Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఆరోగ్యానికి కొబ్బరి నీళ్లు

$
0
0

సహజంగా కొబ్బరి బోండాం నుంచి నేరుగా కొబ్బరినీళ్లు తాగడం స్వర్గతుల్యం. దీనివల్ల ఉపశాంతే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ నీళ్లలో విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, ఎంజైములు, ఎమినోయాసిడ్లు, సైలోకిస్ అధికంగా ఉన్నాయి. ఈ నీళ్లు ఉపశాంతినిచ్చే నగదు రుచికి, ఆరోగ్య ప్రయోజనాలకి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. డయేరియా తగ్గిన తర్వాత కొబ్బరినీళ్లు చాలా ఉపయోగకరం. ఇవి నష్టపోయిన ఫ్లూయిడ్స్‌ని భర్తీ చేస్తాయి. వీటిలో అమైనో ఆమ్లాలు, ఎంజైములు, ఆహార ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజ సంపద పుష్కలంగా ఉంటుంది. ఇందులో క్లోఠైడ్లు, కొలెస్ట్రాల్ తక్కువ. వీటివల్ల శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
* కొబ్బరినీళ్లలో సెటేనియం, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వంటి కొన్ని మిశ్రమాలు ఉన్నాయి. ఇవి కేన్సర్‌పై పోరాటం చేస్తాయని రుజువైంది.
* కొబ్బరినీళ్లు వృద్ధాప్య నివారణ, కేన్సర్ తగ్గించే కారకాలు, రక్తప్రసరణకు ఉపయోగకరంగా ఉండే సైటో కీనిన్లను కలిగి ఉంటాయని పరిశోధనలు నిరూపించాయి.
* కొబ్బరినీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నది. ఇది రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతున్నది.
* కొబ్బరినీళ్లలోని ఖనిజాలు పొటాషియం, మెగ్నీషియం వల్ల మూత్రపిండాలలోని కారాళ్ల వల్ల వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
* శరీరంలోని వైరస్ లేదా బాక్టీరియా ఉన్నప్పుడు కొబ్బరినీళ్లు వాటిని అరికట్టడానికి బాగా ఉపయోగపడతాయి.
* మొటిమలు, మచ్చలు, ముడుతలు, సాగిన గుర్తులు, సిల్యులైట్, తామర వంటి వాటిపై కొబ్బరి నీళ్లను రెండు వారాలపాటు రాసి వదిలేస్తే అది చర్మాన్ని శుభ్రపరిచి తేటగా చేస్తుంది.
* కొబ్బరి బోండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్లలో దాహార్తిని తీర్చే శక్తితో పాటు అనేక లాభాలున్నాయి. కూల్‌డ్రింక్స్ తాగితే తాత్కాలికంగా దాహం తీరుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎప్పుడైనా కొబ్బరిబోండాలు సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు.


గోరింటాకు పేరు ఇలా..

$
0
0

ప్రాచీన కాలంనుంచి సౌందర్య సాధనాలలో గోరింటాకు ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. ఆషాడంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు. వేదాలలో గోరింటాకు ఎరుపును సూర్యునికి ప్రతీకగా చెపుతారు. సంస్కృతంలో గోరింటాకు చెట్టును ‘మెంథికా’ అంటారు. ఆ పదం నుంచే మెహిందీ వచ్చింది. గోరింట ఆకులను ఎండబెట్టి, పొడిచేసి చేతులు, పాదాలపై రేఖాగణిత నమూనాల్లో డిజైన్లు వేసుకునేవారు. వీటివల్ల సంతానోత్పత్తి పెరిగి, అండాశయం పనితీరు సక్రమంగా ఉంటుందని చెపుతారు. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటే ఆషాఢంలో బయటి వాతవారణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి బయటి వాతవారణానికి విరుద్ధంగా తయారై అనారోగ్యాలు తప్పవు. అందుకే శరీరంలో వుండే వేడిని తగ్గించే శక్తి వున్న గోరింటాకును పెట్టుకుంటారు. ఈ ఆకు రోగనిరోధక శక్తిని పెంచుతుందని పెద్దలే కాకుండా డాక్టర్లు కూడా అంటున్నారు. అంతేగాక అరచేతి మధ్యలో స్ర్తి గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలో అతి ఉష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు. గోరింటాకు ప్రకృతిలో దొరికే కలుషితం లేని పదార్థం. పొలం పనులు చేసేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు నీటిలో కాళ్ళు చేతులు తడపడంవల్ల చర్మవ్యాధులు రావడం, గోళ్ళు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజులు ఆపుతుంది.
హిందూ సంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు గోరింటాకు పెట్టుకుని ఉంటారు. గోరింటాకు ఎలా పుట్టిందంటే పెద్దలు చెప్పే ఎక్కువ ప్రాచుర్యంలో వున్న కథ ఇది. గోరింటాకు (గౌరింటాకు) గౌరి ఇంటి ఆకు. అది కాస్తా గోరింటాకు అయ్యిందట. గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలతాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ పార్వతి రుధిరాంశతో జన్మించాను. నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది. అపుడు పార్వతి (గౌరి) ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి. అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందనుకునేలోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధా కలుగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తోంది అంటుంది. పర్వతరాజు ఇకపై స్ర్తి సౌభాగ్య చిహ్నంగా ఈ గౌరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది. స్ర్తిల గర్భాశయ దోషాలు తొలగిస్తుందని చెప్పాడట. అప్పటినుంచి స్ర్తిలకు గోరింటాకుపై ఎనలేని మక్కువ పుట్టిందట. తన వర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లు అందంగా తీర్చుకుంటూ ఉంటారు. ఆషాఢమాసంలో తల్లిగారింట్లోవున్నపుడు కూడా తనను మరచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట.
ప్రయోజనాలు
ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు అన్నీ ఔషధయుక్తాలే. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో వుండే లాసోన్ అనే సహజ రసాయనంవల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. అంతేగాక పండుగలు, ఫంక్షన్లకు చేతులు అందంగా కనిపించేందుకు గోరింటాకును పెట్టుకుంటారు.
‘‘మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడని, గనే్నరులా పూస్తే కలవాడు వస్తాడని, సింధూరంలా పూస్తే చిట్టి చేయంత అందాల చందమామ అతడే దిగివస్తాడని’’ అనే సినీ గేయాన్ని ఆషాఢమాసంలో మహిళలు ఆలపిస్తుంటారు. ఆషాడంలో గోరింటాకు ఎక్కడ ఉన్నా మహిళలు వెతికి మరీ మెత్తగా రుబ్బి చేతులకు కాళ్లకు అందంగా పెట్టుకుంటారు. ఎంత బాగా పండితే అంతగా వారి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందనే నమ్మకం వివాస సమయంలో పెండ్లి కుమార్తెలకు మెహందీ పెడతారు. గోరింటాకు డిజైన్లు పెట్టడం ఎందరికో ఉపాధి చూపిస్తోంది. ఇపుడంటే మార్కెట్లో పౌడర్లు, కోన్స్ లాంటివి రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. మహిళలకు ఇష్టమైంది గోరింటాకు. ‘‘గోరింటా పూసింది కొమ్మా లేకుండా, మురిపాలా అరచేతా మొగ్గా తొడిగిందీ’’ అని ఓ కవి ఎంతో రమ్యంగా గోరింటాకు అందాలను వర్ణించాడు. కృత్రిమ గోరింటాకు పొడిని వాడటం కంటే సహజమైన గోరింటాకును వాడటం ఎంతైనా మేలు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే గోళ్ళు పుచ్చిపోయి పిప్పి గోళ్ళు అయ్యే ప్రమాదముండదు. గోర్ల చుట్టూ పెట్టుకునే ఆకు కాబట్టి దానిని గోరింటాకు అన్నారు. గోరు + అంటు - గోరును అంటుకుని ఉండేదని అర్థం. సంస్కృతంలో దీని అసలు పేరు నఖరంజని.
వివాహం కానివారు, జాతకంలో శుక్రదోషం వల్ల ఇబ్బందులున్నవారు ఈ గోరింటాకును దానం చేయడంవల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. గోరింటాకును రుబ్బి కీళ్ళ నొప్పులకు పట్టు వేస్తే తగ్గుతాయట. ఆషాఢంలో ఆదివారంనాడు ఖచ్చితంగా అతివలందరూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతారు. ఇంట గోరింట ఉంటే వెంట ఆరోగ్యం వున్నట్టే అని పెద్దలు చెబుతారు. గోరింటాకు పెట్టుకోవడంవల్ల మానసిక ఒత్తిడి తగ్గిస్తుందని పలు పరిశోధనల్లో రుజువైంది. గోరింటాకు పువ్వులను తలక్రింద పెట్టి నిద్రపోయినట్లయితే బాగా నిద్ర వస్తుంది. గోరింటాకు పెట్టుకోవడమనేది మన జీవన విధానంలో ఒక ఆచారంగా సంప్రదాయంగా ప్రవేశపెట్టి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకొనేలా చేశారు. వాతావరణ పరిస్థితుల కనుగుణంగా పెట్టడంలోనే హిందువుల వైజ్ఞానిక దృక్పథం తేటతెల్లవౌతుంది. తెల్లని జుట్టును కూడా నల్లబరిచే ఔషధ గుణం గోరింటాకులో ఉన్నదని ఇటీవల శాస్తజ్ఞ్రులు కనుగొన్నారు. ఈనాడు బ్యూటీపార్లర్‌లలో మనం కోరిన విధంగా రకరకాల డిజైన్లలో గోరింటాకును డిజైన్ చేస్తున్నారు. మీరూ గోరింటాకును పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.

స్వాధ్యాయ సందోహం

$
0
0

ఆధునిక కాలంలో మహర్షితుల్యుడైన దయానంద సరస్వతి ఈ విషయాన్ని విపులంగా ఇలా వివరిస్తున్నారు.
‘‘జితేంద్రియుడు కావాలనే కోరిక గలవాడు రాత్రింబవళ్లు ప్రణవాన్ని (ఓంకారాన్ని) తప్పక జపించాలి. జపం చేస్తూండగా రాత్రి ప్రొద్దుపోతే అవసరమైనంతవరకు నిద్రించి మరల మేల్కొని ప్రణవ జపాన్ని ఆరంభించాలి. ఎందుకంటే ఎక్కువ సమయం నిద్రిస్తే కాలమంతా స్వప్నాలలో గడిచిపోతుంది. ఇది జితేంద్రియుడను కావాలనుకొనే వారికి శుభదాయకం కాదు.’’
మనస్సును పరమాత్మపై లగ్నం చేయి. బాహ్యేంద్రియ విషయాలు తమంత తామే వైతొలగిపోతాయి. అప్పుడు నిద్రించినచో ఏ కలలూరావు. మనస్సు సుషుప్తిదశనుండి తురీయావస్థకు చేరుతుంది.
**
ఋజుమార్గ ప్రవర్తన
అపక్రామన్ పౌరుషేయాద్ వృణానో దైవ్యం వచః
ప్రణీతీర భ్యావర్తస్వ విశే్వభిః నభిభిః సహ॥
అథ.వే.7-105-1॥
భావం:- మానవుల మాటలను ఉపేక్షించి దైవ వచనాల (వేదాల)ను ఎంచుకొని అనుసరించు. మిత్రులందరితోకూడి సత్ప్రవర్తనలను నలువైపుల వ్యాపింపచేయి.
వివరణ:- మానవ జీవితానికి పరమలక్ష్యమేమిటి? అన్న విషయంలో చాలా కొద్దిమంది మాత్రమే ఆలోచన చేస్తారు. అయితే ఎక్కువమందికి మాత్రం తమ జీవిత లక్ష్యమేమిటో తెలియనే తెలియదు. తినడం, త్రాగడం, దుస్తులు ధరించటం, పిల్లలను కనడం, సుఖాలననుభవించడం, కష్టాలకు దుఃఖించడం ఇంతకు తప్ప వారికేమీ తెలియదు. ఈ పనులను పశుపక్ష్యాదులు కూడ చేస్తూనే ఉన్నాయి. అయితే మనుష్యుని ఘనత ఏమి?
ఈ పశుప్రవృతుతలను సంతృప్తిపరచడమేనా మాన జీవిత లక్ష్యం? అలాకాక మానవ జీవితానికి ఒక ప్రత్యేకమైన లక్ష్యమేదైనా ఉందా? ఉంటే దానికి తప్పక ఒక ఉపదేశం కావాలి. ఏ మాటల గారడీతోనో, ఏ చమత్కారకర్మల వల్లనో భోగ సామగ్రిని సంపాదించేందుకే అధికాంశం మానవుల జీవితం గడిచిపోతూంది? దైవం మనిషిని పుట్టించినప్పుడే కొంత జ్ఞానాన్ని కూడ అతడికి ప్రదానం చేసారు. ఆ జ్ఞానమే వేదం. అదే ‘దైవ్యం వచః’ ‘్భగవద్వచనం అని చెప్పబడుతూంది. ఈ విషయాన్ని గురించి వేదం ‘అపక్రామన్ పౌరుషేయాద్ వృణానో దైవం వచః’ ‘‘మానవ వచనాలను విస్మరించి భగవద్వచనాలను ఎంచుకొని అనుసరించు’’మని హితవు పలికింది.
మానవ జీవనోద్దేశ్యం- తత్సిద్ధికి సాధనాలు వేద వచనాలలో ఉన్నాయి. మహామహులైన విద్వాంసులు సహితం మానవ జీవితానికి విహితమైనట్టి కర్తవ్యమిదేనని చెప్పజాలరు. అందుకే సృష్ట్యారంభంలో భగవానుడు మానవ కల్యాణంకోసం వేద సాహిత్యాన్ని అందించాడు. వేదవిజ్ఞానం సమస్త అజ్ఞానాన్ని- దానివలన కలిగే పశుప్రవృత్తులను వినాశం చేస్తుంది. ఈ విషయమే విద్వాంసుల వచనంగా అథర్వణవేదంలో ఇలా కనబడుతూంది.
‘ఉత్ త్వా నిరృత్యాః ఆశేభ్యోదైవా వాచా భరామసి’ (అథ.వే.8-1-3) ‘‘దైవీ వాక్కు అయిన భగవద్వచనాల ద్వారా మేము మిమ్ము పాపపాశాలనుండి విముక్తులను చేస్తున్నాం’’. వేదంలో ఈ దైవీవాక్కే ‘కల్యాణీవాణి’గా (శు.య.వే.26-2) చెప్పబడింది. దీని సమాంతర అర్థమే ‘ప్రణీతీరభ్యావర్తస్వ విశే్వభిః సభిభిః సహ’ ‘‘సమస్తమైన మిత్రులతో కూడి ఉత్తమ ప్రవర్తనలను నలువైపుల వ్యాపింపచేయుము’’ అని మానవుడు సంఘజీవి. ఏ మనిషి పరోక్షంగాగాని ప్రత్యక్షంగా గాని ఇతరుల సహాయాన్ని పొందకుండ జీవింపలేడు. ఇదే పరస్పరాశ్రయమైన సమాజ నిర్మాణానికి మూలసూత్రం.
- ఇంకాఉంది

అనర్థహేతువు

$
0
0

కోపం రాని వారు అంటూ ఎవరూ ఉండరు. సత్వగుణులకైనా ధర్మాగ్రహం వచ్చితీరుతుంది. కాని కోపం రావడం సహజం. ఆ వచ్చిన కోపాన్ని నిగ్రహించుకొని ఎవరు మీద ఎంత వరకు కోపాన్ని ప్రదర్శించాలో అంతవరకు ప్రదర్శించి త్వరగా ఉపశమింపచేసుకొనేవారు గొప్పవారుగా కీర్తించబడుతారు. రాముడు సాత్వికుడు. రాము నికి కోపమే రాదు అని చెప్పినా సముద్రుని మీద వారధి కట్టబోతుంటే సముద్రుడు ఉప్పొంగి వస్తూ వారధి కట్టడానికి వీలు కాకపోతే సముద్రునిమీద రామునికిఎక్కడ లేని కోపం వస్తుంది. సమస్త భూమండలాన్ని ఎదరించగలశక్తి ఉన్న నన్ను గుర్తించడం లేదు సముద్రుడు అంటాడు రాముడు. ఇదిగో ఇక్కడే కోపం రావడానికి కారణం. రాముడు నేను మానవ మాత్రుడిని. దశరథుని పుత్రుడిని మాత్రమే కానీ ఏ మహా విష్ణువు అవతారమని తన రామావతారంలో దేవతలందరూ ఆఖరికి బ్రహ్మదేవుడు చెప్పినా ఒప్పుకోడు. అట్లాంటి రాముడు సముద్రుని దగ్గరకు వచ్చేసరికి నేను అనే అహంకారం చూపుతాడు. అది ఆయనకు చెల్లింది అని చెప్పు కున్నా సామాన్యమానవులకు కూడా ఈ అహం కారమే ఇతరులపైన కోపం రావడానికి కారణం అవుతుంది.
నేను చెపితే వినరా... నేను చెప్పితే చేయరా.. ఏమదీ అంటూ అహాన్ని ప్రదర్శించి గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకుంటారు. అందుకే వివేకులు ఎపుడైనా కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి అనే చెప్తారు. పేదవానికోపం పెదవికి చేటు అనీ దీనివల్లనే సామెత పుట్టుకొచ్చింది. ధనికులు, పదవిలో ఉండేవారు ఏదైనా తప్పు చేసినా వారికి అసలు విషయం చెప్పకుండా కోపాన్ని వారి మీద చూపితే వారు వెంటనే తమ తప్పును సరిదిద్దుకొనకపోగా కోపం చూపించిన వారికి కీడు చేస్తారు. కోపాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉన్నపుడైనా సరే వ్యక్తిగతంగా కాక కేవలం ఏ విషయం పైన కోపం వచ్చిందో దాన్ని చెప్పి అవతల వారికి వారి తప్పును తెలుసుకొనే ట్టు చేయాలి. ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని ఇవ్వాలి. లేకపోతే కోపంవల్ల నలుగురిలో చులకన అవుతారు. కోపిష్టి అనే ముద్ర పడుతుంది. అకారణంగా కోపగించుకోవడం అనర్థానికి దారితీస్తుంది. ఒక్కోసారి కారణం లేకుండానే కోపగించుకుని తరువాత పశ్చాత్తాపపడుతూ వుంటారు కొందరు. చిన్నచిన్న విషయాలకు కూడా కొందరు కోపగించుకుంటూ వుంటారు. అటువంటివారి జోలికి ఎవరూ పోరు. అలుక, కినుక అనే పదాలను అందంగా ప్రయోగిస్తూంటారు కానీ అవి కూడా ముదిరితే చీకాకులే మరి. కోపం వల్ల మనిషిలోని శక్తి, ఉన్న సమయమూ వృధా అవుతాయి. మనశ్శాంతి లోపిస్తుంది. దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. తరచుగా కోపగించుకునేవారిపట్ల ఎవరికీ లక్ష్యభావం ఉండదు. కోపం అగ్నిలాంటిది. లోపల లోపల కాల్చివేస్తుంది. ఇది కనిపించని శత్రువు, అంతశ్శత్రువు. అరిషడ్వర్గంలో కోపం ఒకటి.
‘‘క్రోదాద్భవతి సమ్మోహః సమ్మోహత్ స్మృతి విభ్రమః
స్మృతి భ్రంశాల్ బుద్ధినాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి’’ అని శ్రీకృష్ణుడు క్రోధం పతనానికి దారితీస్తుందని చెప్పాడు. అందుకే కోపాన్ని విడిచిపెట్టడమే మేలు చేస్తుంది. కోపం వల్ల జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. చిత్త చాంచల్యం జరుగుతుంది.యుక్తాయుక్త విచక్షం నశిస్తుంది. వాక్పురుష్యం కలుగుతుంది. ఈ పరుషపదాల వల్లే సమాజంలో చెడు పేరు వస్తుంది. దానితో సర్వమూ నాశనమైపోతుంది. మానవుని పతనానికి కోపమే కారణ మవుతుంది. క్రోధమధి శత్రువు అంటారు ఏనుగు లక్ష్మణ కవి. కోపం వుంటే వేరే శత్రువుతో పనిలేదు. కొన్ని సందర్భాల్లో చేతకానితనం, అసమర్థత, కోపానికి కారణమవుతాయి. కనుక ఏది ఏమైనా కోపాన్ని దూరం చేసుకోవడం చాలా మంచిది.

శ్రీకృష్ణ రమ్య రామాయణం

$
0
0

అనుచు నిటుల భ్రమయందున మునిగి తేలినారు
తమ తప్పుల తెలిసికొంచు మిగుల వగచినారు.

పరపురుషుని జూచుటన్న పాపమ్మని తలచెనేమొ
సీత తొట్రుపడుచు సోలి, రామునిపై బడెను.

పూజకొరకు, పుప్పచయముకొరకు తానునేతెంచెను
పూజాసుమమై రాముని పాదమ్ములబడెను.

ఆమె పడెను ఆమెతోడ పుష్పమ్ములు జారిపడెను
పూవుపడెను పూజేతులనున్న పూలు రాలెననగ.

లేపి నిలువబెట్టినట్లు పడిపోయిన పుష్పమ్మును
సీతమ్మను శీతకనుల శ్రీరాముడు నిలబెట్టెను.

బుగ్గన సిగ్గులు పూయగ జానకి ముకుళించెను
ప్రేమ మొగ్గవేయగానె రాముడు వికసించెను.

భూమియె సిగ్గిల్లినటుల భూమిజ సిగ్గిడెను
‘గలగల’మని చిరుచేతుల గాజులు నవ్వేను.

‘పదపద’మని ఇపదములలో అందెలు త్వరపెట్టినవి
కాని, కనులె చూపలనెడు త్రాళ్ళను బంధించినవి.

ఏదో ఒక అయస్కాంతశక్తి నామె నాపెను
ఎవరో, ఎటులో తెలియక కాలమ్మే కట్టుబడెను.
ఇంకావుంది...

నైషధమ్ (హంస దౌత్యం)

$
0
0

‘‘ఓ సుందరాంగీ! ఒంటరిగా దొరికిన నీవంటి అందగత్తెను ఏ పురుషుడు కోరడు? అనవసరపు మాటలను కట్టిబెట్టి నా కోర్కెను తీర్చుము! అట్లుగానిచో బలవంతంగానయినా నిన్ను పొందగలను’’ అని వదరగా
కోపించిన దమయంతి ఆ కిరాతకుని చెడ్డ ఆలోచనను గమనించి మండిపోతున్న అగ్నిజ్వాలవలె వానిని సమీపించింది. ఆమెను బలత్కరించాలనే తలంపుతో ఉన్నప్పటికి ఆ కిరాతకుడు ఆమెను ప్రజ్వలించే అగ్నిజ్వాలగా భావించాడు. మాటలతో వీనిని వారింపలేనని తలంచిన దమయంతి కోపంతో
‘‘నేను నిషధరాజైన నలుని తప్ప మరొకరిని మనసులో సైతం భావించనట్లయితే ఈ వ్యాథుడు ఈ క్షణమే మరణించుగాక’’!అని శపించింది.
దమయంతి అలా పల్కిన వెంటనే ఆ కిరాతుడు నిప్పుచేత దహింపబడిన చెట్టువలె నేలపై కూలి మరణించాడు.
తన పాతివ్రత్య మహత్యంతో దమయంతి హృదయంలో తన భర్తఅయిన నలమహారాజును ధ్యానిస్తూ ఆ భయంకరారణ్యంలో క్రూరమృగాలకు భీతి చెందక వరుసగా ముందుకు నడక సాగించింది.
ఆ వనచరుని బారినుండి తప్పించుకొన్న దమయంతి జనులు తిరుగాడని ఆ కారడవిలో ఎటూతోచక అటుగా ప్రక్కనే కనపడిన ఒక కాలిబాటను అనుసరించి ముందుకు సాగింది.
ఈల పురుగుల రొదతో ఆ అడవి భయంకరంగా కనిపిస్తున్నది. మ్లేచ్చులకు, దొంగలకు నిలయమైనదిగా ఉన్నది.
సింహాలు, ఏనుగులు, అడవి దున్నలు, గరుపోతులు, పెద్దపులులు, ఎలుగుబంట్లు, అడవి పందులు, తోడేళ్లు, శరభాలు మొదలగు క్రూర జంతువులకు నిలయమైయున్నది.
బహువిధములైన పక్షిజాతులు చెట్లపై నివసిస్తున్నాయి. నీటికోళ్ళు, బొగ్గురు పక్షులు, కొంగలు, చక్రవాక పక్షులు మొదలగు రకరకాల పక్షులతో అడవి అంతా కూతలతో రొదగానున్నది. కొన్ని జింకలు, దుప్పులు గుంపులు గుంపులుగా తిరుగుచున్నాయి.
ఒక దారి అంటూ పొదలతో, అనేక రకరకాల లతలతో నిండుగా ఉన్నది.
మద్ది చెట్లు, కానుగ చెట్లు, పొగడ చెట్లు, ఏరుమద్ది చెట్లు, వేప చెట్లు, కడిమి చెట్లు, కలగొట్ట చెట్లు, చందన వృక్షాలు, కర్పూర వృక్షాలు, దరిసెపు చెట్లు, తియ్య మామిడిచెట్లు, ఎఱ్ఱగంధపు చెట్లు, (ఎఱ్ఱ చందనం) పోక చెట్లు, మారేడు చెట్లు, వెలగ చెట్లు, ఇప్ప చెట్లు, సాల వృక్షాలు, శాల్మలీ వృక్షాలు (బూరుగ) లవంగ లతలు, వెదురుపొదలు, చండ్ర, రావి, తుమికి చెట్లు, ఇంగువ చెట్లు, మోదుగ చెట్లు, తనిశ చెట్లు, నేరేడు చెట్లు, లొద్దుగ చెట్లు, మునుగుదామర,
ప్రబ్బలి, పద్యక, ఉసిరిక, జివ్వి, అత్తి, రేగు, మఱ్ఱి, అడవి మామిడి, తాడి, ఖర్జూర, కరక్కాయ, తాండ్ర చెట్లతో అడవి అంతా దట్టంగా ఉన్నది.
గైరికాది బహుధాతువులతో కూడిన పర్వతాలు, పొదరిండ్లతో కప్పబడిన కొండ చరియలు కనువిందు చేస్తున్నాయి.
నదులు, సరస్సులు, దిగుడు బావులు, సెలయేళ్ళు, అతి భయంకాకృతిగల పిశాచాలు కనపడుచున్నాయి.
పాములు, ముంగిసలు పరుగెత్తుతూ కలబడుచున్నాయి. రకరకాల కోతులు ఒక చెట్టుపైనుండి మరొక చెట్టుపైకి దూకుతూ అరుస్తున్నాయి.
నెమళ్ళు పురివిప్పి అందంగా నాట్యం చేస్తున్నాయి.
పర్వతాలనుండి ఎంతో ఎత్తుపైనుండి క్రిందికి దూకుతున్న జలపాతాల శబ్దాలు వినిపిస్తున్నాయి. అలా జాలువారే నీటి బిందువులు పైకెగసి ముత్యాల మాదిరిగా నలుదిక్కులా చిమ్ముతున్నాయి. అందంగా కనువిందు చేస్తున్నాయి.
కొంతదూరంలో కోపంతో ఒకటితోనొకటి భయంకరంగా కలబడుచున్న ఖడ్గమృగాల భీకరపోరును చూచి భయకంపితురాలయింది దమయంతి.

చిన్మయుని చిత్రములేనా! ( చిత్రకేతువు -2)

$
0
0

ఊరు వాడ రాజ్యం అంతా కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. రాజుగారు నాకు లేక లేక పుట్టిన కొడుకు అందులోను మహర్షి వరం చేత పుట్టిన కొడుకు ఇలా ఎందుకు మృత్యువు పాలయ్యాడో అని వగచారు. కృతద్యుతి సవతులంతా బాధను నటించారు. చివరకు రాజు అంగీరస మహాముని వద్దకు బిడ్డను తీసుకుని వెళ్లి బతికించమని కోరుకుంటాను అనుకొన్నాడు.
ఆ దారిన పోతున్న నారదుడు ఆ రాజ్యంలోని ఏడుపులు విని ఏమై ఉంటుందో తెలుసుకుని అంగీరసుని చెంతకు వెళ్లి విఃయాన్ని వివరించారు. అంగీరసుడు కూడా నారదునితోకలసి వెక్కి వెక్కి ఏడుస్తున్న మహారాజు చెంతకు వచ్చాడు. ఏమి జరిగి ఉంటుందో ఆయన తన దివ్యదృష్టితో చూసి తెలుసుకొన్నాడు. మనుష్యుల్లో ఈర్ష్యాద్వేషాలు ఎంతటి పనికైనా తెగిస్తాయని అనుకున్నారు.
దాంతో రాజుగారికే జ్ఞానోదయం కలిగించాలని అంగీరస, నారదులు అనుకొన్నారు.
చనిపోయిన పిల్లవాని కాళ్ల దగ్గర కూర్చుని ఏడుస్తున్న రాజు రాణిని చూసి అంగీరసుడు వారి దగ్గరకు వచ్చాడు. మహారాజు మహర్షిని చూసి మరింతా బోరుమన్నాడు. ఆయన వారిని ఓదారుస్తూ ‘నిన్నమొన్నటి దాకా ఈ పిల్లవాని గురించి మీకు తెలయనే తెలియదు కదా. మీ దగ్గర కు వచ్చి కొన్ని నెలలు అయితే నే మీరు ఇంతగా రోదిస్తున్నారెందుకు? మనందరమూ కూడా ఒకనాటికి మృత్యువు పాలయ్యేవారిమే ఈ పిల్లవాడు ముందుగా వెళ్లాడు అంతే మీ రోదనలను ఆపండి అని చెప్పాడు.
ఆ మాటలకుతల్లి హృదయం దెబ్బతింది. కృతద్యుతి మరింతగా ఏడ్వనారంభించింది. దానితో మహారాజుకూడా ఆమె ఓదార్చలేక ఆయన కన్నీళ్లప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు.
చిత్రకేతువుదుఃఖాన్ని పూడ్చలేకపోయేసరికి అంగీరసుడు ‘మహారాజా! బాగానే ఏడుస్తున్నావు. కానీ ఇతడు నీకు ఏవౌతాడు? ’ ఆ విషయం నాకు చెప్పు అన్నాడు.
ఈ మాటలు వినేసరికి దుఃఖంలో కోపం వచ్చింది. ‘మహానుభావా! నేను అసలే దుఃఖంలో మునిగిపోయి ఉన్నాను. అది మీకు తెలిసి కూడా నన్ను ఎందుకు ఇలా బాధిస్తున్నారు’ అని అడిగాడు.
‘నాకు తెలుసుకనుక నేను మాట్లాడుతున్నాను. ఈ బిడ్డను నేను కదా ఇచ్చాను. తిరిగి ఈ బిడ్డను బతికించడం నాకు కష్టం కాదు. కానీ నీకు ఈ బిడ్డకు ఉన్న సంబంధం ఏమిటో నాకు చెప్పు’అన్నాడు.
ఈ మాటలతో మరింత కోపం హెచ్చి ‘స్వామీ ఇతడు నాకుమారుడు. ఇతడిని విడిచి నేను ఉండలేను. ఇతడే నా వంశాన్ని వృద్ధి చేస్తాడని ఎంతో ఎదురుచూస్తున్నాను. ఇపుడు వీడు ప్రాణాలు కోల్పోవడం నాకు జీర్ణం కావడంలేదు.
మీరు నా బిడ్డను బతికించగలిగి ఉండికూడా మీరు కాలయాపన చేయడం నాకు మీ భావమేమిటో అర్థం కావడంలేదు. మీరు దయచేసి నా బిడ్డను బతికించండి’ అని కన్నీళ్లు కారిపోతుండగా అడిగాడు. కృతద్యుతి కూడా ‘గురువర్యా! మీరిచ్చిన బిడ్డను మేము ఈనాడు పోగొట్టుకొన్నాము. దయచేసి మాకు మాబిడ్డను మాకిచ్చి మాప్రాణాలనునిలపండి’అని అడిగింది.
మరునిముషంలో అంగీరసుడు కళ్లు మూసుకుని కాసేపు ధ్యానం చేసి తన చేతిలో ఉన్న కమండలంలోని నీటిని చనిపోయిన పిల్లవానిపైన చల్లాడు. వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు.

శ్రీ పరమహంస బోధామృతము

$
0
0

1055. అమితభక్తిచే (తన్మయత్వము పొందుటచే) హాని కలుగుననుట అవివేకము- అసంగత ప్రలాపము. మాణిక్యకాంతులు మనోహరముగను ప్రశాంతికరముగను ప్రకాశించునే కాని తగులబెట్టవు.
1056. లీలమూలమున నిత్యుని దెలిసికొనయత్నింపుము.
1057. ‘సత్తు’ను దెలిసికొనుటకై ‘చిత్తు’నాశ్రయింపుము. (అనగా శుద్ధసత్త్వస్వరూపమగు బ్రహ్మమును దెలిసికొనుటకై శుద్ధ చైతన్యరూపమగు వాని లీల నాశ్రయింపుమని భావము.)
1058. నిత్యమైన దానిని అనిత్యమైన దాని మూలముననే పొందవలసి యున్నది; సత్యమును అసత్యము మూలముననే కనుగొనవలయును; పరమార్థమును వ్యవహారము మూలముననే గ్రహింపవలయును.
1059. వాని పేరు చిన్మయుడు; వాని నివాసము (అధిష్ఠానము) చిత్తు (జ్ఞానము); ఆతడు (పరమేశ్వరుడు) జ్ఞాన స్వరూపుడు.
నీతి కథలు
సాంసారిక దుశ్చింతవలన గలుగు హాని
1060.్భగవంతుడు కల్పతరువు వంటివాడు. మనమేమి కోరినను భగవంతుడొసగును. కాబట్టి పారమార్థిక సాధనలచే మనస్సును పరిశుద్ధమొనర్చుకొని సాధకుడు ఐహిక వాంఛలనన్నిటిని విసర్జించుటకై జాగరూకడు కావలయును. ఈ విషయమై ఒక కథ జెప్పెదను, వినుడు. ఒక బాటసారి ప్రయాణామైపోవుచు, దారిలో ఒక మైదానమును జేరుకొనెను. అతడు బయట నెండలో నడిచియున్నందున అలసి ముచ్చెమటలుపట్ట కొంచెము విశ్రమింపవలయునని యొక చెట్టునీడను గూర్చుండెను. అంత గొంత సేపటికి అక్కడ నిద్రించుటకు దనకొక పాన్పులభించిన నెంత సుఖముగా నుండునోకదా అని ఊహింపనారంభించెను.
తాను కల్పవృక్షము క్రింద గూర్చుంటినని అతడెరుగనే ఎరుగడు. పైని జెప్పిన కోరిక మనస్సు దోపగనే తన ప్రక్క నొక చక్కని పానుపు గానబడెను. అది చూచి అమితాశ్చర్యమునొంది దానిపై బరుండెను. అటుపిమ్మట తనకొక సుందరి వచ్చి నెమ్మదిగా పాదములొత్తిన నెంత హాయిగానుండునో కదా అనుకొనెను. ఈ తలపు కలుగగనే ఒక సుందరి వచ్చి తన పాదముల నొత్తుచుండుట కనుగొని బాటసారి పరమానందభరితుడయ్యెను. అటుపిమ్మట వానికి విశేషమైన ఆకలియైనది. అంతట అతడిట్లు ఊహించెను: ‘‘నేను కోరినదంతయు ప్రాప్తించినది. నాకిక నేదైన ఆహారము లభింపకుండునా?’’- అంతలోనే వాని ఎదుట రుచికరమగు నానావిధ పదార్థములును వడ్డింపబడియుండెను. తతక్షణమే అతడు వానిని దినమొదలుపెట్టెను. తృప్తిగ మెక్కి తిరిగి పరుపుమీద బండుకొని ఆనాడు జరిగిన వృత్తాంతమును గూర్చి చింతింపసాగెను.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి


maatata

$
0
0
Cross Image: 
Date: 
Tuesday, July 30, 2019

దూతికా విజయం-3

$
0
0

తాను ఇరవై ఏళ్ళుగా ఎరిగిన మాధవీదేవి కాదీమె. ఈనాటి ఆమె ప్రవర్తన సరస్వతికి ఎంత ఆలోచించినా అంతుబట్టడంలేదు. రాణి తాను బైటపడకుండా గొప్ప నటనను ప్రదర్శిస్తోందనే సంగతి సరస్వతికి తెలుసు. నిన్న సాయంత్రం వరకూ మామూలుగా వున్న రాణిలో ఇంత గొప్ప మార్పు ఒక్క రాత్రిలో ఎలా వచ్చిపడిందో సరస్వతి ఊహకు అందడంలేదు.
ఏదో గొప్ప విషమ సమస్య మనసు పీడించి, పిండివేసేదే ఆమెను బాధపెడుతూండి ఉండాలి. తన ఆందోళన బహిర్గతం కాకుండా రాణి ఎంత చాకచక్యంతో సమర్థించగలదో చూడాలి.
తనవలెనే ఆమె స్థితిని ఇతరులు - ముఖ్యంగా ధర్మపాలుడు గ్రహించినట్లయితే లేనిపోని విచారణలూ, సంజాయిషీలూ అనవసరమైన రభసా తప్పవు. అందుకని చిన్నరాణి మనస్సును వినోద కార్యక్రమాల మీదికి మళ్లించే ప్రయత్నాలు విశేషంగా అనుసరించవలసి ఉంటుంది. అసలు సంగతి తెలుసుకున్నాక పరిష్కారాలు ఆలోచించవచ్చు. తన చాకచక్య ప్రదర్శనకు సమాయమాసన్నమైనదని గ్రహించింది సరస్వతి.
2
పోటీలు ఆరంభించవచ్చని రాజాజ్ఞ అయంది.
ముందుగా బలప్రదర్శన పోటీలు మొదలైనవి. వేదికమీదకు ఎక్కి తన కండరాల్ని చూపుతూ శరీరంలోని వివిధ భాగాలకు వాటిని బదిలీ చేస్తూ, శారీరక ప్రదర్శన జరిగింది. మొత్తం ఎనిమిదిమంది ఇందులో ఉన్నారు. ఏడోవాడుగా వచ్చిన పాతికేళ్ళ యువకుడు అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.
కండరాలు పెంచిన శరీరాల్లో అవి అలవిమాలిన పరిమాణానికి పెరిగి, సహజ శారీరక సౌందర్యాన్ని ధ్వంసం చేయడం సర్వసామాన్యం. ఎక్కడ ఎంతవరకూ పెరుగుతూ తూకంగా శరీర సౌందర్యం చెడకుండా ఉండగలదో అంతవరకే పెంచడమనేది వ్యాయామం చేసేవాడి చెప్పుచేతల్లో ఉండదు. కండలు పెంచడం ఒక్కటే అతనికి తెలుసు. వాటిని పెంచడంతోనే తన బాధ్యత తీరినట్లు అతను భావిస్తాడు. ప్రతి సంవత్సరమూ చూసే వికృతాకారాలకూ ఈనాడు రుూ యువకునిలో చూస్తూన్న శారీరక సౌందర్యానికీ ఎంతో వ్యత్యాసం వున్నది. దేన్నయితే చూస్తామని భావించి, ఊహించిన దృష్టికి ఈ యువకుడు గొప్ప ఆశాభంగాన్ని సృష్టించాడు.
ఇతర ప్రేక్షకుల సంగతి అలా ఉంచి మాధవీదేవిని పరిశీలనగా మనం చూస్తున్నట్లయితే, ఆ యువకుని బలప్రదర్శన ఆరంభమవగానే ఆమె ముఖకవళికలు క్షణంలో మారినవి. ముఖంలోని దైన్యమూ, దిగులూ మాయమై వాటి స్థానే ఎంతో ఆనందమూ, ఉత్సాహమూ ఉట్టిపడినవి. ఆ వికారాలను తనలో ఇముడ్చుకోలేకనేమో మాధవీదేవి ఒక దీర్ఘనిశ్వాసం ద్వారా కుదుటబడింది.
ఇదంతా గమనిస్తూన్న సరస్వతి మెల్లిగా తన చేతిని మాధవీదేవి వీపుమీద వేసి మునివేళ్ళతోనే హెచ్చరించింది. నోటితో మాట్లాడవలసిన అవసరం లేనప్పుడు, లేదా అవకాశం లేనప్పుడు తదితర శరీరాంగాల ద్వారా తమ భావాలను వ్యక్తం చేయగల సామర్థ్యం సామాన్యులకు ఉండదు. మాధవీదేవి, సరస్వతీ కూడా సామాన్యుల కోవకు చెందినవారు కాకపోవడంవల్లా, ఉభయుల విజ్ఞాన వికాసాలూ, లోకజ్ఞానమూ, సంస్కృతీ సమాన మట్టాల్లో ఉండటంవల్లా వారికది సుసాధ్యమైనది.
మాధవీదేవి మెరుపువలె ఒక్కసారి సరస్వతి కళ్ళలోకి చూసి తల తిప్పుకున్నది. ఆ భాష వారిద్దరికీ తప్ప మరెవరికీ అర్థమవదు.
అంతే- సరస్వతి మెరుపుతీగవలె మాయమైంది. తరువాతి కార్యక్రమాలు ఆరంభమయ్యే సమయానికి తన స్థానానికి వచ్చేసింది. అతి రహస్యంగా రాణి చెవుల్లో, ‘వీరభద్రుడు’ అన్నది. రాణి ఎంతో సంతోషించినట్లు కనిపించింది.
ఆ తరువాత పటిష్టమైన ఉక్కు కడ్డీలను వొంచడంలో పోటీ జరిగింది. ఇందులో ఐదుగురు మాత్రమే పాల్గొన్నారు. ముగ్గురికి పరాజయమే ప్రాప్తించింది. నాలుగోవాడు నానా అవస్థాపడి వొంచాడు. ఐతే ఆ అలసటతో స్పృహ తప్పి పడిపోతే మోసుకొని వెళ్ళవలసి వచ్చింది.
చివరివాడుగా వీరభద్రుడు రంగస్థలం ప్రవేశించాడు. అతని ముఖం చూస్తేనే విజయాన్ని వెంట పెట్టుకొచ్చాడనిపిస్తోంది. అతనింకా ఉక్కు కడ్డీలను చేతితోనైనా తాకకముందే ప్రేక్షకుల హర్షధ్వనులు మిన్నుముట్టాయి. తనకు తెలియకుండానే మాధవీదేవి కూడా ప్రేక్షకులను అనుసరించింది. సరస్వతి హెచ్చరించనట్లయితే అసహ్యకరమైన పరిస్థితి ఏర్పడేదే!
అందరూ ఎందుకంత తొందరపడాలో సరస్వతికి అర్థమవలేదు. ఎంత మహామహుడైనా- ఏ క్షణంలోనైనా పరాజయంపాలు కావచ్చు. విజయుడయ్యాక అభినందించవచ్చు కదా! ఇప్పుడు వీరభద్రుణ్ణి రుూ ఉక్కుకడ్డీలే జయిస్తే ఎంతమంది మొహాలు మాడి, మసిబొగ్గులవుతాయో ఎవ్వరూ ముందుగా ఊహించలేరు కదా!
చిత్రం! వీరభద్రుడు అవలీలగా ఆ ఉక్కు కడ్డీలను వొంచివేసి, ఎంతోమందిని నిరాశనుంచి కాపాడాడు. అందరికీ ఎంతో ఆనందాన్నిచ్చాడు. తామిచ్చిన ఉత్సాహం అయోగ్యతకు అంకితమవనందుకు అందరూ హర్షించారు. ముఖ్యంగా చిన్నరాణి, ఆమెతోపాటు సరస్వతీను.
తరువాత నువ్వులు పిండి నూనె తీయటంలో పోటీలు. ఇందులో పదిమంది పాల్గొన్నారు. ఎంత ప్రయత్నించినా ఒక్క బొట్టుకన్నా ఎక్కువ నూనె పిండటం ఎవరివల్లా కాలేదు. తిరిగి వీరభద్రుని వంతు వచ్చింది. అతను వేదికమీదికి వస్తూండగానే తిరిగి కరతాళ ధ్వనులు విననైనవి. రుూసారి మాత్రం చిన్నరాణి ముందుగా హర్షించకుండా అతి ప్రయత్నంమీద నిభాయించుకుంది. అది గ్రహించి సరస్వతి మనసు కుదుటపడింది.
గుప్పెడు నువ్వులు వీరభద్రుని చేతిలో ఎంత ఆవేదనను అనుభవించాయో బొటాబొటా రాలిన వాటి కన్నీరే తెలియచెపుతూన్నది. రెండు క్షణాల్లో అతను అరచేతిని విప్పాడు. తైలంతో తడిసిన ఆ చేతిలో సూర్యకిరణాలు ధగధగా మెరిసిపోతూన్నవి. ప్రేక్షకులందరూ మరోసారి చప్పట్లు చరిచారు. ఇందులో చిన్నరాణితోపాటు ఆమె చెలికత్తె సరస్వతికూడా పాల్గొన్నది.
తరువాతి కార్యక్రమం మల్లయుద్ధం. బహుశా ఇందులో వీరభద్రుడు పాల్గొనడని మాధవీదేవి తలంచింది. ఒకవేళ అతను కూడా పాల్గొనేట్లయితే వరుసగా రుూ కార్యక్రమాల్లో పాత్ర వహించడంవల్ల ఎంతో అలసిపోయి ఓటమి ఎదురౌతుందేమోనని ఆమె గుండెలు గుబగుబలాడినవి. మల్లయుద్ధంలో వీరభద్రుడు పాల్గొనలేదు.
- ఇంకాఉంది

శిప్రముని వాఙ్మయ నికషోపలం

$
0
0

నికషోపలం (వ్యాససంపుటి)
- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్
వెల:375/- ప్రతులకు: నవోదయ, ఆర్యసమాజ్ మందిరం ఎదురుగా, కాచిగూడ, హైదరాబాద్-500 027.
ఫోన్:040-24652387.
=================================================
సంస్కృతంలో నికషోపలం అనే పదానికి సమానార్థకంగా కసౌటీ - గీటురాయి - టచ్‌స్టోన్ వంటి పదాల ప్రయోగం జరుగుతూ ఉంటుంది. చారిత్రక నవలా చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ వివిధ సందర్భాల్లో రచించిన వ్యాసాలు ఇటీవల సంకలనాలుగా వస్తున్నాయి. శిప్రవాక్యం - వ్యాసదర్శనము నికషోపలం అనే పేర్లతో ఇప్పటికే మూడు సంకలనాలు వెలువడ్డాయి.
నికషోపలంలో తొలి వ్యాసం చాలా బరువైనది. ఆర్యశబ్దము గుణ వాచకమా? జాతి (రేస్) వాచకమా? అనే సుదీర్ఘ చర్చ జరిగింది. ఆర్యులు ఎక్కడినుండి వచ్చారు? ఆర్య ద్రావిడ సంబంధాలేమిటి? ఈ అంశంపై పాశ్చాత్య విద్వాంసులు ఏమన్నారు? లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి అంశాలు భాషా శాస్త్రం భౌగోళిక శాస్త్రం, చారిత్రక నేపథ్యాలలో పరిశోధించి పరిశీలించి ‘కృణ్వంతో విశ్వమార్యమ్’ అనే సుదీర్ఘ వ్యాసాన్ని సంతరించారు. ఇది ఈ తరంలోని విద్యార్థులకే కాదు పండితులకు కూడా మార్గదర్శనం చేస్తుంది అనటంలో సందేహంలేదు.
జొరస్ట్రానియన్లు అగ్నిపూజకులు. వీరి మత గ్రంథాలు అలెస్టా భాషలో ఉన్నాయి. తర్వాతికాలంలో అవి పహ్లవి, అరబిక్, ఆంగ్ల భాషలలోకి అనువదింపబడ్డాయి. ఈ అహిర్‌మర్ద ఎవరు? జంషడ్‌జీ అంటే అర్థం ఏమిటి? జరుతష్ట పదానికి సమానార్థకమైన ఆంగ్ల పదం సంస్కృతం ఏదైనా ఉందా? యస్నా అంటే మరేదో కాదు యజన శబ్దమే. వెండిడాడ్ అంటే భారతీయుల గృహ్యసూత్రాలే సుమా! ఈ అద్భుత పరిశోధన తెలుగులో ఇప్పటివరకూ రాలేదు అనేది నిర్వివాదాంశం. ఈ నికషోపలం సంకలనంలో వెండిడాడ్ ఒక పరిచయం అనే వ్యాసం ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని మద్దిగాం సమీపంలోని మాకవరంలో శ్రీ ఉమాసహిత నీలకంఠేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఇది అత్యంత ప్రాచీనమైనది. దీనిపై నూరేండ్ల క్రితం వంతుల బ్రహ్మదేవకరి ఒక యక్షగానం రచించారు. నేడది అలభ్యము. ప్రొఫెసర్ శివప్రసాద్ శ్రమించి శిథిల ప్రతిని ఒకదానిని సేకరించారు. దానిని పరిష్కరించి నీలకంఠేశ్వర యక్షగాన పరిచయము అనే ఒక వ్యాసాన్ని రచించి పాఠకుల సౌకర్యార్థం ఈ సంకలనంలో చేర్చారు. దానితోబాటు ఆ ప్రాచీనదేవాలయం (మాకవరం)లోని ఆలయ శిల్పాన్ని కూడా సేకరించి ముద్రించారు. తెలుగులో యక్షగాన చరిత్ర, నీలకంఠేశ్వర యక్షగానంలో కాళిదాస కథాగతమైన క్రమం ఎంతవరకు ఉంది? అనే అంశాలు స్పృశించారు. ఇలా జీర్ణోద్ధరణ చేయటం రచయిత సాహిత్య సేవకు పరిశోధక మేధకు నిజంగా నికషోపలమే. ఇటీవలికాలంలో భారతదేశంలో జరిగే వివిధ విషయాలపైన ముదిగొండ వారు తనదైన ఆలోచనా దృక్పథంలో విషయ వివరణ చేస్తూ ‘ఈ కల్పన బాగుంది’ అనే గ్రంథాన్ని రూపొందించారు. అందులోని ప్రతీ వ్యాస సారంశం ప్రతివారిని ఆలోచింపచేస్తుంది. ఇందులో ఆర్టికల్ 19ఎ, బిలు ఇచ్చిన భావస్వేచ్ఛ, దేశద్రోహానికి దారితీయకూడదు అని శివప్రసాద్ స్పష్టీకరించారు. ఈ సంకలనంలో ఆయా సందర్భాలలో దేశంలో జరిగిన వివిధ రాజకీయ పరిణామాల సందర్భంగా రచయిత ఆంధ్రభూమి దినపత్రికలో శిప్రవాక్యం శీర్షికలో వెలువరించిన వ్యాసాలు కూడా ఇందులో కొన్ని ప్రచురించారు. ఇవి విశే్లషణాత్మకంగా గణాంకాలతో (స్టాటిస్టిక్స్) సోదాహరణంగా ఉండటంవల్ల చెప్పిన విషయానికి ప్రామాణికత పెరుగుతున్నది.
ఇందులో దేశ రాజకీయాలు, రాజకీయ నేతల ఆలోచనలు ఎటువైపుకు మళ్లుతున్నాయ వాటికి కారణాలేంటి అనే ఆలోచనాపరంపరలు పాఠకు నిలో మొలకెత్తుతాయ. తెలంగాణ రాజకీయాల్లో ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ అస్తిత్వం ఎంత? అపర చాణుక్యుడు ఎవరు? పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన ఆర్థిక పరిణామాలేమిటి? ఉగ్రవాదం .... ఇలా ఎన్నో అంశాలను ప్రతీ వ్యాసం లోను విశే్లషణాత్మకంగా ప్రొఫెసర్‌గారు వివరించారు. తమిళనాడు రాజకీయాల పయనం ఎటు? చైనాతో స్నేహం చేస్తే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే. దేశంలోని అన్ని సమస్యలకూ మూలకారణం దేశ ప్రజలలో దేశభక్తి లోపించటం ఇట్లాంటి వ్యాసాలు ఈ వ్యాస సంకలనంలో చోటు చేసుకున్నాయ. తృతీయ ఫ్రంట్ ప్రయోగం ఎందుకు విఫలమైంది? కాంగ్రెస్ ముక్త్భారత్ అనే లక్ష్యానికి బిజెపి ఎంత చేరువలో వుంది? ఇలా ఆసక్తికరమైన సమాకాలీన రాజకీయాంశాలపై లోగడ శివప్రసాద్ ప్రచురించిన వ్యాసాలు ఇందులో పొందుపరిచారు. ఏ వ్యాసమైనా ప్రామాణికంగా ఉండటంతోబాటు రీడబిలిటీ ఎక్కువగా ఉండటంవలన ఇవి విశేషంగా లోగడ లక్షలాది పాఠకులను ఆకర్షించినట్లే ఇపుడు పాఠకులను ఆకర్షిస్తాయ. ఈ గ్రంథాన్ని శ్రీ భిళ్లముడి సీతారామస్వామి దంపతులకు రచయిత అంకితం చేయడంతోబాటు కృతిభర్త వంశవృక్షాన్ని సేకరించి సచిత్రంగా ప్రచురించారు. పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు ఈ గ్రంథం అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది అని వేరే చెప్పనక్కరలేదు.

అనుభవాలూ - జ్ఞాపకాలూను( శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తి )

$
0
0

శ్రీపాద వారి భాష గురించి ఎక్కువ చెప్పవలసిన పనిలేదు. అక్షరజ్ఞానం ఉండి సాహిత్య పరిచయం ఉన్నవారికెవరికైనా ఆ విషయం విదితమే. శ్రీపాద వారి వాడుక భాషా సౌందర్యం ఆస్వాదయోగ్యమే కాని దాన్ని గురించి ఎంత చెప్పినా చాలదు. ఒక అక్షరం.. పదం.. అది ప్రతిభావంతుడైన వాడి చేతిలో.. అక్షర శక్తి తెలిసినవాడి చేతిలో పడితే దానికి రంగు, రుచి, వాసన సంక్రమిస్తాయి. శ్రీపాదవారిది ప్రతిపద పరిమళభరితమైన భాష. అందాల సంవాద కథన ధోరణి, ఈ ఆత్మకథాత్మక రచనలోనూ ఆ సుందర లక్షణం సంపన్నంగా కనిపిస్తుంది. తన భాష కేవల పాండిత్య ఫలం కాదనీ, లేక గ్రంథ పఠనంవల్ల వచ్చింది కాదనీ ఆయన విచిత్రంగా చెప్పారు. తన భాష తన చుట్టూ ఆవరించుకుని వున్న జీవితం నుంచి, ముఖ్యంగా తన చుట్టూ వున్న సామాన్య అవిద్యావంతులైన గృహిణిల నుంచి తాను నేర్చుకున్నానని ఘంటాపదంగా చెప్పారు. ఈ గ్రంథంలో ఆయన అత్యంత వినయంగా తనకు వాడుక భాషలోని అందాన్నీ రమణీయకాన్నీ నేర్చిన గృహిణులకు పేరు పేరునా కృతజ్ఞత తెలియజేయడం మరింత అబ్బురపరిచే విషయం. పైగా తాను వ్రాస్తున్న భాష వారనుగ్రహించిన దాన్లో సహస్రాంశమైనా లేదు. ఇంతా చేస్తే అనడం మరీ విచిత్రమైన విషయం. తమ తల్లిగారు, తటవర్తి సుబ్బమ్మగారు, మైలవరపు జోగమ్మగారు, బుద్ధవరపు సీతమ్మగారు- ఈ పుణ్యస్ర్తిలందరూ ఏ లోకాలలో వున్నారో- దినదినమూ జరుపుకునే గోష్ఠి తనకు అత్యంత రుచ్యమైన వాడుక భాష నేర్పిందని శ్రీపాదవారి ఉవాచ. ఛలోక్తులు, శే్లషలు, సామెతలు, పలుకుబళ్లు, ఇంకా నవరసాలు ఆ సంభాషణలలో.. అక్కడ సరస్వతీదేవి లాస్యం చేస్తున్నట్టుండేదిట. ‘వారే కాదు, నలుగురు స్ర్తిలెక్కడ మాట్లాడుకుంటున్నా వింటూ ఉండిపోయేవాణ్ణి’ అంటారు శ్రీపాద. ఇప్పుడు అర్థమవుతుంది మనకు ఆయనవ్రాసిన ‘యావజ్జీవం కోష్యామి’ కథలో పేరులేని ఆ కోమలాంగి సరసమైన మాటల ధోరణి ఎక్కడిదో.
ఈ గ్రంథం ఆనాటి సమాజంలోని వివిధ పోకడలకు ఒక నిలువుటద్దం. అప్పటి జన జీవితానికి అచ్చమైన ప్రతిబింబం. అప్పటి సామాన్య ప్రజల జీవనాడి. గుండెచప్పుడు. తాను అనేక సందర్భాలలో అనుభవించిన దారిద్య్రం..

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

పరమేశ్వర శతకం

$
0
0

తే.గీ. రమ్యభావాలు నాలోన రాజ్యమేల
భక్త్భివాలు పొంగారు వాంఛదీర
నీదయావీక్షణంబుల నెఱపుమయ్య
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: చక్కటి భావాలు నాలో రాజ్యమేలేవిధంగా, భక్త్భివాలు పొంగార వలయుననే వాంఛతీరేలా దయతో కూడినటువటి నీ చల్లని చూపులను వ్యాపింపచేయువయ్య శంకరా! నీవు రక్షించిన నీ భక్తుల కథలు విని, నీ దయామృత హృదయాన్ని చూసి నేను చేసిన పాపాలను కూడా నీవు దయతో పారద్రోలుతావని నెరనమ్మి నీ నామానే్న నిరంతరం విడువక జపిస్తున్నాను తండ్రీ నీవే నన్ను కాపాడాలి.
తే.గీ. భక్తవత్సలుడవు శివా! భయమువీడి
ధైర్య సంపత్తి గల్గియు ధరణిలోన
స్థైర్య మాకృతిఁ దాల్చంగ సాగఁ దలతు
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ పార్వతీ పరమేశ్వరా! నీవు భక్తవత్సలుడవయ్య! భయం విడిచి నిర్భయంగా థైర్యస్థైర్యాలతో సాగిపోవాలనుకుంటున్న నన్ను రక్షించవయ్య స్వామీ! శివా నీపేరులోనే పవిత్రమూ, స్వచ్ఛత ఉంది. నీవు లేనిదే ఈలోకంలేదు. నీవే లయకారునివి. నిన్ను మించిన దైవం ఎక్కడనూలేదు. కనుక నేను నిరంతరమూ నీనామస్మరణనే చేస్తున్నాను. నన్ను ధర్మపథంలో నడిపించే బాధ్యత నీదే శివా.

ట్రైలర్‌కొచ్చిన బోయ్

$
0
0

విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌పై అమర్ విశ్వరాజ్ తెరకెక్కిస్తోన్న చిత్రం -బోయ్. ఆర్ రవిశంకర్ రాజు మరో నిర్మాత. లక్ష్య, సాహితీ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఆగస్టు 9న విడుదలకానున్న చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను మాస్టర్ విరాట్, ట్రైలర్‌ను బెక్కం వేణుగోపాల్ విడుదల చేశారు. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ -ట్రైలర్‌లో వండర్‌ఫుల్ కంటెంట్ కనిపిస్తోంది. టెన్త్‌క్లాస్ ఏజ్ గ్రూప్ పిల్లల ఫీలింగ్స్‌ను సినిమాలో చూపించినట్టు తెలుస్తోంది. కానె్సప్ట్ నచ్చి రైట్స్‌ను తీసుకున్న పివీఆర్, సినిమాను విడుదల చేస్తోంది. బోయ్ టీమ్‌కు సక్సెస్ రావాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. మరో అతిథి డార్లింగ్ స్వామి మాట్లాడుతూ -ఆరు నెలలు పిల్లలతో కష్టపడి యాక్ట్ చేయించి సినిమాను తెరకెక్కించారు. ఆ కష్టం వృధాపోకూడదని ఆశిస్తున్నా అన్నారు. చిత్ర దర్శకుడు, నిర్మాత అమర్ విశ్వరాజ్ మాట్లాడుతూ -కాలేజీ వైపుఆశగా చూసే అబ్బాయి కథ. టెన్త్‌లో ఎదుర్కొన్న సమస్యలేమిటి? అనేది కథాంశం. సెన్సార్ నుంచి క్లీన్ యు సర్ట్ఫికెట్ వచ్చింది. ఈ సినిమాకు కారణమైన ఇద్దరు ఏకలవ్య గురువుల గురించి సక్సెస్‌మీట్‌లో చెబుతానన్నాడు.

ఆసక్తికరంగా శివరంజని

$
0
0

రష్మీ ప్రధాన పాత్రలో నందు, అఖిల్ కార్తీక్, ఇంద్ర హీరోలుగా నాగ ప్రభాకర్ దర్శకత్వంలో యూ అండ్ ఐ బ్యానర్‌పై పద్మనాభరెడ్డి నిర్మిస్తున్న హర్రర్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ శివరంజని. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న సినిమా ఆగస్టు 2న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత పద్మనాభరెడ్డి మాట్లాడుతూ జబర్దస్త్ రష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శివరంజని. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుంది. శివరంజని ఎవరన్న నేపథ్యంలో కథ సాగుతుంది. కొద్దిగా హారర్ ఉంటే.. ఎక్కువగా థ్రిల్లర్‌గానే కథ సాగుతుంది. దర్శకుడు ప్రభాకర్ చెప్పిన కానె్సప్ట్ నచ్చింది. ఈ కథకు ఎవరైనా పాపులర్ హీరోయిన్ అయితే బాగుంటుందన్న ఆలోచనతో రష్మీని కలవడం, ఆమెకు కథ నచ్చడంతో సినిమా చేశాం. రష్మీ పాత్ర హైలెట్‌గా ఉంటుంది. ముగ్గురు అబ్బాయిల మధ్యలో అమ్మాయి ఎవరిని ప్రేమించిందన్నది ఆసక్తికరంగా సాగుతుంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే మ్యూజిక్ కూడా హైలెట్‌గా నిలిచింది. కమర్షియల్ అంశాల విషయంలో అన్ని హైలెట్‌గా నిలుస్తాయి అన్నారు.


సక్సెస్‌ఫుల్ కామ్రేడ్

$
0
0

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ట్యాగ్‌లైన్. భరత్ కమ్మ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌బెన్ సినిమాస్ పతాకాలపై తెరకెక్కిన చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్న భాషల్లో విడుదల చేశారు. సినిమా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న సందర్భంగా నిర్మాతలు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ -విడుదలైన మూడురోజుల్లో మంచి వసూళ్లువచ్చాయి. మూడురోజులకు గ్రాస్ కలెక్షన్లు 30 కోట్లు దాటుతోంది. హీరో విజయ్‌కున్న క్రేజ్ నేపథ్యంలో భారీ వసూళ్లురావడం ఆనందంగా ఉంది. అటు ఓవర్‌సీస్‌లో కూడా భారీ కలక్షన్స్ అందుకున్నాయి. అలాగే ఇతర భాషల్లోకూడా మంచి వసూళ్లురావడం, వీకెండ్ తరువాతా అదే కలక్షన్స్ రావడం.. బయ్యర్స్ హ్యాపీగా ఉన్నారు. సినిమా స్లోగా ఉందంటూ కామెంట్స్ రావడంతో 30 నిమిషాల సినిమాను కట్ చేసాం. ఇప్పటికే ఇందులో క్యాంటీన్ సాంగ్ బాగా పాపులర్ అయింది. నిడివి దృష్ట్యా దాన్ని పెట్టలేదు. చాలామంది కావాలని కోరుకోవడంతో నేటినుండి ఆ సాంగ్‌ని జోడించాం. ఆ పాట సినిమాకు ఇంకాస్త ఊపుఇస్తుందని భావిస్తున్నాం అన్నారు. మరో నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ -‘రెస్పాన్స్ చాలా హ్యూజ్‌గా ఉంది. యు.ఎస్, యు.కె.ల్లో మంచి కలెక్షన్స్ ఉన్నాయని ప్రూవ్ అయింది. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కథను పెళ్లిచూపులు తరువాత విజయ్ విని నాకు వినిపించాడు. అప్పటికి అర్జున్‌రెడ్డి రాలేదు. ఆ తరువాత సినిమా మొదలుపెట్టాం. అర్జున్‌రెడ్డి పెద్ద హిట్ అవ్వడంతో ఈ స్క్రిప్ట్ విషయంలో ఏ మార్పులు చేయలేదు కానీ... అనుకున్నాం. అప్పుడే మైత్రి నిర్మాతలు అప్రోచ్ అయ్యారు. వారివల్ల సినిమా రేంజ్ పెరిగింది. దానికి తగ్గట్టుగా మంచి వసూళ్లు అందుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. నిర్మాత యలమంచిలి రవి మాట్లాడుతూ కలక్షన్స్ బాగున్నాయి. వరల్డ్‌వైడ్‌గా రిపోర్ట్‌బాగుంది. ముఖ్యంగా తెలుగు సినిమాను మలయాళంలో బాగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే అక్కడ వసూళ్లు వచ్చాయి. అలాగే తమిళ్, కన్నడ కూడా బాగా ఆడుతుంది. ఈ సినిమా తరువాత విజయ్ హీరోగా చేస్తున్న హీరో సినిమా మరో షెడ్యూల్ మొదలుపెట్టనున్నాం అన్నారు.

మొదలైంది మరో కామెడీ థ్రిల్లర్

$
0
0

హరికృష్ణ, ఫిదాగిల్, అనూ హీరో హీరోయిన్లుగా దర్శకుడు రఘు పతకమూరి తెరకెక్కించనున్న కొత్త చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. మోనికా స్రవంతి ఆర్ట్స్ బ్యానర్‌పై మురళి శ్రీనివాస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు జి నాగేశ్వర్‌రెడ్డి క్లాప్‌నిచ్చారు. దర్శకుడు డైమండ్ రత్నబాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు జి నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ -కానె్సప్ట్ బేస్డ్ సినిమాలతో సక్సెస్‌లు అందుకుంటున్న కొత్త హీరోలు, దర్శకుల సీజన్ ఇది. అలాంటి సీజన్‌లో వస్తున్న ఈ సినిమాకూ సక్సెస్ రావాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ -క్రైమ్ థ్రిల్లర్‌గా కొత్త ఐడియాతో వస్తోన్న ఈ చిత్రానికి అందరి సపోర్టు కావాలి. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అన్నారు. నిర్మాత మురళి శ్రీనివాస్ మాట్లాడుతూ -మోనికా స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌లో మా అబ్బాయి హరిని హీరోగా పరిచయం చేస్తున్నాం. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా కొత్త దర్శకుడు రఘు సినిమాను తెరకెక్కిస్తున్నాడు అన్నారు. చిత్ర దర్శకుడు రఘు పతకమూరి మాట్లాడుతూ -వైవిధ్యమైన క్రైమ్ కామెడీ సస్పెన్స్ ధ్రిల్లర్ ఇది. భాస్కరభట్ల లిరిక్స్ అందిస్తున్నారు. నిర్మాత మురళీ శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు. ఆగస్టు 19నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. 15 రోజులు హైదరాబాద్‌లో, 20 రోజులు గోవాలో షెడ్యూల్స్ ప్లాన్ చేశాం అన్నారు. హీరో హరికృష్ణ మాట్లాడుతూ -నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతిఒక్కరికీ థాంక్స్. మంచి కంటెంట్‌తో కూడిన కథ ఇది. మీ అందరి ఆశీర్వాదం కావాలి అన్నారు. మంచి సినిమాలో భాగమైనందుకు హ్యాపీగా ఉందని హీరోయిన్ ఫిదాగిల్ పేర్కొంది.

కథలో దమ్ముంది

$
0
0

ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్ వర్శిటీ నెలకొల్పే ఆలోచన
ఉందంటున్నారు కెఎల్ వర్శిటీ అధిపతి కోనేరు సత్యనారాయణ.
విద్యా సంస్థల నిర్వహణలో మేటి అనిపించుకుని, తాజాగా సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఎ స్టూడియోస్ బ్యానర్‌పై తమిళ రీమేక్ రాక్షసుడుతో పూర్తి నిర్మాతగా పరిచయమవుతున్న కోనేరు -ఈ ఫ్లాట్‌ఫాంకు రావడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయన్నారు. బెల్లంకొడ సాయిశ్రీనివాస్, అనుపమ
పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు రమేష్‌వర్మ పెనె్మత్స తెరకెక్కించిన రీమేక్ -రాక్షసుడు. ఆగస్టు 2న విడుదలవుతున్న నేపథ్యంలో నిర్మాత కోనేరు మీడియాతో మాట్లాడారు.

కదిలించిన కథ..
రాక్షసన్ -తొలివారంలోనే చూశా. భాష కొంచెం ఇబ్బందైనా -గ్రిప్పింగ్‌గా సాగిన కథా కథనాలు కదిలించాయి. తెలుగు ఆడియన్స్‌కు అందించే ఉద్దేశంతో రైట్స్ తీసుకున్నాం. నిర్మాణ రంగానికి ఇలాంటి చిత్రంతోనే రావాలన్న ఆలోచన కూడా కారణమైంది.
నాకు కొత్త ఫ్లాట్‌ఫాం..
40ఏళ్లలో -కెఎల్ వర్శిటీని అత్యున్నత స్థాయికి తెచ్చా. ఫస్ట్‌టైం ప్రొడక్షన్ ఫ్లాట్‌ఫాంకు వస్తున్నా. గతంలో ‘జీనియస్’ చిత్రానికి భాగస్వామ్య నిర్మాతగావున్నా, ‘రాక్షసుడు’తో పూర్తి నిర్మాత అవుతున్నా.
బెల్లంకొండతోనే ఎందుకంటే..
నా కుమారుడు హవీష్ హీరోగా సినిమాలు చేశాడు. ఈ కథను ఎంచుకునే సరికి -ఇలాంటి జోనర్‌లోనే ‘7’ సినిమా చేసేశాడు. రాక్షసన్ చిత్రాన్ని తమిళంలో విష్ణువిశాల్ చేశాడు. అంతే ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగల హీరో కోసం చూస్తున్నపుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కు కనెక్టయ్యాం. అతని సినిమా ఒక్కటే చూశా. అయినా నమ్మకంతో తీసుకున్నాం. మా నమ్మకాన్ని నిలబెట్టాడు. -అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
అనుపమ పరమేశ్వరన్‌తో..
ఈ కథలో హీరోయిన్‌ది టీచర్ పాత్ర. చాలామందినే పరిశీలించాక, స్క్రిప్ట్ డిమాండ్ మేరకు -అనుపమను తీసుకున్నాం. చివరివరకూ చీరకట్టులోనే కనిపించినా అందం, పెర్ఫార్మెన్స్‌తో ఆమె న్యాయం చేసింది.
కాంప్రమైజ్ కాలేదు..
తమిళ మాతృక తెలుగు చిత్రంలాగే ఉంది. అందుకే -ఇంప్రొవైజేషన్, నేటివిటీ పేరుతో కథను డిస్ట్రర్బ్ చేయొద్దని దర్శకుడికి చెప్పా. డిఫికల్ట్ స్క్రిప్ట్. అయినా, అంచనాలకు మించి తీశాడు రమేష్‌వర్మ. టెక్నికల్ వాల్యూస్‌లో కాంప్రమైజ్ కాలేదు. అప్‌డేట్ టెక్నాలజీని వాడాం. సినిమా క్వాలిటీని ట్రైలర్‌లోనే చూసుంటారు.
డిఫరెంట్ టైటిల్..
రాక్షసుడు హీరో టైటిల్ కాదు. రాక్షస మనస్తత్వమున్న వ్యక్తుల్ని హీరో ఎలా ఫేస్ చేశాడన్నదే కథలో పాయింట్. చాలా టైటిల్స్ వెతికినా, రాక్షసుడు టైటిలే సూటబుల్ అనిపించింది.
చిన్న మెసేజ్..
పూర్తి కమర్షియల్ ఓరియంటెడ్ చిత్రమే అయినా -స్కూల్ గాళ్స్‌కు ఉపయుక్తమైన మెసేజ్ ఉంటుంది. నిజానికి ఆ పాయింటే -కథకు నన్న దగ్గర చేసింది.
డిసిప్లిన్డ్ వర్క్..
ప్రఖ్యాత విద్యాసంస్థను నిర్వహిస్తోన్న అనుభవం నాది. ఇక్కడా డిసిప్లిన్ ఇంప్లిమెంట్ చేశా. పూజా కార్యక్రమాలకు ముందే -డీటెయిల్డ్ సినిమా ల్ ప్లాన్ సిద్ధం చేశాం. సిస్టమేటిక్‌గా ప్రణాళిక అమలు చేస్తూ, ప్రొఫెషనల్‌గా సినిమా తీశాం.
ఈ దర్శకుడితో అందుకే..
తమిళంలో రాక్షసన్ సినిమా చేసిన దర్శకుడితోనే ఇక్కడా చేయొచ్చు. కాకపోతే -రమేష్‌వర్మకు అప్పగించడానికి కారణముంది. అతను ఇంతకుముందు తీసిన రైడ్‌లో ఓ టెంపో మనల్ని వెంటాడుతుంది. ఈ సినిమాకూ అలాంటి టెంపోయే ప్రాణం. అందుకే రమేష్‌కు చాన్స్ ఇచ్చా. నాలుగేళ్ల క్రితమే సినిమా చేద్దామంటూ రమేష్ నన్ను కలిశాడు. అప్పుడు వర్కవుట్ కాలేదు. ఈ చాన్స్‌కు అదో కారణం కూడా.
క్లైమాక్స్ ఫైట్..
బిగినింగ్ ప్లాన్‌లో షెడ్యూల్ 70 డేస్ మాత్రమే. కాకపోతే -హండ్రెడ్ డేస్ పట్టడానికి కారణం క్లైమాక్స్ ఫైట్. సినిమాకు అదే ప్రాణం. ముందే ప్రాక్టీస్ చేసుకున్నా, షూట్ మాత్రం అనుకున్న షెడ్యూల్‌కంటే ఎక్కువైంది. టెక్నికల్ హైఎండ్‌లో తీశాం. ఒరిజినల్ ఫుటేజ్ కొంతకూడా తీసుకోకపోవడం, క్లైమేట్ వల్ల కూడా డేస్ పెరిగాయి.
హ్యాపీ బిజినెస్..
రాక్షసుడు సినిమాకు బిజినెస్ అయిపోయింది. శాటిలైట్ రైట్స్ జెమినీ తీసుకుంది. హిందీ రైట్స్ కూడా ఇచ్చేశాం. తెలుగు ధియేట్రికల్ రైట్స్‌ని అభిషేక్ పిక్సర్స్ తీసుకుంది. దీని తరువాత రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మా అబ్బాయిదీ ఒకటుంటుంది. వివరాలు త్వరలో చెబుతా.
రావడానికి కారణం..
ఈ ఫీల్డ్‌కు రావడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి -మా అబ్బాయి సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నాడు కనుక సొంత ప్రొడక్షన్ హౌస్ మంచిదన్న ఆలోచన. రెండోది -్భవిష్యత్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్ యూనివర్శిటీ పెట్టే యోచన. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అలాంటి వర్శిటీ నెలకొల్పడంపై సీరియస్‌గానే ఫోకస్ పెట్టాం. పూర్తి వివరాలు త్వరలోనే చెబుతా.

నాలోనా నీవేనా..

$
0
0

నాగార్జున నుంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న చిత్రం -మన్మథుడు-2. నాగార్జున నిర్మాతగా హీరో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం. నాగ్ సరసన రకుల్‌ప్రీత్ మెరుపులు మెరిపించనుంది. తాజాగా సినిమానుంచి మెలోడీని బయటకు వదిలారు. ‘నాలోనా నీవేనా/ ప్రేమై నేడు పూచేనా...’ అంటూ సాగే పాటను సినిమాలో నాగ్, రకుల్‌పై చిత్రీకరించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం, శుభం విశ్వనాథ్ సాహిత్యం, చిన్మయి ఆలాపన -వెరసి పాట మధురానుభూతి అందిస్తోంది. కీర్తిసురేశ్, సీనియర్ హీరోయిన్ లక్ష్మి ముఖ్యమైన పాత్రలు పోషిస్తోన్న సినిమాలో -సమంత ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఆగస్టు 9న రెండో మన్మథుడు థియేటర్లకు వస్తున్నాడు.

మెగాస్టార్‌తో.. సినిమాకు రెడీ?

$
0
0

వరుస విజయాలతో టాలీవుడ్‌లో టాప్ బ్యానర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మొత్తానికి ఇరవై ఏళ్లు పూర్తిచేసుకుని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. దిల్‌రాజు సినిమా అంటే ప్రేక్షకుల ఆసక్తి హైట్స్‌లోనే ఉంటుంది. ఓవైపు డిస్ట్రిబ్యూటర్‌గా, మరోవైపు నిర్మాతగా సక్సెస్‌ను కొనసాగిస్తూనే, చిన్న నిర్మాతల చిత్రాలను ఎస్‌విసి బ్యానర్‌పై విడుదల చేస్తానంటూ కొత్త స్కీం మొదలెట్టాడు. అంటే బాలీవుడ్‌లో కరణ్ జోహార్ టైపన్నమాట. అలాగే -తనదగ్గరన్ను 12 కథలకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని చెబుతున్నాడు దిల్ రాజు. ఇందులో భాగంగా త్వరలో మెగా ప్రాజెక్టుని పట్టాలెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడట. దిల్‌రాజు డ్రీమ్ సినిమా ఎవరితో అంటే పవర్‌స్టార్‌తో అని చాలాసార్లు చెప్పాడు. కానీ ఆయన డ్రీమ్ నెరవేరేలా లేదు. ఇప్పట్లో పవన్ సినిమా చేసే ఛాన్స్ లేదు. ఇప్పుడు అదే డ్రీమ్‌ని మెగాస్టార్‌వైపు మార్చాడు దిల్‌రాజు. ఇటీవలే మెగాస్టార్‌ని కలిసి మనసులో మాట చెప్పాడట. చిరు సైతం పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వడంతో, త్వరలో ఆయనకోసం ఓ సూపర్ స్క్రిప్ట్ తెస్తానన్నాడట. ప్రస్తుతం సైరా పూర్తిచేసిన మెగాస్టార్, వచ్చే నెలలో కొరటాల శివ సినిమా మొదలుపెట్టనున్నాడు. చిరు 153వ సినిమా దిల్‌రాజు బ్యానర్‌లో తెరకెక్కే అవకాశాలు లేకపోలేదు.

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>