Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

హెపటైటిస్‌పై ఉమ్మడి పోరు

$
0
0

న్యూఢిల్లీ, జూలై 28: హెపటైటిస్ వంటి వ్యాధులను తరమి కొట్టి వ్యాధుల రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు దేశ ప్రజలు చేతులు కలపాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పిలుపునిచ్చారు. ప్రపంచ హెపటైటీస్-డే సందర్భంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిల్లారీ సైనె్సస్ (ఐఎల్‌బీఎస్) శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి స్పీకర్ బిర్లా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ బిర్లా ప్రసంగిస్తూ హెపటైటీస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి, అప్రమత్తం చేసేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు. ముఖ్యంగా హెపటైటీస్-బీ, హెపటైటీస్-సి చాలా ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా పూర్తిగా నిరోధించవచ్చని అన్నారు. పోలియో మహామ్మరిపై పోరాటం చేసి అణగ దొక్కగలిగామని ఆయన చెప్పారు. హెపటైటీస్ వ్యాధిపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పార్లమెంటు సభ్యులు కూడా నడుం బిగించాలన్నారు. మీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని చేపట్టాల్సిందిగా తాను ఎంపీలందరినీ కోరుతానని బిర్లా చెప్పారు. ప్రపంచ హెపటైటీస్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమానికి స్పీకర్‌తో పాటు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్షవర్దన్ ప్రసంగిస్తూ హెపటైటీస్ వ్యాధి వైరల్ కాకుండా అరికట్టి, నామరూపాలు లేకుండా చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రసంగిస్తూ హెపటైటీస్‌పై ఉమ్మడిగా పోరాటం చేయాల్సి ఉందన్నారు. తన మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి సహాయాన్ని అయినా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఇంకా కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్, న్యాయవేత్త నారిమన్ తదితరులు పాల్గొన్నారు.


కాశ్మీర్‌కు పొంచిఉన్న ‘ఉగ్ర’ ముప్పు

$
0
0

న్యూఢిల్లీ, జూలై 28: జమ్ముకాశ్మీర్‌లో అతిపెద్ద ఉగ్రదాడికి సిద్ధమవుతున్న ఇస్లామిక్ ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం మరో పదివేల మంది భద్రతా దళాలను పంపించినట్లు తెలిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా ఒకటి, రెండు రోజుల్లో సీనియర్ అధికారులతో సమావేశమై జమ్ముకాశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జమ్ముకాశ్మీర్‌లో ప్రస్తుతం అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతోంది. భద్రతా దళాలు లేదా అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు పెద్దఎత్తున దాడులు చేసే ప్రమాదం ఉన్నదని భారత గూఢచార సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు తెలిసింది. జాతీయ భద్రతా వ్యవహాల సలహాదారు అజీత్ దోవల్ రెండు రోజుల పాటు శ్రీనగర్‌లో సైనిక, సీఆర్‌పీఎఫ్, జమ్ముకాశ్మీర్ పోలీసులు, గూఢచార సంస్థ సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశాలు జరిపిన తరువాతనే కేంద్ర ప్రభుత్వం జమ్ముకాశ్మీర్‌కు అదనంగా మరో పదివేల మంది భద్రతా సిబ్బందిని పంపించినట్లు తెలిసింది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఇస్లామిక్ సంస్థలు జమ్ముకాశ్మీర్‌లో అతిపెద్ద ఉగ్రవాదాడికి సిద్ధమవుతున్నట్లు భారత నిఘా సంస్థ ‘రా’, ఇంటలిజెన్స్ బ్యూరో ఇతర గూఢచార సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి కచ్చితమైన సమాచారం అందజేసినట్లు తెలిసింది. ఉగ్రవాదుల దాడులను తప్పికొట్టేందుకు ఏం చేయాలనేది లోతుగా చర్చించిన తరువాతనే కేంద్ర ప్రభుత్వం అదనంగా పదివేల మంది భద్రతా సిబ్బందిని జమ్ముకాశ్మీర్‌లో మోహరించాలనే నిర్ణయం తీసుకున్నదని అంటున్నారు. అమర్‌నాథ్ యాత్రికుల భద్రత కోసం ఇప్పటికే నలభై వేల మంది దళాలను మోహరించారు. దీనికితోడు జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అరికట్టేందుకు మరి కొన్ని వేల భద్రతా దళాలు పని చేస్తున్నాయి.
జమ్ముకాశ్మీర్‌లో ఇటీవల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జమ్ముకాశ్మీర్ శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. పంచాయతీ ఎన్నికల మాదిరిగా శాసనసభ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగితే ప్రజల్లో మార్పు వచ్చి ఉగ్ర కార్యకలాపాలకు నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని భావిస్తున్న పాకిస్తాన్ గూఢచార సంస్థ రాష్ట్రంలో పెద్దఎత్తున దాడులు జరిపించేందుకు ఇస్లామిక్ ఉగ్రవాదులను సిద్ధం చేస్తోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రాష్ట్రానికి అదనంగా తరలించిన పదివేల మంది భద్రతా సిబ్బందిని అత్యంత కీలక ప్రాంతాల్లో మోహరించిటం కూడా పూర్తయిందని హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి.

జాతీయ మృగానికి భద్రత కరువు

$
0
0

విశాఖపట్నం, జూలై 28: జాతీయ మృగం పులి వేటగాళ్ల వలలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. గడచిన ఆరేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో 10 పులులు మరణించాయి. వీటిలో నాలుగు పులులు వేటగాళ్లకు బలికాగా, ఇప్పటి వరకూ నాలుగు కేసుల్లో పులి చర్మాలు, ఇతర అవయవాలు స్వాధీనం చేసుకున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. 2012 నుంచి 2018 వరకూ తెలంగాణలో 3 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 6 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 2012 నుంచి 2018 మధ్యకాలంలో 657 పులులు మరణించగా, వీటిలో 313 సాధారణ మరణాలుగా గుర్తించారు. మరో 35 పులులు ప్రమాదాలు, ఇతర కారణాలతో మృతి చెందాయని నిర్ధారించగా, 87 పులుల మరణాలు ఏ విధంగా సంభవించాయన్నది ఇప్పటికీ తేలలేదు. వీటితోపాటు 138 పులులు వేటగాళ్లకు బలయ్యాయి. మరో 84 కేసుల్లో పలి చర్మాలు, అవయవాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 63 పులులు మరణించినట్టు నిర్ధారించారు. వీటిలో 56 మరణాలు సాధారణంగానే జరిగినట్టు నిర్ధారించగా, మరో 7 కేసుల్లో పులుల అవయవాలు స్వాదీనం చేసుకున్నారు.
దేశవ్యాప్తంగా పులుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాలు సహా, మరో రెండు చిన్న రాష్ట్రాల్లో మాత్రం తగ్గుతూ వస్తున్నట్టు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. 2006 నాటికి దేశంలో 1411 పులులు ఉన్నట్టు గుర్తించగా, వీటిని కాపాడేందుకు కేంద్రం ప్రాజెక్టు టైగర్‌ను అమలు చేసింది. దీంతో 2010 నాటికి వీటి సంఖ్య 1706కు, 2014 నాటికి 2226కు పెరిగింది. అయితే ఇదే సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రాజెక్టు టైగర్ అమల్లో ఉన్నప్పటికీ పులుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వీటి సంఖ్య 2006 నాటికి 95 కాగా, 2014 నాటికి 68కి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం అటవీ శాఖలో సిబ్బంది కొరతగా యంత్రాంగం పేర్కొంటోంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 1800 మంది అటవీ సిబ్బంది నియామకాన్ని చేపట్టగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా అటువంటి ప్రక్రియ చేపట్టలేదు. ఇదే తీరు కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో జాతీయ మృగాన్ని చరిత్ర పాఠాల్లో చదువుకోవాల్సిందే.

టీబీ డ్యాంలో 23.33 టీఎంసీలు.. ఇన్‌ఫ్లో 14,348 క్యూసెక్కులు

$
0
0

బొమ్మనహాల్, జూలై 28 : కర్నాటకలోని తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 23.33 టీఎంసీలకు చేరినట్లు జలాశయం సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ వెంకటరమణ ఆదివారం తెలిపారు. జలాశయం పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న తేలికపాటి వర్షాలకు 14,348 క్యూసెక్కుల వరద జలాశయంలోకి వచ్చి చేరుతోందన్నారు. గత ఏడాది ఈ సమయానికి జలాశయంలో నీటి నిల్వ 94.313 టీఎంసీలు నమోదు కాగా 62,415 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండేదన్నారు. ఇన్‌ఫ్లో ఆశాజనకంగా లేని కారణంగా ఆగస్టు లోపు జలాశయంలో నీటి మట్టం పెరిగితే తప్ప తాగు, సాగునీటికి నీటి విడుదల సాధ్యం కాకపోవచ్చునని సూచనప్రాయంగా అన్నారు. ఇదిలా ఉండగా జలాశయంలోకి 50 టీఎంసీల నీరు చేరితే తప్ప ఐఏబీ సమావేశం నిర్వహించే ప్రసక్తే లేదని జలాశయం కమిషనర్ తెలిపినట్లు ఆయన తెలిపారు.

పాలకుల అపసవ్య విధానాల వల్లే ఆగని రైతుల ఆత్మహత్యలు: సీపీఐ

$
0
0

విజయవాడ, జూలై 28: రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు అన్ని జిల్లాల్లో సీపీఐ రాష్ట్ర నాయకత్వం పర్యటించనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో, దేశంలో పాలకుల ఆర్థిక విధానాల ఫలితంగా వ్యవసాయ రంగం కుదేలయ్యిందని ఆయన విమర్శించారు. దీనికితోడు కరవు, తీవ్ర వర్షాభావ పరిస్థితులు, గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల రైతు కుటుంబాలు అతలాకుతలమయ్యాయని తెలిపారు. ఫలితంగా రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుని తీర్చలేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇటీవలి ఎన్నికల అనంతరం నూతన ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగడం దురదృష్టకరమని నిరసన తెలిపారు. నూతన ప్రభుత్వం రైతులను ఆదుకోవడాకి కొన్ని చర్యలు, పథకాలు చేపట్టినప్పటికీ ఆత్మహత్యలు ఆగలేదన్నారు. రాష్ట్రంలో విస్తారమైన ప్రాంతంలో కరవు, వర్షాభావ పరిస్థితుల కొనసాగుతున్నాయని, వలసలు ఆగడం లేదన్నారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సీపీఐ రాష్ట్ర నాయకత్వం పర్యటించి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి మానసిక స్థైర్యం నింపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం నిర్ణయించిందని రామకృష్ణ వివరించారు.

టీడీపీకి మరో షాక్..

$
0
0

ప్రొద్దుటూరు టౌన్, జూలై 28: తెలుగుదేశం పార్టీ తనను మోసం చేసిందని అందుకే ఆ పార్టీని వీడి త్వరలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలోని తన నివాసంలో ఆదివారం వీరశివారెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ తనను పూర్తిగా మోసం చేసిందని, దీంతో నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జెరూసలెంకు వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి కూడా తనను పార్టీలోకి ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రజల సంక్షేమం కోసం నవరత్నాలు పథకాలను అమలు చేయడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. సీఎం జగన్ జిల్లాలో ఉక్కు కర్మాగారానికి డిసెంబర్ 26వ తేదీ శంకుస్థాపన చేయడంతో పాటు చెన్నూరులో ఉన్న చక్కర కర్మాగారాన్ని ప్రారంభించడంతో జిల్లా రైతాంగం, యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయన్నారు.

చిత్రం...ప్రొద్దుటూరులో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి

టీటీ మహిళలు, యూత్ చాంప్స్ శైలూ, కాజోల్

$
0
0

విజయవాడ (ఎడ్యుకేషన్), జూలై 28: నగరంలోని దండమూడి రాజగోపాలరావు నగర పాలక సంస్థ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న రాష్టస్థ్రాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. పురుషుల చాంపియన్‌షిప్‌ను గుంటూరుకు చెందిన పవన్‌కుమార్ కైవసం చేసుకోగా, మహిళల చాంపియన్‌షిప్‌ను కృష్ణా జిల్లాకు చెందిన శైలూ నూర్‌బాషా దక్కించుకుంది. రన్నరప్స్‌గా జగదీష్ కృష్ణ (గుంటూరు), కాజోల్ (కృష్ణా) నిలిచారు. యూత్ బాలుర విభాగంలో కాకినాడకు చెందిన టి సూర్యతేజ చాంపియన్‌గా, రన్నరప్‌గా సీహెచ్ నితేష్‌వర్మ నిలిచారు. బాలికల విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన ఆర్ కాజోల్ చాంపియన్‌షిప్ దక్కించుకోగా రన్నరప్‌గా కృష్ణా జిల్లాకే చెందిన శైలూ నూర్‌బాషా నిలిచింది. జూనియర్స్ బాలుర విభాగంలో కాకినాడకు చెందిన టి సూర్యతేజ, అనంతపురానికి చెందిన సీ కుశాల్‌కుమార్ ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. బాలికల విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన కాజోల్, రాజమండ్రికి చెందిన చార్వీ వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాలు దక్కించుకున్నారు. సబ్ జూనియర్స్ బాలుర విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన ఎంవీ కార్తికేయ, అనంతపురానికి చెందిన బీ ధార్మిక్ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో విశాఖపట్టణానికి చెందిన టీ అర్షిత, రాజమండ్రికి చెందిన చార్వీ మొదటి రెండు స్థానాలు కైవసం చేసుకున్నారు. మినీ క్యాడెట్ విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన తన్వీ చాంపియన్‌గా నిలిచింది.
చిత్రం...సాధించిన బహుమతులతో విజేతలు

రిజర్వేషన్లు ఇవ్వననడం కాపులకు బ్లాక్ డే

$
0
0

పాలకొల్లు, జూలై 28: కాపులకు రిజర్వేషన్లు కల్పించడాన్ని నిరాకరిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రోజు చరిత్రలో కాపులకు బ్లాక్ డేగా నిలిచిపోతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన విలేఖర్లతో మాట్లాడారు. బ్రిటీష్ కాలంలో కాపులను బీసీలుగా గుర్తించారని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడగానే దీనిని రద్దుచేసినా తిరిగి నాటి ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య కాపులను బీసీలుగా ప్రకటించారని, కానీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం 1962లో రద్దుచేసిందన్నారు. 40 సంవత్సరాల అనంతరం టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు కాపులను బీసీలుగా ప్రకటించి, కమిషన్ వేసి, కేంద్రానికి పంపారని, కేంద్రం సముఖంగా లేకపోవటంతో ఈబీసీలకు ప్రకటించిన పది శాతం రిజర్వేషన్‌లో 5 శాతం కాపులకు అందేలా చూడాలని నిర్ణయించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఇప్పుడా నిర్ణయాన్ని అమలుచేయలేమని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చెప్పటం దారుణమన్నారు. తమకు రాజకీయ రిజర్వేషన్లు అక్కర్లేదని, తమ పిల్లలకు ఆర్థిక సాయం, విద్య నేర్పమని మాత్రమే కోరారని ఆయన గుర్తుచేశారు. కాపులు, కాపుసంఘాలు ముందుకు వస్తే తాము మద్దతు ఇచ్చి వారి కోసం పోరాటం చేస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


శాస్త్ర, సాంకేతిక రంగాలతోనే అభివృద్ధి

$
0
0

నెల్లూరు, జూలై 28: భవిష్యత్తులో అభివృద్ధి చెందాలంటే శాస్త్ర, సాంకేతిక రంగాలే ముఖ్యమని, ఆ దిశగా విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాల్సిన గురతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని భారత రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటలోని సైన్స్ సెంటర్‌లో భారతరత్న, ప్రముఖ భౌతికశాస్తవ్రేత్త డాక్టర్ సర్ సివి రామన్ విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి డిఆర్‌డిఓ చైర్మన్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. తొలుత చైర్మన్ జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబుతో కలసి ప్రదర్శనశాల ప్రాంగణంలో ఆకాష్ క్షిపణి నమూనాను ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ సర్ సివి రామన్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ చైర్మన్ మాట్లాడుతూ ఆకాష్ క్షిపణి భారతదేశంలో తయారుచేసిన క్షిపణుల్లో చాలా ముఖ్యమైనదన్నారు. 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాన్ని గాని, క్షిపణిని గాని ఛేదించే శక్తిసామర్ధ్యాలు ఆకాష్‌కు ఉందన్నారు. అందుకే భారత సైన్యం అమ్ముల పొదిలో ఆకాష్ చేరిందని, 25 వేల కోట్ల రూపాయల ఆర్డర్లు వచ్చాయన్నారు. ఆకాష్ నమూనా క్షిపణి 1:1 పరిమాణంలో డిఆర్‌డిఓ ప్రయోగశాలలో తయారుచేయించి ఇక్కడకు పంపించామన్నారు. ఇక్కడి విజ్ఞాన ప్రదర్శనశాల అభివృద్ధి కోసం భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహాన్ని చూపుతుండటం చాలా సంతోషదాకమన్నారు. ఇందులో భాగంగా డాక్టర్ సర్. సివి రామన్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల్లో చిన్నతనం నుండే విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తి పెంపొందించే బాధ్యత అవ్వతాతలు, తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులపై ఉందన్నారు.
ఇక్కడి ఉపాధ్యాయులు దేశానికి ఉపయోగపడే శాస్తవ్రేత్తలను తయారుచేస్తారనే నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లావాసులు ఎంతో అదృష్టవంతులని, ఉదాత్తమైన ఆలోచన కల్గిన జిల్లా కలెక్టరు జిల్లాకు వచ్చారని అన్నారు. విజ్ఞాన ప్రదర్శనశాలలో ఒక ఇంకుబేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం పత్రాలు తయారుచేసి పంపుతామని, సెమినార్లకు ఉపయోగపడే విధంగా ఒక మంచి సమావేశం మందిరం ఏర్పాటు చేస్తామని, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్) నిధులను విజ్ఞాన కేంద్రం అభివృద్ధికి వినియోగిస్తామని కలెక్టర్ చెప్పడం ఎంతో శుభపరిణామమన్నారు. ఉపగ్రహం ఒక సెకనుకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, అటువంటి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనే ధ్వంసం చేసే శక్తిసామర్థ్యాలున్న ‘ఏ శ్యాట్ క్షిపణిని’ డిఆర్‌డిఓ ప్రయోగశాలలో తయారుచేశామని, దీనిని ఈ ఏడాది మార్చి 27వ తేదీన ప్రయోగించి విజయం సాధించామన్నారు. అమెరికా, రష్యా, చైనా తరువాత మన భారతదేశం ఆ క్షిపణి తయారీలో ముందుందన్నారు. ఆ క్షిపణి ప్రయోగం జరిగిన రెండు నిమిషాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో ఫోన్‌లో మాట్లాడిన క్షణాలు మరచిపోలేనివన్నారు. అటువంటి ఏ శ్యాట్ క్షిపణి నమూనాను తయారుచేసి ఇక్కడ విజ్ఞాన కేంద్రంలో త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కేంద్రం అభివృద్ధికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని ఆయన ప్రకటించారు. క్షిపణి రంగంలో మనదేశం ఎవరిమీద ఆధారపడకుండా పూర్తి శక్తిసామర్థ్యాలు సాధించిందన్నారు. ఇస్రో, డిఆర్‌డిఓ, అటామిక్ ఎనర్జీ సంస్థలు అమోఘమైన విజయాలు సాధిస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయన్నారు.
ప్రభుత్వం ఇన్నోవేషన్స్‌కు ప్రాధాన్యతనిస్తోందని ఆ దిశగా విద్యాసంస్థలు ముందడుగు వేయాలన్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించి బావిభారత శాస్తవ్రేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర భౌతికశాస్త్ర ఫోరం కార్యదర్శి జి సురేంద్రరెడ్డి రూపొందించిన భౌతిక, రసాయన శాస్త్రాల కరదీపికను డీఆర్‌డీఓ చైర్మన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంవి శేషగిరిబాబు, జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధనాచార్యులు, సర్వశిక్ష అభియాన్ పీఓ నరసింహారెడ్డి, డిప్యూటీ డీఈఓ విజయలక్ష్మి, జిల్లా సైన్స్ అధికారి జి శ్రీనివాస్, పూర్వపు సైన్స్ అధికారిణి రాధారాణి, 13 జిల్లాల నుండి వచ్చిన భౌతిక, ప్రకృతి శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చిత్రం...సైన్స్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న
డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ సతీష్‌రెడ్డి

‘హోదా’ సాంకేతికంగా సాధ్యం కాదు

$
0
0

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా సాంకేతికంగా సాధ్యం కాదని, ఆ విషయాన్ని నీతి ఆయోగ్ మార్గదర్శకాల్లో కూడా సవివరంగా తెలిపిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కన్నా ఆదివారం అనంతపురం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయ క్షీణత 32 శాతం నుంచి 42 శాతానికి పెరగడమే కాకుండా, హోదాపై నీతి ఆయోగ్ మార్గదర్శకాల్లో కూడా సవివరంగా తెలుపుతూ హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదించిందన్నారు. అయితే ఈ విషయం తెలిసినప్పటికీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు బీజేపీ పరువు తీయడానికి బహిరంగంగా తిట్టడమే పనిగా ఎంచుకున్నారని విమర్శించారు.
అంతేకాకుండా ప్రత్యేక హోదా డిమాండ్‌తో శివాజీ రాజా, చలసాని శ్రీనివాస్ వంటి కొందరు ట్రబుల్ క్రియేటర్స్‌ను చంద్రబాబు ఎంచుకున్నారని, తద్వారా హోదా సమస్యపై సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వేసిన ఉచ్చులో పడ్డారని ఆరోపించారు. అలాగే ప్రత్యేక హోదా కింద రాష్ట్రాలకు రూ. 5వేల కోట్లు తెచ్చుకునే వెసులుబాటు ఉంటే, ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ. 16వేల కోట్లు కేటాయించేందుకు హామీ ఇచ్చిందన్నారు.
కాగా అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం(సెంట్రల్ యూనివర్సిటీ) ఏర్పాటులో నిర్లక్ష్యం ప్రదర్శించడంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు కన్నా సమాధానమిస్తూ దేశంలోని 16 సెంట్రల్ వర్సిటీలతో పాటు అనంతపురంలో ఏర్పాటు చేసేందుకు రూ. 960 కోట్లు కేటాయించిందన్నారు. అయితే అప్పటి సీఎం చంద్రబాబు జిల్లా కేంద్రం సమీపంలోని బుక్కరాయసముద్రం మండల పరిధిలో ఆమోదయోగ్యమైన భూమిని కేటాయించలేదని, అలాగే ఇచ్చిన నిధులను వినియోగించుకోలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అభివృద్ధి చేస్తే బీజేపీకి మంచి పేరొస్తుందన్న భయంతో టీడీపీ ప్రభుత్వం మొదటి నుంచే సహకరించలేదని విమర్శించారు. ప్రస్తుత బడ్జెట్‌లో కేంద్రం కేవలం రూ. 10 కోట్లు మాత్రమే కేటాయించడంపై వివరణ ఇస్తూ ఆ మొత్తం హెడ్ ఆఫ్ అకౌంట్ ప్రారంభించేందుకే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి, నీటి వసతిని సమకూర్చేందుకు సహకరించినట్లయితే ఆ నిధులను ఖర్చు చేయవచ్చన్నారు.
మరో రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా తమ కార్యకలాపాలను ప్రారంభించడంలో జాప్యం జరగడానికి కూడా చంద్రబాబు వివాదాస్పద భూమిని కేటాయించడమే కారణమని వ్యాఖ్యానించారు. అలాగే సెంట్రల్ వర్సిటీ విషయంలో కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్రంలో అవాంచనీయమైన వాతావారణాన్ని సృష్టిస్తున్నాయన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సి ఉండగా ఇప్పుడు పని గట్టుకుని వరుస ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం కన్నా జిల్లాలో సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతంపై నియోజకవర్గ బాధ్యులు, జిల్లా నేతలతో సమావేశమయ్యారు.

చిత్రం...అనంతపురంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

అది అగ్నికి ఆజ్యం పోసినట్టే..

$
0
0

శ్రీనగర్ : జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లేదా గుర్తింపు కల్పించిన 35ఏ ఆర్టికల్‌ను రద్దు చేయాలన్న కేంద్రం యోచన అగ్నికి ఆజ్యం పోసినట్టేనని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ 20వ రైజింగ్ డే సందర్భంగా ఆదివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని శాశ్వత నివాసితులకు ప్రత్యేక హక్కులు, అధికారాలను కట్టబెట్టిన ఆర్టికల్ 35ఏ పరిరక్షణకు పార్టీ కార్యకర్తలు ‘పెద్ద యుద్ధం’ చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ‘ఆర్టికల్ 35ఏను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడమంటే అగ్నికి ఆజ్యం పోసినట్టేనని. ఈ ఆర్టికల్‌ను రద్దు చేయడానికి ఎవరు చేతులు కలిపినా, ఆ చేతులే కాదు..మొత్తం శరీరమే కాలి బూడిద అవుతుంది’ అని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా, గుర్తింపు పరిరక్షణ కోసం ఒక గోడ మాదిరిగా నిలబడి పోరాడిన పార్టీ కేవలం తమ పీడీపీనేనని, ఈ విషయం ఢిల్లీ ప్రభుత్వానికి తెలుసునని, అందువల్లే తమ పార్టీ నాయకులను అనేక రకాలుగా వేధిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. జమ్మూ-కాశ్మీర్ ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని ఎదుర్కొనే సత్తా, దమ్ము తమ హృదయాల్లో లిఖించి ఉందని, మిగిలిన పార్టీలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నా అవి హృదయపూర్వకంగా వచ్చిన మాటలు కావని ఆమె వ్యాఖ్యానించారు. ‘పెద్ద పోరాటానికి సిద్ధంగా ఉండండి. ఎన్నికలు వస్తుంటాయి..పోతుంటాయి..అధికారం కూడా వస్తుంది..పోతుంది..జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా పరిరక్షణకు ఇపుడు అసలైన పరీక్ష ఎదురుకాబోతోంది. తుది శ్వాసవరకు రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉంటాను’ అని పీడీపీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు సైతం పీడీపీతోనే రాష్ట్ర సమస్యలు గట్టెక్కుతాయని భావిస్తున్నారని ఆమె అన్నారు. ‘ఈరోజు ప్రతి అంశం కూడా కీలకమే. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియకుండా ఉంది. అయితే, జమ్మూ-కాశ్మీర్ ప్రజల కోసం పీడీపీ ఎంతవరకైనా తెగించి పోరాడుతుంది. ప్రజల త్యాగాలను మేం వృథా కానివ్వం. వారి త్యాగాలను మరచిపోం. రాష్ట్ర హక్కుల కోసం, ప్రజల బాగోగుల కోసం ఒక రక్షణ గోడ మాదిరిగా నిలబడతాం’ అని ఆమె భరోసా ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు అనుకున్నంత బాగా లేవని, రాజకీయంగా, ఆర్థికపరంగా ప్రజలు చాలా వెనుకబడి ఉన్నారని, దీనిని మరింత బలహీనపరచేందుకు కొన్ని శక్తులు దాడులకు తెగబడుతున్నాయని ఆమె ఆరోపించారు.
చిత్రం...జమ్మూ-కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ

రాజకీయ మేరునగం

$
0
0

విజ్ఞత, రాజకీయ చతురత, పాలనా పటిమ, ఎలాంటి బాధ్యతనైనా నిరూపమాన దక్షతతో నిర్వహించగలిగే లక్షణాలు ఒకే వ్యక్తిలో అత్యంత అరుదుగానే ఉంటాయి. అటు జాతీయ, ఇటు రాష్ట్ర రాజకీయాలను తనదైన శైలిలో ప్రభావితం చేసిన జైపాల్‌రెడ్డి ఈ అరుదైన లక్షణాలను పుణికిపుచ్చుకున్నారనడం అతిశయోక్తేమి కాదు. జాతీయ రాజకీయాలు తీసుకున్న ప్రతి మలుపులోనూ జైపాల్‌రెడ్డి ముద్ర ఉంది. దశాబ్దాల పాటు జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన జైపాల్‌రెడ్డి అజాత శత్రువు. అన్ని పార్టీల అగ్రనేతలు ఆయనకు అత్యంత ఆప్తులే, సన్నిహితులే. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి వనే్న తేవడంతో పాటు అందరినీ కలుపుకుపొగలిగే అరమరికలు లేని స్నేహశీలత జైపాల్‌రెడ్డిది. ఆయన జీవితంలోని ప్రతి దశ ఓ అద్భుత ఘట్టమే. ముఖ్యంగా విజ్ఞానఖని అన్న మాటకు తిరుగులేని తార్కాణంగా జైపాల్‌రెడ్డి నిలుస్తారు. స్నేహశీలతతో పాటు మచ్చలేని వ్యక్తిత్వం జైపాల్‌రెడ్డిని రాజకీయాల్లో ఉన్నతంగా నిలిపింది. ఏ అంశం పైనైనా విశే్లషణాత్మక రీతిలో అనర్ఘలంగా మాట్లాడ గలగడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. నాటి జనతా పార్టీ నుంచి నేటి తెలంగాణ వరకు జైపాల్‌రెడ్డి అప్రతిహత రాజకీయ పయనం వివేచన, విచక్షణ మేళవించిన ఆయన నిండైన జీవితానికి నిదర్శనమే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయ్యాక తెలంగాణ ఉద్యమనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మొట్టమొదట ఢిల్లీలో జైపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి ధన్యవాదాలు తెలిపారంటేనే, రాష్ట్రం ఏర్పాటులో ఆయన ఎంతటి కీలక భూమిక పోషించారో అర్థం చేసుకోవచ్చు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ రాష్ట్ర విభజన ఎలా జరిగిందో కళ్లకు కట్టినట్టు రచించిన ‘విభజన కథ‘ పుస్తకంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జైపాల్‌రెడ్డి నిర్వహించిన పాత్రపై ప్రత్యేక శీర్షికనే రాశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జైపాల్‌రెడ్డి పాత్ర ఏమిలేదని కొందరు టీఆర్‌ఎస్ నాయకులు చేసిన విమర్శలకు స్పందిస్తూ,‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ఇంటికి వచ్చిన కేసీఆర్, అన్నా...కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రతిపాదిస్తే సున్నితంగా తిరస్కరించాను’ అని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పాటులో తన పాత్రామీ లేకపోతే తనను సీఎంగా ఉండాలని కేసీఆర్ ఎందుకన్నారో, అడిగి తెలుసుకోండని జైపాల్‌రెడ్డి ఎదురు ప్రశ్నించారు. దక్షిణాది నుంచి ఉత్తమ్ పార్లమెంటేరియన్‌గా అరుదైన పురస్కారాన్ని అందుకున్న గొప్ప రాజనీతిజ్ఞుడు కూడా. సునిశిత రాజకీయ పరిశీలన, అవగాహన, విశే్లషణ, వ్యక్తీకరణ కలగలిపిన అతికొద్ది మంది జాతీయ నాయకులలో జైపాల్‌రెడ్డి ఒకరు. చిన్నతనంలోనే రెండు కాళ్లూ పోలియో వల్ల పని చేయకపోయినా, తన అంగవైకల్యం రాజకీయ పురోగతికి, పరిణితికి అడ్డురాలేదు. సమరశీల వ్యక్తిత్వం, విశిష్టమైనశైలీ, భావస్పష్టత, భావవ్యక్తీకరణ అనే సుగుణాలతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగి దేశ రాజకీయ చిత్రపటంలో జైపాల్‌రెడ్డి తనదైన చెదరని ముద్రవేశారు. మాజీ ప్రధానులు విపి సింగ్, దేవెగౌడ, ఐకె గుజ్రాల్, మన్మోహన్‌సింగ్‌కు అంతరంగ సన్నిహితునిగా ఉంటూ క్లిష్ట సమయాల్లో, పలు కీలక అంశాలలో సూచనలు, సలహాలు ఇచ్చిన గొప్ప మేధావి కూడా. జనతాదళ్, నేషనల్ ఫ్రంట్, యూనైటెడ్ ఫ్రంట్‌కు అధికార ప్రతినిధిగా వ్యవహరించి ప్రత్యర్థులను కూడా మెప్పించగలిగిన రాజకీయ దురుంధరుడాయన. రాజకీయాలలో విలువలకు, సిద్దాంతాలకు చివరి వరకు కట్టుబడిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. నాలుగున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో కనీసం ఒక్క ఆరోపణను కూడా ఎదుర్కొని నిజాయితీపరుడు కావడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఒక సందర్భంలో జైపాల్‌రెడ్డి వ్యక్తిత్వం గురించి జనతాదల్ సిద్దాంతకర్త సురేంద్రమోహన్ విశే్లషిస్తూ, ‘విభిన్న మనస్తత్వాలుగల కింగ్ మేకర్లతో, కుయుక్తులకు పాల్పడే రాజకీయ నాయకులతో చాకచక్యంగా వ్యహరించగల సత్తాగల నాయకుడు’ అని కితాబు పొందారు. ‘ఆయన ఎవరినైనా సమర్థంగా తన దారిలోకి తెచ్చుకోగలరు’ అని కూడా సురేంద్రమోహన్ కొనియాడారు. దేశ రక్షణ సమస్యలపైనా, ప్రపంచ వర్తక, వాణిజ్య ఒప్పందాలపైనా, జాతీయ, అంతర్జాతీ సామాజిక అంశాలపైనా జైపాల్‌రెడ్డికి ఉన్న పరిజ్ఞానం, విశే్లషణలకు రాజకీయ పండితులను అబ్బురపర్చేవి. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా జైపాల్‌రెడ్డికి అరుదైన గౌరవం దక్కినప్పుడు...ఈ బిరుదుకు అసలు సిసలైన అర్హుడిగా రాజకీయ ప్రత్యర్థులు సైతం కొనియాడారు. ఏ అంశంలోనైనా లోతైన సునిశిత అధ్యయనం, అవగాహన, విశే్లషణకు గుర్తింపుగానే...కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పెట్రోలియం మంత్రిత్వశాఖలతో పాటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, లోక్‌పాల్‌పై ఏర్పాటు చేసిన జాయింట్ సెలెక్ట్ కమిటీ, సెక్యూరిటీల కుంభకోణంపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తదితర వాటిలో సభ్యునిగా ఎంపిక కావడానికి దోహదం చేశాయి. నిజాయితీకే కాకుండా నిరాండంబరానికి నిలువెత్తు నిదర్శనం జైపాల్‌రెడ్డి. దాదాపు ఐదు దశాబ్దాలపాటు రాజకీయాల్లో ఉన్న తన కుటుంబ సభ్యులు ఎవరినీ రాజకీయాల వైపు తుంగిచూడనీయకుండా కట్టడి చేసిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. విపి సింగ్‌కు అత్యంత సన్నిహితునిగా వ్యవహరించినప్పటికీ ఆయన హయాంలో కేంద్ర మంత్రి పదవిని ఆశించలేదు. ‘మీకు ఎంతో సన్నిహితుడు కదా? మంత్రి ఎందుకు కాలేదు? అడిగితే, నేను అడుగలేదు...ఆయన ఇవ్వలేదు’ అని నవ్వేవారు. అంతటి స్థితప్రజ్ఞత ఆయనది. ఐకే గుజ్రాల్ మంత్రివర్గంలో జైపాల్‌రెడ్డిని చేర్చుకున్నప్పుడు ఆయన లోక్‌సభ సభ్యుడు కాదు, రాజ్యిసభ సభ్యుడు కాదు. అయినప్పటికీ కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రిగా తీసుకోవడం అసాధారణమైందే. ఆకాశలవాణి, దూరదర్శన్‌లకు స్వయం ప్రతిపత్తి కల్పించే ‘ప్రసార భారతి’ చట్టాని సమర్థవంతంగా, పటిష్టంగా అమలు చేయగలిగిన శక్తి, యుక్తి జైపాల్‌రెడ్డికి ఉన్నాయనే మంత్రివర్గంలోకి తీసుకున్నట్టు ఒక సందర్భంలో ప్రధాని ఐకె గుజ్రాల్‌యే స్వయంగా వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కె రోశయ్య తర్వాత ముఖ్యమంత్రిగా జైపాల్‌రెడ్డిని పంపించాలని ఒక దశలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ప్రతిపాదిస్తే, తానే సున్నితంగా తిరస్కరించిన విషయాన్ని తన అంతర్గత సంభాషణలలో జైపాల్‌రెడ్డి చెప్పేవారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తారాస్థాకి చేరుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తావనీ, పదవి కోసం తాను తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌ను తాకట్టు పెట్టారన్న అపవాదు వద్దనే తిరస్కరించడానికి గల కారణంగా చెప్పేవారు. జైపాల్‌రెడ్డి జాతీయస్థాయిలో రాణించడానికి అనేక కోణాలు దోహదం చేశాయి. క్షేత్రస్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏ అంశంపైనైనా లోతైన అవగాహన, విశే్లషణ, బహు భాషా ప్రావీణ్యం, రాజకీయ చతురత, చతురోక్తులు, మంచి వక్త కావడం దోహదం చేశాయి. అసెంబ్లీలో మాట్లాడినా, పార్లమెంట్‌లో మాట్లాడినా, బహిరంగ సభల్లో మాట్లాడినా ఎంతటి జటిలమైన అంశాన్ని కూడా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో మాట్లాడటం ఆయన ప్రత్యేకత. ఆయన వ్యంగ్యోక్తులు సభలు, మీడియా సమావేశాల్లో నవ్వుల్లో ముంచెత్తేవి. రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగినప్పుడు శాసనసభలో జైపాల్‌రెడ్డి, ఇప్పటి ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు చేసే ప్రసంగాలను ఆకాశవాణిలో వినడానికి జనం ఎగబడేవారు. తమ ఇద్దరిని శాసనసభలో తిరుపతి వెంకటకవులుగా పిలిచేవారని ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు తన నివాళి సందర్భంగా గుర్తు చేశారు. ఎంతటి వివాద సంబంధ అంశాలనైనా వివాదాల్లో చిక్కుకోకుండా ఆచితూచి మాట్లాడటం జైపాల్‌రెడ్డికున్న మరో విశిష్టత. ఆంగ్లం, తెలుగు భాషలపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ చేసిన జైపాల్‌రెడ్డికి ఆంగ్ల భాషపై ఉన్న పట్టు అసమానం. పార్లమెంట్‌లో, మీడియా సమావేశాల్లో ఆయన వాడిన పదాలకు ఆంగ్లపండితులు, సీనియర్ జర్నలిస్టులు సైతం డిక్షనరీలను వెతికేవారంటే ఏ మాత్రం అశియోక్తి కాదు. భాషపై ఎంత పట్టుందో అంతకుమించి చతురత కూడా ఆయనకే సొంతం. ప్రధాని చంద్రశేఖర్ మంత్రివర్గంలో డాక్టర్ సుబ్రమణ్యస్వామిని న్యాయశాఖ మంత్రిగా నియమించినప్పుడు ‘ప్రసిద్ద లాయర్ అయినందుకు కాదు, ఘోరమైన లిటిగెంట్ అయినందుకే ఆ పదవి దక్కింది’ (నాట్ బి కాజ్ హి ఈజ్ ఎ నోటెడ్ లాయర్, బట్ బికాజ్ హి ఈజ్ ఎ లిటిగెంట్ లాయర్’ అని జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో ప్రపంచ వర్తక, వాణిజ్య ఒప్పందంపై (గాట్) జరిగిన చర్చ సందర్భంగా గాట్‌ను ఆయన ‘గాటోక్రసీ’గా అభివర్ణించారు. అలాగే ‘గ్లోబలైజేషన్’ ఎక్కడికి దారితీస్తుందో వివరించే సందర్భంగా ‘ఘోటాలైజేషన్’గా (కుంభకోణాల వ్యవస్థ) అభివర్ణించారు. ‘నియో రిచ్’ను ‘లంపెన్ నియో రిచ్’గా (అలగా సంపన్నులు) కొత్త పదాన్ని సృష్టించిందీ జైపాల్‌రెడ్డినే. కొత్త పదాలు, పదబంధాలు సృష్టించడంలో జైపాల్‌రెడ్డి దిట్ట. తరిమిల నాగిరెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రధాని నెహ్రు గురించి ‘హి స్పీక్ ఫర్ ది మిలియన్స్ అండ్ ఏక్స్‌ఫర్ట్ ది మిలియనీయర్స్’ (వారు కోట్లాది మంది ప్రజల గురించి మాట్లాడుతారుగానీ కోటీశ్వరులకు సాయపడుతారు) అని చేసిన వ్యాఖ్యలను వార్తమాన రాజకీయాల ప్రస్తావించే సందర్భంగా జైపాల్‌రెడ్డి తరుచు గుర్తు చేసేవారు. జైపాల్‌రెడ్డి లేని లోటు రాజకీయ రంగానికే కాదు, మేధావి లోకానికి, భాషా పాండిత్య ప్రపంచానికీ కూడా...

జైపాల్‌రెడ్డి మృతి తీరనిలోటు : గవర్నర్

$
0
0

విజయవాడ : కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి అకాల మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. జైపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా రాష్ట్రం, దేశాభివృద్ధికి తనవంతు కృషి చేశారన్నారు. జైపాల్‌రెడ్డి కుటుంబానికి ఆయన సానుభూతి తెలిపారు.
మాజీ సీఎం చంద్రబాబు సంతాపం
అమరావతి: మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి మృతి రాజకీయ రంగానికి తీరని లోటని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా, వీపీ సింగ్, మన్మోహన్‌సింగ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞడు జైపాల్‌రెడ్డి మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నేటి యువతకు ఆదర్శం
సీనియర్ పార్లమెంటేరియన్ జైపాల్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం నేటితరానికి ఆదర్శమని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఇక్కడ సంతాపం తెలిపారు. విద్యార్థి దశ నుంచి కేంద్ర మంత్రి వరకు అంచలంచెలుగా ఎదిగిన ఆయన ప్రజలకు ఎనలేని సేవలందించారని శ్లాఘించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
అజాత శత్రువు: కళావెంకట్రావు
రాజకీయాల్లో అజాతశత్రువుగా జైపాల్‌రెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావ్ ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ప్రజావాణి వినిపించటంతో ఏమాత్రం భేషజాలకు పోకుండా నిగర్విగా నిబద్ధతతో పనిచేశారని గుర్తుచేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన జైపాల్‌రెడ్డి నేటితరం రాజకీయ నేతలకు దిశానిర్దేశకులుగా గుర్తింపు పొందారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. సీనియర్ రాజకీయవేత్త జైపాల్‌రెడ్డి మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారో లోకేష్ నివాళి అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
జాతి గర్వించదగిన నేత: పవన్‌కళ్యాణ్
చట్టసభల్లో సభికుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయటంతో పాటు తన రాజకీయ ప్రస్థానంలో మచ్చలేనివాడిగా తెలుగుజాతి గర్వించదగిన నేత జైపాల్‌రెడ్డి అని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ గుర్తుచేశారు. జైపాల్‌రెడ్డి మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు. ఆయన జీవితం నేటితరానికి ఆదర్శమంటూ జనసేన పార్టీ తరపున ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ప్రముఖుల సంతాపం
విజయవాడ: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ జైపాల్‌రెడ్డి మృతి పట్ల వివిధ రాజకీయ పక్షాల నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభలో, పార్లమెంట్‌లోనూ సుదీర్ఘ కాలం ప్రజాప్రతినిధిగా పనిచేసి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికైన జైపాల్‌రెడ్డి జీవితాంతం లౌకికత్వానికి కట్టుబడి ఉన్నారన్నారు. నాడు ఎమర్జన్సీని వ్యతిరేకిస్తూ సొంత పార్టీనే వీడి ప్రజాస్వామ్యం కోసం నిలబడ్డారని నివాళి అర్పించారు. జైపాల్‌రెడ్డి రాజకీయ ఉద్దండులని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రగాఢ సంతాపం తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ మంత్రిగా విజయవాడ నగరాభివృద్ధి కోసం ఆయన ఎంతగానో తపన పడ్డారని గుర్తుచేశారు. జైపాల్‌రెడ్డి మృతి పట్ల ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. సిద్ధాంతాలు, విలువలు కలిగిన దార్శనికుడైన గొప్ప రాజకీయవేత్త జైపాల్‌రెడ్డి అన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలిచిన జైపాల్‌రెడ్డి మరణం నేటి తరానికి తీరని లోటన్నారు. తెలుగు రాజకీయవేత్తల్లో అరుదైన నాయకుడు జైపాల్‌రెడ్డి మరణం దేశానికి, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు తీరనిలోటని పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఐదేళ్లలో వాటర్‌గ్రిడ్ ద్వారా తాగునీరందిస్తాం

$
0
0

డోన్, జూలై 28 : రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీరు అందిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని మున్సిపల్ సమావేశ భవనంలో ఆదివారం మంత్రి బుగ్గన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపడుతున్నామని వివరించారు. రాబోయే ఐదేళ్లలో వాటర్ గ్రిడ్ పైపుల ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందివ్వనున్నట్లు తెలిపారు. వాటర్‌గ్రిడ్ పథకంపై ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.

మావోల చేతుల్లో హతమైన గిరిజన అమరుల పేరిట స్థూపం !

$
0
0

పాడేరు, జి.మాడుగుల, జూలై 28: విశాఖ మన్యంలో మావోయిస్టు ల అమరవీరుల వారోత్సవాల తరహాలో పోలీసు శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మావోయిస్టుల అమరవీరుల దినోత్సవాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు ఒకవైపు యత్నిస్తునే మన్యంలో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. మరోపక్క గిరిజనుల అభిమానం పెంచుకుని వారితో సత్సంబంధాలు కలిగి ఉండడానికి తెలుపు స్థూపావిష్కరణ చేపట్టి ధీటైన ఎత్తుగడకు తెర తీశారు. పోలీసుల ఎన్‌కౌంటర్లలో మృతి చెందిన మావోయిస్టులకు నివాళి అర్పించేందుకు మావోయిస్టు పార్టీ ప్రతియేటా జూలై 28 నుంచి ఆగస్టు 3వతేదీ వరకు వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఆదివారం నుంచి మన్యంలో అమరవీరుల వారోత్సవాల నిర్వహణకు మావోయిస్టులు సన్నద్ధం కాగా, పోలీసులు ఒక అడుగు ముందుకు వేసి మావోల వారోత్సవాల తరహాలో మావోల చేతిలో హతమైన గిరిజన అమరుల వారోత్సవాల సరికొత్త కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ఈ మేరకు మృతి చెందిన గిరిజనుల పేరిట మారుమూల గ్రామాలలో పోలీసులు స్థూపాలను ఏర్పాటుచేశారు. పోలీసుల ఎన్‌కౌంటర్లలో మృతి చెందిన మావోల సభ్యులకు ఎర్రని స్థూపాలను నిర్మిస్తుండగా, పోలీసులు మాత్రం మావోల చేతిలో మృతి చెందిన గిరిజనుల పేరిట తెలుపు స్థూపాలను ఏర్పాటుచేసి అందర్నీ ఆకర్షిస్తున్నారు. చింతపల్లి మండలం మారుమూల ప్రాంతమైన కోరుకొండ గ్రామంలో పోలీసులు ఏర్పాటుచేసిన తెల్లని స్థూపం ఆదివారం దర్శనం కావడంతో గిరిజనులను విస్మయానికి గురిచేసింది. కోరుకొండలో ఆదివారం వారపు సంత కావడంతో సంతకు వచ్చిన మారుమూల గ్రామాల గిరిజనులు ఈ స్థూపాన్ని చూసి నివ్వెరపోవల్సి వచ్చింది. ఈ స్థూపం ఆవిష్కరణ ద్వారా గిరిజనులకు మరింత చేరువై మావోల పట్ల వారిలో వ్యతిరేకతను నింపాలన్నదే పోలీసుల లక్ష్యంగా తెలుస్తోంది.


‘నైరుతి’ కరుణించేనా?

$
0
0

విజయవాడ, జూలై 28: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో జూలై చివరి వారం నాటికి వర్షపాతం సగటు సాధారణం కంటే తక్కువగా నమోదైంది. రెండు నెలల్లో 236 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 171 మిల్లీమీటర్లు మాత్రమే నమోదు కావడం గమనార్హం. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని జూన్ 5న తాకుతాయని అంచనా వేసినప్పటికీ, 16రోజులు ఆలస్యంగా పలకరించాయి. దీంతో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. ఈ ఏడాది జూన్ చివరి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పటికీ అది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వైపు తరలి వెళ్లడంతో రాష్ట్రంలో ఆశించిన మేర వానలు కురవలేదు. రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించిన తరుణంలో బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండాలు ఏర్పడితే మంచి వర్షపాతం నమోదై ఉండేది. జూన్‌లో 93 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం కాగా 52 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. జూలైలో 142 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, 118 మిల్లీమీటర్లు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఈ సీజనులో 171 మిల్లీమీటర్లు నమోదు కావడంతో 27.4 శాతం మేర తక్కువ నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 41.1 శాతం, విజయనగరంలో 33.2, పశ్చిమ గోదావరిలో 31.2, కృష్ణా జిల్లాలో 24.2, నెల్లూరులో 26.2, కడపలో 40.4, అనంతపురంలో 45, కర్నూలులో 40 శాతం మేర సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఫలితంగా పంటల సాగు విస్తీర్ణంపై ప్రతికూల ప్రభావం చూపించింది. సాధారణంగా జూలై 10నాటికి 9.15 లక్షల హెక్టార్లలో నాట్లు పూర్తికావాల్సి ఉండగా, కేవలం 3.82 లక్షల హెక్టార్లలోనే పూర్తయ్యాయి. వర్షాలు లేకపోవడంతో దాని ప్రభావం నేరుగా వివిధ పంటల నాట్లపై పడింది. ఫలితంగా రాష్ట్రంలో సగటున భూగర్భ జలమట్టం జూన్, జూలై నెలల్లో పోలిస్తే 11 సెంటీమీటర్ల మేర మాత్రమే పెరిగింది. నెల రోజుల వ్యవధిలో కోస్తాలో 25 సెంటీమీటర్ల మేర పెరిగింది. రాయలసీమలో 20 సెంటీ మీటర్ల మేర తగ్గడం గమనార్హం. వర్షాలు సక్రమంగా కురవని కారణంగా వ్యవసాయ పనుల జోరు తగ్గింది. వ్యవసాయ పనులు లేక ఉపాధి హామీ పనులపై వ్యవసాయ కార్మికులు దృష్టి సారించారు. దీంతో ఉపాధి హామీ పనులకు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ పథకం కింద 764 కోట్ల రూపాయల మేర బకాయిలు రావాల్సి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉపాధి పనుల్లో అధికారులు జాగ్రత్త వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. ఫలితంగా శనివారం, ఆదివారం చాలాచోట్ల వర్షం కురిసింది. రానున్న రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడనం ఏర్పడితే, రుతుపవనాలు చురుగ్గా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో మెరుగైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.

బ్రాహ్మణుల సంక్షేమం వైకాపా లక్ష్యం

$
0
0

గుంటూరు (కల్చరల్), జూలై 28: బ్రాహ్మణులు, దైవం, ధర్మం పట్ల అత్యంత గౌరవాదరాభిమానాలు కలిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలకు తోడు వీరి సంక్షేమానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారని శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి చెప్పారు. ఆదివారం గుంటూరు బ్రాడీపేటలో జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో ఉప సభాపతి కోన రఘుపతి, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు మల్లాది విష్ణుకు అభినందన, సత్కార సభ జరిగింది. సమావేశానికి రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు ముత్తనపల్లి శివకృష్ణ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి రఘుపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కేవలం హామీలు మాత్రమే ఇవ్వడం లేదని, వాటిని ఆచరణాత్మకంగా అమలు చేయడానికి కంకణబద్ధులై కృషి చేస్తున్నారని చెప్పారు. సమాజంలో అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా బ్రాహ్మణులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో సీఎం ఉన్నారన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 100కోట్ల రూపాయలను బ్రాహ్మణ వర్గాలకు, ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో ధూపదీప నైవేద్యాలకు, అర్చకుల సంక్షేమానికి చేస్తున్న కృషిలో భాగంగా 234కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఆయన సూచించారు. మరో అతిథి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి బ్రాహ్మణుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమే రఘుపతిని శాసనసభ ఉప సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడమని చెప్పారు. బ్రాహ్మణుల సంక్షేమానికి వైకాపా, ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సభాముఖంగా ఉప సభాపతి రఘుపతి, ఎమ్మెల్యే విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. స్వయంశక్తిగా బ్రాహ్మణులు సుసంఘటితులై మరింతగా ఎదగాలని విష్ణు ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మునుముందుకు సాగాలని కోరారు. సమావేశంలో బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కామేశ్వర ప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్వీ రామరాజు, కోశాధికారి ఆర్ శేషాచలం, జిల్లా కార్యదర్శి తుళ్లూరు ప్రకాష్, జిల్లా నలుమూలల నుండి బ్రాహ్మణులు, వివిధ నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు. 17 నియోజకవర్గాల నుండి వచ్చిన బ్రాహ్మణ సంఘాల నేతలు ఇద్దరు అతిథులను వేదాశీర్వచనం మధ్య ఘనంగా సత్కరించారు.

చిత్రం...బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య సభలో అతిథులు కోన రఘుపతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణును సత్కరిస్తున్న దృశ్యం

డొంకరాయి జలాశయం నుండి గోదావరిలోకి నీరు విడుదల

$
0
0

సీలేరు (విశాఖ జిల్లా), జూలై 28: గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలోకి డొంకరాయి జలాశయం నీటిని జిల్లా అధికారులు విడుదల చేశారు. భారీ వర్షాలకు విశాఖ జిల్లాలోని సీలేరు ప్రాంతంలో ఉన్న డొంకరాయి జలాశయంలో వరదనీరు చేరి జలాశయం నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. దీంతో డొంకరాయి జలాశయం నుంచి 8,400 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి జెన్‌కో అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
గత మూడు రోజులుగా సీలేరు నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్నాయి. సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని డొంకరాయి జలాశయంలో శనివారం నీటిమట్టం 1,037 అడుగుల ప్రమాద స్థాయికి చేరుకుంది. శనివారం రాత్రి మొదటగా 1,100 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. ఆదివారం తెల్లవారున డొంకరాయి జలాశయానికి మరింత వరద నీరు చేరడంతో రెండు గేట్ల ద్వారా 4,400 క్యూసెక్కుల నీటిని, బలిమెల వద్ద ఉన్న ఎవీపీ డ్యామ్ నుంచి రెండు గేట్ల ద్వారా నాలుగువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీనిపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీఎల్ రమేష్ ఆదివారం ఉదయానికి డొంకరాయి జలాశయానికి తొమ్మిదివేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో మెయిన్ డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీఎల్ రమేష్ తెలిపారు. సీలేరు జలవిద్యుత్ కాంప్లెక్స్ అన్ని కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిరాటంకంగా కొనసాగుతుందన్నారు.

చిత్రం...విశాఖ జిల్లాలోని సీలేరు ప్రాంతంలో ఎవీపీ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు

$
0
0

కాకినాడ, జూలై 28: గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి జిల్లాలు గజగజ వణుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. పలుచోట్ల చెట్లు నేలకూలి రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. నిన్న మొన్నటి వరకు నీరు లేక సాగుకు ఆలస్యం జరగగా, ప్రస్తుతం డెల్టా ప్రాంతంలోని వరి చేలు చెరువులుగా మారిపోయాయి. మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయని వస్తున్న హెచ్చరికలతో రైతులు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలులోని సుద్దగడ్డ కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గొల్లప్రోలు-తాటిపర్తి పుంతరోడ్డు పైనుండి నీరు ప్రవహిస్తోండటంతో ఈ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోయాయి. చెందుర్తి శివారులోని చౌటుకాలువ పొంగి ప్రవహిస్తుండటంతో పంట పొలాల్లోకి వరదనీరు చేరింది. వర్షాలు మరికొద్ది రోజులు కొనసాగితే కాయగూర పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తూర్పు ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డు వద్ద శనివారం అర్ధరాత్రి భారీ వృక్షం నేలకూలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వీఆర్‌పురం మండలంలోని తుష్టివారిగూడెం, తెల్లవారిగూడెం, అన్నవరం, దారపల్లి, జల్లివారిగూడెం వాగులు ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. జల్లివారిగూడెం వాగు ఆదివారం ఉదయం పొంగి చప్టా పైనుంచి ప్రవహించటంతో చింతూరు మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. కాగా భారీ వర్షాలకు సీలేరు నదిలో ఇన్‌ఫ్లో పెరగడంతో వై రామవరం మండలం డొంకరాయి డ్యాం వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచి రెండు గేట్లు ఎత్తివేసి సీలేరు నీరు విడుదల చేస్తున్నారు. గేట్ల ద్వారా సుమారు 4,400 క్యూసెక్కులు, ఏపీ జెన్‌కో పవర్ కెనాల్ ద్వారా మరో నాలుగువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతమైన ఒడిస్సాలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో నది ప్రమాద స్థాయి నీటిమట్టం 10.37 అడుగులకు మించి ప్రవహిస్తోంది. ఈ నీరు చింతూరు మండలం మీదుగా శబరి నదిలో కలిసి గోదావరిలో కలుస్తుంది. దీని ప్రభావంతో గోదావరి నీటిమట్టం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు డెల్టా మండలాల్లో వేల ఎకరాల వరిచేలు ముంపునకు గురయ్యాయి. ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు, వీరవాసరం, పాలకొల్లు, యలమంచిలి తదితర మండలాల్లో వేల ఎకరాల్లో వరిపంట ముంపునకు గురైంది. నీరులేక ఆలస్యంగా నారుమళ్లువేసి నాట్లు వేసినప్పటికీ గత కొద్దిరోజులు నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా నాట్లువేసిన చేలన్నీ పూర్తిగా మునిగి చెరువులను తలపిస్తున్నాయి.

చిత్రాలు.. తూ.గో. జిల్లా చింతూరు మండలంలో రహదారి పైనుండి ప్రవహిస్తున్న జల్లెవారిగూడెం వాగు
*ప.గో. జిల్లా ఆచంట మండలంలో నీట మునిగిన వరి చేలు,

చిటపట చినుకుల్లో చాట్..

$
0
0

సాయంత్రం వేళ స్నాక్స్ అంటే పానీపూరీనే గుర్తొస్తుంది పిల్లలకైనా.. పెద్దలకైనా.. ముఖ్యంగా చిటపట చినుకులు పడుతుంటే సమోసాచాట్, పావ్‌బాజీ వంటివి గుర్తొచ్చి నోట్లో నీళ్లూరతాయి. అయితే రోడ్ల పక్కన పానీ పూరీ బండ్లలో పానీపూరీ తినడానికి తల్లులు ససేమిరా ఒప్పుకోరు. కాబట్టి ఇంట్లోనే శుచి, రుచిగా చేసుకుంటే.. పిల్లలు ఎంత తిన్నా ఇబ్బంది ఉండదు. మరి అలాంటి చాట్ రకాలు ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

బ్రెడ్ కటోరి చాట్
కావలసిన పదార్థాలు
బ్రెడ్ స్లైసులు: ఆరు
ఉడికించిన బంగాళాదుంపలు: అరకప్పు
ఉడికించిన స్వీట్ కార్న్: పావుకప్పు
ఉడికించిన తెల్ల సెనగలు: రెండు చెంచాలు
కీరాదోస ముక్కలు: రెండు చెంచాలు
టొమాటో ముక్కలు: రెండు చెంచాలు
ఉల్లిపాయ ముక్కలు: రెండు చెంచాలు
పెరుగు: అరకప్పు
ఉప్పు: రుచికి సరిపడా
చాట్ మసాలా: ఒక చెంచా
నల్ల ఉప్పు: పావు చెంచా
సన్న కారప్పూస: ఒక చెంచా
నూనె: ఒక చెంచా
పంచదార: ఒక చెంచా
కొత్తిమీర తరుగు: మూడు చెంచాలు
చింతపండు చాట్ చట్నీ: అరకప్పు
తయారుచేసే విధానం
ముందుగా పెరుగులో పంచదార కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక్కో బ్రెడ్ అంచులను తీసేసి తెల్లని భాగాన్ని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. ఆ తరువాత మఫిన బేకింగ్ ట్రేలోని గుంతలకు నూనె రాసి, వత్తి పెట్టుకున్న బ్రెడ్‌లను వాటిలో పెట్టి గట్టిగా అదిమి గుంతల గోడలకు అంటించాలి. తరువాత వీటిని 190 డిగ్రీలు లేదా 370 ఫారన్‌హీట్ ప్రీ హీట్ చేసిన ఒవెన్‌లో పావుగంటసేపు ఉంచి తీయాలి. అప్పుడు కరకరలాడే బ్రెడ్ కటోరీలు తయారవుతాయి. ఆ తరువాత కొత్తిమీర, సన్న కారప్పూస తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ ఒక గినె్నలో వేసి బాగా కలిపి బ్రెడ్ కటోరీలలో వేసి వాటి పైన పెరుగు, కొత్తిమీర, సన్న కారప్పూస వేసి పిల్లలకు అందించాలి. ఒక్కో కప్పు వారు ఎంతో ఆస్వాదిస్తూ తింటారు.

పానీపూరీ

కావలసిన పదార్థాలు
గోధుమరవ్వ: కప్పు
మైదా: మూడు చెంచాలు
బేకింగ్‌సోడా: పావుచెంచా
ఉప్పు: తగినంత
వంటనూనె: వేయించేందుకు సరిపడా
చింతపండు గుజ్జు: అరకప్పు
జీలకర్రపొడి: రెండు చెంచాలు
నీరు: రెండు కప్పులు
జీలకర్ర: మూడు చెంచాలు
కొత్తిమీర ఆకులు: అరకప్పు
పచ్చిమిరపకాయలు: మూడు
పుదీనా ఆకులు: కప్పు
నల్ల ఉప్పు: ఒక చెంచా
బంగాళాదుంపలు: రెండు
పచ్చిమిరపకాయలు: మూడు
ఉల్లిపాయలు: రెండు
తయారుచేసే విధానం
వెడల్పాటి గినె్న తీసుకుని అందులో గోధుమరవ్వ, ఉప్పు, మైదా, బేకింగ్ సోడా, వేడినీరు పోసి పూరీ పిండిలా కలుపుకుని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీటిని పూరీల్లా ఒత్తుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి ఉంచి అందులో నూనె వేసి కాగాక ఒత్తుకున్న పూరీలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. తరువాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, నల్ల ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నీళ్లతో కలపాలి. ఈ నీళ్లలోని చింతపండు గుజ్జు, జీలకర్ర కూడా కలుపుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. తరువాత బంగాళాదుంపలను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. చల్లారాక వీటిని గుజ్జుగా చేసి పొయ్యిపై పెనం పెట్టి నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఆ తరువాత వేయించిన జీలకర్రపొడి, ఉప్పు, కొత్తిమీర, ఉప్పు, వేసి గరిటెతో తిప్పుతూ వేడెక్కాక దింపేయాలి. అంతే స్టవ్ కూడా రెడీ. ఈ స్ట్ఫ్‌ను పూరీలో ఉంచి పానీలో ముంచి తింటుంటే ఆ మజాయే వేరు..

కార్న్‌ఫ్లేక్స్ చాట్

కావలసిన పదార్థాలు
కార్న్‌ఫ్లేక్స్: ఒకటిన్నర కప్పు
టొమాటో: ఒకటి
పచ్చిమిర్చి: ఒకటి
కారం: చిటికెడు
మిరియాలపొడి:చిటికెడు
తేనె: కొద్దిగా
ఉల్లి తరుగు:
రెండు చెంచాలు
చాట్ మసాలా: చిటికెడు
జీలకర్ర పొడి: పావు చెంచా
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు:
రెండు చెంచాలు
నెయ్యి: ఒక చెంచా
తయారుచేసే విధానం
టొమాటోను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. తరువాత కార్న్‌ఫ్లేక్స్ తప్ప మిగిలిన అన్ని పదార్థాలను ఒక పళ్లెంలోకి తీసుకుని వాటిని చేతితో నలపాలి. ఇలా చేయడం వల్ల ఆ పదార్థాల నుంచి తేమ బయటకు వస్తుంది. కాసేపటి తరువాత వీటిలో కార్న్‌ఫ్లేక్స్ వేసి కలపాలి. తరువాత ఇందులో నెయ్యివేసి మళ్లీ బాగా చేత్తో కలపాలి. పైన నిమ్మరసాన్ని చల్లుకుని ఆలస్యం చేయకుండా వెంటనే వడ్డించేయాలి.

కార్న్ చాట్

కావలసిన పదార్థాలు
ఉడికించిన కార్న్: కప్పు పనీర్ ముక్కలు: అరకప్పు
ఉల్లిపాయ: ఒకటి టొమాటో: ఒకటి
క్యారెట్: సగం పచ్చిమిర్చి: ఒకటి
కొత్తిమీర: చిన్న కట్ట చాట్ మసాలా: అరచెంచా
ఆమ్‌చూర్: చిటికెడు ఉప్పు: తగినంత
మిరియాలపొడి: చిటికెడు
తయారుచేసే విధానం
ఉల్లిపాయ, టొమాటోలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్‌పై పెనం ఉంచి కొద్దిగా బటర్ వేసుకోవాలి. దీనిలో కార్న్, పనీర్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, మిగిలిన అన్ని పదార్థాలను వేసి చివరగా కొత్తిమీర కూడా వేసి కలపాలి. తరువాత వీటిని గినె్నలోకి తీసుకుని ఉడికించిన పల్లీలతో అలంకరించుకుని తింటే ఇది మరింత టేస్టీగా ఉంటుంది.

సమోసా చాట్

కావలసిన పదార్థాలు
చనా మసాలా: తగినంత
ధనియాల పొడి: అరచెంచా
జీలకర్రపొడి: అరచెంచా
ఉప్పు: తగినంత
టొమాటో: ఒకటి
బటర్: ఒక చెంచా
ఉల్లిపాయలు: రెండు
చాట్‌మసాలా: అరచెంచా
కారం: రుచికి సరిపడా
సమోసాలు: రెండు
కాబూలి చనా: కప్పు
నీళ్లు: సరిపడా
పెరుగు: కొద్దిగా
గ్రీన్ చట్నీ: ఒక చెంచా
స్వీట్ చట్నీ: ఒక చెంచా
కొత్తిమీర: కట్ట
తయారుచేసే విధానం
బాణలిని స్టవ్‌పై ఉంచి కొద్దిగా బటర్ వేసుకోవాలి. తరువాత అందులో ఉడికించిన కాబూలి చనా, తరిగిన టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు, కారం, జీలకర్రపొడి, ధనియాల పొడి, చాట్ మసాలా వేసి కొద్దిసేపు వేయించి తరువాత నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు సమోసాలను ముక్కలుగా చేసి ఉడికించుకున్న చాట్‌లో వేసి కలపాలి. దీనిలో కొంచెం గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ వేసి కలుపుకోవాలి. తరువాత పైన పెరుగు వేసి కొద్దిగా కొత్తిమీర, సేవ్‌తో గార్నిష్ చేస్తే వేడివేడి సమోసా చాట్ రెడీ.

పావ్‌బాజీ

కావలసిన పదార్థాలు
పావ్: నాలుగు
తరిగిన ఉల్లిపాయలు: అరకప్పు
ఉడికించిన బఠాణీలు: అరకప్పు
ఉడికించిన క్యారెట్: అరకప్పు
ఉడికించిన ఆలు: ఒకకప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక చెంచా
కారం: ఒక చెంచా
ధనియాలపొడి: ఒక చెంచా
జీలకర్రపొడి: ఒక చెంచా
పావ్‌బాజీ మసాలా: రెండు చెంచాలు
టొమాటో ప్యూరీ: ఒక కప్పు
టొమాటో కెచప్: రెండు చెంచాలు
తరిగిన కొత్తిమీర: అరకప్పు
బటర్: మూడు చెంచాలు
తయారుచేసే విధానం
ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టుకుని ఒక చెంచా బటర్ వేయాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసుకోవాలి. రెండు నిముషాలు వేగిన తరువాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చి వాసన పోయాక టొమాటో ప్యూరీ వేయాలి. దీన్ని రెండు నిముషాలు వేయించాలి. తరువాత ఉడికించిన క్యారెట్ ముక్కలు, బఠాణీలు, ఆలూలను వేయాలి. వాటిని బాగా వేయించి కొద్దిగా నీళ్లు పోసుకుని రెండు నిముషాల పాటు ఉడికించాలి. దీన్ని మాషర్‌తో బాగా మెత్తగా చేయాలి. తరువాత ఇందులో రెండు చెంచాల పావ్‌బాజీ మసాలా వేయాలి. తరువాత ఉప్పు, టొమాటో కెచప్ వేసి బాగా ఉడికించి దగ్గర పడిన తరువాత కొత్తిమీర తరుగు వేసి చివరగా ఒక చెంచా బటర్ వేయాలి. మరో స్టవ్‌పై చపాతీ పెనాన్ని ఉంచి దానిపై మిగిలిన బటర్ వేసి వేడయ్యాక పావ్‌ను విడదీసి రెండు వైపులా దోరగా వేయించాలి. తరువాత పావ్‌ను, కర్రీని వేడివేడిగా పిల్లలకు అందించాలి. అంతే ఎంతో రుచికరమైన పావ్ బాజీ తయారు.

Viewing all 69482 articles
Browse latest View live