విజయవాడ, అక్టోబర్ 23: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం కనకదుర్గమ్మ మహిషాసుర మర్దినిగా భక్తకోటికి దర్శనమిచ్చింది. ఉగ్రరూపంలో ఉండే అమ్మను దర్శించుకోటానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో చివరి రోజు బుధవారం దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమివ్వనుంది. మధ్యాహ్నం తర్వాత దుర్గామల్లేశ్వరస్వామివార్ల కల్యాణం నిర్వహించి సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఇందుకు 20 పడవల మధ్యలో సర్వహంగులతో దుర్గామల్లేశ్వరుల జల విహారానికి హంస వాహనాన్ని సిద్ధం చేశారు. సోమవారం రాత్రి నిర్వహించిన ట్రెయిల్న్ ఆదిలోనే వైఫల్యం చెందగా తిరిగి మంగళవారం విజయవంతంగా నిర్వహించారు. తెప్పోత్సవం సందర్భంగా నగరంలో భారీ ఎత్తున ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. సింహవాహనం, చేతిలో త్రిశూలంతో మహిషాసురుణ్ని సంహరిస్తూ ఉగ్రరూపంలో అమ్మ దర్శనమిచ్చింది. భవానీదీక్ష మంటపంలో అర్చకులను ఆలయ ఇవో రఘునాథ్ సత్కరించారు. మహిషాసుర మర్దినికి పూజ చేసిన కుంకమను ధరిస్తే భయాలు తొలగిపోతాయన్న నమ్మకంతో భక్తులు అర్చకుల నుంచి కుంకుమను స్వీకరించారు. అలాగే భవానీ మంటపంలో ప్రత్యేక కుంకుమార్చనలు విశేషంగా జరిగాయి. ఈ రోజు దుర్గమ్మను దర్శించుకున్నవారిలో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి తదితరులు వున్నారు. ఇంద్రకీలాద్రిపై నిజరూపంలో సాక్షాత్కరించిన దుర్గాదేవిని దర్శించుకునేందుకు భవానీలు పెద్దఎత్తున తరలిరావటంతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. అత్యధికంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కృష్ణాలోని స్నానఘట్టాలలో నీరు తక్కువగా ఉండటంతో కృష్ణవేణి ఘాట్‌లో జల్లుస్నానం ఏర్పాటు చేశారు. పవిత్ర స్నానాలనంతరం భవానీలు ఇరుముడులు ధరించి క్యూమార్గాల్లో దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ ఉత్సవాల్లో చివరి భాగంగా బుధవారం దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తకోటికి దర్శనమివ్వ నుంది. పరమశాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ చెరకుగడ చేతిలో ధరించి ఒక చేత అభయ ముద్ర చూపిస్తున్నట్లు అమ్మవారిని అలంకరిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు దుర్గామల్లేశ్వరుల ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు మొదలై పవిత్ర కృష్ణానదీ జలతరంగాలపై సర్వాంగ సుందరంగా అలంకరించే హంస వాహనంపై ఊరేగిస్తారు. సాయంత్రం తెప్పోత్సవం అనంతరం అఖండ కర్పూర జ్యోతి దర్శనం ఉంటుంది.కాగా విజయదశమి రోజున కృష్ణానదిలో జరిగే తెప్పోత్సవం అనంతరం ఉత్సవ విగ్రహాలను దేవాదాయ అధికారులు పోలీసులకు అప్పగిస్తారు. అక్కడి నుంచి అమ్మవారి నగర ఉత్సవం ఆరంభమవుతుంది. తొలుత జమ్మిదొడ్డి ప్రాంతానికి వెళ్లి శమీపూజ చేసి వన్‌టౌన్ వీధుల మీదుగా ఊరేగించి తిరిగి స్టేషన్‌కు తీసుకొనివస్తారు.
మహాదుర్గ అలంకారంలో శ్రీశైలాంబ
శ్రీశైలం: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భ్రమరాంబికా దేవి మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అష్ట్భూజాలతో శంఖు, చక్ర, గద, పద్మం, విల్లంబులు, త్రిశూలం తదితర ఆయుధాలను ధరించిన ఈ అవతారంలో అమ్మవారి దర్శనానికి ప్రాధాన్యత ఉంది. వేదాలు ఆదిశక్తి స్వరూపాన్ని దుర్గాగా పేర్కొన్నాయి. సాయంత్రం జరిగిన వాహన సేవలో ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై కొలువుదీర్చి పూజలు చేశారు. కాగా ఏటా వస్తున్న సాంప్రదాయంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఆది దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
వైభవంగా శరన్నవరాత్రి పూజలు
english title:
durgamma
Date:
Wednesday, October 24, 2012