మహబూబ్‌నగర్, అక్టోబర్ 23: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలు పక్కరాష్ట్రాలకు మేలు చేస్తున్నాయని దాంతో ఆంధ్ర రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలో పడిందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇటు కర్నాటక, అటు మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చే నదులపై అక్రమంగా ప్రాజెక్టులు నిర్మించడం పట్ల రాష్ట్ర రైతాంగానికి నీరు రాకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసమర్థత కాంగ్రెస్ వల్లే ఈ పరిస్థితి నెలకొందని చంద్రబాబు అన్నారు. మంగళవారం శాంతినగర్, జూలకల్ గ్రామాల్లో బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. జూలకల్ గ్రామంలో జరిగిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది.. అవినీతి పెరిగిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాలన గాడితప్పడంతో ప్రజల కష్టాలు పెరిగాయని, ఆ కష్టాలను తీర్చేందుకు ప్రజల మధ్యకు వచ్చి పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు రాష్ట్రాన్నంత కుటుంబ సభ్యులకు దోచిపెట్టారని ఆరోపించారు. అందులో ప్రధానంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రధాన భూమిక పోషించారని, అందుకే ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డి జైలులో ఊసలు లెక్కపెడుతున్నారని విమర్శించారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ కోసమే తహతహలాడుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా దాదాపు 50వేల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత తమదని, ప్రస్తుత కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆర్డీఎస్ రైతాంగానికి నీరు అందివ్వడం లేదని ఆరోపించారు. 2005లో ఆర్డీఎస్ ఆధునీకీకరణకు 110కోట్లు నిధులు మంజూరు చేసుకొని కాంగ్రెస్ నాయకులు, కాంట్రాక్టర్లు బొక్కేశారని విమర్శించారు. ఓ నాయకుడు తెలంగాణ ప్రాంతమని గొప్పలు చెప్పుకుంటున్నాడని ఆయన ఈ ప్రాంతంలోనే పర్యటించక పోవడం దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. కెసిఆర్ ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వచ్చాడా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి తెరాసా న్యాయం చేయరని, ఈ ప్రాంతానికి న్యాయం జరగాలంటే అది తెలుగుదేశంకే సాధ్యమని తెలిపారు. భవిష్యత్తులో ఆ పార్టీ కనిపించదన్నారు. పత్యేక తెలంగాణ విషయంలో మళ్లీ మళ్లీ చెప్పే అవసరం లేదని, మా విధానం తెలంగాణాకు వ్యతిరేకం కాదని, ఆ విధానం ఏమిటో కేంద్రం అఖిలపక్షం పెడితే అప్పుడు వెల్లడిస్తామని ప్రకటించారు.
* బాబు విసుర్లు
english title:
farmers are in dire state
Date:
Wednesday, October 24, 2012