Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

అర్థాలే వేరులే..

$
0
0

‘సీత’ చిత్ర దర్శకుడు ఒక మేవరిక్ అని ఒక పత్రిక అభివర్ణించింది. మేవరిక్ అంటే స్థిర అభిప్రాయాలు లేని చంచల చిత్తుడు లేదా పిచ్చోడు అని అర్థం. కాజల్ చక్కగా నటించినా సీత పాత్రను దర్శకుడు సరిగా మలచలేక పరాజయం మూటకట్టుకున్నాడని మరో పత్రిక కథనం. మన వెనె్నల సీతకు సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఇన్ని వాతలుపడినా కాజల్ ఏమంటున్నదో చూడండి! ‘సీత’తో పిహెచ్‌డీ చేసే అవకాశం వచ్చింది. తేజా స్కూలులో చాలా నేర్చుకున్నా. ఆయన ప్రతి పాత్రనూ చక్కగా తీర్చిదిద్దారు. ఇలాంటి పాత్ర లభించటం నా అదృష్టం’ అంటూ తేజాని ఆకాశానికి ఎత్తేసింది కాజల్. అందుకే తారల మాటలకు అర్థాలే వేరులే అంటారు!
-లంబకర్ణ, రాజేంద్రప్రసాద్
చిత్రసీమ విషాదం
ఈ ఏడాది ఒక్క మే నెలలోనే చిత్రసీమ చాలామంది ప్రముఖులను కోల్పోయింది. నటి సురేఖావాణి భర్త, చందమామ విజయా కంబైన్స్ అధినేత బి వెంకట్రామరెడ్డి, రాళ్లపల్లి, స్పెషల్ ఎఫెక్ట్స్ ఏకె నాథ్, స్టంట్ మాన్ వీరూ దేవ్‌గన్ లాంటి ప్రముఖులు కనుమరుగయ్యారు. వీరిలోటు తీరనిదైనా వారి ఆత్మలు శాంతించాలని కోరుకొంటూ ప్రగాఢ సానుభూతి తెలుపుదాం.
-టి.సదా, తిరుపతి
శృతిమించి..
ఆనాటి ఈనాటి సినిమాల్లో శృంగార రసం పాటల్లో తొణికిసలాడుతుంది. ఆనాటి శృంగారం అర్ధవంతంగా ఉండేది. ముఖ్యంగా అంతస్తులు సినిమాలో -దాచుకున్న మమతలన్ని ఎవరికోసమో/ దాగిన యవ్వనం ఎవరికోసమో; దాడుగుమూతలు చిత్రంలో ‘చెక చెక లాడే పిరుదును దాటే జడను చూస్తే చలాకి ముద్దు’; మురళీకృష్ణ చిత్రంలో ‘నడచినంత పిడికెడంత నడుము వణికిపోవును’, అలాగే.. కురిసింది వానా, చిటపట చినుకులు పడుతూ ఉంటే, కలిసే కళ్లలోనే కురిసే పూలవాన అంటూ పాటల్లో సుతిమెత్తని, పరిధిదాటని శృంగార రసం కనిపించేది. తరువాత మేజర్ చంద్రకాంత్‌లో ‘నీక్కావలసింది నా దగ్గర ఉంది’ అంటూ ఊరింపులూ కొంతకాలం సాగాయి. ఇప్పటి సినిమాల్లో శృంగారాన్ని పూర్తిగా ఓపెన్ చేసి మరీ పాటలు రాసేస్తుంటే -సిగ్గుపడాలో, బాధపడాలో అర్థంకాని పరిస్థితి ఉంటోంది. పాటల్లోనే అంటే -ఇక సన్నివేశాల్లోనూ డైరెక్ట్‌గా సెక్స్‌ను చూపించేసేంతగా స్క్రీన్‌కు ఎక్కిస్తుంటే తెలుగు సినిమా ఎటుపోతోందో అనిపిస్తోంది.
-ఎఆర్‌ఆర్‌ఆర్, ఖమ్మం
అభినందనలు
ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం అందిస్తోన్న ‘వెనె్నల’ ముస్తాబు బావుంటోంది. కొత్త సినిమా సంగతులే కాకుండా, చరిత్రలో రహస్యంగా ఉండిపోయిన అంశాలు, ముచ్చట్లను రచయితలు అందిస్తోన్న విధానం బావుంటుంది. ‘ఆనాటి హృదయాలు’ శీర్షికన భరణి గురించి తెలుసుకుని ఆనందించాం. అలాగే ఎస్‌కె మిశ్రో ముచ్చట్లను రచయిత సరయు శేఖర్ అందించిన విధానం బావుంది. ఆయన నాటకాల అనుభవం, ఆ అనుభవంతో పరిశ్రమకు వచ్చిన విధానం ఆసక్తికరంగా అందించారు. సినిమా క్విజ్ బావుంటుంది. చాలాకలంగా రచయిత్రి మాణిక్యేశ్వరి అందిస్తోన్న ఫ్లాష్‌బ్యాక్ పత్రికకే హైలెట్ అన్నట్టు ఉంటుంది. పాత చిత్రాలను పునఃస్సమీక్షగా అందిస్తూనే, ఆనాటి సంగతులు ఇప్పుడు కొత్తగా చెప్పే విధానం బావుంటుంది. మంచి కథనాలు అందిస్తున్న ఆంధ్రభూమికి ధన్యవాదాలు, అభినందనలు.
-వై ఈశ్వరరావు, విశాఖపట్నం
ప్రసన్నరాణి ప్రతిభ
తన అభిప్రాయాలను సూటిగా చెప్పడంలో దిట్ట అనేలా ‘బతుకునిత్య నృత్యం’ సరయు శేఖర్ వ్యాసం -సుడిగుండాలు ఫేమ్ ప్రసన్నరాణి గురించి తెలియజేసింది. ఆమె వ్యక్తిత్వం అపూర్వం. చాలామంది కళాకారుల్లో కనపడని నిక్కచ్చితత్వం ఆమెది అనిపించేలా ఉంది. సరిపడనిచోట ఇమడలేని ఆమె స్వభావం తనకు వచ్చిన, నచ్చిన కళనే ఆరాధించి, ఆమె తృప్తికి అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకున్న అపూర్వ కళాకారిణి ప్రసన్నరాణి అభిప్రాయాలు చాలా విలువైనవి. అరుదైన నాట్యమయూరి వ్యాసం నాకెంతో ఆనందం కలిగించింది. సాధారణంగా కళాకారుల్లో చాలామందికి చెప్పేది ఒకటి చేసేది మరొకటి లాంటి ప్రవర్తనలే ఉంటాయి. అందుకు భిన్నం ఆమె నడవడి.
-యంవి రమణకుమారి,
హైదరాబాద్
నిర్లక్ష్యమే..
స్మిత జీవితం కనువిప్పు అనటం బాగుంది. అయితే చిత్రరంగంలో ఎందరో నిర్లక్ష్యభావనకు బలైన సందర్భాలు చూసి కూడా స్మితకు కనువిప్పు కలగలేదు. ఎవరినీ లెక్కచేయని ఆమె నిర్లక్ష్యమే ఆమెకు శత్రువైంది. శివాజీ గణేశన్‌లాంటి ప్రఖ్యాతుడు వచ్చినప్పుడు కాలుమీద కాలువేసుకొని కూచోవటం ఆమెకు మ్యానర్స్ తెలీదనిపించింది -అలనాటి హృదయాల్లో చదువుతుంటే. ఎన్టీఆర్ సెట్‌లోకి వచ్చి సిద్ధంగా వేచివున్నా జమున అరగంట లేటుగా వచ్చి సారీ చెప్పకపోవటంతో అగ్రనటులిద్దరూ ఆమెను బ్యాన్ చేశారు. నిర్మాతలు పూనుకొని సర్దుబాటు చేశారు. లేకుంటే జమున కేరీర్ అక్కడితోనే సమాప్తమయ్యేది. కనీస మర్యాదలు పాటించకపోతే అవే పెద్ద సమస్యలవుతాయి మరి!
-పైడి పంతులు, శ్రీనగర్
డబ్బు డిమాండ్ చేస్తే..
కథ డిమాండ్ చేస్తేనే గ్లామరస్‌గా నటిస్తామని అందాల తారలు చిలుకపలుకులు పలుకుతారు. అసలు విషయమేమంటే, కుర్రకారుని కిర్రెక్కించి డబ్బులు చేసుకోవాలన్న స్వార్థంతోనే నిర్మాతలు సిగ్గూ ఎగ్గూ లేని సీన్లు కథలో చొప్పించమని రచయితల్ని శాసిస్తారు. ఆ విషయం తారలకూ తెలుసు. కథ డిమాండ్ చేసిందంటూ మొదట స్ర్తిల నాభి చూపించే వారు. తర్వాత నగ్న వీపు. ఆపై హగ్గులు.. ఇప్పుడు డైరెక్ట్‌గా ముద్దులు. ఇదంతా కథ ‘డిమాండ్’ మేరకే. డబ్బుకోసం ఇవన్నీ చేస్తూ కిర్రెక్కిన ఎవరో కాస్త ముందడుగు వేస్తే ‘మీటూ’ అంటూ గగ్గోలు! అదీ కొంతమంది మాత్రమే. ఆహా చిత్రసీమ!
-పూర్ణారావు, కాకినాడ


టక్కరి దొంగ- చక్కని చుక్క

$
0
0

రాజమండ్రికి చెందిన వైవి రావు (‘సువర్ణమాల’ చిత్ర నిర్మాణ బాధ్యతలకై 1948లో మద్రాస్ వచ్చారు) జర్నలిజంపై ఆసక్తితో టెంపోరావ్‌తో కలిసి ‘్ఫల్’, ‘టెంపో’ మొదలైన డిటెక్టివ్ సంపాదకవర్గంలో 1954 నుంచి పని చేశారు. వీరి బావ నిర్మాత భావన్నారాయణ స్థాపించిన గౌరీ ప్రొడక్షన్స్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. 1968లో పూర్ణాకామరాజు సహకారంతో ‘రవి చిత్ర ఫిలిమ్స్’ నెలకొల్పి తొలి ప్రయత్నంగా కృష్ణ, విజయనిర్మల కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం ‘టక్కరి దొంగ- చక్కని చుక్క’.
నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన కె సుబ్బరామదాసు (కెయస్‌ఆర్ దాస్) నిర్మాత భావన్నారాయణ ప్రోత్సాహంతో మద్రాస్ చేరి, వారి చిత్రాలకు ఎడిటింగ్ విభాగంలో పనిచేశారు. భావన్నారాయణ 1966లో నిర్మించిన ‘లోగుట్టు పెరుమాళ్లుకెరుక’ చిత్రం ద్వారా దర్శకునిగా ప్రస్థానం మొదలెట్టారు. 2012లో అమరులయ్యారు. అంతవరకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువభాగం హీరో కృష్ణ నటించిన చిత్రాలకు దర్శకత్వం వహించటం విశేషం. 1969లో ‘టక్కరిదొంగ- చక్కని చుక్క’ చిత్రానికి దర్శకులుగా కెయస్‌ఆర్ దాస్‌ను ఎన్నుకున్నారు నిర్మాత వైవి రావు. ఈ సినిమా 1969 మే 16న విడుదలైంది. మ్యూజియంలో దొంగతనం... తరువాత టైటిల్స్, డిజైన్స్ ప్రారంభమవుతాయి.

సంగీతం: సత్యం
నృత్యం: కెఎస్ రెడ్డి
స్టంట్స్: మాధవన్
కళ: చలం
ఫొటోగ్రఫీ: ఎస్‌ఎస్ లాల్
మాటలు: టిపి మహరథి
కూర్పు, దర్శకత్వం: కెఎస్‌ఆర్ దాస్
నిర్మాత: వైవి రావు

ఆ ఊరిలో దాదా (రాజనాల), భయంకర్ (సత్యనారాయణ) ఇద్దరూ గ్యాంగ్ లీడర్లు. దోపిడీలు దొంగతనాలు చేస్తూ రౌడీలను పెంచి పోషిస్తూ దందాలు చేస్తుంటారు. భయంకర్ సూచనతో ముఠాకు చెందిన శ్యామ్ (కృష్ణ) మ్యూజియంలోంచి అతి విలువైన పరిటాల వజ్రాలు దొంగిలించి తన హోటల్ రూములో సీలింగ్ ఫ్యాన్‌లో దాస్తాడు. బిఏ చదివి, ఏ ఉద్యోగం దొరక్క రిక్షా నడుపుతూ జీవించే వ్యక్తి గోపి (మరో కృష్ణ). ఒకరోజు శ్యామ్ గోపీ రిక్షాను కారుతో ఢీకొట్టడం, అతన్ని తన రూమ్‌కు తీసుకొచ్చి తనకు బదులుగా రూమ్‌లో నెల రోజులు ఉండమని 50వేల రూపాయలు ఇస్తాడు. గోపి అందుకు అంగీకరించటంతో, శ్యామ్ దూరంగా వెళ్లిపోవటం జరుగుతుంది. వజ్రాలు తెచ్చివ్వలేదని భయంకర్, శ్యామ్ కోసం వెతుకుతుంటాడు. అలాగే ఆ వజ్రాల కోసం దాదా గోపీని బంధిస్తాడు. గోపి తనకేమీ తెలియదని చెబుతాడు. తరువాత రూమ్‌కి వచ్చి, అక్కడ శ్యామ్ మరణించి ఉండటాన్ని గమనించి, ఇక భయంకర్‌ను, దాదాను తానే ఒంటరిగా ఎదుర్కొంటుంటాడు. ప్రభుత్వ సైనికుల శక్తి సామర్థ్యాల కోసం తలపెట్టిన ప్రయోగాన్ని సైంటిస్ట్ (పిజె శర్మ), అతని అసిస్టెంటు గీత (విజయనిర్మల) సక్సెస్ చేస్తారు. గీతను ఇష్టపడి ప్రేమించిన గోపి, ఆ ఫార్ములా కాగితాల కోసం సైంటిస్ట్‌ను హత్యచేసి తీసుకోవాలనుకున్న దుండగుల బారినుంచి గీతను, ఫార్ములాను కాపాడతాడు. పత్రాలను ప్రభుత్వానికి అప్పగించటంతో గోపిని ప్రభుత్వం ధనంతో సత్కరిస్తుంది. గీతతో కలిసి తల్లివద్దకెళ్లి వారి ప్రేమ పెళ్ళికి అంగీకారం పొంది, ఇరువురూ ఒకటవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో గోపి స్నేహితుడు, మాలిష్‌వాలా చిన్నయగా రాజ్‌బాబు, అతని జంటగా మీనాకుమారి, పోలీస్ సూపర్నెంట్‌గా ధూళిపాళ, ఇన్స్‌పెక్టర్ కామేశంగా త్యాగరాజు, గోపి తల్లిగా మాలతి, శ్యామ్ ప్రియురాలు లైలాగా విజయలలిత నటించారు.
యాక్షన్, క్రైమ్ సెంటిమెంటుతో కూడిన చిత్రాన్ని దానికి తగ్గట్టు సన్నివేశాలను వైవిధ్యంగా రూపొందించారు దర్శకులు కెఎస్‌ఆర్ దాస్. వజ్రాలు దొంగిలించిన శ్యామ్ వాటిని పదిలంగా దాచటం, అసలు మ్యూజియమ్‌నుంచి వజ్రాల దొంగతనాన్ని ఎంతో విపులంగా చూపించారు. తన స్థానంలో గోపిని ఉంచటం, చిత్రం చివరలో గోపి, శ్యామ్‌లను చూసిన దొంగలు పొరపడి శ్యామ్‌ను గోపి అనిభావించి అంతం చేయటం, ఆ శవాన్ని హోటల్ రూమ్‌లో ఉంచటం, ఇక చిత్రంలో శ్యామ్ బదులు గోపీ సాహసంతో పలుమార్లు దుండగులను ఎదిరించటం, దాదా, భయంకర్‌ల డెన్‌లో ప్రవేశించినా తప్పించుకోవటం, పులిబోనులో అంతకుముందు ఓ వ్యక్తి ఆహారం కావటం, కృష్ణ దానితో పోరాడి తెలివిగా జేబులో చిన్న కత్తితో సంహరించటం లాంటి సన్నివేశాలను ఉత్కంఠ రేకెత్తించేలా దర్శకులు చిత్రీకరించారు. విజయనిర్మలతో కత్తులబోనులో బంధించబడి చిన్నయ్య సాయంతో (తమాషాగా చిత్రీకరించిన పాట -నేనే మాలిష్ వాలా/ నా పేరే చిన్నయ్యలాలా- ఈ చిత్రంలోని హిట్ సాంగ్స్‌లో ఇదొకటి) తప్పించుకోవడం లాంటి సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. మార్వాడి వద్ద నగలు కొట్టేసిన సన్నివేశం.. గీత, గోపిలు పోలీస్‌ల నుంచి తప్పించుకునే క్రమంలో పలు ఛేజింగ్‌లు.. సైంటిస్ట్ హత్య తరువాత గీత దుండగులకు చిక్కడంతో, ప్లాన్ కోసం భయంకర్, దాదాలు గోపీని ఉపయోగించుకోవాలని అనుకున్న క్రమంలో వైవిధ్యభరితమైన ఫైటింగ్‌లు, క్లైమాక్స్‌లో దాదాను తేలిగ్గా అంతం చేయటం.. భయంకర్, గోపిల మధ్య ఎంతో థ్రిల్లింగ్‌గా రైలుపెట్టెలు, క్రేన్‌లు, వంతెనలమీద శ్రమతో రూపొందించిన షాట్స్ ఆసక్తిని రేకెత్తిస్తాయి. మధ్యలో తల్లి మాలతితో గోపి, కామేశం (ఇన్‌స్పెక్టర్)తో సెంటిమెంటు సన్నివేశాలు, చిత్రం చివరలో గోపి మంచివాడని చెప్పించటంతో తల్లి గీత, గోపిల పెళ్లికి అంగీకరించటం.. ఇలా యాక్షన్, సెంటిమెంటుల కలబోతగా చిత్రీకరణ సాగింది.
చిత్రంలో శ్యామ్‌గా, గోపిగా కృష్ణ సన్నివేశానికి తగ్గట్టు ప్రశంసనీయమైన చురుకుదనం చూపించారు. గీతతో ప్రేమ, ప్రణయం సన్నివేశాల్లో లవర్ బోయ్‌గా ఒదిగిపోయారు. తొలుత గీతను వెంబడిస్తూ పాడే గీతం -ఓ చక్కని చుక్క/ నీ నడకలు చూస్తే మనసౌతుంది (రచన: సినారె, గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం). మరో సినారె గీతం -నువ్వు నేను ఇంకెవ్వరూ లేరు (గానం: పి సుశీల). అద్దాల మధ్య రివాల్వింగ్ బెడ్‌పైన పలు నృత్య భంగిమలతో నర్తిస్తూ, కృష్ణను కవ్వించే విజయలలితపై ఈ పాటను చిత్రీకరించారు. సుశీల వైవిధ్యమైన గానంతో మరింత కైపు కలిగించే గీతంగా ఇది సినిమాకు ప్లస్ అయ్యింది. ప్రారంభంలో డెన్‌లో విజయలలితపై చిత్రీకరించిన మరో గీతం -వయసు కుర్రది వంపులున్నది (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి, రచన: ఆరుద్ర). సత్యనారాయణ వద్ద జ్యోతిలక్ష్మిపై చిత్రీకరించిన సినారె గీతం -కిల్లాడి మామయ్యా/ నావల్లకాదయ్యా (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి). ఈ చిత్రంలోని చక్కని యుగళగీతం కృష్ణ, విజయనిర్మలపై చిత్రీకరణ -కలలుకనే కమ్మని చిన్నారి/ నీ సొగసులన్నీ నావే (గానం: ఎస్పీ బాలు, పి సుశీల, రచన: దాశరధి). సత్యం సంగీతంతో అలరించేలా ఆకట్టుకునేలా గీతాలు సాగాయి.
మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రం, తప్పక చూడండంటూ పబ్లిసిటీ ఇచ్చి, చూసినవారికి ఓ వెరైటీ అనుభూతిని అందించి, మాస్ ప్రేక్షకులను, పిల్లల్ని థ్రిల్స్‌తో అలరించిన చిత్రంగా ‘టక్కరి దొంగ- చక్కని చుక్క’ గుర్తింపు పొందటమే కాదు, మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తరువాత కెఎస్‌ఆర్ దాస్ -కృష్ణ కాంబినేషన్‌లో పలు యాక్షన్ చిత్రాలు, దొంగలకు దొంగ, దొంగలకు సవాల్ వంటి కౌబాయ్ చిత్రాలు రూపొందాయి. ఆ తరువాత కెఎస్‌ఆర్ దాస్ దర్శకత్వంలో పద్మాలయా పతాకంపై కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ‘మెక్‌నాస్ గోల్డ్’ చిత్రం ఆధారంగా రూపొందించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. దర్శకునిగా దాస్‌కి, హీరోగా కృష్ణకు ఎనలేని కీర్తిని అందించటం.. వీరి కాంబినేషన్ ఓ స్పెషాలిటీగా పేరుపొందటం విశేషం.

దారితప్పిన కథనం

$
0
0

స్టువర్టుపురం * బాగోలేదు

తారాగణం: ప్రీతీసింగ్, రవిరాజ్, మల్లికా, భానుప్రసాద్, హర్ష నల్లబెల్లి, శివప్రసాద్, సాయిరామ్ దాసరి తదితరులు
ఎడిటింగ్: లక్కీ ఏకారి
బ్యానర్: ఆర్కాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: నవనీ చారి
సమర్పణ: రంజిత్ కోడిప్యాక
నిర్మాత, దర్శకత్వం: సత్యనారాయణ ఏకారి
కథ, స్క్రీన్‌ప్లే,: సత్యనారాయణ ఏకారి
================================================================
తెలుగులో హారర్, థ్రిల్లర్ సినిమాలకు మంచి క్రేజ్ వుంది. ఈ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఈమధ్య అటు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతుండటంతో, ఈ తరహా సినిమాలపై దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. సరైన కథ, కథనంతోపాటు ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలుంటే చాలు ప్రేక్షకులు హిట్టు మార్కులేస్తున్నారు. తాజాగా ఆ తరహాలో తెరకెక్కిన మరో చిత్రం స్టూవర్టుపురం. నందికొండ వాగుల్లో, మోని చిత్రాలతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న సత్యనారాయణ ఏకారి తెరకెక్కించిన మూడో చిత్రమిది. ప్రీతిసింగ్ మెయిన్ లీడ్‌లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ గురించి తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ
చెడ్డీగ్యాంగ్. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఇళ్లను దోచుకునే కరడుగట్టిన దొంగల ముఠా. ఒంటరిగా వున్నవాళ్ళను టార్గెట్ చేసుకుని ఇళ్ళల్లోకి చొరబడుతూ ఈజీగా దోపిడీలు చేసే గ్యాంగ్, తమకు అడ్డొచ్చిన ఎవరినైనా దారుణంగా చంపేస్తారు. జంట నగరాల్లో సంచలనం రేపిన ఈ గ్యాంగ్ హైదరాబాద్ సిటీ అవుస్కట్స్‌లో వున్న ఓ ఫామ్‌హౌస్‌లోకి జొరబడతారు. ఆ ఇంట్లో ఒంటరిగా అమ్మాయి వుందని తెలుసుకుంటారు. ఆ అమ్మాయిని చంపి దోచుకోవాలని అనుకుంటారు. కానీ ఆమె అంధురాలని తెలుసుకుని, తమ పని ఇంకా ఈజీ అవుతుందని దొంగలు దోచుకునే ప్రయత్నాల్లో వుండగా.. తన ఇంట్లో ఎవరో దొంగలు చొరబడ్డారని తెలుసుకున్న ఆ అమ్మాయి వాళ్లను ఎదుర్కోవడమే మిగతా కథ.
థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఆద్యంతం ఆసక్తి కలిగించేలా.. ముఖ్యంగా హారర్ సినిమాగా భయపెట్టే ప్లాన్ చేశాడు దర్శకుడు. ప్రతి విషయంలో కరడుగట్టిన నేరస్థులను సైతం భయపెట్టే అంశాన్ని ప్రధానంగా తీసుకుని కథను నడిపించాడు. ఇక ఈ సినిమాలో నటీనటుల గురించి చెప్పాలంటే ముందుగా హీరోయిన్ ప్రీతిసింగ్ గురించి చెప్పుకోవాలి. కథను మొత్తం తానే భుజాలపై వేసుకుని నడిపించింది. ముఖ్యంగా ఆమె గుడ్డి అమ్మాయిగా కనిపించే విషయంలో చక్కగా రాణించింది. అటు గ్లామర్ ఇటు నటన విషయంలో శభాష్ అనిపించుకుంది. కథ మొత్తం ఆమెచుట్టూ తిరుగుతుంది కాబట్టి.. కథకు సంపూర్ణ న్యాయం చేసింది ప్రీతి. ఇక చెడ్డిగ్యాంగ్‌లో వున్న సాయిరామ్ దాసరి కాస్త కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ గ్యాంగ్‌లో లేడీ లీడర్‌గా మల్లిక తన పాత్రకు న్యాయం చేసింది. ఇక మిగతా పాత్రల్లో ఎవరికివారు వారి వారి స్థాయిల్లో మెప్పించే ప్రయత్నం చేశారు. కథతోనే కామెడీ సాగడం.. పైగా కథ మొత్తం ఒకే బిల్డింగ్‌లో నడిచినా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు.
థ్రిల్లర్ కథ కాబట్టి.. ఈ సినిమాకు ఆర్‌ఆర్ ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా రీరికార్డింగ్ ప్రధాన హైలెట్‌గా నిలిచింది. నవనీత్‌చారి అందించిన మ్యూజిక్ బాగుంది. అయితే ఆర్‌ఆర్ సినిమా నేపథ్యాన్ని కాస్త డామినేట్ చేసింది. కథ, కథనం మొత్తంగా హారర్ తరహాలో ఉంటుందేమోనన్న తరహాలో బిల్డిప్ ఇవ్వడంతో కథలోని ఇంటెన్సీటి తగ్గింది. కరుడుగట్టిన నేరస్థులు అయిన చెడ్డిగ్యాంగ్ మనుషులను కమెడియన్స్‌గా చూపించడంతో కథపై ఆసక్తి తగ్గించేలా ఉంది. ఇక ఎడిటింగ్ ఫర్వాలేదు. కెమెరావర్క్ బాగుంది. సినిమా మొత్తాన్ని నైట్ మూడ్‌లో చూపించే విషయంలో కెమెరామెన్ మంచి ప్రతిభ చూపించాడు. దర్శకుడు సత్యనారాయణ చేసిన ఈ ప్రయత్నం కొత్తగా ఉంది. కానీ కథ, కథనం విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. ఓ అంధురాలైన అమ్మాయి.. దొంగలను ఎలా ఎదుర్కొన్నది అన్న ఆసక్తికర పాయింట్‌ను దర్శకుడు తీసుకున్నప్పటికీ దాన్ని ఇంట్రెస్ట్‌గా చూపించే విషయంలో తడబడ్డాడు. కథను హారర్ సినిమాలా మార్చే ప్రయత్నం చేశాడు.
చివరగా.. స్టూవర్టుపురం టైటిల్‌తో తెరకెక్కిన సినిమా కథ.. కథనాల విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. ఓ అంధురాలైన అమ్మాయి.. తన ఇంట్లో చొరబడిన దొంగలను ఎలా అడ్డుకుంది అన్న పాయింట్‌ను అంతే ఆసక్తికలిగేలా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సినిమాకు హీరోయిన్ ప్రీతిసింగ్ ఒక్కరే దిక్కైనట్టు అనిపించింది. మిగతా నటీనటులు ఫర్వాలేదనిపించారు. కథను చెప్పే విషయంలో దర్శకుడు మంచి లైన్ రాసుకున్నా, దాన్ని తెరకెక్కించే విషయంలో సరైన నిర్ణయాన్ని చూపకలేకపోవడమే వైఫల్యానికి కారణమైంది.

కేసులు ఇవ్వొచ్చు

$
0
0

ఏజెంట్ సాయ శ్రీనివాస్ ఆత్రేయ ** ఫర్వాలేదు

తారాగణం: నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ, సుహాస్, సందీప్‌రాజ్ తదితరులు
మ్యూజిక్: మార్క్ కె రాబిన్
సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి
ఎడిటింగ్: అమిత్ తిరుపతి
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: స్వరూప్ ఆర్‌ఎస్‌జె

===================================================
సీక్రెంట్ ఏజెంట్, డిటెక్టివ్ తరహా సినిమాలకు -టాలీవుడ్‌లో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. క్రమంగా ఆ తరహా చిత్రాలకు ఆదరణ తగ్గడంతో -జోనర్ కనుమరుగైంది. ఎప్పుడో ముఫ్పై ఏళ్లక్రితం వచ్చిన చిరంజీవి ‘చంటబ్బాయి’ తరువాత -అలా డిటెక్టివ్ జోనర్‌తో ఎంటర్‌టైన్ చేయగలిగే సినిమానే రాలేదు. తరువాత లాయర్ వేషంలో డిటెక్టివ్ మాదిరి వ్యవహరించిన రాజేంద్రప్రసాద్ ‘చెట్టుకింద ప్లీడర్’నూ ఈ కోణాన్ని ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. అలాంటి కనుమరుగైన జోనర్‌ను మళ్లీ ఒకసారి గుర్తు చేస్తూ వచ్చిన చిత్రమే -ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ‘మళ్లీ రావా’ చిత్రం తరువాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన చిత్రమిది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మహేష్ ‘1’ నేనొక్కడినే సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్‌తో మెప్పించిన నవీన్ పోలిశెట్టి ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇక -క్రైమ్ అనేది శాఖోపశాఖలుగా విస్తరిస్తోన్న ఆధునిక కాలంలో, ఒక తరహా క్రైమ్‌ను కొత్తకోణంలో కథ చేసుకున్నాడు కొత్త దర్శకుడు స్వరూప్. అది ఏ తరహా క్రైమ్? ఆడియన్స్‌లో ఎలాంటి ఆసక్తిని కలిగించిందన్నదే అసలు సినిమా.
సినిమాకు ప్రమోషన్స్ జరుగుతున్న టైంలో నవీన్ పోలిశెట్టి ఒక రిక్వెస్ట్ చేశాడు. -‘నచ్చితే సినిమా ఎంజాయ్ చేయండి. కథలోని ట్విస్ట్‌ల్ని మాత్రం నలుగురితో డిస్కస్ చేయొద్దు’ అని. సో, కథని క్లుప్తంగానే చెప్పుకుందాం.
**
శీను అలియాస్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ (నవీన్ పోలిశెట్టి) ఓ ఎఫ్‌బిఐ ఏజెంట్. యుఎస్‌లోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ అంత బిల్డప్‌తో నెల్లూరు కూరగాయల మార్కెట్‌కు దగ్గర్లో ఓ డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతుంటాడు. ఇక్కక ఎఫ్‌బిఐ అంటే -్ఫతిమా బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్. హీరో ఫస్ట్ లవర్ పేరు ఫాతిమా. అయితే, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు -ఏఫ్‌బిఐ ఏజెంట్‌కి ఉబుసుపోని కేసులే తగులుతుంటాయి. అనూహ్యంగా ఓ సంచలన కేసు తగులుతుంది. కొన్ని హత్యలతో ముడిపడిన ఈ కేసులో తీగలాగితే డొంకే కదులుతుంది. ఈలోగా అనుకోని మలుపుల నడుమ ఆత్రేయ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఇలాంటి క్రైసిస్‌లోనే డిటెక్టివ్‌ల ఆలోచనలు షార్ప్‌గా ఉంటాయన్నట్టు -ప్రీ ప్లాన్ట్ వ్యవహారమేదో జరుగుతుందన్న అనుమానం కలుగుతుంది ఆత్రేయకు. కావాలనే తనను ఇరికించారన్న విషయం అర్థమవుతుంది. అతనిపై పడిన మర్డర్ కేసును ఎలా ఛేదించాడు. తనను ట్రాప్‌లోకి లాగిన ఆగంతకుల్ని ఎలా కనిపెట్టాడు? అసలు మర్డర్ల మిస్టరీ ఏంటి? శవాల నుంచి సేకరించే అవయవాలు -సంఘ విద్రోహ చర్యలకు ఎలా ఉపయోగిస్తున్నారు? ఇలాంటివన్నీ కథలో భాగంగా కనిపిస్తాయి.
కామెడీ ప్రధానంగా సాగే ‘చంటబ్బాయి’ తరహాలోనే సినిమా మొదలవుతుంది. కాకపోతే -ఒక సీరియస్ ఇష్యూ దగ్గరకు ఆడియన్స్‌ని తీసుకెళ్లాడు దర్శకుడు స్వరూప్. కామెడీగా కథను నడిపించినా -ఎవరూ నమ్మలేని మిస్టరీ చుట్టూ కథను తిప్పగలిగాడు. మతవ్ఢ్యౌ భావాలు, మూఢ నమ్మకాల కారణంగా తలెత్తే క్రైమ్ పత్రికల్లో చూస్తూనే ఉంటాం. కాకపోతే -దర్శకుడు వాటిపై సీరియస్ ఫోకస్ పెట్టాడు. వాటితోనే కథను అల్లుకున్నాడు. భవిష్యత్‌పై ఆశ, చెడు సంభవించొచ్చన్న భయం -మనిషిని పిచ్చి నమ్మకాలవైపు ఎలా నడిపిస్తుంది? ఆ బలహీనతలను క్యాష్ చేసుకునే వ్యక్తుల మనస్తత్వాలను చూపించాడు. కాకపోతే, థ్రెడ్ బలమైనదే అయినా, చుట్టూ అల్లిన సన్నివేశాల్లో బిగింపులేక -్ఫస్ట్ఫా టైంపాస్‌కే పరిమితమైంది. పాత్రల పరిచయానికి సరిపోయింది. సెకెండాఫ్‌ను డిటెక్టివ్ ఇన్విస్టిగేషన్‌కు కేటాయించటంతో -రిపీటెడ్ కంటెంట్‌తో ఆడియన్స్ భారం ఫీలవుతారు. ఇలాంటి కథకు పెద్ద కాన్వాస్, భారీ ప్రొడక్షన్ వాల్యూస్ లేకపోవడంతో -షార్ట్ ఫిల్మ్ ప్రమాణాలకు పరిమితమైన భావన కలిగింది. బడ్జెట్ పరిమితులు సినిమా స్థాయిని తగ్గించేశాయి. స్ట్రెయిట్‌గా కథను చెప్పే ప్రయత్నం కూడా వైఫల్యానికి కారణం. దర్శకత్వపరంగా స్వరూప్ సక్సెస్ అయ్యాడు. కథ విషయంలో కొత్త ఆలోచనలతో ప్రతిభ చూపించుకున్నాడు. హీరో నవీన్ పోలిశెట్టి మంచి నటుడిగా ప్రూవ్ అయినట్టే. హీరోగా లాంచింగ్‌కు వైవిధ్యమైన పాత్ర ఎంచుకుని, నూరుశాతం న్యాయం చేయగలిగాడు. హీరో అసిస్టెంట్ పాత్రలో శ్రుతి శర్మ ఓకే అనిపించింది. పాత్రకు తగ్గ పెర్ఫార్మెన్స్ చూపించింది. ‘మజిలీ’లో ఆకట్టుకున్న సుహాస్, మరోసారి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మిగతా పాత్రల్లో అంతా కొత్తవాళ్లే కనిపిస్తారు.
సాంకేతికంగా చూస్తే -చిన్న బిట్ సాంగ్ వినా పాటలులేని చిత్రంలో నేపథ్య సంగీతంతో మార్క్ కె రాబిన్ ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ ఓకే. పాటలు లేకుండా థ్రిల్లర్ మూవీని రెండున్నర గంటల నిడివితో చెప్పడం సినిమాకు ప్రతికూలతే. ఈ విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్తపడి ఉంటే బావుండేది.

పోగులు మెలేశాడు

$
0
0

మల్లేశం *** బాగుంది

తారాగణం: ప్రియదర్శి, అనన్య, ఆనంద్ చక్రపాణి, ఝాన్సీ తదితరులు.
సంగీతం: మార్క్ కె రాబిన్,
కళ: లక్ష్మణ్ ఏలె
సినిమాటోగ్రఫీ: బాలు శాండిల్యాస
నిర్మాతలు: రాజ్ ఆర్, శ్రీ అధికారి,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్ ఆర్
=======================================================

తమ వృత్తికవసరమైన శారీరక శ్రమను తగ్గించే ఓ నూతన ఆవిష్కరణ కోసం పాటుపడి సాధించిన ఓ వ్యక్తి సజీవ ఉదంతానికి తెర రూపమే ‘మల్లేశం’- ఈ చిన్న వివరణే స్ఫూర్తివంతంగా ఉంది కదా! చిత్రం కూడా అదేస్థాయి స్ఫూర్తితో మనకందించాడు దర్శకుడు రాజ్ ఆర్.
చేనేత కార్మికుల చీరల నేతలో ఆకర్షణీయమైన ఆకృతులు ముద్రించడానికి అవసరమైన ‘ఆసు’ యంత్రాన్ని రూపొందించుదామని చిన్ననాటి నుంచి మల్లేశం (ప్రియదర్శి) అనుకుంటూ ఉంటాడు. అలా అనుకోడానికి కారణం -ఆ పని చేత్తో చేసి చేసీ భుజం దెబ్బతిన్న తల్లి లక్ష్మి (ఝాన్సీ) స్థితిని చూడటం కూడా. యంత్రం కనుగొంటే, తన తల్లితోపాటు అనేక మంది చేనేత కార్మికుల వెతలు తీరతాయన్న బృహత్ సంకల్పం అతనిది. కానీ అది కనిపెట్టడానికి అవసరమైన చదువు, ఆర్థిక ఆలంబనకు అందనంత దూరమైన దయనీయమైన పరిస్థితి అతనిది. అదీకాకుండా ఈ పని సాధించే ప్రక్రియలో అనేకానేక ఆపదలూ దాపురించాయి. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోంచి బయటపడి ఎలా విజయుడయ్యాడు? అన్న వివరణతో మనల్ని ఇంటికి పంపుతాడు మల్లేశం. తెలుగులో ఒకరకంగా ఇది బయోపిక్‌ల వత్సరంగా చెప్పుకోవాలి. ఇప్పటికే మూడు చిత్రాలు ఈ విభాగంలో వచ్చేశాయి. వాటికీ, దీనికి తేడా ఏమిటంటే -ఓ సామాన్యుడు అసామాన్య స్థితికి ఎదిగి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని సాధించటం. మరెందరికో ప్రేరణాత్మకుడిగానూ నిలిచిన వ్యక్తి కథ ఇది. ఈ ఉదంతాన్ని చిత్రాంతంలో -మల్లేశం ప్రసంగాన్ని పొందుపర్చి సినిమాకు చక్కదనాన్ని తెచ్చారు. తెలంగాణ గ్రామీణ ప్రాంత మాండలికాన్ని ఇంత సాధికారికంగా ఉపయోగించిన చిత్రం ఇదేనేమో. మాండలికంలో అలవోకగా, అంతర్భాగంగా, అప్రయత్నంగా వచ్చే ఉర్దూ పదాల్నీ యథాతథంగా వాడి సన్నివేశాలకు ఎనలేని వనె్న తెచ్చారు. చిత్రం ప్రారంభమే ‘మగ్గాలు మూతపడ్డాయి- అప్పులు కుప్పలయ్యాయి’. అందుకే ‘ఇజ్జత్’ (పరువు) కాపాడుకోడానికి బ్రతుకు చాలించిన ‘మల్లేశం’ మేనమామ కుటుంబం ఆత్మహత్య చేసుకోడంతో ప్రారంభించి -ఆ వర్గం పడిన, పడుతున్న వెతలు చూపిస్తూ.. మరింకేవీ పట్టించుకోకుండా సినిమా స్కిన్‌లోకి ఆడియన్స్‌ని తీసుకుపోయాడు దర్శకుడు. ఈ సందర్భంగా తెలిసో తెలియకో చిన్న మల్లేశం ‘సరే మామ అప్పుచేశాడు. ఇజ్జత్ కోసం చనిపోయాడు, మరి బుజ్జి (మేనమామ కూతురు)నెందుకు చంపేశారు?’ అని అడిగిన మాట హృదయమున్న వారిని ఇంటికొచ్చిన తరువాతా వెంటాడే మాట. ‘అవును అది తప్పే’ అని అదే సందర్భంలో మల్లేశం తల్లి ఒప్పుకుంటుంది కూడా! అలాగే మరోచోట ఎదురైన అవరోధాలకు అదిరిపోయి, తనువు చాలించుకుందామనుకున్న మల్లేశం, తల్లి చాలాసార్లు అనే మాట ‘ఆపదలు’ వచ్చినపుడు అన్ని దార్లు మూసుకుపోయినా, ఎక్కడో ఓ ద్వారం తెరుచుకుని ఉంటుంది. దాన్ని పట్టుకోడానికే ప్రయత్నించాలి అన్నది గుర్తుకువచ్చి, ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకుంటాడు. అసలు ఆయన అలాంటి పనిని విరమించుకున్నాడు కనుకనే, ఈనాడు మనం ఆ చరిత్రను మార్గదర్శకంగా భావించి నీరాజనాలిస్తున్నాం. ఈ సన్నివేశాల్ని హృద్యంగా చిత్రీకరించారు. ఇక సినిమాలో నటీనటుల నటనా ప్రస్థావనకొస్తే, ఓమాట చెప్పాలనిపిస్తోంది. నట శిక్షణాలయాల్లోనూ, ఇతరేతర చర్చల్లోనూ ‘ఏది మంచి నటన?’ అన్న ప్రశ్నకు సమాధానంగా ఏది నటన కాదో అది మంచి నటన (గుడ్ యాక్టింగ్ ఈజ్- నోయాక్టింగ్) అని చెప్తారు. ఆ పదబంధం సరిగా ఇందులోని నటవర్గానికి సరిపోతుంది అనీ తప్పనిసరిగా చెప్పచ్చు. ఎందుకంటే నాయక పాత్రధారి ప్రియదర్శినుంచి, పంకా పాడైందని అడ్డమైన మాటలూ అన్న గంగవ్వ పాత్రవరకూ అందరూ ప్రాణంపెట్టి పాత్రల్లో జీవించారు. హాస్య నటుడుగా ఇంతవరకూ అలరించిన ప్రియదర్శి అయితే నిజమైన మల్లేశమే సంతోషంగా ఉప్పొంగిపోయే విధంగా నటించారంటేనే చాలు, ఆయన ప్రతిభ ఎంతటిదో చెప్తోంది. ఝాన్సీని లక్ష్మి పాత్రలో చూసిన తర్వాత చిత్రసీమ కాస్త కొరత ఫీలవుతున్నా కారెక్టరు ఆర్టిస్టుల లోటు తీరుతుందనే అనిపించింది. మల్లేశం భార్య పద్మ పాత్రలో అనన్య పేరుకు తగిన రీతిలో సాటిలేని విధంగా నటించింది. భర్త పరిస్థితిని అర్థంచేసుకుని తగిన ధైర్యమిచ్చిన సన్నివేశంలోగానీ, అతని విషాద భావనను గమనించి కాస్త లైటర్ మూమెంట్ తీసుకురావడానికి చేసిన సీన్స్‌లోగానీ అనన్యమైన స్థాయిలో ఆమె నటించింది. అలాగే మల్లేశం తండ్రిగా ఆనంద్ చక్రపాణి కూడా చాలా సహజంగా నటించారు. అయితే సాధారణంగా నటీనటుల నటనాఖ్యాతిని వారినలా నటింపచేసిన దర్శకుడికిస్తారు. కానీ ఇందులో టైటిల్స్‌లో ‘డైరెక్టర్ ఆఫ్ యాక్టింగ్...’ అంటూ ఒకరి పేరు చూపారు. హాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ అక్కడక్కడ ఇలా చూపే విధానం ఉంది. తెలుగులో తక్కువ. ఏది ఏమైనా మనమీ క్రెడిట్ అటు దర్శకుడికీ, ఇటు డైరెక్టర్ ఆఫ్ యాక్టింగ్‌కీ కూడా ఇద్దాం’. ఇందాకా అనుకున్నట్లు తెలంగాణ మాండలికానికి నిజమైన పెద్దపీట వేసిన సంభాషణాకర్త పెద్దింటి అశోక్‌ని ప్రశంసించకుండా ఉండలేం. ‘ఎంత పెద్దపనైనా చిన్నచిన్న భాగాలుగా చేసి చేసేస్తే పని అయిపోతుంది’ లాంటివి ఆచరణీయం. అదే విధంగా పద్మ పాత్రలో ‘అబ్బో ఈ చీర ఎంత బాగుందో, చీరలు నేసుడే కానీ, ఎన్నడూ ఇసుంటివి వేసుకోనే లేదు’... అన్న సంభాషణా గుండెల్ని తాకింది. మార్క్ కె రాబిన్ స్వరాల్లో ‘నాకు నువ్వని, మరి నీకు నేనని’ అన్న దాంట్లో తన మార్కు చూపారు. ‘నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో’ అన్న వాక్యం ఓ పాటలో రచయిత బాగా ఉపయోగించారు. అలాగే ‘పేగుబంధం- పోగుబంధం’ పద ప్రయోగమూ బాగుంది. కథాభాగం ఎనభై, తొంభై దశకాల్లో కనుక అప్పుడు విరివిగా దొరికే గోల్డ్‌స్పాట్ లాంటివి చూపడంలోనూ చక్కటి ‘సమయోచిత’ ప్రజ్ఞ చూపిన డైరెక్టర్, అప్పట్లో వాడకంలోలేని రెండొందల రూపాయల నోట్లని నాయక పాత్రధారికి పాత ఇనుము కొన్న వ్యాపారి ఇస్తున్నట్టు చూపకుండా ఉంటే బాగుండేది. ఓ పక్క మల్లేశం కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అని చూపిస్తూ, ఆ పాత్ర మాత్రం ఎప్పుడూ ఇస్ర్తి బట్టలు వేసుకున్నట్టు చూపడమూ సరిగ్గాలేదు. ఇలాంటి చిన్న చిన్నవి వదిలేస్తే లాజిక్కు లేని చిత్రాలు, రియాల్టీకి దూరం అన్నీ అని తూర్పారబట్టేవారు కూడా నిరభ్యంతరంగా చూడదగ్గ చిత్రం ‘మల్లేశం’.

అదే ఆమె కల..!

$
0
0

తల్లిని మించిన దైవం లేదంటారు అంతా. నాకు మాత్రం మా అమ్మ దేవమే కాదు, సైన్యం.. ధైర్యం కూడా.
**
సినిమా -జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక్కోసారి -జీవితం కూడా సినిమాను చూసి రూపుదిద్దుకుంటుంది. ఇది -విలోమానుపాతం. అప్పట్లో వచ్చిన ఏఎన్నార్- సావిత్రి సినిమా ‘అభిమానం’లో -తల్లిని మించిన దైవం వేరే లేదురా/ ఎన్ని లోకములు వెతికి చూసినా లేనే లేదురా అన్న పాటుంది. అది నా జీవిత సంఘటనలకు ఖచ్చితంగా సరిపోతుంది -అంటోంది లతాశ్రీ.
ముందు -పద్మలత. స్క్రీన్ పరిచయం -శ్రీలత. కెరీర్ పరుగులో సెంటిమెంట్‌గా -లతాశ్రీ. ప్రత్యేక పరిచయం అవసరంలేని మంచి నటి. పాత్రలో ఉన్నపుడు పక్కింటి పరిచయస్తురాలిగా అనిపించే లతాశ్రీ -ఈవారం వెనె్నల ముచ్చట్లకు అతిధి.

విజయవాడకు చెందిన ముల్పూరి మాధవరావు, సువర్ణలత కుమార్తె -లతాశ్రీ. ఆ కుటుంబంలో అన్నకు చెల్లిగా గారాలపట్టి. అలనాటి రంగస్థల నటుడు సూరపనేని ప్రభాకరరావు మనవరాలు కూడా. బాల్యంనుంచే నాట్యాభినివేశం శ్రీలత ప్రతిభ. ఆ ఆసక్తిని గమనించింది తల్లి సువర్ణలత. తండ్రికి ఇష్టంలేకున్నా డ్యాన్స్ నేర్పించింది. స్కూల్లో అన్ని డ్యాన్స్ క్లాసుల్లో ఆమే ఫస్ట్. అనేక ప్రదర్శనలూ ఇచ్చింది. అనేక బహుమతులూ అందుకుంది. ముఖ్యంగా మోహినీ భస్మాసుర నృత్య నాటకంలో శ్రీలత చేసిన ‘మోహినీ నృత్యం’ అందరినీ మోహితులను చేసింది. ఇదే ప్రదర్శన హైదరాబాద్‌లోనూ ఇస్తే, అనేక అవార్డులు వచ్చాయి. సినిమాలో నటించడమన్నది అంత ఇష్టంలేని విషయం. కానీ మనకు ఇష్టంలేనిదే పదే పదే మనముందుకొస్తుంది -అన్నట్లు ఇష్టంలేని సినిమా అవకాశాలు లతాశ్రీని వెతుక్కుంటూ వచ్చాయి. అలా తొలిసారిగా తమ్మారెడ్డి భరద్వాజ రూపొందించిన ‘మన్మథ సామ్రాజ్యం’ చిత్రంలో కథానాయికగా నటించారు. తరువాత టెన్త్ పాస్ అవ్వడంతో, ఇంటర్మీడియట్ విజయవాడలో చదువుతున్న టైం. నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఓసారి విజయవాడ వచ్చినపుడు.. తాను రూపొందిస్తున్న పోలీస్ భార్య చిత్రంలో నటించమని అవకాశమిచ్చారు. అది హిట్టవ్వడంతో లతాశ్రీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. ఓవైపు ఇంటర్ చదువు, మరోవైపు షూటింగ్‌లు. చివరికి అధ్యాపకులు ఇచ్చిన అమూల్యమైన సలహాతో సినిమా అవకాశాలవైపే ప్రయాణించారు లతాశ్రీ. అలా మొదలైన ప్రయాణం ఎక్కడా గ్యాప్‌లేకుండా దాదాపు 80 చిత్రాలవరకూ సాగింది. ఒకరకంగా పీక్ స్టేజ్‌లో ఉన్నపుడే ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. ఆమెకు ఇద్దరు కొడుకులు. తెలుగుతోపాటు కన్నడంలో కథానాయికగా శశికుమార్, సాయికుమార్, కాశీనాథ్, కన్నడ ప్రభాకర్ వంటి వారితో నటించారు లతాశ్రీ. ‘పగలు తెలుగు సినిమా షూటింగులతో బిజీగా ఉండటంతో, కాల్షీట్లు అడ్జెస్ట్ చెయ్యలేక రాత్రి సమయాలను కన్నడ చిత్రాలకు కేటాయించిన రోజులు అనేకం’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా లతాశ్రీకి యమలీలలోని ‘హిమక్రీముల సుందరి’ పాత్ర అద్భుతమైన గుర్తింపు తెచ్చింది. ఇవివి సత్యనారాయణ, ఎస్ వికృష్ణారెడ్డిల దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాల్లో ‘జెండా ఎత్తేద్దామా’ అన్న టైపులో ఏదోక మ్యానరిజమ్‌తో శ్రీలత కోసం సరికొత్త పాత్రలను దర్శకులు ఆవిష్కరించారు. అలా ఒక్కో సినిమాలో ఒక్కో మ్యానరిజమ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు లతాశ్రీ. ఈ ప్రయాణానికి ఆదినుంచీ వెన్నుదన్నుగా నిలిచింది మాత్రం -లతాశ్రీ అమ్మ సువర్ణలత. ‘ఏదైనా సరే ఆమెమీదే ఆధారపడేదాన్ని. అమ్మ నా దైవమే కాదు, ధైర్యం, సైన్యం కూడా’ అంటూ గుర్తు చేసుకున్నారు లతాశ్రీ. యమలీలలో ‘అభినందనం..’ పాటలో చేసిన నృత్యాన్ని చూసిన ఏఎన్నార్ ‘సువర్ణసుందరి’లో అంజలీదేవి గుర్తు వచ్చిందని అన్నారట. అంతేకాదు, నేనెప్పుడు కనిపించినా అంజలీ లేదా దేవి అని సంబోధించేవారు -అంటూ గుర్తు చేసుకుంది లతాశ్రీ. ‘నేనెప్పుడు కనిపించినా మీ తరుఫువాళ్లు ఎవరైనా కళారంగంలో ఉన్నారా? అని ఏఎన్నార్ అడిగేవారు. కానీ నేను మా తాత పేరు ఏనాడూ చెప్పలేదు. అలా ఓ ఐదారుసార్లు ఆయనతో అనేక వేడుకలలో పాల్గొనే అవకాశాలు వచ్చాయి. ఎప్పుడు కనిపించినా ఆయననుంచి అదేమాట -మీ తరఫువాళ్లు ఎవరున్నారు కళారంగంలో అని. చివరికి చెప్పక తప్పిందికాదు. మా తాత గురించి చెప్పగానే ఏఎన్నార్ అంత పెద్ద లెజెండ్ అయినా చాలా సింపుల్‌గా తన గత అనుభవాలను నెమరేసుకున్నారు. నేనూ మీ తాత కలిసి నాటకాలాడాం. ఆయన హీరోగా, నేను హీరోయిన్‌గా రంగస్థలంపై ప్రేక్షకులను అలరించాం అని గుర్తు చేసుకోవడం తలచుకుంటే నాకిప్పటికీ ఒళ్ళు గగుర్పొడిచే విషయం. అందుకే నేనంటే ఆయనకు చాలా అభిమానం. ఆయనతో ఒక్క చిత్రంలోనైనా డ్యాన్స్ చేయాలనుకున్నాను. కానీ విధి మరోలా తలచింది. ఏఎన్నార్ జ్ఞాపకశక్తిని మెచ్చుకోవాలి. అందుకే వారు లెజెండ్స్ అయ్యారనిపిస్తుంది’ అంటూ తన జీవితంలోని ఓ మంచి ముచ్చటను గుర్తు చేసుకున్నారు లతాశ్రీ.
కెరీర్ ప్రారంభమైన తొలి రోజుల్లో సినిమా ప్రారంభోత్సవం అంటే చాలా భయంగా ఉండేది. ముహూర్తపు షాట్‌కి అనేకమంది పెద్దవాళ్లు వస్తారు. వాళ్ళందరిముందూ ఉండటం అంటే భయమనిపించేది. ఏ సినిమాకు ఆ సినిమా.. అలా భయం అనిపించినా మా అమ్మ ఇచ్చిన ధైర్యంతో బింకంగా కూర్చునేదాన్ని. ఓసారి నెంబర్‌వన్ సినిమా షూటింగ్ ఒక్కరోజు చేసి ఆపేశారు. తరువాత రోజునుండి షూటింగ్ ఉందని చెప్పలేదు. అలా మూడు నాలుగురోజులు గడిచింది. చివరికి నన్ను ఆ సినిమాలోంచి తీసేశారు అనుకున్నా. ఐదు రోజుల తరువాత ఇక నాకు పాత్ర లేదు అని కన్‌ఫర్మ్ చేసుకొని చాలా బాధపడ్డాను. సడెన్‌గా ఓ రోజు ఫోన్ వచ్చింది. హీరో కాల్షీట్స్ అడ్జెస్ట్‌కాక షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందని, రేపు మళ్లీ షూటింగ్ వుందని కాల్షీట్లు అడిగారు. దాంతో చాలా ధైర్యమొచ్చింది. మేజర్ చంద్రకాంత్, పెదరాయుడు, టాప్‌హీరోలాంటి చిత్రాల్లో కూడా అవకాశాలు వచ్చినా కాల్షీట్లు లేక వదులుకోవాల్సి వచ్చింది. ఇపుడు అప్పుడప్పుడు అనుకుంటాను.. కనీసం ఏదైనా సర్దుబాటు చేసి మేజర్ చంద్రకాంత్‌లో నటిస్తే బాగుండేదని. కానీ సమయం దాటిపోయింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది లతాశ్రీ. అలాగే కృష్ణతో కలిసి, ఆయన దర్శకత్వంలో అనేక చిత్రాల్లో చేశానని చెప్పారు లతాశ్రీ. ‘అపుడు పరిశ్రమలో నన్ను కృష్ణ మేనకోడలు అనుకునేవారు. చాలామంది అడిగారు కూడా ఆ విషయాన్ని. నా చిన్నప్పుడు ఆయనంటే నా ఫేవరేట్ హీరో. మా అన్న అని చెప్పుకునేదాన్ని. ఆయన చెల్లెలుగా నెంబర్‌వన్ చిత్రంలో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అదే అదృష్టమంటే. పాఠశాలనుండి కాలేజీకి వెళ్లాను. ఆ వెంటనే సినిమా సెట్టింగుల్లో షూటింగ్‌లకు వెళ్లాను. షూటింగ్ అంటే నాకు స్కూలుకు వెళ్లొచ్చినట్టే ఉండేది. ఎప్పటికప్పుడు ఈ చిత్రం చేసి ఇక మానేద్దాం అనుకునేదాన్ని. అలా అనుకుంటూనే అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో ఇన్ని చిత్రాల్లో నటించాను’ అంటూ గుర్తు చేసుకున్నారు. ‘బాగా చిత్రాలతో బిజీగా వున్నపుడు ఎవరూ పెళ్లివైపు వెళ్లరు. కానీ నేను పెళ్లి చేసుకున్నాను. జిమ్‌కు వెళ్లినపుడు ఆయన పరిచయం. ఆవిధంగా మా పరిచయమే పరిణయమైంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలలో జిమ్ స్టూడియోలు నిర్వహిస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు. బాధాకరమైన విషయాన్ని గుర్తు చేసుకుంటూ -‘అమ్మ దూరమవ్వడమే బాధాకరం. ఓ అన్న ఉన్నా లేనట్టే అయ్యింది నాకు. అమ్మకు ఆరోగ్యం సరిలేనపుడు ఎంతో ప్రయత్నం చేశాను. అన్నలు మనవారైనా వదినలు మనవారు కారుగా. ఓరకంగా ఠాగూర్ చిత్రంలో చికిత్స చేసినట్టుగా అమ్మకు చేశారు. అది చాలా బాధాకరమైన విషయం నా జీవితంలో. అమ్మ దూరమయ్యాక ఏకాగ్రత కోల్పోయా. ఏంచేస్తున్నానో తెలీక మళ్లీ డ్యాన్స్ క్లాసులకు వెళ్లా. ఆ విషయంపైనా ఓదార్చకుండా నాపై రాళ్లు వేసే ప్రయత్నం చేశాడు అన్నయ్య. మా అమ్మ మాత్రం నా కూతురుకు నేనుండాలి అన్న విల్‌పవర్‌తో మృత్యువుతో ఎంతో పోరాడింది. ఆవిధంగా జీవితంలో చాలా పెద్ద పోరాటమే చేశాను నేను. అమ్మతోవున్న అటాచ్‌మెంట్ అలాంటది. ఏనాడూ గొప్పలకు పోలేదు. ఎప్పుడూ ఒకేలా ఉన్నాను. ఓరకంగా నేను ఇలా ఉండటానికి మా అమ్మే స్ఫూర్తి. మళ్లీ చిత్రాల్లో నటించాలన్నది కూడా ఆమె ఆశయం. అందుకే ఇపుడు మంచి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధమవుతున్నా. ఇటీవల అల్లరి నరేష్‌తో అత్తిలి సత్తిబాబు చిత్రంలో నటించా. రాజకీయాల్లోకి వెళ్లి ప్రజాసేవ చేయాల్సిన అవసరం లేదు. మన మనసుంటే ఎంతో చేయొచ్చు అన్న ఏఎన్నార్ సలహా నాకు ఇప్పటికీ శిరోధార్యం అంటూ ముగించారు లతాశ్రీ.

లాటరీలో హీరోయిన్ ఛాన్స్ ( ఆనాటి హృదయాల..)

$
0
0

సరే ఒక పనిచేద్దాం. ఎవరెవరు అక్కినేని పక్కన నటించాలని అనుకుంటున్నారో వారందరి పేర్లు రాసి చీట్లు కలుపుదాం. లాటరీ హీరో చేత తీయిద్దాం. ఎవరి పేరువస్తే వారే హీరోయిన్ అన్నారు. అందుకు అందరూ ఒప్పుకున్నారు.

‘సోగ్గాడు’ చిత్రం తర్వాత జయచిత్రకి చాలా మంచి పేరొచ్చింది. జయచిత్ర తల్లి జయమ్మ మంచి నటి (దైవబలం చిత్రంలో -్ధరణిగిరి భారమా పాట ఆ రోజుల్లో అందరి నాల్కలమీద నానింది). ‘సోగ్గాడు’ చిత్రంతో తల్లినిమించిన తనయ అనిపించుకుంది జయచిత్ర.
జయచిత్ర క్రమశిక్షణకి పెద్దపీట వేస్తుంది. ఏ టైమ్‌లో ఏంజరగాలో అది జరిగి తీరాల్సిందే -తేడావస్తే క్షమించేది కాదు.
ఆమె బలహీనత నృత్యం. శైవా మాస్టారు జయచిత్ర గురువు. డ్యాన్స్ నేర్పుతుండేవారు. తెలుగు తమిళ భాషల్లో వరుసగా అవకాశాలు వస్తున్నాయిగాని, అగ్రనటులతో నటించే అవకాశం రాలేదు. ఎప్పుడూ అదే ఆరాటంతో ఉండేది జయచిత్ర. ముఖ్యంగా అక్కినేని సరసన నటించాలని కలలుగనేది.
ఒకరోజు చెన్నై టి.నగరు వాణీమహల్‌లో అక్కినేనికి నటీనటులంతా సన్మానం చేయతలపెట్టారు. ఇండస్ట్రీలోవున్న చిన్నా పెద్దా హీరోయిన్లంతా ఆ సన్మాన సభకి హాజరయ్యారు. అపుడో చిత్రమైన ప్రపోజల్ వచ్చింది. కృష్ణవేణి కూతురు అనురాధదేవికి అక్కినేని డేట్స్ ఇచ్చారు. దాసరి దర్శకుడు. హీరోయిన్ ఎవరు? అందరికీ సందేహమే. ఆ సమయంలో వాణిశ్రీ, జయప్రద, ప్రభ, జయసుధ, జయచిత్ర పోటీపడ్డారు. అప్పటికి అందరూ ఫామ్‌లోవున్న ఆర్టిస్టులే.
సరే ఒక పనిచేద్దాం. ఎవరెవరు అక్కినేని పక్కన నటించాలని అనుకుంటున్నారో వారందరి పేర్లు రాసి చీట్లు కలుపుదాం. లాటరీ హీరో చేత తీయిద్దాం. ఎవరి పేరువస్తే వారే హీరోయిన్ అన్నారు. అందుకు అందరూ ఒప్పుకున్నారు. కార్యక్రమం కొనసాగుతోంది.
అందరి దృష్టీ ‘లాటరీ’మీదే!
ఆరోజు రసవత్తరమైన చర్చ జరిగింది. ‘సినీఫీల్డులో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను పెరిగిపోతుంది. తగ్గించడం ఎలా?’ ఘాటుఘాటుగా నిర్మాతలూ, దర్శకులూ మాట్లాడుతున్నారు. ఇక హీరోయిన్ విషయం మర్చిపోయారనుకున్నాం అంతా.
ఇక సభ ముగిసే సమయానికి అక్కినేని లాటరీ తీసి అందులోంచి ఓ చీటీ తీసారు.
‘జయచిత్ర’
తన పేరురాగానే చిన్న పిల్లలా కేరింతలు కొట్టింది. మిగతా వాళ్ళందరూ కంగ్రాట్స్ చెప్పేరు.
ఆ చిత్రంలో అక్కినేని కాంబినేషన్‌లో నటించే మోజుతో పెద్ద రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చెయ్యలేదు.
ఇప్పటికీ జయచిత్ర జీవితంలో తనకి అత్యంత ఇష్టమైన పాట.
‘రవివర్మకే/ అందని/ ఒకే ఒక అందానివో’. జయచిత్ర బాగా పాడగలదు కూడా.

తోడికోడళ్లు (నాకు నచ్చిన సినిమా)

$
0
0

అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై దుక్కిపాటి మధుసూధనరావు నిర్మించిన ద్వితీయ చిత్రం -తోడికోడళ్ళు. ఈ చిత్రం మాతృక శరత్ నవల ‘నిష్కృతి’. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించటానికి (స్క్రీన్‌ప్లే) హేమాహేమీలైన దుక్కిపాటి, ఆదుర్తి, ఆత్రేయ మేలుకలయిక పునాది. ఆదుర్తిది తొలి అడుగు అన్నపూర్ణా సంస్థలో. ఈ చిత్రానికి సంభాషణకర్త ఆచార్య ఆత్రేయ... స్క్రీన్‌ప్లేలో కూడా ఈయన పాత్ర ఉండటంవల్ల సన్నివేశాలు, సంభాషణలు అదును, పదును కలిగి చాలాచక్కగా పండాయి. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు లభించాయి. ఆర్థికంగా అన్నపూర్ణ సంస్థని ముందుకి నడిపాయి.
కథాంశానికి వస్తే -ఒక వ్యవసాయైక కుటుంబం, పట్నంలో ఎస్‌వి రంగారావు, ఇంటి పెద్దకొడుకు అడ్వొకేట్ అవడంవల్ల కుటుంబం పట్నంలో స్థిరపడింది. పొలంపనులు అవి పల్లెలో రేలంగి నిర్వహిస్తూండేవాడు. రేలంగి ప్రేరణ, ప్రమేయం లేకపోయినా భార్య సూర్యకాంతం పట్నవాసంపై పెంచుకున్న మోజువల్ల రేలంగి కూడా అన్నగారైన ఎస్‌విఆర్, ఆయన భార్య కన్నాంబ మరియు ఏఎన్‌ఆర్, సావిత్రి దంపతుల మధ్యన చొరబడి హాయిగా, ప్రశాంతంగా సాగిపోతున్న సంసారంలో చిరు మనస్పర్ధలు ఏర్పరచి ఏఎన్‌ఆర్, సావిత్రి పల్లెకు మళ్లేటట్టుగా చేసి కథను మలుపుతిప్పుతారు. కథనంలో ఆ ఇంటి బంధువైన జగ్గయ్య పాత్ర కూడా ఎంతో ఉంది. అవగాహనా లోపంవల్ల ఏర్పడిన ఒడిదుడుకులు సర్దుమణిగి చివరాకరికి కథ సుఖాంతం అవుతుంది.
అప్పట్లో కుటుంబ కథాచిత్రాలకు అగ్ర తాంబూలం కాబట్టి కథా కథనం ఎంతో చాకచక్యంగా నడిపించి ఆదుర్తి సుబ్బారావు తొలి ప్రయత్నంలోనే చాలా అనుబంధం ఏర్పరచుకున్నారు.
ఎస్‌వి రంగారావు, కన్నాంబ, అక్కినేని, సావిత్రి, రేలంగి, సూర్యకాంతం, జగ్గయ్య, రాజసులోచన పాత్రకి మించి నటించి మెప్పించారు. పాటలు ఎంతో కమనీయంగా మాస్టర్ వేణు సంగీత నిర్వహణలో ప్రాచుర్యాన్ని పొంది అప్పటికి, ఇప్పటికీ మనకి స్ఫూర్తినిస్తున్నాయి. అందుకొన్ని: కారులో షికారుకెళ్ళే..., నలుగురు కలసి పొరుపులు మరచి.., టౌన్ పక్కకెళ్ళద్దురో.., నీ సోకు చూడకుండా..., కలకాలం ఈ కలత... ఇత్యాదివే అన్ని. పాటలు కూర్చిన రచయితలు ఆత్రేయ, శ్రీశ్రీ, కొసరాజు, తాపీ ధర్మారావు. చాలావరకు సందేశాత్మకంగా, సంచలనాత్మకంగా, భావగర్భితంగా పాటలు ఉండటంవల్ల నలుగురు కలిసిన ప్రతి ఫంక్షన్లలో ఈ పాటలు ప్రభావితం చేస్తాయనడం ఎంతైనా సమంజసం. అందుకే ఈ చిత్రం నాకెంతగానో నచ్చింది.


గోదారి గట్టుంది (నాకు నచ్చిన పాట )

$
0
0

గోదారి గట్టుంది/ గట్టుమీద సెట్టుంది/ సెట్టు కొమ్మన పిట్టుంది/ పిట్ట మనసులో ఏముంది...’ -ఈ పాట మూగమనసులు సినిమా కోసం పూదోట విరిసిన పల్లె పాట. ఒక ఈడొచ్చిన పాల పిట్టంటి గౌరి, గోదారి గట్టమ్మట పరికిణీతో గెంతుతూ పాడిన పాట. ఈ పాట పొంగింది కవితాశరధి దాశరథి కలంలో. గోదారి గలగల గలలా పారింది కమనీయ గానకోయిల పి సుశీలమ్మ గళాన. ఈ పాటకి ఎప్పుడో ఫిదా అయింది తెలుగు జాతి. జాతి నలుదిశలా వ్యాపించింది ఖ్యాతి.
ఈ గీతానికి జమున అభినయాన్ని మాటల్లో చెప్పలేం. సంగీత విరించి మామ కెవి మహదేవన్ స్వర విన్యాసంతో గోదారి తెగ మురిసి మెరిసింది అశేష ఆంధ్ర జనావళి నేత్ర ద్వయాల.
దీనికి కర్త కర్మ క్రియ ఆదుర్తి సుబ్బారావు. ఆయన సినిమా యావత్తు గోదారి గట్టున చిత్రీకరించడం ఆయన అభిరుచికి దర్పణం. ఎంతో మనోహరంగా, సుందరంగా రూపుదాల్చిన లొకేషన్స్ కథకి పాత్రలకి మరింత ఊపుని, ప్రాపుని ఇచ్చాయి.
ఇహ పాట చరణాలకి వెళ్తే... వగరు వగరుగా పొగరుంది/ పొగరుకు తగ్గ బిగువుంది/ తీయతీయగా సొగసుంది/ సొగసును మించే మంచుంది.
ఇలా పాటతో ఎంతో సొగసుగా సొబగులతో గోదారి గట్టంట పరిగెడ్తుంది జమున. ఆహార్యంలో సమతూకంగా, సరళంగా సాగిన పద లాలిత్యం భలే పసందనిపిస్తుంది వినే చెవులకి మామ స్వర విన్యాసంలో.
వెనె్నల వుంది ఎండుందీ పువ్వూ ఉంది... ముల్లుందీ... ఏది ఎవ్వరికి యివ్వాలో యిడమరిసే ఆ యిది వుంది- కథానాయకి (ఈ పాటలో) జమున కనె్నమనసైనా పువ్వులా మెత్తగా ఉంది, ఎవడైనా జోలికి వస్తే ముల్లులా చెలరేగుతుంది అని హెచ్చరిస్తోంది నాగభూషణంలాంటి దుష్టుల గురించి- కథానాయకుడు గోపీపట్ల పువ్వైంది గౌరి.
మలి చరణంలో... పిట్టమనసు పిసరంతైనా/ పెపంచమంత దాగుంది/ అంతు దొరకని నిండు గుండెలో ఎంత తోడితే (అంత ప్రేమ, మమతానురాగాలు ఎంతకీ తరగని) అంతుందీ -అంటూ గొప్ప వేదాంత భావాల సమ్మిళిత భరితం ఈ పాట. చూట్టానికి అతి సామాన్యంగా వినిపించినా, ఈ పాట నాకు నచ్చిన పాట.

కొత్త బ్యూటీతోనే..

$
0
0

వరుస వైఫల్యాలకు బ్రేక్ వేసుందుకు అక్కినేని అఖిల్ తదుపరి ప్రాజెక్టును బొమ్మరిల్లు భాస్కర్‌తో చేయనున్న విషయం తెలిసిందే. కొత్త ప్రాజెక్టు కోసం కాస్టింగ్ పూరె్తైనా, అఖిల్‌తో ఆడి పాడాల్సిన బ్యూటీని మాత్రం ఇంకా ఎంపిక చేయలేదు. అయితే, 26నుంచే తొలి షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నారు. ఆమధ్య కైరా అద్వానీ లేదా రష్మికా మండన్న.. ఇద్దరిలో ఒకరికి చాన్స్ రావొచ్చన్న కథనాలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం అఖిల్ సరసన కొత్త హీరోయిన్‌నే ఫైనల్ చేయనున్నారట. కొంతమంది స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలించినా చివరికి కొత్త అమ్మాయివైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఫ్యామిలీ ఎమోషన్స్‌తోపాటు లవ్‌స్టోరీ కూడా కీలకం కావడంతో -కొత్త అమ్మాయినే అఖిల్ సరసన తీసుకుంటే మంచిదన్న అభిప్రాయానికి చిత్రబృందం వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ వారం తార

$
0
0

కషిష్ వోహ్రా
*
ఫొటో బై ఆర్‌కె చౌదరి

అస్థిపంజరాల కలకలం!

$
0
0

ముజఫర్‌పూర్ (బిహార్), జూన్ 22: బిహార్‌లోని ముజఫర్‌పూర్ శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ (ఎస్‌కేఎంసీహెచ్) పక్కన శనివారంనాడు గుట్టలు గుట్టలుగా అస్థిపంజరాలు కనిపించడం కలకలం రేపింది. ఈ ఆసుపత్రిలో ఈనెల 1 నుంచి ఇప్పటివరకు దాదాపు 127 మంది చిన్నారుల మెదడువాపు సంబంధిత వ్యాధితో మృతి చెందిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రి పోస్టుమార్టం గది పక్కనే గల డంపింగ్ యార్డులో శనివారం కొన్ని అస్థిపంజరాలు కనిపించడంతో మళ్లీ అలజడి రేగింది. ‘పోస్టుమార్టం అనంతరం గుర్తు తెలియని మృతదేహాలను పూడ్చిపెడతాం.
కానీ ఇపుడు కన్పిస్తున్న అస్థిపంజరాలను పూడ్చిపెట్టిన చోట నుంచే తీసుకువచ్చినట్టు అనుమానంగా ఉంది’ అని ఎస్‌కేఎంసీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీల్ కుమార్ తెలిపారు. ‘పోస్టుమార్టం విభాగం మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న ప్రిన్సిపాల్ నియంత్రణలో ఉంది. ఇపుడు పోస్టుమార్టం గదికి సమీపంలో కనిపించిన అస్థిపంజరాల విషయమై ఒక కమిటీ ఆధ్వర్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతాను’ అని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. శనివారంనాడు అస్థిపంజరాలు కనిపించిన విషయమై వివిధ న్యూస్ చానెళ్లలో విస్తృతంగా ప్రసారం కావడంతో జిల్లా పాలనా యంత్రాంగంతోపాటు తూర్పు సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ కుందన్ కుమార్, సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నీరజ్ కుమార్ వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమగ్ర విచారణ జరిపాకే దీనిపై మాట్లాడతామని ఎస్పీ మీడియాకు స్పష్టం చేశారు.
చిత్రం... ఆసుపత్రి వెలుపల గుట్టలు గుట్టలుగా పిల్లల అస్థి పంజరాలు

‘మైనారిటీలపై దాడులు’ అవాస్తవం

$
0
0

న్యూఢిల్లీ, జూన్ 22: హిందూ అతివాద సంస్థలు మైనారిటీలపై ముఖ్యంగా ముస్లింలపై దాడులకు తెగబడుతున్నాయంటూ అమెరికాకు చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛా సంస్థ తన 2018 వార్షిక నివేదికలో వెల్లడించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. మైనారిటీలను ముఖ్యంగా ముస్లింలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది బీజేపీ నేతలు ప్రసంగాలు చేస్తున్నారంటూ అమెరికా సంస్థ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొనడం సరి కాదని బీజేపీ పేర్కొంది. బీజేపీ మీడియా ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూని శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మైనారిటీలను వ్యతిరేకిస్తూ దాడులకు పాల్పడుతున్నారంటూ నివేదికలో పేర్కొనడం పూర్తిగా అవాస్తవం అని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న వివాదాల నేపథ్యంలో నేరస్థులెవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే వాటిని అడ్డుకోవడానికి ప్రభుత్వం సకల చర్యలు తీసుకొంటోందని చెప్పారు. సమాజంలోని మైనారిటీలు, వీకర్ సెక్షన్లపై దాడులను తమ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఎలాంటి అల్లర్లనైనా అదుపు చేయగల న్యాయవ్యవస్థ భారత్‌కు ఉందని ఆయన నొక్కి చెప్పారు. అల్లర్లకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఎన్డీయే నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఎంతమాత్రం వెనుకాడదని, అమెరికా సంస్థ నివేదికను ఉటంకిస్తూ బలూని పేర్కొన్నారు. అయితే, ఈ అంశాన్ని అమెరికా సంస్థ నివేదికలో పేర్కొనకపోవడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్) నినాదానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కుల, మత, ప్రాంతాల వారీగా అందరికీ సమానంగా సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

ఉగ్రవాదాన్ని అణచి వేయాల్సిందే

$
0
0

న్యూఢిల్లీ, జూన్ 22: ఉగ్రవాదాన్ని అన్ని విధాలుగా అణచి వేసేందుకు అవసరమైన విశ్వసనీయ చర్యలన్నింటినీ పాక్ తీసుకుని తీరాలని భారత్ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇందుకు సంబంధించి విశ్వసనీయ రీతిలో అంతర్జాతీయ ఆకాంక్షలకు పాక్ అద్దం పట్టగలదని ఆశిస్తున్నామని తెలిపింది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ‘ఎఫ్‌ఎటీఎఫ్’ కార్యాచరణ పథకాన్ని పాక్ అమలు చేసి తీరాలని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ స్పష్టం చేశారు. ఎఫ్‌ఎటీఎఫ్ నివేదిక నేపథ్యంలో మాట్లాడిన ఆయన ఉగ్రవాద నిరోధనపై పాక్ ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని ఎఫ్‌ఎటీఎఫ్ కార్యాచరణను అమలు చేయలేకపోయిందని ఆయన అన్నారు. అయితే సెప్టెంబర్ నాటికైనా ఈ కార్యాచరణ కార్యక్రమాన్ని అమలు చేయగలదని ఆశిస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ ఉగ్రవాద నిరోధక టాస్క్ ఫోర్సుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని, ఆ విధంగా అంతర్జాతీయ ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిందని అన్నారు. ప్యారిస్ కేంద్రంగా పని చేస్తున్న ఈ ఉగ్రవాద నిరోధక సంస్థ టెర్రరిస్టులకు నిధులు అందే మార్గాలపై కూడా దృష్టి పెట్టి వాటిని మూసేందుకు కృషి చేస్తున్నది. తమ దేశంలో నిషేధిత ఉగ్రవాద సంస్థలపై ఇప్పటికే పాక్‌ను కోరింది. అయితే ఇందుకు సంబంధించి పాక్‌లో చట్టాలను పటిష్టపరచాల్సి ఉందన్నారు. ఇక ఎంత మాత్రం జాప్యం లేకుండా చివరి కార్యాచరణ ఆశయాలను పాక్ నెరవేర్చాలని, లేని పక్షంలో దానిపై తదనుగుణమైన చర్య తీసుకుంటామని ఈ సంస్థ తెలిపింది.

తాళం వేసి వెళ్లిపోయిన వైద్య సిబ్బంది

$
0
0

ముజఫర్‌నగర్, జూన్ 22: వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి ఇదో పరాకాష్ట. వైద్యుడు దేవుడితో సమానంగా భావించి వైద్యో నారాయణో హరిః అన్నారు.. అయితే, ఇందుకు భిన్నంగా వైద్యో నారాయణో ‘హరీ’లా పరిస్థితి తయారైంది.
వైద్యుల నిర్లక్ష్యానికి అదృష్టవశాత్తు ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది కనుక సరిపోయింది. అనుకోనిది ఏమైనా జరిగితే పరిస్థితి ఎలా ఉండేదో? ఆసుపత్రి సమయం అయిపోయిందంటూ రోగిని లోపలే చీకట్లో వదిలేసి వైద్యుడు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా తాళం వేసి వెళ్లిపోయిన ఉదంతమిది. వివరాలు ఇలా ఉన్నాయి. అపస్మారక స్థితిలో ఉన్న రోగిని లోపల ఉంచి తాళం వేసి వెళ్లిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం చోటుచేసుకొంది. ముజఫర్‌నగర్ జిల్లా ఫలోదా గ్రామంలో సోనియా అనే 30 ఏళ్ల మహిళ అపస్మార స్థితిలో చేరింది. దీంతో ఆమెకు బెడ్ కేటాయించి వైద్యం మొదలు పెట్టారు. అంతలోనే ఆసుపత్రి సమయం ముగిసిందంటూ ఆమెను ఒక్కదానినే లోపల ఉంచి వైద్యుడితో పాటు వైద్య సిబ్బంది తాళం వేసి వెళ్లిపోయారు. చాలాసేపటి వరకు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెకు ఏం జరుగుతోందో తెలియలేదు. అదృష్టవశాత్తు ఆమెకు రాత్రి అపస్మారక స్థితి నుంచి బయటకు రావడంతో మెలకువ వచ్చింది. దీంతో ఆసుపత్రిలో ఎవరూ లేకపోవడంతో ఆందోళన చెంది.. కేకలు వేయడం మొదలు పెట్టింది. లోపలి నుంచి మహిళా రోగి అరుపులు విన్న పరిసరాల ప్రజలు సమాచారాన్ని సదరు వైద్య సిబ్బందికి తెలియజేయడంతో వచ్చి తాళం తీశారు. నిర్లక్ష్యంగా రోగిని లోపల ఉంచి తాళం వేసి వెళ్లిపోవడం పట్ల గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది, వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గ్రూప్-డీ సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆసుపత్రి వైద్యుడైన డాక్టర్ మోహిత్, చీఫ్ ఫార్మసిస్ట్ ప్రవీణ్‌కుమార్‌లను అక్కడి నుంచి బదిలీ చేసినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ పీఎస్ మిశ్రా తెలిపారు. ఈ ఉదంతంపై డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బీకే ఓఝా బృందం విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వనుంది.


తమిళనాట మళ్లీ తన్నీర్, తన్నీర్

$
0
0

చెన్నై, జూన్ 22: తమిళనాడు రాష్ట్రంలో తాగు నీటి ఎద్దడి తీవ్రతరమైంది. తన్నీర్, తన్నీర్ అంటూ ప్రజలు అలమటిస్తున్నారు. ఈ తరుణంలో ద్రవిడ మునె్నట్ర ఖగజం (డీఎంకె) నేతలు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం వేలాదిగా ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఖాళీ బిందెలతో, ఖాళీ మట్టి కుండలతో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేశారు. చెన్నై మాజీ మేయర్ ఎం.సుబ్రహ్మణియన్ నేతృత్వంలో జఫర్‌ఖాన్ పేటలో జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ అసమర్థతేనంటూ నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇలాఉండగా మాజీ మేయర్ సుబ్రహ్మణియన్ ఎఎన్‌ఐ వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నదంటూ మండి పడ్డారు. ఇంత పెద్ద సమస్య వచ్చేంత వరకు ప్రభుత్వం మేల్కొనలేదని, నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరానికి తాగు నీరు తెప్పిస్తున్నామని ముఖ్యమంత్రి పళనిస్వామి చెప్పారని ఆయన తెలిపారు. ఇన్ని రోజులు ఆయన ఏమి చేస్తున్నారని, ముందు జాగ్రత్తగా చర్యలు ఎందుకు చేపట్టలేదని సుబ్రహ్మణియన్ ప్రశ్నించారు. నీటి ఎద్దడి తీవ్రతరమైన తర్వాత మేల్కొంటారా? అని ఆయన అన్నారు. ప్రభుత్వం చేస్తున్న యజ్ఞ-యాగాదులతో ఫలితం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. చెన్నై నగరానికి రోజూ నీటి సరఫరా లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులకోసారి తాగు నీరు వస్తున్నదని తెలిపారు. తాగు నీరు పట్టుకునేందుకు ఉద్యోగాలు మాని ఇంట్లో ఉండాల్సి వస్తున్నదని కొందరు, తాగు నీటి బాటిళ్ళను ఖరీదు చేసేంత ఆర్థిక స్థోమత తమకు లేదని మరి కొందరు వాపోయారు.
సీఎం సమీక్ష..
ఇలాఉండగా ముఖ్యమంత్రి పళనిస్వామి తాగు నీటి ఎద్దడిపై సమీక్షించి తగు చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నీటి కొరత నివారణకు చర్యలు చేపట్టామని అన్నారు. వర్షాలు లేక నగరానికి నీరు అందించే నాలుగు రిజర్వాయర్లు ఎండిపోయాయని ఆయన తెలిపారు.

చిత్రం... తీవ్ర వర్షాభావంతో తల్లడిల్లుతున్న తమిళనాడును కరుణించాలని వరుణుడిని పార్థిస్తూ
శనివారం కోయంబత్తూర్‌లో నిర్వహించిన యాగం ఇది.

నేలమీదే నిద్రించిన కుమార స్వామి

$
0
0

చిత్రం... కర్నాటకలోని యాదగిరి జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం సందర్శించిన కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామి రాత్రి నేలమీదే నిద్రించిన దృశ్యం ఇది.

విమాన విన్యాసంలో ప్రమాదం

$
0
0

హోనోలులు, జూన్ 22: అమెరికాలోని నార్త్ షోర్, హోనోలులు ప్రాంతంలో జరిగిన గగన విన్యాసాల విమాన ప్రమాద దుర్ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఓ చిన్న విమానం ల్యాండింగ్ కావడానికి ముందు దిల్లింగం ఏయిర్ ఫీల్డ్‌కు సమీపంలో కూలిపోయింది. అయితే కూలిపోవడానికి ముందు ఇంజన్‌లో మంటలు చెలరేగి, మొత్తం విమానాన్ని చుట్టు ముట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరూ బతికి ఉండకపోవచ్చని స్కై డైవ్ ఆపరేషన్స్ అధికారులు అన్నారు. నార్త్ షోర్‌లోని ఓహులో హవాలీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ అధికార ప్రతినిధి టిమ్ సకహరా మీడియాతో మట్లాడుతూ విమానం తిరిగి వస్తుండగా విమానానికి నిప్పంటుకోవడం కనిపించిందని తెలిపారు. హోనోలులు అగ్నిమాపక చీఫ్ మాన్యుయల్ నెవాస్ మాట్లాడుతూ విమానాన్ని మంటలు వ్యాపించడంతో తాము (అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా) ఉన్నప్పటికీ, చిన్న విమానాశ్రయం ఫెన్సింగ్ లోపలి భాగంలో విమానం ఒక్కసారిగా నేలకూలిందన్నారు. మంటలార్పడంలో తనకు ఉన్న 40 ఏళ్ళ అనుభవంలో ఇటువంటి ఘోర ప్రమాదాన్ని ఎప్పుడూ చూడలేదని ఆయన బాధగా చెప్పారు. గగన విన్యాసాల కోసం ఈ చిన్న విమానాన్ని ఉపయోగిస్తుంటామని ఆయన తెలిపారు.

వేలాదిగా మరణించిన చేపలు

$
0
0

అంతూపొంతూ లేకుండా కొనసాగుతున్న గీష్మతాపం ఓ పక్క.. వర్షాభావం మరో వైపు చేపల పాలిట
పెనుశాపాలయ్యాయి. కోయంబత్తూర్‌లో వేలాదిగా మరణించిన చేపలే ఇందుకు నిదర్శనం.

‘సుప్రీం’ జడ్జిల సంఖ్యను పెంచండి

$
0
0

న్యూఢిల్లీ, జూన్ 22: సుప్రీంకోర్టులో ఏళ్ల తరబడి పేరుకుపోతున్న అనేక కేసులను పరిష్కరించేందుకు వీలుగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని, హైకోర్టు జడ్జిల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఒక లేఖ రాశారు. సుప్రీంకోర్టులో పదవీ కాలం పూర్తయిన జడ్జిల ఖాళీలను, హైకోర్టు జడ్జిలను ఆర్టికల్ 128, 224ఏ ప్రకారం వెంటనే భర్తీ చేయాలని ఆయన కోరారు. ఈమేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మూడు లేఖలు రాశారు. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఇప్పటికే 58,669 వివిధ రకాల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని, ఎప్పటికప్పుడు కొత్తగా మరికొన్ని కేసులు కూడా వీటికి జమ కావడంతో వాటిని పరిష్కరించేందుకు ఇబ్బందులు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. జడ్జిల కొరతతోపాటు రాజ్యాంగ బెంచీల ఏర్పాటు జరగకపోవడంతో కీలక కేసుల్లో విచారణ జరిపేందుకు జాప్యం జరుగుతోందని గొగోయ్ అభిప్రాయపడ్డారు. ‘మూడు దశాబ్దాల కిందట చూసుకుంటే సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 18 నుంచి 26కు పెరిగింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల తర్వాత 2009లో ఆ సంఖ్య సీజేతో కలుపుకుంటే 31కి పెరిగింది’ అని ఆయన పేర్కొన్నారు. ‘సుప్రీంకోర్టు మరింత సమర్థవంతంగా, చురుకుగా పనిచేసేందుకు వీలుగా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం వల్ల సత్వర న్యాయం కోరుకునే ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యం కొంతవరకైనా నెరవేరుతుంది’ అని సీజే గొగోయ్ అభిప్రాయపడ్డారు. దేశ సర్వోన్నత న్యాయస్థానంతోపాటు హైకోర్టుల్లో సైతం న్యాయమూర్తుల సంఖ్య అనుకున్న రీతిలో పెరగకపోవడం వల్ల అనేకానేక కేసుల్లో విచారణకు జాప్యం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రధానికి రాసిన రెండో లేఖలో..హైకోర్టు జడ్జిల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలని, ఇందుకు రాజ్యాంగ సవరణలను తీసుకువచ్చేందుకు చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సూచించారు. ‘హైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్య పెరగకపోవడం వల్ల వేలాది కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి. హైకోర్టులకు మంజూరైన 399 పోస్టులు లేదా 37 శాతం ఇంకా ఖాళీలు ఉన్నాయి. ఆయా హైకోర్టుల్లో ఇప్పటికే ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను తక్షణ ప్రాతిపదికన భర్తీ చేయాలి’ అని ఆయన మోదీని కోరారు. హైకోర్టు జడ్జిల పదవీ విరమణ వయసును మరో మూడేళ్లు పెంచాలని ఆయన కోరారు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును పెంచడంతోపాటు ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయడం వల్ల పెండింగ్‌లో ఉన్న అపరిష్కృతంగా ఉన్న అనేక కేసుల పరిష్కారానికి చొరవ చూపేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన సూచించారు. ఉద్యోగంలో ఉన్న సమయంలో తనకున్న అపార అనుభవంతో తన వద్దకు వచ్చిన వివిధ కేసుల్లో తగిన రీతిలో స్పందించి, చర్యలు తీసుకునేందుకు న్యాయమూర్తులకు అవకాశం ఉంటుందని, అదే సమయంలో పదవీ విరమణ దగ్గరపడుతున్న సమయంలో దానిపై అదే రీతిలో స్పందించేందుకు కొంత ఇబ్బంది అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ హైకోర్టు జడ్జిల పదవీ విరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు పెంచే విషయాన్ని సానుకూలంగా పరిశీలించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>