Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

వాన..వాన

$
0
0

హైదరాబాద్, : మహానగరంలో శుక్రవారం ఉన్నట్టుండి చిరుజల్లుల నుంచి ఓ మోస్తర్తు వర్షం కురిసింది. ఎండ తగ్గినా, వేడి తగ్గలేదంటూ నగరవాసులు భావిస్తున్న సమయంలో సాయంత్రం నగరంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో చిరుజల్లులు పలకరించాయి. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై తొలుత లంగర్‌హౌజ్, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ఆ తర్వాత బషీర్‌బాగ్, నాంపల్లి, ఎంజే మార్కెట్, సికిందరాబాద్, బేగంపేట తదితర ప్రాంతాల్లో చిరుజల్లులుగా మొదలైన వర్షం ఓ మోస్తరుగా కురిసింది. ఎండ అంతంతమాత్రంగా ఉన్నా, వేడి పెరిగిన సమయంలో వర్షం కురిసి, వాతావరణం చల్లబడటంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నా, చిన్నపాటి వర్షానికే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే జంక్షన్లలో నీరు నిల్చిపోవటం, ట్రాఫిక్‌లో చిక్కుకోవటం పట్ల నగరవాసులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫలితంగా చాలా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిల్చిపోవటంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షం కురిసే అవకాశాం ఉన్నట్లు వాతావరణ శాఖ నుంచి ముందస్తుగా హెచ్చరికలు రావటంతో అప్పటికే అప్రమత్తమైన బల్దియా ఎమర్జెన్సీ బృందాలు ఆయా ప్రాంతాల్లో రోడ్డుపై నిలిచిన నీరు ప్రవహించేందుకు వీలుగా సహాయక చర్యలు చేపట్టారు. నిత్యం వహనాలతో రద్దీగా ఉండే పంజాగుట్ట నుంచి హైటెక్‌సిటీ వరకున్న ఐటీ కారిడార్‌లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ చేరుకునేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టేలా ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిల్చిపోయింది. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా రోడ్డుపై నీరు నిల్వకుండా ముందుచూపుతో రోడ్లు వేశామని బల్దియా అధికారులు ప్రకటించుకున్నా, శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు జంక్షన్లు చిన్నసైజు చెరువులను తలపించాయి. అప్పర్ ట్యాంక్‌బండ్‌పై సైతం రోడ్డుపై భారీగా నీరు నిల్చిపోవటంతో ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ బృందాలు నీరు ప్రవహించేందుకు వీలుగా సహాయక చర్యలు చేపట్టారు. సాయంత్రం ఆరు గంటలకు నగర శివారు హయత్‌నగర్‌లో 60 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా, ఆ తర్వాత ఎల్‌బీనగర్‌లో 52.8 మిమీ వర్షం కురిసిందని, అన్నింటి కన్నా తక్కువగా సరూర్‌నగర్‌లో 21.0 మిమీ వర్షపాతం నమోదైనట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో మళ్లీ చిరుజల్లులు కురవటంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎమర్జెన్సీ బృందాలతో పాటు అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేశారు.
కరుణించిన వరుణుడు.. మురిసిన నగరం
సనత్‌నగర్: నగరంపై వరుణుడు కరుణ చూపించాడు. ఉదయం నుంచి ఊగిసలాడిన మేఘాలు సాయంత్రం 4 గంటల సమయంలో చిరుజల్లులతో మొదట మురిపించాయి. ఈ జల్లులు మరింత ఉక్కపోతకు కారణం అవుతాయని భావిస్తుండగా, మేఘాలు పూర్తిస్థాయిలో వర్షించాయి. నగర ప్రజలు మురిసి పోయారు. వర్షంలో తడుస్తూ ఆనందంగా గడిపారు. భానుడి ప్రతాపానికి తెరపడే సమయం కోసం నగర ప్రజలు ఆత్రుతగా ఎదురుచూశారు. ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభమైన ఎండలు, జూన్ మూడవ వారం వరకు కొనసాగాయి. రోజురోజుకూ పెరుగుతూ పోయిన ఉష్ణోగ్రతలతో నగర ప్రజలు అల్లాడి పోయారు. అన్ని వర్గాల ప్రజలు సూర్యతాపానికి తల్లడిల్లిపోయారు. ఉదయం 6 గంటలకే మబ్బుల్ని చీల్చుకుంటూ వచ్చే సూర్యకిరణాలు సాయంత్రం 6.30 గంటల వరకు తమ ప్రతాపాన్ని ప్రదర్శించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇతర ప్రదేశాలకు భిన్నంగా ఉండే వాతావరణం సైతం ఉక్కపోతగా మారిపోయింది. నగర వాతావరణాన్ని చాలా కాలంగా పరిశీలిస్తున్న పర్యావరణ ప్రేమికులు ఈసారి నమోదైన ఉష్ణోగ్రతలు, ఉక్కపోత గతంలో ఎప్పుడూ చూడలేదని, కనీసం ఊహించలేదని వాపోయారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో వేసవి కాలం ముగిసే సమయం కోసం రోజులు లెక్కించుకున్నారు. మార్చి మొదటి వారం నుంచి జూన్ మొదటి వారం వరకు ఎండలు తగ్గుతాయని భావించినా జూన్ మూడవ వారం ప్రవేశించిన వాతావరణంలో ఎలాంటి మార్పులు రాకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందారు. ఈ తరుణంలో శుక్రవారం మధ్యాహ్నం నగరంపై దట్టమైన మేఘాలు కమ్ముకోగా ఆ చల్లదనాన్ని ఆస్వాదించారు. అనంతరం గంట పాటు దోబూచులాడినా సాయంత్రం 4.30 గంటల నుంచి 6.00 గంటల వరకు వర్షం కురిసింది. రుతుపవనాల రాక నగర ప్రజలను ఆనందంలో ముంచెత్తింది.
గచ్చిబౌలి: గచ్చిబౌలి పరిధిలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఐటీ ఉద్యోగులు ఇంటికి వెళ్లే సమయంలో వర్షం ప్రారంభమైంది. ఉద్యోగులందరూ ఒకేసారి రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గచ్చిబౌలి, శిల్పారామం, కొత్తగూడ, కొండాపూర్, ట్రిబుల్ ఐటీ, విప్రో, ఖాజాగూడ, బయోడైవర్సిటీ చౌరస్తాల్లో ట్రాఫిక జామైంది. ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గచ్చిబౌలి రాడిసన్ హోటల్ వద్ద వౌకాల లోతు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైటెక్ సిటీ నుంచి జేఎన్‌టీయూ వరకు వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయకపోవడంతో పోలీసులు మరింతగా ఇబ్బంది పడ్డారు.
ఉప్పల్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వర్షం ఎట్టకేలకు కురిసింది. తొలకరి జల్లుతో నగర ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. వేడిమి, ఉడకపోత నుంచి ఉపశమనం కల్గింది. రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్, చిల్కానగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, చెంగిచర్ల, మేడిపల్లి, పర్వతాపూర్, కాచవానిసింగారం పరిసర ప్రాంతాలలో సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. వచ్చిపోయే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షం కురువడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
ఘట్‌కేసర్: ఘట్‌కేసర్ మండలంలో కురిసిన భారీ వర్షంతో జాతీయ రహదారిపై వర్షం నీరు ప్రవహించి ట్రాఫిక్ స్తంభించి రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మండల పరిధిలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి అన్నోజిగూడ వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇన్‌స్పెక్టర్ రఘువీర్ రెడ్డి సారథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి జేసీబీతో అడ్డుగా ఉన్న కల్వర్టును తొలగించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
షాబాద్: చేవెళ్లలో భారీ వర్షం, షాబాద్‌లో చిరు జల్లులు శుక్రవారం సాయంత్రం కురిసాయి. చేవెళ్లలోని మసీదులో ముస్లింలు వర్షాలు కురువాలని ప్రత్యేక పార్థనలు చేశారు. సాయంత్రం సమయంలో వర్షాం భారీగా కురువడంతో ఆనందం వ్యక్తం చేశారు. రెండు గంటల పాటు వర్షం పడడంతో చేవెళ్ల ఈర్లపల్లి గ్రామంలో వాగులు పొంగిపరువులు తీశాయి. షాబాద్‌లో చిరు జల్లులు కురవడంతో రైతులో ఆనందం వచ్చింది. ఇప్పటికే విత్తనాలు నాటి వాటిని కలుపుతీసే సమయం వస్తున్న వర్షాలు రాలేవని బెంగతో అయోమయంలో ఉన్న రైతులకు ఊరట లభించింది.
షాద్‌నగర్ రూరల్: ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం షాద్‌నగర్ పట్టణంతోపాటు కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల్లో మోస్తారు వర్షం కురిసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు 20రోజులు గడుస్తున్నప్పటికీ నేడు మోస్తారు వర్షం కురవడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. షాద్‌నగర్‌లో మోస్తారు నుంచి కొద్దిమేరకు ఎక్కువగానే వర్షం పడటంతో రోడ్డుపై ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మురుగునీరు రోడ్లపైకి రావడంతో రాకపోకలకు ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోస్తారు వర్షం రావడంతో తాగునీటిని కొంతమేరకు ఇబ్బందులు తప్పుతాయని కొంతమంది ప్రజలు పేర్కొంటున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో ఫరూఖ్‌నగర్ మండలం దుసకల్‌లో పిడుగుపడి ఒక గెదె మృత్యువాత పడింది. ఈదురు గాలులకు కొన్ని గ్రామాల్లో ఇంటి పైకప్పులు ఎగిరిపోవడమే కాకుండా అక్కడక్కడ ఉన్న కొన్ని పంటలు దెబ్బతిన్నాయని రైతులు పేర్కొంటున్నారు.


29న గ్రామీణ ఆర్థిక పరిపుష్టిపై సమావేశం

$
0
0

ఖైరతాబాద్, : నానాటికీ దిగజారుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసి, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించేందుకు ఈనెల 29న రాజేంద్రనగర్‌లోని ఇనిస్టిటిట్యూట్ ఆఫ్ రూరల్ డెలప్‌మెంట్ (ఎన్‌ఐఆర్‌డీ) క్యాంపస్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు మహా భారత్ అభియాన్ పేర్కొంది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మహా భారత్ అభియాన్ ప్రతినిధులు నారాయణ చార్యులు, మాజీ ఐఏఎస్ అధికారిణి చందనాఖాన్, మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణ రావు, నిజాం నవాబు మనవడు, సంస్థ బ్రాండ్ అంబాసిడర్ రౌనక్ యార్ ఖాన్ మాట్లాడారు. దేశాన్ని పన్ను రహితంగా తీర్చిదిద్దడం, అప్పులు లేని దేశంగా తీర్చిదిద్దడం, గ్రామీణ ప్రాంతాలలోని రైతు కుటుంబాల ఆదాయాన్ని పెంచడం, అడుగంటుతున్న భూగర్బ జలాలను అభివృద్ధి పరచడం, గ్రామాలకు పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
సమావేశానికి ముఖ్యఅతిథిగా చిన్నజీయర్ స్వామి హాజరై ప్రారంభోపన్యాసం చేస్తారని, అభియాన్ ప్లానింగ్ కమిటీ కన్వీనర్ అశోక్ కుమార్, మాజీ ఐఏఎస్ చందనా ఖాన్‌తో పాటు వివిధ రంగాల్లోని నిపుణులు హాజరై ప్రసంగిస్తారని చెప్పారు

.మహిళల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత

$
0
0

హైదరాబాద్, : ఏ కార్యక్రమం నిర్వహించినా, అది విజయవంతం కావాలంటే మహిళల భాగస్వామ్యం తప్పనిసరి అని, అలాగే నగరంలో నూటికి నూరు శాతం స్వచ్ఛత, పరిశుభ్రతను సాధించేందుకు జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న సాఫ్ హైదరాబాద్-షాన్‌దార్ హైదరాబాద్ కార్యక్రమంలో కూడా ప్రతి మహిళా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంపై కమిషనర్ శుక్రవారం ముషీరాబాద్‌లోని జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో మహిళా సంఘాల సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో సంపూర్ణ స్వచ్ఛతను సాధించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతి పౌరుడు తమ బాధ్యతను తెల్సుకుని భాగస్వాములు కావాలని సూచించారు. నగరంలోని 45వేల స్వయం సహాయక బృందాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి తడి,పొడి చెత్త వేరు చేసి, స్వచ్ఛ ఆటోలకు అందించాలని, ఇందులో మహిళలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. అంతేగాక, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాల నిర్వహణ, వాటిని విజయవంతం చేయటంలో మహిళలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా నీటి వృథాను అరికట్టడం, కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రోడ్లపైకి మురుగు జలాలు వదలకుండా చూడటం, వర్షపు నీరు వృథా కాకుండా, భూగర్భ జలాల మట్టాలు పెంచుకునేందుకు వీలుగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయటం సాఫ్ హైదరాబాద్-షాన్‌దార్ హైదరాబాద్ కార్యక్రమం కింద ముఖ్య కార్యక్రమాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలు తమ ప్రాంతాల్లో విధి నిర్వహించి, ప్రజల్లో అవగాహన పెంచి, సంపూర్ణ స్వచ్ఛత సాధనకు స్వయం సహాయక బృందాల మహిళలు కృషి చేయాలని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ సిక్తాపట్నాయక్, యుసీడీ ప్రాజెక్టు డైరెక్టర్ సౌజన్యతో పాటు డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
కార్వాన్‌లో కమిషనర్ పర్యటన
బల్దియా కమిషనర్ దాన కిషోర్ కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించారు. టౌలీచౌకీలోని పారవౌంట్ కాలనీ తదితర ప్రాంతాల్లో రహదారులు, నాలాలు, చెరువులను ఆయన పరిశీలించారు. హకీంపేట నాలా విస్తరణకు ఇదివరకే నిధులను మంజూరు చేశామని, ఈ నాలా విస్తరణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.

డ్రోన్‌లతో నిఘా

$
0
0

హైదరాబాద్, : మహానగరంలో అక్రమ నిర్మాణాలను కట్టడి చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలు, అనుమతులున్నా, వాటిని ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా జరుగుతున్న నిర్మాణాల విషయంలో ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులకు కోర్టు మొట్టికాయలు వేయటంతో అసలు జీహెచ్‌ఎంసీలో అక్రమ నిర్మాణాలెన్ని ఉన్నాయి? వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై అధికారులు ప్రత్యేక అధ్యయనం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా చీఫ్ సిటీ ప్లానర్ ఎస్. దేవేందర్ రెడ్డి, టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ కే. శ్రీనివాసరావులు రెండురోజులుగా జోన్ల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రతి సర్కిల్‌లో అసలు అనుమతుల్లేని అక్రమ నిర్మాణాలు, అనుమతులున్నా, వాటిని ఉల్లంఘించి నిర్మితమైన కట్టడాలను గుర్తించి నివేదికలు పంపాలని సంబంధిత టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. డ్రోన్ కెమెరాలతో అక్రమ నిర్మాణాలను గుర్తించాలని అధికారులు భావిస్తున్నారు. గతంలో వీటి ద్వారానే సుమారు మూడు నుంచి నాలుగు వేల వరకు అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు, ఇపుడు వీటి సంఖ్య కొంత వరకు పెరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. వీటి ద్వారా రెండు రకాలుగా అక్రమ నిర్మాణాలను గుర్తించాలని యోచిస్తున్నారు. అసలు బల్దియా అనుమతుల్లేకుండా నిర్మించిన భవనాలు, అలాగే అనుమతులున్నా, అదనంగా అంతస్తులు నిర్మించటం, అనుమతులను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా డీవియేషన్లు చేస్తూ నిర్మించిన అక్రమ నిర్మాణాలను గుర్తించాలని అధికారులు భావిస్తున్నారు. ఎప్పటికపుడు అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం, అధికారులు వాటిని కూల్చేందుకు నోటీసులు జారీ చేసి వెళితే క్షేత్ర స్థాయిలో ఉద్రిక్తతలు చోటుచేసుకోవటం వంటివి జరుగుతున్నాయి. అంతేగాక, అధికారులు కూల్చివేసిన మరుసటి రోజు మళ్లీ నిర్మించటం వంటివి జరుగుతుండటంతో అక్రమ నిర్మాణాల కట్టడికి అధికారులు శాశ్వత పరిష్కారాన్ని అనే్వషిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జీహెచ్‌ఎంసీకి ప్రత్యేకంగా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయటంతో ఈ సారి అక్రమ నిర్మాణాలను గుర్తించి, కూల్చివేయాలని భావిస్తున్నారు. వీటిలో అసలు అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలకు కనీసం నోటీసులు కూడా జారీ చేసే అవసరం లేదని అధికారులు ఓ కోణంలో ఆలోచిస్తున్నారు. ఇక అనుమతులు తీసుకుని, వాటిని ఉల్లంఘించి అదనంగా అంతస్తులు నిర్మించిన ఉన్న భవనాలకు మాత్రమే నోటీసులు జారీ చేసి కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు.

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

$
0
0

హైదరాబాద్, : రేషన్ కార్డు, కుల ఆదాయ సర్ట్ఫికెట్, మీసేవా సర్ట్ఫికెట్, ల్యాండ్ రికార్డ్స్ ఆప్డేన్‌లు, మ్యూటేషన్‌లు, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్డీఓలను, తహశీల్దార్‌లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో రేషన్ కార్డు, కుల ఆదాయ సర్ట్ఫికెట్, మీసేవా సర్ట్ఫికెట్, ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్‌లు, మ్యూటేషన్‌లు, చెరువులు, కుంటలపై కలెక్టర్ ఆర్డీఓలు, తహశీల్దార్‌లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరీష్, ఆర్డీఓలు పాల్గొన్నారు.
హరితహారంవిజయవంతం చేయాలి
హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్ సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో హరితహారం, శానిటేషన్, ఎన్‌ఆర్‌జీఎస్, ఆసరా పెన్షన్‌లు, మరుగుదొడ్ల పై ఎంపీడీఓలతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి, పీడీ డీఆర్‌డీఏ ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.
బీసీ ఓటర్ల గణన వేగవంతం చేయాలి
కీసర, జూన్ 21: బీసీ ఓటర్ల గణన వేగవంతం చేయాలని దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ రామలింగం పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్‌లతో సమావేశం నిర్వహించారు.

బోనాలకు ముందే అభివృద్ధి పనులు పూర్తి
హైదరాబాద్, జూన్ 21: బోనాల ఉత్సవాలు ప్రారంభించడానికి ముందే పాతబస్తీలోని అన్ని దేవాలయాల వద్ద అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని దక్షిణ మండలం జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ బీ.శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు, సంబంధిత మున్సిపాల్ అధికారులతో కలిసి పాతబస్తీలోని వివిధ దేవాలయాలను సందర్శించి అక్కడ చేపట్టాల్సిన పనుల్ని పరిశీలించారు. పర్యటన గౌలిపురా, లాల్‌దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం, ఓంనగర్, మేకలబండ, అలియాబాద్, హరిబౌలి, అక్కన్న మాదన్న దేవాలయం, బేలా ముత్యాలమ్మ దేవాలయంతో పాటు తదితర దేవాలయాల వద్ద చేపట్టవలసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. జోనల్ కమిషనర్ వెంట ఉమ్మడి దేవాలయల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు పోటెల్ శ్రీనివాస్ యాదవ్, ప్రతినిధులు బల్వంత్ యాదవ్, ప్యారసాని వెంకటేష్, లాల్‌దర్వాజ శ్రీసింహవాహిని మహంకాళి దేవాలయం చైర్మన్ తిరుపతి నర్సింగ్ రావు, కమిటీ ప్రతినిధులు కే.వెంకటేష్, అలె భాస్కర్, సీ.వెంకటేష్, పొన్న వెంకటరమణ, హంస రాజ్, వై.నరేష్ అధికారులు డిప్యూటీ కమిషనర్ సూర్య కాంత్, ఈఈ ఎలక్ట్రికల్ గణేష్, మెడికల్ అధికారి ప్రసాద్, సత్యనారాయణ రెడ్డి, సందీప్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు
లాల్‌దర్వాజా మహంకాళి దేవాలయంలో దక్షిణ మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతబస్తీలోని దేవాలయాల పర్యటనలో భాగంగా లాల్‌దర్వాజ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం జడ్‌సీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో శ్రీనివాస్ రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ తిరుపతి నర్సింగ్ రావు ఘనంగా సన్మానించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను తిరుపతి నర్సింగ్ రావు, కే.వెంకటేశ్, బల్వంత్ యాదవ్, కే.విష్ణు గౌడ్, కాశీనాథ్ గౌడ్ వివరించారు. బోనాలలోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని శ్రీనివాస్ రెడ్డిని కోరారు.

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం

షాద్‌నగర్, జూన్ 21: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని శివమారుతి దేవాలయంలో పతంజలి యోగా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 15నిమిషాల పాటు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ యోగా చేశారు. రోజుకు 15నిమిషాల పాటు యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తొందని అన్నారు.
ఘట్‌కేసర్: నిత్యం యోగా సాధన చేయటంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని సంస్కృతి టౌన్‌షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్టు బాల్‌రెడ్డి తెలిపారు. పోచారం మున్సిపాలిటి పరిధి సంస్కృతి టౌన్‌షిప్ ఆవరణలోని కళావేదిక వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సంస్కృతి టౌన్‌షిప్‌లో బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కళావేదిక ప్రాంగణం వద్ద యోగా సాధన జరిపారు.
శేరిలింగంపల్లి: భారతీయ ప్రాచీన యోగాతో తమ ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలని చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, కేంద్ర ప్రభుత్వ కనీస వేతన సలహా మండలి సభ్యుడు బాల్డ అశోక్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం చందానగర్ పీజేఆర్ స్టేడియంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా ఉత్సవాల్లో భాగంగా అతిథులు యోగాభ్యాసకులతో కలిసి వ్యాయామం, ఆసనాలు, ప్రాణాయామాలు చేశారు. ఆరోగ్య భారతావనికై అడుగు ముందుకు అనే నినాదంతో పీజేఆర్ స్టేడియం నుంచి చందానగర్‌లోని శ్రీ వేంకటేశ్వర దేవాలయ సముదాయం వరకు యోగా వాక్ నిర్వహించారు. ప్రతి రోజూ యోగా చేస్తూ రోగాలను పారదోలాలని అతిథులు నవత రెడ్డి, అశోక్ కోరారు. ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంలో పతంజలి చికిత్సాలయం వైద్యులు అజిత్ జాగిర్దార్, రమాకాంత్ సాహు, స్మితా ఠాకూర్, సునితా పాండా పాల్గొని పరీక్షలు నిర్వహించారు. యువభారత్ హైదరాబాద్ వెస్ట్ జిల్లా అధ్యక్షుడు పుట్ట వినయ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన యోగా ఉత్సవాల్లో బీజేపీ రంగారెడ్డి జిల్లా నాయకుడు చింతకింది గోవర్దన్ గౌడ్, పతంజలి యోగా సమితి జిల్లా అధ్యక్షుడు విఠల్, యోగా గురువులు కుప్పమ్మ, స్వేత, సమితి ప్రతినిధులు హన్మంతరావు, జగన్నాథం, మల్లేష్, భూషణ్, జ్యోతి, ఉజ్వల పాల్గొన్నారు.
భెల్ స్టేడియంలో..
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం బీహెచ్‌ఈఎల్ స్టేడియంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. వ్యాయామం, ఆసనాలు, ప్రాణాయామాలు చేసి యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శేరిలింగంపల్లిలో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో పలు చోట్ల యోగా డే వేడుకలు చేశారు. గుల్‌మొహర్ పార్కు కాలనీలో పతంజలి యోగా గురువు, భారత్ స్వాభిమాన్ ట్రస్టు హైదరాబాద్ వెస్ట్ జిల్లా ఉపాధ్యక్షుడు నూనె సురేందర్ ఆధ్వర్యంలో యోగాసనాలు చేయించి, యోగ ప్రాధాన్యత గురించి వివరించారు. కార్యక్రమంలో గుల్‌మొహర్ కాలనీ అధ్యక్షుడు ఎస్‌కే ఖాసిం, నేతాజీనగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్, గారెల వెంకటేష్ పాల్గొన్నారు.
కులకచర్ల: ప్రపంచ యోగా దినోత్సవాన్ని కులకచర్ల మండలంలోని పలు పాఠశాలలో నిర్వహించారు. మండలంలోని ముజాహిదపురంలో ఆరెస్సెస్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఉన్నత పాఠశాలతో ఆదర్శ పాఠశాల, పలు గిరిజన తండాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో యోగ కార్యక్రమాలు నిర్వహించారు.
మేడ్చల్: అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మేడ్చల్ మండలంలో వివిధ పాఠశాలల్లో యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలలతో పాటు వివిధ కాలనీల్లో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో యోగ దినోత్సవాన్ని నిర్వహించారు. మేడ్చల్ పట్టణంలోని కేఎల్‌ఆర్ నగర్‌లో యోగ గురువు లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం యోగ గురువు లక్ష్మణ్ యాదవ్‌ను ఘనంగా సన్మానించారు. పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన యోగ డేలో పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హెచ్‌ఏఎల్ జాతీయ డైరెక్టర్ మల్లారెడ్డి, పతంజలి యోగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ్ధర్ రావు, ఎంపీపీ విజయలక్ష్మీ, జడ్పీటీసీ శైలజ హరినాథ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరం కాంతారావు, పతంజలి సమితి ముఖ్య నాయకులు కిషోర్, నాగభూషణం, వెంకటేశ్, కిషన్, ఆంజనేయులు, వేణు, రణమల్ల మల్లారెడ్డి, నాయకులు మోహన్ రెడ్డి, శేఖర్ గౌడ్, రాజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పాండు గుప్త, శ్రీనివాస్, శేఖర్, మల్లిక పాల్గొన్నారు.
బాలాపూర్: ప్రపంచ యోగా డేను పురస్కరించుకొని శుక్రవారం బాలాపూర్, సరూర్‌నగర్ మండలాలలోని పలు ప్రాంతాలలో యోగా డేను ఘనంగా నిర్వహించారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యోగా డేను నిర్వహించారు. కార్యక్రమానికి నెహ్రూ యువ కేంద్రం జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ రావు పాల్గొన్నారు. సరూర్‌నగర్ వీఎం హోంలో యోగా డేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ కసారెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని యోగా గొప్పదనాన్ని వివరించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధి మహిపాల్ రెడ్డి, వీఎం హోం ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి, లక్ష్మిపార్వతి, ఎన్‌సీసీ అధికారి కళావతి, రచయిత హన్మంత్ రెడ్డి, నర్సింహ రావు పాల్గొన్నారు.
జీడిమెట్ల: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని చింతల్ రెయిన్‌బో విద్యా సంస్థల ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సరళ దివ్య యోగా అధిపతి అన్విత్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు అతిథులు సూచించిన యోగా ఆసనాలను చేశారు. కార్యక్రమంలో రెయిన్‌బో విద్యా సంస్థల చైర్మన్ శాంతి కుమార్ యాదవ్, డైరెక్టర్ స్నేహలత పాల్గొన్నారు.
ఉప్పల్: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని ప్రముఖ యోగ గురువు వై.సుధాకర్ రావు అన్నారు. 5వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పీర్జాదిగూడ శ్రీశ్రీనగర్‌లో యోగా గురువును కాలనీ ప్రజలు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. మేడిపల్లిలోని శాంతి వనంలో రామానంద గురుజీ, శైలజ ఆధ్వర్యంలో ఏవీ కన్‌స్ట్రక్షన్ ఎండీ జక్కా వెంకట్ రెడ్డి నేతృత్వంలో యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్వతాపూర్ మహారాజ్ ఫోర్ట్‌లో అమ్మ యోగ ఆశ్రమం సొసైటీ అధ్యక్షుడు సీతాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, రఘుపతి గౌడ్, సహదేవ్ గౌడ్, బొడిగె కృష్ణా గౌడ్, శ్రీనివాస్, కిరణ్, అశోక్, రాధిక పాల్గొన్నారు. ఉప్పల్ గోల్డెన్ సీనియర్ సిటిజన్ వయోవృద్ధులు ప్రపంచ యోగ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కార్యదర్శి దుబ్బాక నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో..
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నగరంలోని సంజీవయ్య పార్కులో శుక్రవారం అంతర్జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అర్బన్ ఫారెస్ట్రీ విభాగం డైరెక్టర్ శ్రీనివాస్ హాజరై ప్రసంగించారు. యోగ మన భారతీయ సంస్కృతిలో భాగమని, వైధిక శాస్త్రాలలో యోగ సాధనను వివరించారని అన్నారు. పతంజలి యోగ సాధనను ప్రారంభిస్తే ప్రదాని నరేంద్ర మోదీ యోగాను ప్రపంచానికి పరిచయం చేశారని చెప్పారు. యోగాభ్యాసం, వాటి పద్ధతులపై కరపత్రాన్ని విడుదల చేశారు. బీపీపీ అధికారి విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ డెన్మార్క్, అమెరికా, జపాన్ లాంటి దేశాలలో నిత్యం పాఠశాలలో పిల్లల చేత యోగభ్యాసం చేయిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో యోగ గురువు గోపాల కృష్ణ, దేవజ. గోపాల్ రెడ్డి, ప్రదీప్, అపర్ణ పాల్గొని యోగ చేశారు.

నకిలీ విత్తనాలకు అడ్డా అగిర్యాల
* పరిగి, షాబాద్, కుల్కచర్ల
ప్రాంతాలకు తరలింపు
* శివారు గ్రామాలే అడ్డ్డాగా
పత్తి విత్తనాల సరఫరా
* నేరుగా రైతుల వద్దకే పత్తి విత్తనాల ప్యాకెట్లు
* మొక్కుబడిగా వ్యవసాయ శాఖ
అధికారుల తనిఖీలు

కొందుర్గు, జూన్ 21: ఖరీఫ్ సీజన్ ప్రారంభమయిందంటే చాలు నకిలీ విత్తనాలను సరఫరా చేసేందుకు వ్యాపారులు జోరుగా పల్లెల్లో పర్యటనలు చేస్తుంటారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు రాకపోవడంతో వ్యాపారులు పెద్దగా గ్రామాల్లో పర్యటించడం లేదు. వర్షాలు రావడమే తరువాయి మండల కేంద్రాలకు శివారు గ్రామాలను ఎంపిక చేసుకొని నకిలీ పత్తి, మొక్కజొన్న విత్తనాలను రైతులకు అంటగట్టి వారి వ్యాపారం మూడు పువ్వులు..ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. ఒక్కొక్క పత్తి విత్తనాల ప్యాకెట్ రూ.550నుండి రూ.600వరకు విక్రయిస్తున్నారు. స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించడమే కాకుండా సమాచారం వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఒకవైపు నకిలీ విత్తనాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంటే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వివిధ గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల పరిధిలోని అగిర్యాల గ్రామం నకిలీ విత్తనాలకు అడ్డగా మార్చుకొని శివారు గ్రామాల రైతులకు విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రైతు కొందుర్గు మండలం అగిర్యాల గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడ్డారు. ప్రతి ఏడాది ఆంధ్ర ప్రాంతం నుండి నకిలీ పత్తివిత్తనాలు తీసుకువచ్చి స్థానికంగా ఉన్న రైతులకు అరువుపై ఇచ్చి పంట చేతికి వచ్చిన తరువాత మిత్తితో సహాయ నగదును వసూలు చేస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ప్రతి ఏడాది వందల క్వింటాళ్ల పత్తి విత్తనాలను విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నారు. కొందుర్గు మండలంతోపాటు జిల్లెడు చౌదరిగూడ, షాబాద్, పరిగి, కుల్కచర్ల ఫరూఖ్‌నగర్, నవాబ్‌పేట మండలాలతోపాటు ఇతర జిల్లాలకు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లపై మ్యానిఫాశ్చరింగ్ తేది, ఎంత ధర అనే విషయాన్ని ప్యాకెట్లపై ఉందని రైతులు అంటున్నారు. అగిర్యాల అడ్డగా నకిలీ విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతుంటే స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారని రైతులు వాపోతున్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొందుర్గు మండల వ్యవసాయ శాఖ అధికారి మదుసూదన్ అన్నారు. మండలంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తమ దృష్టికి ఇప్పటి వరకు రాలేదని, ఒక వేళ వస్తే విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో పర్యటించామని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని రైతులకు సూచించినట్లు తెలిపారు.

అక్రమ నల్లా కనెక్షన్
* ఇంటి యాజమానిపై క్రిమినల్ కేసు
హైదరాబాద్, జూన్ 21: జలమండలి సరఫరా చేస్తున్న పైప్‌లైన్ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. సుల్తాన్ బజార్, రఘునాథ్ బాగ్‌లోని బహుళ అంతస్తు భవనానికి అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్నారు. ఇది గుర్తించిన జలమండలి విజిలెన్స్ అధికారులు బోర్డు ఎండీ ఎం.దానకిషోర్ ఆదేశాల మేరకు అక్రమ నల్లా కనెక్షన్ తొలగించడంతో పాటు సంబంధిత భవన యాజమాని సుశీల్ కపాడియాపై సుమ్తాన్ బజార్ పోలీస్టేషన్‌లో ఐపీసీ సెక్షన్లు 269, 430, 379 కింద నమోదు చేవారు. జలమండలి అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు.

బాలికపై అత్యాచార యత్నం
జీడిమెట్ల, జూన్ 21: ఎనిమిదేళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జగద్గిరిగుట్ట, రిక్షాపుల్లర్స్ కాలనీలో నివాసముండే ఎల్లయ్య(60) కూలీ పని చేస్తుంటాడు. అదే బస్తీలో నివసించే సురేశ్, శోభ దంపతుల కూతురికి(8) ఎల్లయ్య మామిడి పండు ఇస్తానని ఇంటికి తీసుకువెళ్లి బాలిక చేతిని పట్టి లాగడంతో కేకలు పెట్టింది. ఇరుగుపొరుగు వెంటనే గమనించి బాలికను రక్షించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు ఎల్లయ్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లా పోలీసు శాఖ ప్రక్షాళన

$
0
0

మచిలీపట్నం, : కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం జిల్లా పోలీసు శాఖ ప్రక్షాళన షురూ అయ్యింది. ఇటీవల జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు తీసుకున్న ఎం రవీంద్రనాధ్ బాబు అతి కొద్ది రోజుల్లోనే పోలీసు శాఖపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లాలో భారీగా ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 49 మంది ఎస్‌ఐలను బదిలీ చేసిన ఎస్పీ రవీంద్రనాధ్ వీరిలో ఐదుగురిని ఏలూరు రేంజ్ డీఐజీ ఆదేశాల మేరకు విజయవాడ కమిషనరేట్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనరేట్‌కు కేటాయించిన వారిలో ముసునూరు ఎస్‌ఐ కెవిజివి సత్యనారాయణ, చాట్రాయి ఎస్‌ఐ యండీ షబీర్ అహ్మద్, ఆగిరిపల్లి ఎస్‌ఐ వి యేసేబు, నూజివీడు టౌన్ ఎస్‌ఐ సిహెచ్ రంజిత్ కుమార్, నూజివీడు రూరల్ ఎస్‌ఐ కెడి ప్రసాదరావు ఉన్నారు. వీఆర్‌లో ఉన్న 11 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా నుండి జిల్లాకు కేటాయించిన పి యేసుపాదంను వీఆర్‌లో పెట్టారు. మిగిలిన 33 మందికి స్థానచలనం కల్పించారు. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే జరిగిన ఎస్‌ఐల బదిలీల్లో రాజకీయ రంగు లేకపోలేదు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమకు అనుకూలమైన వారిని తమ తమ ప్రాంతాలకు తెప్పించుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పేరు ప్రస్తుత స్టేషన్ బదిలీ స్టేషన్

కె రాజారెడ్డి ఉమెన్ పీఎస్ కైకలూరు టౌన్
యండీ మస్తాన్‌ఖాన్ వీఆర్ బందరు ట్రాఫిక్
డిబి వీర్రాజు సీసీఎస్ బందరు డీఎస్‌బీ బందరు
డి చంద్రశేఖర్ సీసీఎస్ బందరు నూజివీడు రూరల్
బి అభిమన్యు పెడన గూడూరు
కె శ్రీనివాసు బంటుమిల్లి గూడూరు
కె నాగరాజు గూడూరు గుడివాడ వన్‌టౌన్
పి నాగరాజు గుడివాడ వన్‌టౌన్ చల్లపల్లి
వి రాజేంద్ర ప్రసాద్ డీఎస్‌బీ బందరు గుడివాడ ట్రాఫిక్
జి రామకృష్ణ ముదినేపల్లి రెడ్డిగూడెం
ఎం లక్ష్మణ్ సీసీఎస్ గుడివాడ కంచికచర్ల
ఎ గణేష్‌కుమార్ కైకలూరు టౌన్ పామర్రు
హబీబ్ బాషా పామర్రు సీసీఎస్ బందరు
ఎంకె రాజు పెదపారుపూడి సీసీఎస్ బందరు
టి రామకృష్ణ తిరువూరు నందిగామ ఎస్‌ఐ-2
పి కిషోర్ నందిగామ ఆగిరిపల్లి
సిహెచ్ అవినాష్ గంపలగూడెం తిరువూరు ఎస్‌ఐ-2
బి రాజు రెడ్డిగూడెం సీసీఎస్ గుడివాడ
పి మురళీకృష్ణ నందిగామ పెడన
ఎ మణికుమార్ కంచికచర్ల ముదినేపల్లి
ఉమామహేశ్వరరావు వత్సవాయి గంపలగూడెం
బి శ్రీనివాసరావు చల్లపల్లి నూజివీడు టౌన్
ఎవిఎస్ రామకృష్ణ డీఎస్‌బీ పెదపారుపూడి
ఎంటి రామకృష్ణ డీఎస్‌బీ బంటుమిల్లి
పి లోవరాజు డీఎస్‌బీ నందిగామ
ఆర్ ప్రసాదరావు వీఆర్ డీటీసీ కృష్ణా
కె వెంకటేశ్వర్లు వీఆర్ సీసీఎస్ బందరు
పి వెంకటేశ్వర్లు వీఆర్ సీసీఎస్ గుడివాడ
జె హనుమంతరావు వీఆర్ సీసీఎస్ బందరు
టి నాగేశ్వరరావు వీఆర్ చిలకలపూడి ఎస్‌ఐ-2
హుస్మాన్ ఖాన్ వీఆర్ సీసీఎస్ బందరు
బి రామారావు వీఆర్ డీఎస్‌బీ
కెవి నారాయణరావు వీఆర్ డీఎస్‌బీ
ఆర్‌కె కుమారి వీఆర్ ఉమెన్ పీఎస్
జె గజపతిరావు వీఆర్ ఉమెన్ పీఎస్
పీ యేసుపాదం ప.గో. వీఆర్
కె ఫణికుమార్ ఇనగుదురు ఆర్‌పేట ఎస్‌ఐ-2
డి రాజేష్ చిలకలపూడి మచిలీపట్నం
దివ్యకల్యాణి ఆర్‌పేట ఎస్‌ఐ-2 సీసీఎస్ గుడివాడ
ఎ దుర్గాప్రసాద్ మచిలీపట్నం డీఎస్‌బీ
పిఎస్ శేఖరరెడ్డి వీఆర్ ఇనగుదురు ఎస్‌ఐ-2
పి గౌతమ్ కుమార్ విస్సన్నపేట వత్సవాయి
ఎ బాబా ఫక్రూద్దీన్ ఇనగుదురు ఎస్‌ఐ-2 సీసీఎస్ గుడివాడ

బాధ్యతగా పని చేయండి

బదిలీ ఎస్‌ఐలకు ఎస్పీ రవీంద్రనాథ్ సూచన

మచిలీపట్నం, జూన్ 21: ఎటువంటి విమర్శలు లేకుండా బాధ్యతగా విధులు నిర్వర్తించి ఫిర్యాదారులకు సముచితమైన సేవలు అందించాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాధ్ బాబు బదిలీ అయిన ఎస్‌ఐలకు సూచించారు. శుక్రవారం జిల్లాలో మొత్తం 49 మంది ఎస్‌ఐల బదిలీలను ఆయన చేపట్టారు. ఐదుగురిని విజయవాడ కమిషనరేట్‌కు కేటాయించగా మిగిలిన 45 మంది వివిధ స్టేషన్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరితో శుక్రవారం ఆయన ఎలక్షన్ సెల్‌లో సమావేశమై బదిలీ ఉత్తర్వులు అందించారు. బదిలీ అయిన వారంతా తమకు కేటాయించిన స్టేషన్లలో తక్షణమే రిపోర్టు చేయాలని ఆదేశించారు. బదిలీ అయిన స్టేషన్ల పరిధిలోని పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసుకుని సేవలు అందించాలన్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాద పూర్వకంగా మెలిగి వారి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారితో సత్సంబంధాలు కొనసాగించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ రవీంద్రనాధ్ సూచించారు.

ప్రజాసేవకు ప్రాధాన్యత

$
0
0

గుడ్లవల్లేరు, : గ్రామ పంచాయతీలను గ్రామ సచివాలయాలుగా తీర్చిదిద్ది ప్రజలకు సేవలందించేందుకు 10 మందికి తగ్గకుండా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు. మండల పరిధిలోని పెంజాండ్ర గ్రామంలో రూ.15 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం మంత్రి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సచివాలయంలో ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారన్నారు. పంచాయతీల కార్యదర్శుల సంఖ్య తక్కువగా ఉందని, ఒక్కో కార్యదర్శి ఆదారు పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్నారన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్, గృహ నిర్మాణం, వివిధ పథకాలకు సంబంధించిన పనులను గ్రామ సచివాలయం నుండే ఆగస్టు 15 నుండి వలంటీర్లు పర్యవేక్షిస్తారన్నారు. ప్రజలు గ్రామ పంచాయతీలలో సమస్యలపై దరఖాస్తులు చేసిన 48 గంటల్లో వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఈ ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేయనున్నారన్నారు. పంచాయతీ భవనానికి ప్రభుత్వ నిధులు రూ.13లక్షల 50వేలు, దాత బొప్పన శరత్ రూ.లక్షా 50వేలతో నిర్మించినట్లు తెలిపారు. అనంతరం మంత్రి సబ్సిడీపై జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కోగంటి ధనుంజయ్, డిప్యూటీ తహశీల్దార్ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం

ఎస్పీ రవీంద్రనాథ్ బాబు

మచిలీపట్నం (కోనేరుసెంటరు), జూన్ 21: యోగాభ్యాసం శారీరక, మానశిక ఆరోగ్యానికి దోహదం చేస్తుందని జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసు కల్యాణ మండపంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రపంచ యోగ దినోత్సవ కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగ జీవితంలో భాగం కావాలని, ముఖ్యంగా ఉద్యోగులు ప్రతి రోజు యోగ చేయడం ద్వారా పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారన్నారు. తద్వారా శారీరక, మానసిక ఆనందాన్ని పొందుతారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ విజయరావు, బందరు ఆర్డీఓ జె ఉదయ భాస్కరరావు, డీఎస్పీ ఎండి మహబూబ్ భాషా, తహశీల్దార్ సునీల్ బాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుర్, పలువురు యోగ గురువులు, రెవెన్యూ సిబ్బంది యోగాసనాలు వేశారు.

ఘనంగా యోగా దినోత్సవం

$
0
0

జగ్గయ్యపేట, ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఆరోగ్యవంతులే అని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని బాలుర హైస్కూల్‌లో జరిగిన యోగా కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు, ప్రముఖులతో కలిసి యోగా చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు యోగా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్, తన్నీరు నాగేశ్వరరావు, పతంజలి సంస్ధ నిర్వాహకులు పిన్నం వెంకళరావు, నోముల రఘు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఫైర్ స్టేషన్‌లో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎపీ ఫైర్ సర్వీసుసివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ 3వ బెటాలియన్‌కు చెందిన 96 మంది అగ్ని మాపక సిబ్బంది పట్టణ ఫైర్ స్టేషన్‌లో యోగాసనాలను వేశారు. పట్టణంలోని మార్కెట్ యార్డు యోగాసాధకుల సంఘం ఆధ్వర్యంలో యోగాసనాలను వేశారు. పట్టణంలోని ఎస్‌జిఎస్ కళాశాలలో ఇన్‌చార్జీ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో యోగాసాధకులు లుగేంద్రపిళ్ళై ఆధ్వర్యంలో యోగాసనాలను వేశారు. వాసవీక్లబ్‌కపుల్స్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలను నిర్వహించి యోగాచార్యులు లుగేంద్రపిళ్ళైను కపుల్స్ అధ్యక్షుడు కాకరపర్తి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. పట్టణంలోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో వాసవీ వనితాక్లబ్ ఆధ్వర్యంలో యోగాసనాలను నిర్వహించి యోగాగురువులను ఘనంగా సత్కరించారు. పట్టణంలోని విజ్ఞాన్ హైస్కూల్‌లో డైరెక్టరు తన్నీరు సుధారాణి ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.


ప్రతి గ్రామానికీ వౌలిక సదుపాయాలు

$
0
0

పామర్రు, : రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి కనిష్ట వౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి కృషి చేసే యోచనలో ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) పేర్కొన్నారు. మండల పరిధిలోని జెమీగొల్వేపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాలయ శిఖర ప్రతిష్ఠ శుక్రవారం నిర్వహించగా ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాలు పేదల అభ్యున్నతికి, రాష్ట్ర ప్రగతికి ఎంతో దోహదపడతాయన్నారు. నాణ్యమైన నిత్యావసర వస్తువులను ఖచ్చితమైన తూకం ద్వారా రేషన్ దుకాణాలను అనుసంధానం చేసి స్వయంగా అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇది ఇలా ఉండగా శిఖర ప్రతిష్ఠలో పాల్గొని శ్రీ సీతారాములను దర్శించి మంత్రి నాని ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ పొట్లూరి వెంకట సత్యనారాయణ స్వామివారి శేషవస్త్రంతో మంత్రి నానిని సత్కరించారు. అలాగే పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ సాయంత్రం పూజలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్, మంత్రి నానికి గ్రామ సొసైటీ మాజీ అధ్యక్షుడు పొట్లూరి వెంకట కృష్ణారావు, మాజీ సర్పంచ్ వల్లభనేని వెంకటరత్నం, వైకాపా నేత వల్లభనేని వేణుగోపాల్, కె జయశేఖర్ తదితరులు స్వాగతం పలికి ప్రత్యేకంగా సన్మానించారు. దళితవాడలో నూతనంగా నిర్మించిన వైకాపా పతాక స్థూపాన్ని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ఆవిష్కరించారు.

వడ్డేను పరామర్శించిన పురంధ్రీశ్వరి

ఉయ్యూరు, జూన్ 21: భార్యా వియోగంలో ఉన్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావును కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి శుక్రవారం పరామర్శించారు. సమాచారం అందుకున్న ఆమె ఉదయం స్ధానికంగా వడ్డే స్వగృహానికి వచ్చి ఆయనను ఓదార్చారు. దివంగత వడ్డే పాపాయమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, వడ్డేకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నట్లు ఈ సందర్భంగా ఆమె విలేఖరులకు తెలిపారు. కాగా పలువురు రాజకీయ, వ్యాపార, వర్తక ప్రముఖులు వడ్డేను పరామర్శించిన వారిలో ఉన్నారు.

వీఎంసీ కౌన్సిల్‌కు నేడు చివరి సమావేశం
* సన్నద్ధమైన అధికార, ప్రతిపక్ష పార్టీలు
* జూలై 2తో ముగియనున్న పాలకవర్గం
* మేయర్‌గా ఐదేళ్లపాటు సుదీర్ఘ పాలన సాగించిన కోనేరు శ్రీ్ధర్
విజయవాడ (కార్పొరేషన్), జూన్ 21: నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం శనివారం జరగనుంది. ప్రస్తుత పాలక వర్గానికి చివరి కౌన్సిల్‌గా చెప్పుకునే ప్రస్తుత సమావేశానికి అధికార, ప్రతిపక్షాలు సన్నద్ధమైనాయి. 2014 జూలై 3న ప్రారంభమైన కౌన్సిల్ ఐదేళ్లపాటు కొనసాగి 2019 జూలై 2తో పాలనా కాలం ముగియనుంది. ఆఖరి కౌన్సిల్ నిర్వహణకు మేయర్ కోనేరు శ్రీ్ధర్ సర్వం సిద్ధం చేశారు. ప్రస్తుత సమావేశంలో సుమారు 150కిపైగా ప్రతిపాదనలు రాగా, అదనపు అంశాలుగా మరికొన్ని కీలక అంశాలుగా రానున్నాయి. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఊహించని విధంగా బదిలీపై వచ్చిన ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ ఎం రామారావుకు వీఎంసీలో ఇదే మొదటి, చివరి సమావేశం అవ్వడం గమనార్హం. చివరిగా జరుగుతున్న కౌన్సిల్ సమావేశం ఏవిధంగా జరుగుతుందాన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో జరిగిన సమావేశాల మాదిరిగా గందరగోళంగా జరుగుతుందా లేక ప్రశాంతంగా జరుగుతుందా అనే అంశం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, కౌన్సిల్‌లో వైసీపీ ప్రతిపక్షంగా ఉండటంతో టీడీపీ, వైసీపీలు ఏవిధంగా వ్యవహరిస్తాయన్నది మీమాంశగా ఉంది. కౌన్సిల్‌లో 39 కార్పొరేటర్లను గెలుచుకుని అధికారాన్ని కైవశం చేసుకున్న తెలుగుదేశం పార్టీ మేయర్‌గా సీనియర్ కార్పొరేటర్ కోనేరు శ్రీ్ధర్‌ను ఎన్నుకుని ఐదేళ్ల పాటు నిరంతరామంగా కొనసాగడం విశేషం కాగా, అనేక ఆటుపోట్ల మధ్య గడిచిన ఐదేళ్ల పాలనా కాలం నగర తెలుగుదేశం పార్టీకి ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఫిబ్రవరిలో జరిగిన సాధారణ, బడ్జెట్ సమావేశాలనంతరం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ప్రతి నెలా జరగాల్సిన కౌన్సిల్ సమావేశం మార్చి నుంచి జూన్ వరకూ జరగలేదు. జూలైతో కౌన్సిల్‌లో ప్రజాప్రతినిధుల పాలనా కాలం ముగియనుండటంతో శనివారం జరగనున్న కౌన్సిల్ సమావేశం చివరి సమావేశంగా చెప్పుకోచ్చు. తదుపరి కౌన్సిల్ రద్దయి నగరంలో స్పెషలాఫీసర్ రానున్నట్టు అధికారిక సమాచారం. ఇప్పట్లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపించకపోవడంతో మరికొద్ది నెలల పాటు స్పెషలాఫీసర్ పాలనలోనే నగర పాలన జరుగనుందన్న విషయం సుస్పష్టం కాగా, ఫిబ్రవరి వీఎంసీ వార్షిక బడ్జెట్‌లో డివిజన్ అభివృద్ధికి కేటాయించే వార్డు బడ్జెట్ నిధులు వినియోగం ఈ సంవత్సరం అంతంతమాత్రమే. ఎన్నికల కోడ్ సందర్భంగా నిలిచిపోయిన టెండర్ ప్రక్రియతో వార్డు నిధులన్నీ వినియోగం కాక అలాగే నిలిచిపోయాయి. ఎన్నికల కోడ్ ముగిసిందనుకుంటే కౌన్సిల్ పాలన కాలం కూడా ముగియడంతో వార్డు బడ్జెట్ నిధుల వినియోగానికి కాలం కలిసిరాక చివరిగా వివిధ అభివృద్ధి పనులకు ముగింపు పలకాలన్న డివిజన్ కార్పొరేటర్ల ఆలోచనలకు బ్రేక్ పడినట్టయింది.
ఇదిలా ఉండగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్‌గా బండి నాగేంద్ర పుణ్యశీల ఇప్పటివరకూ అధికార తెలుగుదేశం పార్టీని దీటుగా ఎదుర్కొన్నారనే చెప్పవచ్చు. అనేక కీలక అంశాలపై ప్రతిపక్షంగా తమవంతు పాత్ర పోషించిన వైసీపీ కార్పొరేటర్లు ఇప్పటివరకూ జరిగిన కౌన్సిల్ సమావేశాలలో కొన్ని మినహా మిగిలిన అన్ని సమావేశాలలోనూ వాకౌట్లు, సస్పెన్షలకు గురైన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకొక్క సభ్యులుగా ఉన్న సీపీఎం, బీజేపీ కార్పొరేటర్లలో సీపీఎం సభ్యురాలు గాదే ఆదిలక్ష్మీ కూడా వివిధ అంశాల్లో అధికార పక్షాన్ని నిలదీయడం, కొన్ని ప్రతిపాదనలపై డీసెంట్‌నోట్ లు ఇవ్వడం, వాకౌట్ చేసి తమ వాదనలను గట్టిగా వినిపించగా, బీజేపీ కార్పొరేటర్ ఉత్తమ్ చంద్ బండారి ఆ పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్‌గా చెప్పుకోవడమే కానీ చెప్పుకోదగిన పాత్ర పోషించలేదన్న విషయం కౌన్సిల్ రికార్డులే తెలుపుతుండటం గమనార్హం. ఏది ఏమైనా 2014 - 2019 కాలంలో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు ఇదే చివరి కౌన్సిలే కాకుండా వారి ప్రాతినిధ్యానికి కూడా చివరి రోజులు కావడం విశేషం.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
* మంత్రి వెలంపల్లి
విజయవాడ పశ్చిమ, జూన్ 21: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చని దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు వెలంపల్లి శ్రీనివాసరావుఅన్నారు. శ్రీవెంకటేశ్వర యోగా సేవా కేంద్రం, కాకరపర్తి భావానారాయణ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను శుక్రవారం ఆ కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతీయ సంప్రదాయ కళల్లో భాగమైన యోగా నేడు అన్ని దేశాలు, అన్ని వర్గాలు ఆమోదించబడి ఆరోగ్యానికి ఒక ప్రధానమైన సాధనంగా మారిందన్నారు. ప్రపంచ వ్యాపితంగా అన్ని దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహించటం గొప్ప విషయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొంత సమయాన్ని యోగాకు కేటాయిస్తే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవటానికి అవకాశముంటుందన్నారు. ఆ దిశగా ప్రతిఒక్కరూ యోగా సాధనను తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం యోగా విస్తరణకు తద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అండగా ఉంటుందన్నారు. వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు వెంకటేశ్వర గురూజీ మాట్లాడుతూ యోగా సాధన అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే సాధనమన్నారు. ప్రపంచంలోనే 177 దేశాలు నేడు యోగా దినోత్సవాన్ని జరుపుకోవటం దీని ఆవశ్యకతను తెలియజేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ యోగాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లి విస్తరణకు ఆయన అందించిన కృషి అద్బుతమైనదని అన్నారు. తమ సంస్థ 38 సంవత్సరాలుగా యోగా విస్తరణకు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కెబీఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ తూనుకుంట్ల శ్రీనువాస్, వైస్ ప్రిన్సిపాల్ ఈ వరప్రసాద్, అధ్యాపకులు జె పాండురంగారావు, డి హేమచంద్రరావు, ఎం సాంబశివరావు, ఎన్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

సింగిల్ డెస్క్‌తో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు
సకాలంలో అనుమతుల మంజూరు
కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్
విజయవాడ (కార్పొరేషన్), జూన్ 21: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సింగ్‌ల్ డెస్క్ ద్వారా సకాలంలో ఆయా అనుమతలు మంజూరు చేయాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా పరిశ్రమ ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ హోదాలో పాల్గొన్న కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ పరిశ్రమ స్థాపనకువచ్చే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా ఫైర్, బాయిలర్, గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ, విద్యుత్ శాఖలతో సింగిల్ డెస్క్ ఏర్పాటుచేసి దాని ద్వారా ఆయా అనుమతులు సత్వరమే మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవడంతోపాటు తిరస్కరించిన దరఖాస్తులకు గల కారణాలను కూడా తక్షణమే తెలపాలన్నారు. జిల్లా పరిశ్రమ శాఖ వద్ద నేటికీ 11 పరిశ్రమలకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులను త్వరితంగా పరిష్కరించాలని ఆయా శాఖాధికారులను ఆదేశించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న వివిధ రకాల రాయితీలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వీటిలో 115 కంపెనీలకు 8 కోట్ల 60 లక్షల 38వేల 12రూపాయల రాయితీని మంజూరుకు కమిటీ ఆమోదించిందని కలెక్టర్ తెలిపారు. జనరల్ క్యాటగిరిలో 68 కంపెనీలకు 5 కోట్ల 34లక్షల 56వేల 706 రూపాయలు, వెనుకబడిన తరగతుల క్యాటగిరిలో 19 కంపెనీలకు కోటి 69లక్షల 99వేల 66రూపాయలు, ఎస్సీ క్యాటగిరిలో 32 కంపెనీలకు 2కోట్ల 18లక్షల 56వేల 528 రూపాయలు, షెడ్యూల్డ్ తెగల క్యాటగిరిలో ఒక కంపెనీకి 24, 812 రూపాయలను రాయితీ మంజూరు చేస్తూ కమిటీ ఆమోదించింది. పెండింగ్ ఉన్న వడ్డీ రాయితీలను ప్రభుత్వం సకాలంలో మజూరు చేయాలని, పరిశ్రమలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించకుంటే పరిశ్రమలు మనగలిగే పరిస్థితిలేక మూతపడే ప్రమాదం ఉందంటూ పలువురు పారిశ్రామిక వేత్తలు కమిటీ దృష్టికి తీసుకురాగా, ఇందుకు స్పందించిన కలెక్టర్ ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు విధంగా పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎ సుధాకర్, డెప్యూటీ డైరెక్టర్ వెంకట్రావ్, ఎలీప్ సెక్రటరీ కనకదుర్గ, ఫ్యాక్సియా ప్రతినిధి ఫణి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

ఆపరేషన్ రెవెన్యూ కలెక్షన్స్
వీఎంసీ పన్ను వసూళ్ల శాతం పెంచేందుకు కసరత్తు
అధికార, సిబ్బందితో సమీక్షించిన వీఎంసీ కమిషనర్ రామారావు
విజయవాడ (కార్పొరేషన్), జూన్ 21: నగర పాలనలో దూకుడు పెంచిన కమిషనర్ రామారావు గురువారం ప్రజారోగ్యశాఖ ప్రక్షాళనకు చర్యలు తీసుకోగా శుక్రవారం రెవెన్యూ కలెక్షన్లపై దృష్టిపెట్టారు. సుమారు రూ.110 కోట్లకు పైగా వసూలుగా రెవెన్యూలో ఆశించినంతగా వసూలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రామారావు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వసూలు శాతం పెంచేందుకు కసరత్తు ప్రారంభించారు. 2లక్షల అసిస్‌మెంట్ల వరకూ ఉన్న నగరంలో కేవలం ఆస్తి పన్ను మినహా మిగిలిన నీటి పన్ను, యూజీడీ, ఖాళీ స్థలాల పన్నుల వసూలు జరగకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్న వీఎంసీ ఖజానాకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలన్న లక్ష్యంతో అడుగులేస్తున్నారు. వీఎంసీ టౌన్ ప్లానింగ్ సంవత్సరానికి 10వేలకు పైగా నూతన భవన నిర్మాణాలు జరుగుతున్నట్టు అధికారిక సమాచారం కాగా అనధికార నిర్మాణాలు, ప్లాన్ లేని చిన్న తరహా నిర్మాణాలు కూడా ఆదే స్థాయిలో జరుగుతున్నాయన్నది సుస్పష్టం. రెవెన్యూ వసూలులో అవినీతి అక్రమాలతో ఖాజానాను నింపడం కన్నా తమ జేబులు నింపుకోవడానికే ఎక్కువ శ్రద్ధ చూపుతున్న బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల తీరుపై బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తుండగా, వీరిని సమన్వయపర్చాల్సిన పైస్థాయి అధికారులు అసిస్టెంట్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు కూడా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండటం గమనార్హమనే చెప్పాలి. ఇదిలావుండగా నగర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాసాలు ఉండి, వారి ఇళ్లకు కరెంట్, ఇతర సదుపాయాలు ఉన్నవారికి ఆస్తి పన్ను విధించడంలో రెవెన్యూ అధికార సిబ్బంది అనుసరిస్తున్న పనితీరుపై పలు అరోపణలు వినిపిస్తున్నాయి. చేతులు తడిపితేనే పన్ను విధింపు అన్నట్టుగా ఉన్న వీరి తీరు బహిరంగ రహస్యమే. ఇదిలా ఉండగా రెవెన్యూ వసూళ్ల పెంపుపై దృష్టి పెట్టిన కమిషనర్ రామారావు శుక్రవారం రెవెన్యూ అధికార సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయడంతో ఇకనైనా వారి పనితీరు మెరుగుపడుతుందాన్న అంశం వేచి చూడాల్సిందే. ఈసందర్భంగా జరిగిన సమీక్షలో కమిషనర్ రామారావు మాట్లాడుతూ నగర పాలక సంస్థకు ప్రజలు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు వసూలు శాతాన్ని పెంచాలని పేర్కొన్నారు. 2019 -2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నుల వసూలులో ఎటువంటి అలక్ష్యం వహించకుండా బాధ్యతగా తమ విధులను నిర్వర్తించి వసూళ్ల పురోగతి పెంచాలని ఆదేశించిన కమిషనర్ వసూలు శాతం పెంచని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ప్రస్తుతం జరిగిన వసూళ్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన సిబ్బంది పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ జరిపి అప్రమత్తం చేయాలని జోనల్ కమిషనర్లకు సూచించారు. దీర్ఘకాలిక బకాయిలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్న ఆయన ఖాళీ స్థల పన్ను వసూలు శాతం కూడా పెంచాలన్నారు. అడ్రస్‌లేని ఖాళీ స్థల యజమానుల స్థలాల్లో హెచ్చరికలతో కూడిన నోటీసు బోర్డులను ఏర్పాటుచేయాలన్నారు. పన్ను నోటీసులకు సంబంధించి ప్రజలకు జారీ చేయాల్సిన నోటీసులు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇంకా జారీ చేయలేదని వివరించిన వీఎంసీ రెవెన్యూ అధికారుల సూచనలకు కమిషనర్ రామారావు స్పందిస్తూ అసిస్టెంట్ కమిషనర్ల లాగిన్ నుంచి నోటీసులను ముద్రించి జారీ చేయాలని తెలిపారు.పన్ను వసూలుశాతం తక్కువగా ఉన్న బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లపై చర్యలు తీసుకునేందుకు వీలుగా వార్డుల వారీగా వారి వారి వసూలు శాతాన్ని తెలిపే నివేదికలను రెండు రోజుల్లో అందజేయాలని డెప్యూటీ కమిషనర్ ఆఫ్ రెవెన్యూ సుబ్బారావును ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు జోనల్ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కోచ్‌ల భర్తీకి సన్నాహాలు
* శాప్ ఎండీ కాటంనేని భాస్కర్
విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 21: రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి శిక్షకుల నియామకానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కాటంనేని భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని శాప్ కార్యాలయంలో ఈ విలేఖరితో మాట్లాడిన కాటంనేని భాస్కర్ సుమారు 300 మంది కోచ్‌ల అవసరం రాష్ట్రంలో ఉందని, త్వరలో నియమాక ప్రక్రియ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఆరు అకాడమీలు ఉన్నాయని, సుమారు 15 నుండి 17 అకాడమీలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడాకారులు తయారు కావాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమని, ప్రైమరీ స్థాయి నుండి పాఠశాలల్లో క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా చేయాల్సిన అవశ్యకత ఉందని పేర్కొన్నారు. రాష్ట్రానికి పది అంతర్జాతీయ పతకాలు కావాలంటే జాతీయస్థాయిలో 100 మంది క్రీడాకారులు తయారు కావాలని, సుమారు 10వేల మంది అకాడమీల్లో శిక్షణ పొందాలన్నారు. మూడు, నాలుగు నెలల్లో జరిగేది కాదని, ఐదేళ్ల లక్ష్యం తప్పనిసరి అన్నారు. రాష్ట్రంలో స్టేడియాలతో పాటు క్రీడా పరికరాల కొరత ఉందని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందన్నారు. స్పోర్ట్స్ స్కూల్స్‌తో పాటు డే బోర్డర్ స్థాయిలో క్రీడాకారుల సంఖ్య పెరగాలని అప్పుడే క్రీడాభివృద్ధి సాధ్యమన్నారు. మైదానాలు ఉన్న పాఠశాలలను గుర్తించి ఆయా పాఠశాలల్లో ప్రైమరీ స్థాయి నుండి క్రీడాకారులు తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలల్లో మైదానాల కొరత ఉందని, తల్లిదండ్రులు క్రీడల పట్ల అవగాహన కలిగి వారి పిల్లలను ప్రోత్సాహించాలని సూచించారు. సంకల్పం ఎంతో గొప్పదని, అలాంటి సంకల్పంతో పని చేస్తామన్నారు. క్రీడా బడ్జెట్ ప్రభుత్వానికి తెలయజేశామని, గత బడ్డెట్‌ను సద్వినియోగం చేసుకోకపోవడం కొంత వరకు శాప్‌కు శాపమే అన్నారు.

మార్కుల జాబితా కోసం
ఇంటర్ విద్యార్థుల కష్టాలు
* గ్రేడింగ్ విధానంతో తప్పని తిప్పలు
* రాజధానికి పరుగులు

విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 21: జాయింట్ సీట్ ఎలాట్‌మెంట్ అథారిటీ (జోసా), ఇంటర్మీడియేట్ బోర్డు మధ్య సమన్వయ లోపం వల్ల దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్ విద్యార్థులకు, వారి తల్లిదంత్రులకు నరకం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యామండలి తీసుకున్న ప్రత్యేక నిర్ణయం విద్యార్థులకు చుక్కలు చూపిస్తోంది. ఈ ఏడాది ఇంటర్ విద్యార్థులకు మార్కులు ఇవ్వకుండా గ్రేడ్ పద్ధతిలో ఇంటర్ బోర్డు ఫలితాలను వెల్లడించింది. అయితే వైద్య కళాశాలల్లో సీట్ల కేటాయింపును పర్యవేక్షించే జోసా మాత్రం కౌనె్సలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తప్పని సరిగా మార్కుల జాబితా తీసుకురావాలని పేర్కొంది. దీనితో విద్యార్థులు, తల్లిదండ్రులు రాజధానికి పరుగులు తీయాల్సి వస్తోంది. ఓ పక్క కౌనె్సలింగ్ గడువు దగ్గర పడుతుండడంతో మరో పక్క మార్కుల జాబితాలు ఇవ్వడానికి ఇంటర్ బోర్డు అధికారులు పెడుతున్న కొర్రీలతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. కౌనె్సలింగ్‌కు తీసుకెళ్లాల్సిన మార్కుల జాబితా కోసం ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులతో కలిసి కచ్చితంగా విజయవాడలోని ఇంటర్ బోర్డుకు రావాల్సిందే. అంతకు ముందు వారు విద్యార్థులు చదువుకున్న కళాశాల నుండి గుర్తింపు పత్రం తీసుకోవాలి, దానితోపాటు ఎంబీబీఎస్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ హాల్ టికెట్ దానికి జత కలిపి బోర్డు అధికారులకు ఓ అభ్యర్థన పత్రం ద్వారా సమర్పించాలి. వాటిని పరిశీలించి మార్కుల జాబితా అందజేస్తారు. అటు శ్రీకాకుళం నుంచి అటు చిత్తూరు, అనంతపురం వరకు పదమూడు జిల్లాల నుంచి విద్యార్థులు తప్పని సరిగా విజయవాడకు వచ్చి వెళ్లాలి. దాదాపు లక్షన్నర మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రస్తుతం మార్కుల జాబితా కోసం పలు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలిసి ఎదుర్కొన్న కష్టాలు వర్ణనాతీతం. ఇంటర్ బోర్డు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో అడిగే ప్రశ్నలతో వారు మరింత గందరగోళానికి గురయ్యారు. ఈనెల 19 నుండి మొదటి దశ నీట్ (మెడికల్) కౌన్సిలింగ్ ప్రారంభమయింది. ఇందులో రాష్ట్ర విద్యార్ధులకు కష్టాలు తప్పడం లేదు. దీనిపై స్పందించిన ఇంటర్మీడియేట్ బోర్డ్ అధికారులు రాష్ట్రంలో గ్రేడింగ్ విధానం అమలులో ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కార్యాలయానికి వచ్చిన వారికి మార్కుల జాబితా వెంటనే ఇస్తున్నామన్నారు. కళాశాల ధ్రువీకరణ పత్రం, ఇంటర్మీడియేట్ గ్రేడింగ్ కార్డ్‌తో పాటు నీట్ దరఖాస్తు చేసుకున్న ఫారం తీసుకువస్తే మార్కుల జాబితా ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలావుండగా శుక్రవారం చాలా తక్కువ మందికి మాత్రమే మార్కుల జాబితాలు ఇవ్వగలిగారు.

అధికారం ఉన్నా... లేకున్నా
టీడీపీకి మొదటి నుంచి ఫిరాయింపుల దెబ్బ
* ఏపీలో ముంచుకొస్తున్న మరో ముప్పు
* ప్రతిపక్ష హోదా లేకుండా చేసేందుకు బృహత్తర వ్యూహం

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూన్ 21: అదేమి పాపమో కానీ టీడీపీకి మొదటి నుంచి దెబ్బపై దెబ్బ తగులుతున్నది. ఒక్కోసారి స్వపక్షీయులే పార్టీని దెబ్బతీస్తే మరోసారి విపక్షాలు మరి కొంత దెబ్బతీస్తూ వచ్చాయి. నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రధాని నరేంద్ర మోదీకి అన్నింటా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన చంద్రబాబు, కారణాలేమైనా ఎవరూ ఉహించనీ రీతిలో ద్వేషిస్తూ ఎన్నికల ఆ సమయంలో దేశ వ్యాప్తంగా మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పటం లేదు. తాజాగా రాజ్యసభలో టీడీపీకి చెందిన ఆర్గురిలో రాజ్యసభ పక్ష నేత వై సుజనాచౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహనరావు, టీజీ వెంకటేష్‌లు బీజేపీ తీర్ధం పుచ్చుకోటమే కాకుండా రాజ్యసభలో తమపార్టీ విలీనమైనట్లుగా ప్రకటించారు. దీనికి రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు దాదాపు ఆమోద ముద్రవేశారు. ఈ పరిణామం చోటు చేసుకున్న 24 గంటల్లోనే మరో ఉపద్రవం కొట్టుకువస్తున్నది. కొలొంబోలో వున్న విశాఖనార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దాదాపు16 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారని, వీరందరూ ఒకేసారి గ్రూపుగా ఫిరాయింపుల చట్టానికి చిక్కకుండా బీజేపీలో విలీనం కావాలనే ప్రయత్నాలు ప్రారంభించినట్లు విస్తృత ప్రచారం సాగుతున్నది. వాస్తవానికి టీడీపీ తరపున గెలుపొందిన 23 మందిలో ఒక్క ఐదుగురు ఫిరాయిస్తేనే ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోతుంది. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ స్వయంగా సభలోనే చెప్పారు. అయితే తమ పార్టీలోకి వలస వచ్చే వారు ముందుగా తమ సభ్యత్వాలకు రాజీనామా చేయాలనే షరతు విధించడంతో... ఇక బీజేపీ వైపు దృష్టిసారించినట్లు కన్పిస్తున్నది. అసలు జగన్‌కు చిక్కులు ఎదురుకాకుండా టీడీపీ ఎమ్మెల్యేలను గంపగుత్తగా తమవైపు లాక్కొనేందుకు అవసరమైన కార్యాచరణను బీజేపీ నేతలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే అసలు చంద్రబాబు టీడీపీలోకి ప్రవేశించక ముందే... అదే ఆ పార్టీ ఆవిర్బావానికి సరిగా ఏడాది కాలంలోనే పెద్ద ముప్పువాటిల్లింది. నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు రాజకీయంతో ఎన్టీఆర్ పదవీచ్యుతుడు కావాల్సి వచ్చింది. నెల రోజుల పాటు నాదెండ్ల సీఎంగా వ్యవహరించినా ప్రజా మద్దతుతో ఎన్టీఆర్ తిరిగి సీఎం అయ్యారు. దాదాపు 25 మంది టీడీపీ నుండి వీడి ప్రజాస్వామ్య తెలుగుదేశంను ఏర్పాటు చేసుకున్నారు. 1991లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పీవీ నరసిం

తెలంగాణ హైకోర్టు సీజేగా చౌహన్ ప్రమాణ స్వీకారం

$
0
0

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ శనివారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహాన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌ను సీజేగా నియమిస్తూ రాష్టప్రతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.

పోలవరంపై సీఎం జగన్ వ్యాఖ్యలు అర్థరహితం:ఉమ

$
0
0

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ కాపర్ డ్యామ్‌ను ఇంజినీరింగ్ నిపుణుల సూచనల మేరకే నిర్మించామని వెల్లడించారు. అరవై శాతం అప్పర్ డ్యాం పూర్తయిందని అన్నారు. నిబంధనల మేరకే ప్రాజెక్టు పనులు చేపట్టామని, ఎలాంటి అవినీతి జరుగలేదని అన్నారు.

బారాముల్లా జిల్లాలో ఎదురుకాల్పులు

$
0
0

జమ్మూకాశ్మీర్: బారాముల్లా జిల్లాలో శనివారంనాడు ఎదురుకాల్పులు జరిగాయి. బోనియర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందటంతో ఆర్మీ జవాన్లు సీఆర్పీఎఫ్, రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ గార్డులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు సందర్భంగా ఆర్మీ జవాన్లుపై ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎంతమంది మృతిచెందారో వివరాలు తెలియరాలేదు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

$
0
0

హైదరాబాద్: భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లె వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఆగివున్న డీసీఎం వ్యాన్‌ను బైక్ ఢీకొనటంతో వలిగొండకు చెందిన వినయ్, క్రాంతి అనే యువకులు చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వేడినీళ్లు పడి నలుగురు విద్యార్థులకు గాయాలు

$
0
0

హైదరాబాద్: పటాన్‌చెరువులోని నారాయణ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు వేడినీళ్లు పడి గాయపడ్డారు. స్నానాల గదుల్లో ట్యాపులు విరిగిపోవటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా వేడినీళ్లు పడటంతో వారికి గాయాలు అయ్యాయి.

ఇంజినీరింగ్ నిపుణుల కమిటీతో సీఎం జగన్ భేటీ

$
0
0

తాడేపల్లి: ఏపీ సీఎం జగన్ ఇంజినీరింగ్ నిపుణుల కమిటీతో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ ప్రాజెక్టులను అంచనాలను పెంచి నిర్మించినట్లు భావించిన ప్రస్తుత ప్రభుత్వం వివిధ శాఖల్లో చేపట్టిన పనులపై మళ్లీ సమీక్ష నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ ఏర్పాటుచేయటం జరిగింది.


టీటీడీ చైర్మన్‌గా సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం

$
0
0

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈఓ అశోక్ సింఘాల్ వైవీ సుబ్బారెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, శాసనమండలి చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నవరత్నాల వైస్ ఛైర్మన్‌గా శామ్యూల్

$
0
0

విజయవాడ: వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాల పథకం అమలు కోసం ప్రత్యేక అధికారిని నియమించారు. వైఎస్ జగన్నోహన్ రెడ్డి సలహదారుడిగా నియమితులైన విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్‌ను వైస్ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు రూ. 2.50 లక్షల గౌరవ వేతనం, ప్రత్యేక వాహనం, సిబ్బందిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

పోలవరం పనుల అక్రమాలపై నిగ్గు తేల్చండి:జగన్

$
0
0

విజయవాడ: పోలవరం పనుల్లో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చాలని ఇంజినీరింగ్ నిపుణుల కమిటీ సమావేశంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు విషయంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయని అన్నారు. ప్రాజెక్టుల విషయంలోనే కాకుండా మున్సిపల్, రహదారులు భవనాల శాఖ, సీఆర్డీఏ కాంట్రాక్టలపైన కూడా అధ్యయనం చేయాలని అన్నారు. ప్రాజెక్టుల్లో ఎటువంటి అవినీతి జరగటానికి వీల్లేదని, అవసరమైతే పారదర్శకమైన టెండర్ల విధానాన్ని అమలుచేయాలని ఆదేశించారు. ముంపునకు గురయ్యే ప్రాజెక్టులపై తొలుత దృష్టిసారించాలని అన్నారు. వ్వవస్థను బాగుచేసుకుందామని, అవినీతిపై పోరాటానికి సిద్ధమయ్యానని అన్నారు.

ప్రజావేదిక చంద్రబాబు సొంత భవనం కాదు:బోత్స

$
0
0

విజయవాడ:ప్రజావేదిక చంద్రబాబు సొంత భవనం కాదని, ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన ప్రజావేదికలో నిర్వహించేబోయే కలెక్టర్ల సదస్సు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు పదవి నుంచి దిగిపోయాక గౌరవంగా వెళ్లిపోవాలని అన్నారు. ఆయన ఉంటున్న నివాసమే అక్రమ కట్టడమని అన్నారు. గతంలోనూ ఈ ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సులు జరిగాయని, అందువల్లే ఇక్కడ నిర్వహిస్తున్నామని అన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నపుడు ఆయనకు ఎలాంటి అధికారిక నివాసం, గౌరవం కల్పించారో ఇపుడు కూడా అలాంటిదే చంద్రబాబుకు కల్పిస్తామని అన్నారు.

ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూస్తాం:కమిషనర్

$
0
0

హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూస్తామని, అవసరమైతే ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్ తెలిపారు. ఆయన ఈరోజు గౌచ్చిబౌలీలో పర్యటించారు. నాలాలపై ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు. నగరంలోని అన్ని ఆక్రమణలను తొలగిస్తామని స్పష్టంచేశారు.

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>