలో సామూహిక అక్షరాభ్యాసం
సైదాపురం, జూన్ 13: మండల కేంద్రమైన సైదాపురంలో విద్యాసంబరాల కార్యక్రమాల్లో భాగంగా సామూహిక అక్షరాభ్యాసం శుక్రవారం జరిగింది. స్థానిక మెయిన్ పాఠశాలలో అన్ని పాఠశాల విద్యార్థులతో అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందకుమార్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గిరిజనుల్లో చైతన్యం కోసం కృషి చేస్తున్న
ఎఆర్‌డి సంస్థ సేవలు శ్లాఘనీయం
గూడూరు, జూన్ 13: గిరిజనుల చైతన్యం కోసం గూడూరులోని ఎఆర్‌డి సంస్థ చేస్తున్న కృషి శ్లాఘనీయమని, వారి విద్యాబుద్ధుల కోసం శ్రమిస్తున్న సంస్థ నిర్వాహకులను డిఎస్పీ కందుల చౌడేశ్వరీ కొనియాడారు. గురువారం సాయంత్రం తన ఛాంబర్‌లో సంస్థ ఆధ్వర్యంలో ఉన్నత చదువులు అభ్యసించే గిరిజన పేద విద్యార్ధులకు డిఎస్పీ చేతుల మీదుగా వివిధ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఆర్ధిక సాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ గిరిజనుల్లో చైతన్యం తక్కువని, వారిని విద్యాపరంగా ఆదుకొనేందుకు, వారిలో చైతన్యం కోసం కృషి చేస్తున్న సేవలు మరింత విస్తృత పరచాలన్నారు. పది మంది గిరిజన విద్యార్థులకు ఆర్ధిక సాయం అందచేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి బషీర్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు ప్రధానంగా గిరిజనాభివృద్ధి కోసం చేపట్టం జరిగిందని, అలాగే గిరజనులు బాగా చదువుకొంటే వారు ఉన్నత శిఖరాలు అదిరోహించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నారని, వారిని చైతన్య పరిచి వారి విద్యాభివృద్ధికి అవసరమయ్యే ఆర్ధిక సాయాన్ని తాను అందచేస్తున్నానని అన్నారు.
గుర్తింపులేని విద్యాసంస్థలను మూసి వేయాలి
గూడూరు, జూన్ 13: గుర్తింపులేని విద్యా సంస్థలను ప్రభుత్వం వెంటనే మూసి వేయాలంటూ గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను స్థానిక టవర్ క్లాక్ సెంటర్‌లో దగ్ధం చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకొనాలని వారు ఈసందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ డివిజన్ కార్యదర్శి ఎం సునీల్ మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన నెల్లూరులో శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలకు గుర్తింపు లేకున్నా విద్యార్థులను చేర్చుకొంటున్నారని, వారి వద్ద నుండి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కనీసం విద్యార్థులకు సౌకర్యాలు కూడా సక్రమంగా కల్పించకుండా విద్యా వ్యాపారాన్ని సాగిస్తూ విద్యార్థుల తల్లితండ్రుల నుండి అధిక ఫీజుల పేరుతో నిలువు దోపిడిచేస్తున్నారన్నారు. అనుమతి లేకుండా విద్యా సంస్థలు నడుపుతున్నా విద్యా శాఖ పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థులు నెల్లూరులో శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తుంటే 17మందిపై పోలీసులు క్రిమినల్ కేసులు బనాయించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులతో ఉద్యమాలను ఆపలేరని, వెంటనే విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు సిహెచ్ బాబూరావు, ఎల్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఎపిఆర్‌జెసిలో గూడూరు విద్యార్థుల ప్రతిభ
గూడూరు, జూన్ 13: గూడూరు పట్టణంలోని శివానీ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఎపిఆర్‌జెసిలో వివిధ గ్రూపులకు సంబంధించి స్టేట్ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా గురువారం కోచింగ్ సెంటర్‌లో విద్యార్థులకు అభినందన సభ కోచింగ్ సెంటర్ నిర్వహకుడు మరుపూరు శివకుమార్‌రెడ్డి నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ర్యాంకులు సాధించిన ఎస్ హేమశ్రీ,కె సుప్రజ, కె సుబ్రహ్మణ్యం , వి జగదీష్‌బాబు, బి వెంకటసాయి తరుణ్ ను పలువురు అభినందించారు.
ముత్తుకూరులో సువర్ణలక్ష్మి దాంపత్యవ్రత మహాయాగం
ముత్తుకూరు, జూన్ 13: ముత్తుకూరు శ్రీవేణుదత్త సువర్ణలక్ష్మి దాంపత్యవ్రత మహాయాగం దత్త అవధూత శ్రీరామదూత స్వామి ఆధ్వర్యంలో గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పంచమ ధర్మంలో దాంపత్య జీవితం అత్యంత ముఖ్యమైందని పేర్కొన్నారు. భారతదేశంలో మాతృత్వ వ్యవస్థ గొప్పదన్నారు. తల్లి తత్వం లేనిదే ప్రపంచం లేదన్నారు. ఆదివిష్ణువు లక్ష్మిదేవిని వక్షస్థలంలో నిలుపుకున్నారని, అందువల్ల నిత్యం కల్యాణం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు పాపం, ధర్మం, నీతి కలిగి ప్రవర్తించాలన్నారు. దంపతులు సౌఖ్యంగా ఉంటే లక్ష్మిప్రసన్నం అవుతుందని పేర్కొన్నారు. అంతకు ముందు ఆయన స్థానిక శ్రీరామ శశికళ ఇంటి వద్ద విడిది చేశారు. అక్కడ నుండి ఊరేగింపుగా మహాయాగ ప్రదేశానికి భక్తుల స్వాగత సత్కారాలతో ఆయన్ని తీసుకొచ్చారు. దాంపత్య మహాయాగంలో పాల్గొన్న భక్తులకు ఆయన ఆశీర్వచనాలు అందజేసారు. ఈదూరు రామ్మోహన్‌రెడ్డి, తోకచర్ల భాస్కర్‌రెడ్డి దంపతులు ఈకార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం పట్ల శ్రీరామదూత ఆనందం వ్యక్తం చేసారు. ఈనెల 18న 2000 సంవత్సరాలు నుండి 2001లో అడుగిడుతున్న మహాశిద్ధియోగి అవధూత బాబా సందర్భంగా మహాశిద్ధులంతా తమ తపస్సు ఫలితాలను ఆయనకు ధారపోస్తారని, దీంతో ప్రజానీకానికి సకల సిద్ధులు సిద్ధిస్తాయని ఆయన స్పష్టం చేసారు.
వైఎస్‌ఆర్‌సిపిని ఆదరించండి: మాజీ ఎంపి నెలవల
పెళ్లకూరు, జూన్ 13: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పేద, బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్‌ఆర్‌సిపిని స్థాపించారని ప్రజలు ఆపార్టీని ఆశీర్వదించి ఆదరించాలని మాజీ ఎంపి నెలవల సుబ్రహ్మణ్యం కోరారు. మండల పరిధిలోని కలవకూరు గ్రామంలో గురువారం సాయంత్రం నెలవల, డి రాజారెడ్డితో కలిసి గడప గడపకు వైకాపా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెలవల మాట్లాడుతూ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే దళిత గిరిజన పిల్లలకు ఏడాదికి 24 వేల రూపాయలు అందిస్తారని తెలిపారు. పెన్షన్‌లను పెంచుతారని తెలిపారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దయాదక్షణ్యాలతో ఈప్రభుత్వం నిలబడివుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన ప్రభుత్వం పంచాయతీలకు నిధులు రాకుండా నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేసారు. అనంతరం ఆయన గడపగడపకు వెళ్లి వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, జగన్ ప్రవేశపెట్టబోయే పథకాల గురించి కరపత్రాలను విడుదల చేసారు. ఈకార్యక్రమంలో వైకాపా నాయకులు కె మల్లికార్జునరెడ్డి, ఓడూరు వినోద్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, గోను బాబు, ఎ బాబు తదితరులు పాల్గొన్నారు.
పిహెచ్‌సి తనిఖీ
ఓజిలి, జూన్ 13: మండల కేంద్రమైన ఓజిలిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గూడూరు ఎస్‌పిహెచ్‌ఓ చంద్రయ్య గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న చిన్నారుకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయాలని సూచించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వందశాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత గర్భిణిలు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులు చేయించుకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానం సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. అనంతరం ఆయన రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి స్వప్న, సిబ్బంది ఉన్నారు.
నిరుద్యోగ యువత రుణాల కోసం 15 నుండి వార్డు సభలు
గూడూరు, జూన్ 13: గూడూరు పురపాలక సంఘ పరిధిలోని ఎస్‌సి, ఎస్టీ, బిసి కులాలకు చెందిన అభ్యర్థులకు, మైనార్టీలకు, వికలాంగులకు, నిరుద్యోగులైన యువతీ యువకులకు రాజీవ్ యువశక్తి పథకం కింద పట్టణంలోని అన్ని వార్డుల్లో వార్డు సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తామని మున్సిపల్ కమిషనర్ జిసి సుసశీలమ్మ ఒక ప్రకనటలో తెలియ చేశారు. ఈ నెల 15న ఉదయం 10.30 గంటలకు 1వ వార్డు నుండి 5వవార్డు పరిధి వరకు జనార్దన్ రెడ్డి కాలనీ, మధ్యాహ్నం 2 గంటల నుండి 6 గంటల నుండి 6 నుండి 11 వార్డులకు సివిసి పార్కులో, 17న ఉదయం 10.30 గంటలకు 12 నుండి 17 వార్డులకు ఎన్‌జెఆర్ రీడింగ్ రూంలో, మధ్యాహ్నం 2 గంటలకు 18 నుండి 22 వార్డులవరకు వాలయానందపురం వాటర్ ట్యాంకు వద్ద, 18న ఉదయం 10.30 గంటలకు 23నుండి 27 వార్డుల వరకు మాళవ్యానగర్ ఎలిమెంటరీ స్కూల్, మధ్యాహ్నం 2 గంటలకు 28 నుండి 33 వార్డుల వరకు నరసింగరావుపేట సీతమ్మ బడిలో ఈ వార్డు సభలు నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సబ్ కలెక్టర్ అక్రమ బదిలీ ఆపాలి
లోక్‌సత్తా, సిపిఐ
గూడూరు, జూన్ 13: గూడూరు సబ్ కలెక్టర్ జె నివాస్ ఆకస్మిక అక్రమబదిలీని లోక్‌సత్తా, సిపిఐ పార్టీలు తీవ్రంగా ఖంఢించారు. ఈ మేరకు గురువారం వారు సమావేశమై మాట్లాడుతూ 10 నెలలు కాకముందే నిజాయితీగా సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజానీకానికి మేలు చేసేలా పనిచేస్తున్న వ్యక్తిని బదిలీ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఇది అవినీతి ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియ చేస్తున్నదని అన్నారు. సబ్ కలెక్టర్ గూడూరు వచ్చినప్పటి నుండి పట్టణంలో రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా పాలన సాగించి అన్ని వర్గాల ప్రజల మన్నలను పొందారన్నారు. అక్రమమార్కులు కొందరికి ఈయన కంటగింపుగా తయారైనాడని 10నెలలకే బదిలీ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సబ్ కలెక్టర్ బదిలీ ఆపకుంటే ప్రజా ఉద్యమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా డివిజన్ కన్వీనర్ కెవి కృష్ణయ్య, పట్టణ కన్వీనర్ టి ఇజ్రాయిల్‌కుమార్, సిపిఐ నాయకుడు ఎం రాజేష్‌కుమార్, సివిఆర్ కుమార్, పుట్టయ్య, లోక్‌సత్తా రూరల్ నాయకుడు ఎల్ కృష్ణారెడ్డి, ఎస్‌కె షబ్బీర్, ఎస్‌కె మున్నా, కాలేషా, జాకీర్, కె రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
అవినీతి కమిషన్‌గా మారిన ఎపిపిఎస్‌సి
కోవూరు, జూన్ 13: కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతి కమిషన్‌గా మారిపోయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి ఆరోపించారు . పట్టణంలోని టిడిపి కార్యాలయంలో గురువారం మండల పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అర్హతలేని వారిని ఎపిపిఎస్‌సి సభ్యులుగా నియమించి సర్వీస్ కమిషన్‌ను భ్రష్టుపట్టిస్తున్నారని, సర్వీసుకమిషన్ సభ్యులు పోస్టులు అమ్ముకొని ప్రతిభగల లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. గవర్నర్ స్పందించి అవినీతి కమిషన్ సభ్యులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టిడిపి జిల్లా పార్టీ ప్రత్యేక ఆహ్వానితులు పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగనున్న గ్రామపంచాయతీల ఎన్నికలకు పార్టీ నాయకులు సిద్ధం కావాలని, పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించటానికి కృషి చేయాలన్నారు. విద్యార్థులందరికీ ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాల జారీలో మీ సేవా కేంద్రాలలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. విద్యార్థుల అవసరాల దృష్ట్యా త్వరితగతిన సర్ట్ఫికెట్లు జారీ చేయాలని అధికారులను కోరుతూ సమావేశంలో తీర్మానించారు. ఈకార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు కృష్ణయ్య, నాయకులు శ్రీహరిరెడ్డి, జనార్ధన్, రవీంద్ర, వెంకటరమణమ్మ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు వైద్య పరీక్షలు
పెళ్లకూరు, జూన్ 13: మండల పరిధిలోని పసుపుకండ్రిగ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గురువారం ఉదయం పెళ్ళకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారి సతీష్ పాఠశాలలో ఉన్న 28 మంది విద్యార్థులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేసారు. విద్యార్థుల హెల్త్‌కార్డులలో ఆరోగ్య వివరాలను నమోదు చేసారు. ఈ వైద్య శిబిరంలో ఎఎన్‌ఎంలు కె ఇందిర, పి బుజ్జమ్మ, ఉపాధ్యాయులు నారాయణ, శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.