హైదరాబాద్, జూలై 28: అంబర్‌పేట్ పోలీస్టేషన్ పరిధిలో జరిగిన చైన్‌స్నాచింగ్ కేసును పోలీసులు 24 గంటలో ఛేదించారు. అంబర్‌పేట్ డీడీ కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్.. విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అంబర్‌పేట్ డీడీ కాలనీ సాయి బాబా ఆలయం దగ్గర ఓ మహిళ మెడలోంచి గుర్తు తెలియని వ్యక్తులు ఈనెల 27 రాత్రి 9.40 గంటల ప్రాంతంలో బంగారు గొలుసును దొంగలించారు. దీంతో బాధితురాలు రాత్రి 11.00 గంటల ప్రాంతంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేటజ్‌ల ఆధారంగా ఈ కేసును కేవలం 12 గంటల్లో ఛేదించి నిందితులను పట్టుకున్నట్లు సీపీ తెలిపారు. ఈస్ట్ జోన్ డీసీపీ పర్యవేక్షణలో ఏసీపీ ఎం.సుదర్శన్ ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపారు. హర్ష జోషి (19), పోట్లకరి మనోజ్ కుమార్ (18), ఠాకుర్ ఆశ్వీన్ సింగ్ (22) కలిసి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డారు. పట్టుబడిన వారు మొదటి సారి దొంగతనానికి పాల్పడిన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు ఛేదించేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని, కానిస్టేబుల్స్‌ను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. నిందితుల నుంచి నాలుగు తులాల పుస్తేల తాడును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
చైన్‌స్నాచర్ల అరెస్ట్
మినీ శిల్పారామంలో సందడి
ఉప్పల్, జూలై 28: చిరు జల్లులు.. చల్లబడ్డ వాతావరణంతో ఆదివారం ఉప్పల్‌లోని మినీ శిల్పారామం సందర్శకులతో సందడి నెలకొంది. పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు చిన్నారులతో సందర్శించి ఆటవిడుపు కార్యక్రమాలతో సందడి చేశారు. సాయత్రం వేళల్లో శ్రీవారి పాదాలు భరతనాట్యం డ్యాన్స్ అకాడమీ వెస్ట్ మారేడుపల్లికి చెందిన నల్ల రమాదేవి శిశ్య బృందం చేసిన భరత నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. పుష్పాంజలి, గణేష శ్లోకం, మల్లారి, మూషిక వాహన, ఉజదయాలాక్షి కామాక్షి, కొండలలో నెలకోన్న చక్కని తల్లికి ఛాంగుబళా, జతిస్వరం, నృత్యాంజలి, ధిల్లాన అంశాలను ప్రదర్శించారు. యుగరాణి, యోగిత, దుర్గ, దీత్య, సంయత, మనస్విని పాల్గొన్నారు.
భారీ వర్షం
జీడిమెట్ల, జూలై 28: నగరం శివారు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. గాజులరామారం, కుత్బుల్లాపూర్ సర్కిళ్లతో పాటు దుందిగల్, గాగిల్లాపూర్, దొమ్మరపోచంపల్లి, బౌరంపేట్, మల్లంపేట్, బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్, బహద్దూర్‌పల్లి, దూలపల్లి, కొంపల్లి గ్రామాలలో ఉదయం నుండి సాయంత్రం వరకు ముసురుతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో బోనాల పండుగ నేపథ్యంలో ఆలయాలకు వెళ్లేందుకు భక్తులు, ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
‘ఎస్‌సీఈడీ’ పథకం ద్వారా ఎన్‌టీపీసీ పరిధిలోని డిస్కంలకు గణనీయ లబ్ధి
న్యూఢిల్లీ, జూలై 28: జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) ‘సెక్యూరిటీ కన్‌స్ట్రెయిన్డ్ ఎకనమిక్ డిస్పాచ్’ (ఎస్‌సీఈడీ) విధానం ద్వారా ప్రాధాన్యతా ప్రాతిపదికన తక్కువ ధరలకే చేస్తున్న విద్యుత్ సరఫరాతో పలు డిస్కంలు లబ్ధిపొందుతున్నాయి. ఎస్‌సీఈడీ విధానం దాదాపు ఏడాది క్రితం అమలులోకి వచ్చింది. దీనిద్వారా విద్యుత్ ఉత్పత్తి సంస్థలు బొగ్గు గనులకు సమీపంలో ఉండే ప్లాంట్లను విస్తరించుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వీలుకలుగుతుంది. దీనివల్ల ఇంధనానికి సంబంధించిన సరుకు రవాణా ఖర్చులు తగ్గుతాయి. తద్వారా విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు తగ్గి అటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు (డిస్కంలు), ఇటు వినియోనియోగదారులు లాభపడతారు. ఐతే తొలుత ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని సవరించి తర్వాత ఈ ఎస్‌సీఈడీ విధానాన్ని జాతీయ స్థాయి ‘మెరిట్ ఆర్డర్’ మేరకు కొన్ని ఎంపిక చేసిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకే పరిమితం చేయడం జరిగింది. దీని ప్రకారం కేంద్రం నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా విద్యుత్ సరపరా సహాయాన్ని కోరినపుడు తొలుత తక్కువ ఇంధన ఖర్చులతో కూడిన యూనిట్ల నుంచి ఆ రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఈక్రమంలో అధికశాతం రాష్ట్రాలు ఈ ఎస్‌సీఈడీ విధానాన్ని వినియోగించుకుంటున్నాయి. ఇందువల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు తక్కువ ధరలకే విద్యుత్ కొనుగోలు అవకాశాలు పెరిగాయి. తాజా అంచనాల మేరకు డిస్కంలకు ఎస్‌సీఈడీ విధానం వల్ల రోజుకు రూ. 2.5 కోట్ల మేర ఆదా అవుతుంది. ప్రస్తుతం 56 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల 49 థర్మల్ పవర్ ప్లాంట్లు ఎస్‌సీఈడీ పైలట్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నాయి. మొత్తం దేశంలోని అన్ని బొగ్గుగనుల సమీప విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులు, రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు ఈ ఎస్‌సీఈడీ ద్వారా ఏడాదికి రూ. 3000 కోట్ల మేర ఆదా చేయగలుగుతున్నాయని తేలింది. కాగా పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ (పీఓఎస్‌ఓసీఓ) ద్వారా కలుగుతున్న ఈ సదుపాయ వల్ల విద్యుత్ రీడ్యూల్ చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతోంది. ఈ పథకం పరిధిలోని కంపెనీలకు తొలుత ఏర్పాటు చేసుకున్న ఒప్పందాల కంటే తక్కువగానే ఆఖరి టారిఫ్‌లు వస్తున్నాయి. ఎన్‌టీపీసీ గ్రూప్ కంపెనీల టోకు విద్యుత్ ఉత్పత్తి 2018-19 సంవత్సరంలో మొత్తం 3.5.90 బిలియన్ యూనిట్లు. అంతకు క్రితం ఏడాది జరిగిన 294.27 బిలియన్ యూనిట్ల ఉత్పత్తికంటే ఇది అధికం. ఈ సంస్థల కనీస విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు రూ. 3.38గా ఉంది.
భారత మార్కెట్లను శాసించనున్న అమెరికన్ ఫెడ్ రేట్ల ప్రభావం!
న్యూఢిల్లీ : దిగ్గజ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, అమెరికన్ ఫెడరేషన్ పన్ను రేట్ల కోత నిర్ణయం వంటి అంశాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని వాణిజ్య రంగ నిపుణులు అంచనావేస్తున్నారు. గత వాణిజ్య వారం చివరి రోజైన శుక్రవారం నాడు ఎట్టకేలకు ఆరు రోజుల నష్టాలను అధిగమించిన సూచీలు స్వల్ప లాభాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా కంపెనీల బలహీన త్రైమాసిక ఫలితాలు, విదేశీ పెట్టుబడులు వెనక్కు మళ్లడం, గడచిన వారం మొత్తానికి అంతర్జాతీయ మార్కెట్ల స్థితిగతులు ఈ వారం సైతం మదుపర్ల సెంటిమెంటును ప్రభావితం చేస్తాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. గత వారం దేశీయ మార్కెట్ల నష్టాల పరంపర, రుతపవనాల ప్రభావం ఇప్పటికీ మెజారిటీ శాతం ప్రాంతాల్లో ఆశించిన మేర లేకపోవడం మదుపర్లు ఆచితూచి అడుగేసేలా చేయవచ్చని ప్రముఖ విశే్లషకుడు రమేష్ తివారీ పేర్కొన్నారు. ప్రస్తుతానికి అందరి కళ్లూ అమెరికన్ ఫెడరేషన్ వడ్డీ రేట్ల నిర్ణయంపైనే కేంద్రీకృతమై ఉన్నాయని, మనదేశంపైకి విదేశీ మదుపర్ల దృష్టి మళ్లాల్సిన అవసరం ఏంతైనా ఉందని మరో విశే్లషకుడు వినోద్ నాయర్ తెలిపారు.
50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం

గాంగ్జూ (దక్షిణ కొరియా)లోని నంబూ యూనివర్శిటీ మున్సిపల్ అక్వాటిక్ సెంటర్‌లో జరిగిన ఫినా ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ మహిళల 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన కనొమీ క్రొమొవిజొజో (నెదర్లాండ్స్). ఈ ఈవెంట్‌లో మరియా కమెనెవా (రష్యా), పెర్నిల్ బ్లూమ్ (డెన్మార్క్) వరుసగా రజత, కాంస్య పతకాలు అందుకున్నారు. పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో కాలెబ్ డ్రెసెల్ (అమెరికా) విజేతగా నిలిచాడు. బ్రూనో ఫ్రాటస్ (బ్రెజిల్), క్రిస్టియన్ గొలొమీవ్ (గ్రేట్ బ్రిటన్) తమ లక్ష్యాన్ని 21.45 సెకన్లలో చేరుకున్నారు. దీనితో నిర్వాహకులు ఇద్దరికీ రజత పతకాన్ని అందించారు.
బ్రిటన్‌కు అమీర్ వలస!
కరాచీ, జూలై 28: ఇటీవలే టెస్టు ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి, సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ భవిష్యత్తులో బ్రిటన్‌కు వలస వెళ్లడం ఖాయని అంటున్నారు. 2016లో అతను బ్రిటిష్ జాతీయురాలు నర్గిస్ మాలిక్‌ను వివాహం చేసుకున్నాడు. దీనితో అతను భార్య వీసాపై 30 నెలలు ఇంగ్లాండ్‌లో ఉండేందుకు అవకాశం దక్కింది. అయితే, త్వరలోనే బ్రిటిష్ పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకుంటాడని, అక్కడికే వెళ్లిపోతాడని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 27 ఏళ్ల అమీర్ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి, వనే్డ, టీ-20 ఫార్మాట్స్‌లో కొనసాగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అతని నిర్ణయాన్ని మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌సహా ఎంతో మంది మాజీ క్రికెటర్లు తప్పుపట్టారు. ఎన్నో రకాలుగా అండదండగా నిలిచిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ని, దేశంలోని క్రికెట్ అభిమానులను మోసం చేశాడంటూ అతనిపై అక్తర్ విరుచుకుపడ్డాడు. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు రుజువు కావడంతో 2010-2011 మధ్యకాలంలో సస్పెన్షన్‌ను ఎదుర్కొన్న అమీర్ ఆతర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ను కొనసాగిస్తున్నాడు. అయితే, ఇంగ్లాండ్‌లో స్థిరపడేందుకే అమీర్ నిర్ణయించుకున్నాడని అతని సన్నిహితులను ఉటంకిస్తూ స్థానిక పత్రికలు కథనాలను ప్రచురించాయి. బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్న తర్వాత కూడా అతను పాకిస్తాన్ తరఫునే వనే్డ, టీ-20 ఫార్మాట్స్‌లో ఆడతాడని సమాచారం. మొత్తం మీద పాకిస్తాన్‌ను విడిచిపెట్టి వెళ్లాలని అమీర్ ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చాడన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఇది ఎంత వరకూ నిజమో తెలియాలంటే వేచి చూడక తప్పదు.
విజేతగా క్రిస్ సైబోర్స్

కెనడాలోని అల్బెర్టా ప్రావీన్స్ ఎడ్మాంటన్‌లో జరిగిన యూఎఫ్‌సీ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ మహిళల 240 ఈవెంట్‌లో ఛాలెంజర్ ఫెలిసియా స్పెన్సర్‌పై బలమైన పంచ్‌ను సంధిస్తున్న క్రిస్ సైబోర్స్ (ఎడమ). ఆమెను ఈ ఈవెంట్‌లో ఏకాభిప్రాయంతో విజేతగా ప్రకటించారు.
పాక్‌లో భారత్ డేవిస్ కప్ జట్టు పర్యటన!
న్యూఢిల్లీ, జూలై 28: భారత డేవిస్ కప్ టెన్నిస్ బృందం పాకిస్తాన్‌లో పర్యటించనుంది. 2006లో ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియంలో భారత్, పాక్ డేవిస్ కప్‌లో చివరిసారి ఢీకొన్నాయి. కాగా, పాకిస్తాన్‌లో భారత బృందం పర్యటించడం 55 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ముంబయిపై ఉగ్రవాద దాడుల తర్వాత పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక క్రీడా సంబంధాలను భారత్ దాదాపుగా రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ షూటింగ్‌సహా పలు ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు పాక్ క్రీడాకారులు చేసుకున్న వీసా దరఖాస్తులను సైతం భారత్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో డేవిస్ కప్ బృందం పాకిస్తాన్‌ను వెళ్లేందుకు సమాయత్తం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటనను అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ప్రధాన కార్యదర్శి హిరణ్మయ్ చటర్జీ ధ్రువీకరించాడు. డేవిస్ కప్ అనేది ద్వైపాక్షిక టోర్నమెంట్ కాదని, కాబట్టి, భారత నిర్ణయానికి వ్యతిరేకంగా పర్యటన జరుగుతున్నదని అనుకోవడానికి వీల్లేదని పీటీఐతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. జట్టుతో తాను స్వయంగా పాకిస్తాన్‌కు వెళతానని తెలిపాడు. ఇటీవల పాకిస్తాన్ హాకీ జట్టు ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఆడేందుకు భారత్ వచ్చిన విషయాన్ని అతను గుర్తుచేశాడు. అదే విధంగా ఇప్పుడు భారత డేవిస్ కప్ జట్టు పాక్‌కు వెళుతుందని అన్నాడు.
జపాన్ ఓపెన్ విజేత మొమొతా

టోక్యో, జూలై 28: జపాన్ ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్థానిక స్టార్ కెన్టో మొమొతా కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో అతను జొనతాన్ క్రిస్టీని 21-16, 21-13 తేడాతో ఓడించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ మొమొతా ఆధిపత్యం కొనసాగితే, గట్టిపోటీని ఇవ్వడానికి క్రిస్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మొదటి సెట్‌లో కొంత మేరకు మొమొతాను ప్రతిఘటించిన క్రిస్టీ రెండో సెట్‌లో ఆ మాత్రం పోరాటపటిమ కూడా చూపలేకపోయాడు. సెమీ ఫైనల్లో భారత ఆటగాడు సాయి ప్రణీత్‌ను 21-18, 21-12 ఆధిక్యంతో ఓడించిన మొమొతా అదే దూకుడును కొనసాగిస్తూ, ఫైనల్లోనూ విజయభేరి మోగించాడు. కాగా, మహిళల సింగిల్స్ టైటిల్‌ను జపాన్ క్రీడాకారిణి అకానే యమాగూచి గెల్చుకుంది. ఫైనల్లో ఆమె తన దేశానికే చెందిన నొజొమీ ఒకుహరాను 21-13, 21-15 తేడాతో ఓడించింది. అటు పురుషులు, ఇటు మహిళల సింగిల్స్ టైటిళ్లను జపాన్ సొంతం చేసుకోవడం విశేషం.
చిత్రం... ట్రోఫీతో మొమొతా
విండీస్ టూర్‌కు భారత్ పయనం నేడే

న్యూఢిల్లీ, జూలై 28: వెస్టిండీస్‌లో మూడు టీ-20, మూడు వనే్డ ఇంటర్నేషనల్స్, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా సోమవారం ఉయంత్రం ఆనర గంటలకు బయలుదేరుతుంది. భారత ఆటగాళ్లు విమానం ఎక్కే ముందు జరిగే విలేఖరుల సమావేశంలో జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొంటాడు. ఈ టూర్‌కు కోహ్లీ వెళ్లడని, అతను విశ్రాంతి కోరుకుంటున్నాడని వచ్చిన వార్తలకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) చెక్ పెట్టింది. అతనే స్వయంగా విలేఖరుల సమావేశానికి హాజరవుతాడని ప్రకటించింది. సెలక్షన్ కమిటీ కోహ్లీని ఎంపిక చేయడంతోనే చాలా వరకు అనుమానాలు పటాపంచలయ్యాయి. అతనే విలేఖరుల సమావేశానికి హాజరైతే, అరకొర అనుమానలు ఏవైనా ఉంటే, అవి కూడా దూరమవుతాయి. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాను అందుబాటులో ఉండడం లేదని ప్రకటించిన నేపథ్యంలో, మూడు ఫార్మాట్స్‌లోనూ రిషభ్ పంత్ వికెట్‌కీపర్‌గా సేవలు అందిస్తాడు. చేతి బొటనవేలి గాయంతో ప్రపంచ కప్ నుంచి అర్ధాంతరంగా వైదొలగిన ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ టూర్‌లో టీ-20, వనే్డ ఇంటర్నేషనల్స్‌లో ఆడతాడు. కాగా, ఈ రెండు ఫార్మాట్స్ నుంచి పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.
రెండో వనే్డలోనూ లంక విజయం

కొలంబో, జూలై 28: బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన రెండో వనే్డలోనూ విజయభేరి మోగించిన శ్రీలంక, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 239 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించిన శ్రీలంక, ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. దీనితో ఈనెల 31న జరగబోయే మూడో వనే్డకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండాపోయింది. ఆ మ్యాచ్‌ని కూడా గెల్చుకొని క్లీన్ స్వీప్ చేసేందుకు శ్రీలంక ప్రయత్నిస్తే, వైట్‌వాష్ నుంచి బయటపడేందుకు ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ శ్రమించాల్సి ఉంటుంది.
మొదటి వనే్డను 91 పరుగుల తేడాతో చేజార్చుకున్న బంగ్లాదేశ్ రెండో వనే్డలో టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుంది. అయితే, ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీం అజేయంగా 98 పరుగులు చేయగా, చివరిలో మెహదీ హసన్ 43 పరుగులు సాధించాడు. వీరిద్దరి పోరాట ఫలితంగా బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 238 పరుగులు చేయగలిగింది. నువాన్ ప్రదీప్, ఇసురుఉడానా, అకిల ధనంజయ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
బంగ్లాదేశ్‌ను ఓడించి సిరీస్‌ను సాధించేందుకు 239 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో వెన్నుదన్నుగా నిలిచాడు. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (15) తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ, కుశాల్ పెరెరాతో కలిసి అతను స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. 75 బంతులు ఎదుర్కొని, 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు చేసిన అతను తమీమ్ ఇక్బాల్ క్యాచ్ అందుకోగా ముస్త్ఫాజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కుశాల్ పెరెరా 30 పరుగులు చేసి, ముస్త్ఫాజుర్ బౌలింగ్‌లోనే సౌమ్య సర్కార్ క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. అనంరతం ఏంజెలో మాథ్యూస్ (52 నాటౌట్), కుశాల్ మేండిస్ (41 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డారు. లంక 44.4 ఓవర్లలో మూడు వికెట్లకు 242 పరుగులు సాధించి, ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్: 50 ఓవర్లలో 8 వికెట్లకు 238 (ముష్ఫికర్ రహీం 98 నాటౌట్, మెహిదీ హసన్ 43, నువాన్ ప్రదీప్ 2/53, ఇసురు ఉడానా 2/58, అకిల ధనంజయ 2/39).
శ్రీలంక: 44.4 ఓవర్లలో 3 వికెట్లకు 242 (ఆవిష్క ఫెర్నాండో 82, కుశాల్ పెరెరా 30, కుశాల్ మేండిస్ 41 నాటౌట్, ఏంజెలో మాథ్యూస్ 52 నాటౌట్, ముస్త్ఫాజుర్ రహ్మాన్ 2/50, మెహదీ హసన్ 1/51).
*
చిత్రం... లంక టాప్ స్కోరర్ ఆవిష్క ఫెర్నాండో (82)
మేరీ కోమ్ జోరు

న్యూఢిల్లీ: ఆరు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిళ్లను కైవసం చేసుకున్న భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నది. ప్రెసిడెంట్స్ కప్ టోర్నీలో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. మహిళల 51 కిలోల విభాగంలో పోటీపడిన ఆమె ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన లాబువన్ బజోను 5-0 పాయింట్ల తేడితో చిత్తుచేసి, ఆధిపత్యాన్ని రుజువు చేసుకుంది. 36 ఏల్ల మేరీ కోమ్ ఈ ఏడాది మే మాసంలో నిర్వహించిన ఇండియన్ ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్‌లోనూ స్వర్ణ పతకాన్ని అందుకుంది. ఒలింపిక్ క్వాలిఫికేషన్ ఈవెంట్స్‌పై దృష్టి సారించిన ఆమె మే మాసంలోనే జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 7 నుంచి 21వ తేదీ వరకు జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఆమె సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తున్నది. అదే విధంగా 2020 ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడాన్ని కూడా ఆమె లక్ష్యంగా ఎంచుకుంది. ఈ రెండు టోర్నీలు ముగిసిన తర్వాత మేరీ కోమ్ తన కెరీర్‌ను ముగించే అవకాశాలు ఉన్నాయి.
చిత్రం... పోడియంపై పతకాన్ని స్వీకరించిన తర్వాత జాతీయ గీతం ఆలపిస్తున్న మేరీ కోమ్
భారత సైకత శిల్పికి పీపుల్స్ ఛాయిస్ అవార్డు

న్యూయార్క్, జూలై 28: భారత్‌కు చెందిన ప్రముఖ సైకత శిల్పి, పద్మ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ అమెరికాలో జరిగిన సైకత శిల్పకళా ఉత్సవంలో ప్రతిష్టాత్మక పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెల్చుకున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల సముద్ర జలాలు కలుషితం కాకుండా పోరాడాలని తాను చెక్కిన శిల్పం ద్వారా చక్కని సందేశం ఇవ్వడంతోపాటు అమెరికా పౌరులను ఆశ్చర్యగొలిపేలా చేయడంతోపాటు ప్రశంసలు అందుకున్నారు. బోస్టన్‌లోని మసాచుసెట్స్‌లో నిర్వహించిన ఈ సైకత శిల్పకళా ఉత్సవంలో ప్రపంచంలోని 15 మంది అగ్రశ్రేణి సైకత శిల్పులు హాజరయ్యారు. ఈ ఉత్సవంలో సుదర్శన్ పట్నాయక్ తయారు చేసిన ‘ప్లాస్టిక్ కలుషితాన్ని ఆపండి. మన సముద్రాలను రక్షించండి’ అనే సందేశం ఇస్తూ తయారుచేసిన సైకత శిల్పానికి ‘పీపుల్స్ ఛాయిస్ అవార్డు’ దక్కింది. ప్రతిష్టాత్మక ప్రపంచ పురస్కారం తనకు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సుదర్శన్ పట్నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘అమెరికాలో తనకు ఇలాంటి గొప్ప అవార్డు రావడాన్ని అత్యంత గౌరవంగా భావిస్తాను. ప్లాస్టిక్ భూతంప నేను చేస్తున్న పోరాటానికిగాను భారత్‌కు ఈ అవార్డు దక్కింది’ అని అన్నారు. అంతేకాకుండా సముద్రంలో ప్లాస్టిక్ కలుషితం కాకుండా ప్రజల్లో అవగాహనను మరింత పెంపొందించడం ఇపుడు ఎంతో ముఖ్యమని ఆయన పీటీఐ ప్రతినిధితో మాట్లాడుతూ అన్నారు.
కాశ్మీర్‌పై రేపు బీజేపీ కోర్ కమిటీ భేటీ

న్యూఢిల్లీ, జూలై 28: జమ్మూ కాశ్మీర్‌లో రాజకీయ పరిస్థితి గురించి చర్చించేందుకు అలాగే రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేసుకునేందుకు కాశ్మీర్ బీజేపీ కీలక బృందం సమావేశమవుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వాటిని ఎదుర్కొనేందుకు పార్టీని సన్నద్ధం చేయాలనే ఉద్దేశ్యంతో బీజేపీ జాతీయ నాయకత్వం ఈ సమావేశానికి పిలుపునిచ్చింది. మంగళవారం జరిగే ఈ కోర్ కమిటీ భేటీకి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ జాతీయ తాత్కాలిక అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనాలతో పాటు ఇతర సీనియర్ నేతలు ఈ చర్చలో పాల్గొంటారని అభిజ్ఞవర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదిలోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరపాలని రాంమాధవ్ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొన్న దృష్ట్యా రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకునే ఉద్దేశ్యంతోనే బీజేపీ కోర్‌కమిటీ సమావేశం ఏర్పాటు అవుతోంది. ఎన్నికలు ఏర్పాటు చేయడానికి ఈసీకి ఇంకా గడువు ఉందని, అయితే వీటిని ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని బీజేపీ పట్టుబడుతోంది. 2014లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం కాశ్మీర్ రాష్టప్రతి పాలన కింద ఉంది. ఈనెల 3తేదీ నుంచి మరో ఆరు నెలలపాటు రాష్టప్రతి పాలనను పొడిగించిన విషయం తెలిసిందే.
బోన మెత్తిన సింధు

చిత్రం... హైదరాబాద్‌లో ఆదివారం లాల్ దర్వాజా బోనాల్లో బోన మెత్తిన ప్రముఖ బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు
మాకు గ్రీన్ బోనస్ ఇవ్వండి..

ముస్సోరి (ఉత్తరాఖండ్), జూలై 28: తమ అవసరాలు తీర్చడానికి ప్రత్యేకంగా కేంద్రంలో ఓ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని హిమాలయ ప్రాంతాల రాష్ట్రాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం తాము చేస్తున్న కృషికి గుర్తింపుగా గ్రీన్ బోనస్ కూడా ఇవ్వాలని ఆదివారం ఇక్కడ జరిగిన ఓ సదస్సులో కోరాయి. ఈ రెండు రోజుల సదస్సును ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తమ ఉమ్మడి అజెండాను ఈ ప్రాంత రాష్ట్రాలు అందించాయని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. జమ్మూ-కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాల్యాండ్, త్రిపుర, మిజోరం, మణిపూర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాటి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. అస్సాం నుంచి మాత్రం ఎవరూ హాజరుకాలేదు. తమ సమస్యల తక్షణ పరిష్కారానికి కేంద్రంలో ప్రత్యేకంగా ఓ మంత్రివర్గం ఉండాలని ఈ హిమాలయ రాష్ట్రాలు ఉమ్మడిగా డిమాండ్ చేయడం ఇదే మొదటి సారి. తమకు గ్రీన్ బోనస్ ఇవ్వాలన్న డిమాండ్ ఎంతైనా సహేతుకమని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రావత్ స్పష్టం చేశారు. దేశంలోని దాదాపు అన్ని నదులు హిమాలయ ప్రాంతం నుంచి ఉద్బవిస్తాయని, ప్రధాని నరేంద్ర మోదీ జల సంరక్షణ లక్ష్యం నెరవేరాలంటే ఈ ప్రాంత రాష్ట్రాలు క్రీయాశీలక భూమిక పోషించాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణకు ఈ హిమాలయాలు చేస్తున్న కృషి కూడా అత్యధికమేనని వెల్లడించారు. ఈ ప్రాంతంలోని చాలా భూభాగం పర్యావరణ సునిశిత జోన్ల పరిథిలోకి వెళ్ళిపోవడం వల్ల అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టే అవకాశం లేదని ఆయన అన్నారు. దీనికి నష్టపరిహారంగా ఈ ప్రాంత రాష్ట్రాలకు గ్రీన్ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చిత్రం... ముస్సోరీలో ఆదివారం జరిగిన హిమాలయ ప్రాంత రాష్ట్రాల
సదస్సును ప్రారంభిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
హాంకాంగ్‌లో నిరసనాగ్నులు

హాంకాంగ్, జూలై 28: చైనా విధానాలపై హాంకాంగ్ నిరసనకారుల ఆగ్రహాం చల్లారడం లేదు. రబ్బర్ తూటాలు పేల్చినా, బాష్పవాయువు గోళాలను ప్రయోగించినా ససేమిరా అంటూ వీధికెక్కుతున్నారు. శనివారం పోలీసులు తరిమికొట్టే ప్రయత్నం చేసినప్పటికీ పట్టువీడని రీతిలో ఆదివారం కూడా వేలాదిగా ప్రదర్శన నిర్వహించారు. తీవ్ర స్థాయిలో ఆంక్షలు విధించినప్పటికీ అపజలు ఇంత భారీగా నిరసనలు వ్యక్తం చేయడంతో మరోసారి హాంకాంగ్ పరిస్థితి మరింత సంక్షోభంలో పడ్డట్లు అయ్యింది. ఆదివారం ర్యాలీకి అనుమతి లేదని అధికారులు స్పష్టంగా చెప్పినా, దానిని ధిక్కరించి మరీ ప్రదర్శన నిర్వహించడంతో పాలకులు అవాక్కు అవుతున్నారు. కేవలం పార్క్‌లోనే ర్యాలీకి అనుమతి ఉన్నప్పటికీ వేలాదిగా తరలి వచ్చిన జనం అన్ని వీధుల్లో నిండిపోవడంతో అధికారులకు ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తింది. వరుసగా రెండో రోజు కూడా వీధికెక్కిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు మళ్లీ బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.
సుప్రీంలో సవాల్ చేస్తాం..
పుణే/బెంగళూరు, జూలై 28: కర్నాటక అసెంబ్లీ నుంచి తమను సస్పెండ్ చేస్తూ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని కాంగ్రెస్- జేడీ(ఎస్) రెబెల్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఆదివారం కాంగ్రెస్-జేడీ (ఎస్)కు చెందిన 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి స్పీకర్ రమేశ్ కుమార్ వారికి షాక్ ఇచ్చారు. వీరిలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గు రు జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు ఉన్నారు. గురువారం ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇలాఉండగా స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై రెబెల్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రతిస్పందించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి ఇది వ్యతిరేకం అని వారు విమర్శిస్తున్నారు. కుమారస్వామి బలనిరూపణ ఓటింగ్ జరిగినప్పుడు అసెంబ్లీకి హాజరుకాకపోవడంతో వారిపై చర్య తీసుకున్నట్లు స్పీకర్ ప్రకటించారు. స్పీకర్ నిర్ణయంపై తాము సోమవారం సుప్రీం కోర్టులో సవాల్ చేయనున్నట్లు జేడీ(ఎస్) ఎమ్మెల్యే ఏహెచ్ విశ్వనాథ్ తెలిపారు. సోమవారమే సీఎం యెడుయూరప్ప అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. స్పీకర్ నిర్ణయంతో బీజేపీ నాయకులు కూడా ఆశ్చర్యపోయారు. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలలో పలువురు బీజేపీ మంత్రివర్గంలో చేరవచ్చని ఆశించారు. కానీ స్పీకర్ సోమవారం యెడుయూరప్ప బల నిరూపణకు ముందే నిర్ణయం తీసుకోవడంతో వారు షాక్ అయ్యారు.
కిం కర్తవ్యం!?

న్యూఢిల్లీ, జూలై 28: కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? ఈ ప్రశ్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను తీవ్రంగా కలిచివేస్తోంది. పార్టీ అధ్యక్షుడు ఎవరో తేలకపోవడంతో సర్వత్రా అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడుగా యువనేత అయితే బాగుంటుందన్న ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. గాంధీ కుటుంబం నుంచి ఎవరొచ్చినా ఫరవాలేదని కూడా అభిప్రాయం వెల్లడౌంతోంది. ఏదేమైనా దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో నెలకొన్న అయోమయ స్థితికి త్వరితగతిన ఫుల్‌స్టాప్ పెట్టాలనీ.. పార్టీని గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బలోపేతం చేయగలిగే నేత అధ్యక్షుడుగా వస్తేనే కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశిధరూరల్ ఢిల్లీలో ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం పార్టీ క్యాడర్‌లో అసంతృప్తి కలిగించిందనీ.. ఏమైనా ప్రస్తుతం నెలకొన్న సందిగ్ధతను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. పార్టీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితిని వెంటనే తెర దించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కి చెప్పారు. పార్టీ అధ్యక్షుడు ఎవరో తేలిన తరువాతే ఇతర సీడబ్ల్యుసీ సభ్యుల దగ్గర నుంచి ఇతర కీలక పదవులకు ఎవరిని నియమించాలన్న అంశంలో స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితిలో యువ నాయకత్వంతోనే పార్టీకి సరైన న్యాయం జరుగుతుందని ఇప్పటికే పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. అధ్యక్ష పదవికి ప్రియాంక గాంధీ పోటీ చేయాలా? వద్దా? అన్న అంశంపై ఆ కుటుంబం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు ధరూర్ చెప్పారు. అయితే, అధ్యక్షుడు ఎవరన్నది తేలకపోవడంతో కీలక నిర్ణయాలు తీసుకొనే అంశంలో పార్టీ గందరగోళంలో పడిపోతోందని ఆయన వ్యక్తం చేశారు. అటు పార్టీ కార్యకర్తలు, ఇటు అభిమానులను ఈ అంశం తీవ్ర నిరాశా, నిస్పృహలకు గురిచేస్తోందని ధరూర్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియను త్వరితగతిన ముగించి పార్టీ శ్రేణుల్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని ఆయన కోరారు. ఇందుకు అవసరమైతే తాత్కాలిక అధ్యక్షుడిని నెలకొల్పడం ద్వారా కూడా కొంతమేర పరిస్థితిని చక్కదిద్దినట్లు అవుతుందని చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవిపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అభిప్రాయం సరైనదేనని ధరూర్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పార్టీలో నెలకొన్న అనిశ్చితిని రూపుమాపగలిగే సరైన నేత పార్టీకి అవసరమని అన్నారు. తద్వారా పార్టీ పూర్వవైభవం సంతరించుకొనే అవకాశం ఉంటుందని చెప్పారు. ఓటర్లలో చైతన్యం నింపగలిగే వ్యక్తి అధ్యక్షుడుగా రావాలని కోరుకొంటున్నట్లు ధరూర్ స్పష్టం చేశారు.