విజయనగరం, మే 7: జిల్లాలో అక్కడక్కడ ఇవిఎంలు మొరాయింపు..లైవ్ వెబ్‌కాస్టింగ్‌ల మొరాయింపు... రిగ్గింగ్‌నకు యత్నాలు... తదితర సంఘటనలు మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగా జరిగింది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. జనరల్ స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగ్గా, రిజర్వుడు స్థానాలైన సాలూరు, పార్వతీపురం, కురుపాం స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో జిల్లా సరాసరి పోలింగ్ ఉదయం 9 గంటల సమయానికి 17.56 శాతం పోలింగ్ నమోదు కాగా, 11 గంటలకు 37.49, మధ్యాహ్నాం 1 గంటకు 53.3, మధ్యాహ్నాం 3 గంటలకు 65.1, సాయంత్రం 5 గంటలకు 70.71 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లాలో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు మొత్తం 86 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో లోక్‌సభ స్థానానికి 9 మంది బరిలో నిలవగా, 77 మంది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి విజయనగరం, గజపతినగరం, చీపురుపల్లి, ఎస్.కోట, నెల్లిమర్ల, బొబ్బిలితోపాటు రిజర్వుడు స్ధానాలైన పార్వతీపురం, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. కొత్తవలస మండలం ఎగువ ఎర్రవానిపాలెంలో 80 ఓట్లు ఉన్న చోట పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా, 140 ఓట్లు ఉన్న దిగువ ఎర్రవానిపాలెంనకు ఎందుకు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేదని అక్కడ ఓటర్లు ప్రశ్నించారు. మధ్యాహ్నాం 2 గంటల వరకు ఓటుహక్కును వినియోగించకుండా భీష్మించుకొని కూర్చోవడంతో అధికారులు వారికి నచ్చజెప్పి ఎగువ ఎర్రవానిపాలెంలో ఓట్లు వేసేవిధంగా చర్యలు తీసుకున్నారు. విజయనగరంలోని గోకపేటలోను, బొబ్బిలి, తెర్లాం తదితర చోట్ల ఇవిఎంలు మొరాయించాయి. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల్లో అర్థగంట ఆలస్యంగా పోలింగ్‌ను ప్రారంభించారు. కొమరాడ మండలం కొడిశిల, వేపుకొన పోలింగ్ కేంద్రాల్లో వైకాపా కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు రావడంతో అక్కడ పోలింగ్‌ను నిలిపివేశారు. బాడంగి మండలం రామచంద్రాపురం గ్రామంలో టిడిపి గుర్తు బటన్ నొక్కితే, ఫ్యాన్ గుర్తుకు లైటు వెలిగిందని ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. అలాగే చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని మెరకముడిదాం మండలం విశ్వనాధపురంలో ఇవిఎంబటన్ నొక్కితే ఐదు ఓట్లు పడ్డాయని ఓటరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ కొద్దిసేపు పోలింగ్‌ను నిలిపివేశారు. దీంతో అక్కడ టిడిపి ఏజంట్, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇక పలుచోట్ల ఇవిఎంలు మొరాయించడంతో వాటిని మార్పు చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో అతి సమస్యాత్మక గ్రామాల్లో 617 చోట్ల లైవ్ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయగా, 21 చోట్ల లైవ్ వెబ్‌కాస్టింగ్ పనిచేయకపోవడంతో అధికారులు కంగుతిన్నారు. ఇవి మినహా మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
ఆశ, నిరాశల మధ్య
ప్రధాన పార్టీల అభ్యర్థులు!
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మే 7: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు తమ జాతకాల కోసం ఎదురుచూస్తున్నారు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 86 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో లోక్‌సభ స్థానానికి 9 మంది బరిలో నిలవగా, 77 మంది అసెంబ్లీ స్థానాలకు పోటీలో ఉన్నారు. లోక్‌సభ స్థానానికి టిడిపి, కాంగ్రెస్, వైకాపా, బిఎస్పీ, జెఎస్‌ఎ, అమ్ ఆద్మీ, పిరమిడ్‌తోపాటు స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు. ఎలాగైనా గెలుపు సాధించాలని అన్ని విధాలుగా ప్రయత్నించారు. ఈ దఫా ఎన్నికల్లో టిడిపికి, వైకాపాకు ఆశాజనకంగా ఫలితాలు ఉండవచ్చని విశే్లషకులు అంచనా వేస్తున్నారు.
ఈ దఫా ఎన్నికల్లో టిడిపి నుంచి అశోక్‌గజపతిరాజు, వైకాపా నుంచి బేబినాయన, కాంగ్రెస్ నుంచి బొత్స ఝాన్సీలక్ష్మి, బీఎస్పీ నుంచి బోను కృష్ణ, జై సమైక్యాంధ్ర నుంచి టి.రమేష్‌నాయుడు, అమ్ ఆద్మీ నుంచి నారు సింహాద్రినాయుడు, స్వతంత్ర అభ్యర్థిగా కె.హరికిషన్ పోటీ చేసిన విషయం విదితమే. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన అశోక్‌గజపతిరాజు, బొత్స ఝాన్సీలక్ష్మి, బేబినాయనలు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన అభ్యర్థులు బరిలో నిలిచినప్పటికీ నామమాత్రపు పోటీ మాత్రమేనని అంచనా వేస్తున్నారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే... చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పీసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మూడోసారి బరిలో దిగడంతో ఈ నియోజకవర్గంపై అందరిదృష్టిపడింది. ఇక్కడ హాట్రిక్ కోసం ఆయన ప్రయత్నిస్తుండగా, వైకాపా నుంచి జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్‌రావు, టిడిపి నుంచి శ్రీకాకుళం జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ కిమిడి మృణాళిని గట్టి పోటీ నిచ్చారు. దీంతో ఇక్కడ మాజీ మంత్రి బొత్సకు ముచ్చెమటలు పట్టాయి. ఇక్కడ ఓటర్లు గుంభనంగా ఉండటంతో ఎవరిని ఆదరించారన్నదీ విశే్లషకులు అంచనా వేయలేకపోతున్నారు. విజయనగరం అసెంబ్లీ స్థానానికి టిడిపి అభ్యర్థి మీసాల గీత, వైకాపా అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో కర్ఫ్యూ ప్రభావం, సమైక్యాంధ్రఉద్యమం వంటి సంఘటనల వల్ల ఈ నియోజకవర్గంలో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారోనని ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక్కడ టిడిపి అభ్యర్థి గీత, వైకాపా అభ్యర్థి కోలగట్లలు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
బొబ్బిలి అసెంబ్లీ స్థానానికి వైకాపా నుంచి ఉత్తరాంధ్ర వైకాపా కన్వీనర్ సుజయ్‌కృష్ణ రంగారావు, కాంగ్రెస్ నుంచి మాజీ విప్ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పోటీ చేశారు. ఇక్కడ కూడా టిడిపికి ఎక్కువ అవకాశాలు కన్పిస్తున్నాయి. నెల్లిమర్ల నుంచి టిడిపి తరఫున మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు, కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బి.అప్పలనాయుడు, వైకాపా నుంచి పి.సాంబశివరాజు తనయుడు పివివి సూర్యనారాయణరాజు, జైసమైక్యాంధ్ర నుంచి టి.సత్యనారాయణ పోటీ చేశారు. వీరిలో మాజీ మంత్రి పతివాడకు అవకాశాలు కాస్తా మెండుగా ఉన్నాయి. కురుపాంలో వైకాపా నుంచి పి.పుష్పశ్రీవాణి, టిడిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వి.టి.జనార్థన్ తాట్రాజ్, కాంగ్రెస్ నుంచి ఇంద్రసేన్ వర్థన్ బరిలో నిలిచారు. ఇక్కడ సిపిఎంతోపాటు స్వతంత్ర అభ్యర్థులు నలుగురు పోటీ చేశారు. ఇక్కడ టిడిపి రెబల్ అభ్యర్థి నిమ్మక జయరాజ్ గట్టిపోటీనిచ్చారు. దీంతో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి నిమ్మక జయరాజ్, టిడిపి అభ్యర్థి తాట్రాజ్ మధ్య గట్టి పోటీ నిచ్చారు. పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి ఎ.జోగారావు, టిడిపి నుంచి బి.చిరంజీవులు, వైకాపా నుంచి జె.ప్రసన్నకుమార్ బరిలో నిలిచారు. వీరితోపాటు స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు, జైసమైక్యాంధ్ర, సిపిఎం పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలిచినప్పటికీ వీరి పోటీ నామమాత్రమే. సాలూరులో వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్నదొర, టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్, కాంగ్రెస్ నుంచి ఆండ్రబాబా పోటీ చేశారు. వీరితోపాటు సిపిఐ, సిపిఎం పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థి బరిలో నిలిచారు. గజపతినగరంలో కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, టిడిపి నుంచి కె.ఎ.నాయుడు, వైకాపా నుంచి కడుబండి శ్రీనివాస్‌లు బరిలో నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్, టిడిపిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ అప్పలనర్సయ్యకు గెలుపు అవకాశాలు కాస్తా ఎక్కువగా ఉన్నాయని విశే్లషకులు చెబుతున్నారు. ఎస్.కోటలో టిడిపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, కాంగ్రెస్ నుంచి ఇందుకూరి రఘరాజు, వైకాపా నుంచి ఆర్.జగన్నాధం పోటీ చేశారు. వీరితోపాటు బీఎస్పీ, జైసమైక్యాంధ్ర, అమ్‌ఆద్మీ, పిరమిడ్ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు పోటీ చేశారు. ఇక్కడ టిడిపి అభ్యర్థి కోళ్ల లలితకుమారికి గెలుపు అవకాశాలు ఉండవచ్చని విశే్లషకులు అంటున్నారు. ఈ విధంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 78 శాతం పోలింగ్
విజయనగరం (టౌన్) మే 7: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ బుధవారం జిల్లాలో 78 శాతం జరిగింది. జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక పార్లమెంట్ స్థానానికి ఎన్నకల పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ తిరిగి ముగిసే సమయానికి శాతం నమోదైంది. విజయనగరం పార్లమెంట్ స్థానానికి సంబంధించి సాయత్రం 5 గంటల సమయానికి 73.7 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటలకు 35.10 శాతం, మధ్యాహ్నాం ఒంటిగంటకు 51.96 3 గంటలకు 64.69 శాతం పోలింగ్ పూర్తియింది. 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మధ్యాహ్నా 3 గంటల సమయానికి 65.16 శాతం పోలింగ్ జరిగింది. విజయనగరం నియోజకవర్గంలో ఉదయం 11 గంటలకు 31 శాతం మధ్యాహ్నాం ఒంటిగంటకు 45 శాతం 3 గంటలకు 57 శాతం సాయత్రం 5 గంటలకు 63 శాతం పోలింగ్ పూర్తియింది. ఎస్ కోట నియోజకవర్గంలో ఉదయం 11 గంటలకు 38 శాతం, మధ్యాహ్నాం ఒంటిగంటకు 49, 3 గంటలకు 58, 5 గంటలకు 68 శాతం పోలింగ్ నమోదయింది. గజపతినగరంలో ఉదయం 11 గంటలకు 37 శాతం, మధ్యాహ్నాం ఒంటిగంటకు 53, 3 గంటలకు 60, 5 గంటలకు 79 శాతం పోలింగ్ పూర్తియింది. చీపురుపల్లిలో ఉదయం 11 గంటలకు 29 శాతం మధ్యాహ్నాం ఒంటిగంటకు 40, సాయత్రం 3 గంటలకు 61.5, 5 గంటలకు 72 శాతం పోలింగ్ నమోదయింది. సాలూరు ఉదయం 11 గంటలకు 36 శాతం, మధ్యహ్నాం ఒంటిగంటకు 51, 3 గంటలకు 64, 5 గంటలకు 69 శాతం పోలింగ్ పూర్తియింది. బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధి ఉదయం 11 గంటలకు 38 శాతం, మధ్యాహ్నాం ఒంటిగంటకు 61, 3 గంటలకు 72, 5 గంటలకు 78 శాతం జరిగింది. కురుపాం 11 గంటలకు 45 శాతం, ఒంటిగంటకు 63, 3 గంటలకు 74 శాతం నమోదయింది. పార్వతీపురంలో 11 గంటలకు 38.44 ఒంటిగంటకు 59.5, 3 గంటలకు 69 శాతం పోలింగ్ నమోదయింది. నెల్లిమర్లలో 11 గంటలకు 45 శాతం, ఒంటిగంటకు 59, 3 గంటలకు 71 శాతం పోలింగ్ నమోదయింది.
ఓటు వేసిన ప్రముఖులు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, మే 7: సార్వత్రిక ఎన్నికలలో ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. విజయనగరంలో టిడిపి ఎంపీ అభ్యర్థి అశోక్‌గజపతిరాజు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి, పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, టిడిపి అసెంబ్లీ అభ్యర్థి మీసాల గీత, వైకాపా అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామిలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బొబ్బిలిలో వైకాపా అభ్యర్థులు సుజయ్‌కృష్ణ రంగారావు, బేబినాయనలు తమ ఓటును వినియోగించుకున్నారు. పూసపాటిరేగ మండలం రెల్లివలసలో మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు ఓటు వేశారు. చీపురుపల్లిలో మాజీ జెడ్పీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎల్.కోట మండలంలో టిడిపి అసెంబ్లీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి తమ ఓటు హక్కును వినియోగించుకోగా, సాలూరులో వైకాపా అభ్యర్థి పీడిక రాజన్నదొర ఓటు హక్కును వినియోగించుకున్నారు.