తిరుపతి, అక్టోబర్ 23: గత తొమ్మిది రోజులుగా తిరుమలలో జరుగుతున్న బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం చక్రస్నాన ఘట్టంతో కన్నులపండుగగా ముగిసాయి. స్వామివారి నవరాత్రి వేడుకలు ఆద్యంతం అత్యంత వేడుకగా సాగాయి. కమనీయంగా సాగిన బ్రహ్మోత్సవాలను తిలకించిన భక్తకోటి ఆజన్మాంతం గుర్తుంచుకునే అనుభూతిని పొందారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని వివిధ వాహన సేవల్లో తనివితీరా చూసి తరించారు. బ్రహ్మోత్సవాల ముగింపు ముఖ్యఘట్టాల్లో ప్రధానమైన చక్రస్నానం మంగళవారం ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య భూ వరాహస్వామి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీమలయప్పస్వామిని రంగ నాయకమండపానికి తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు,స్నపన తిరుమంజనం నిర్వహించిన పిదప స్వామి వారి సుదర్శన చక్రాన్ని వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ఉదయం 8గంటల సమయంలో పుష్కరిణి వద్ద వున్న నీటిలో పుణ్యస్నానం చేయించారు. ఈ క్షణాల కోసం ఎంతో పవిత్ర మనస్సుతో పుష్కరిణిలో నిండివున్న భక్తజనం ఒక్కసారిగా గోవిందనామ స్మరణలు చేస్తూ పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
గత తొమ్మిది రోజులుగా తిరుమలలో జరుగుతున్న బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు
english title:
chakra snanam
Date:
Wednesday, October 24, 2012