హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణపై తన వైఖరి స్పష్టం చేసి తెలంగాణలో పర్యటించాలని టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడుకు తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 2008లో నాలుగేళ్ల క్రితం సరిగ్గా దసరా రోజునే టిడిపి తెలంగాణకు అనుకూలంగా పొలిట్ బ్యూరో తీర్మానం చేసిందని, ఈ తీర్మానానికి కట్టుబడి ఉన్నారా? లేక తీర్మానానికి నూరేళ్లు నిండాయో ప్రకటించాలని కోరారు. తెలంగాణను వ్యతిరేకించలేదు, వ్యతిరేకించను అని చెబుతున్నారు కానీ తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మీ కోసం యాత్ర చేస్తున్నానని చెబుతున్న చంద్రబాబుకు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల సమస్య ఒక సమస్యగా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం తొమ్మిది వందల మంది యువత ప్రాణ త్యాగాలు చేసుకున్నా చంద్రబాబును కదిలించలేకపోయిందని అన్నారు. శవాలపై నడుస్తూ అధికార పీఠం ఎక్కాలనే తపన తప్ప ప్రజల డిమాండ్ పట్టదా? అని ప్రశ్నించారు.
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే తెలంగాణపై మా వైఖరి చెబుతామని చంద్రబాబు ప్రకటించారని, అంటే దానర్ధం ఇంతకు ముందు తెలంగాణకు అనుకూలంగా ఆయన తీసుకున్న నిర్ణయాలకు తిలోదకాలు ఇచ్చినట్టే కదా? అని ప్రశ్నించారు. గతంలో రోశయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో,అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి తెలంగాణకు అనుకూలం అని ప్రకటించినట్టు తెలిపారు. ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉన్నారా? లేరా ప్రకటించాలని కోరారు. బాబుతో లేఖ ఇప్పిస్తాం అంటూ హడావుడి చేసిన టిడిపి తెలంగాణ నాయకులు చివరకు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ టిడిపి నాయకులను ఇప్పటికైనా చంద్రబాబు విష కౌగిలి నుంచి బయటకు రావాలని,తెలంగాణ సాధన కోసం ఉద్యమించాలని నాగం సూచించారు. రెండు కళ్ల సిద్ధాంతం పేరుతో చంద్రబాబు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో పర్యటిస్తున్న చంద్రబాబు తెలంగాణపై తన వైఖరి స్పష్టం చేయాలని నాగం జనార్దన్‌రెడ్డి చంద్రబాబుకు రాసిన లేఖలో డిమాండ్ చేశారు.
చంద్రబాబుకు నాగం బహిరంగ లేఖ
english title:
nagam's open letters to babu
Date:
Wednesday, October 24, 2012