వి.ఆర్.పురం, అక్టోబర్ 23: ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌లోని వి.ఆర్.పురం మండలంలోని పాపికొండల విహారయాత్రలో మంగళవారం విషాదం నెలకొంది. కాకినాడ జిటిపి పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన నాలుగు కుటుంబాలకు చెందిన 16 మంది సోమవారం పాపికొండల విహారయాత్రకు వచ్చారు. రాత్రి పొల్లూరు హట్స్‌లో బసచేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు సమీపంలోనే ఉన్న పాములేరు వాగులో స్నానాలు చేసేందుకు వెళ్లారు. వారిలో ప్రమాదవశాత్తు ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో సందీప్ అనే ఓ యువకుడు ప్రవాహంలో కొట్టుకుపోతూ పక్కనే ఉన్న ఓ రాయిని పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వై అమర్‌నాధ్‌రెడ్డి (17), అదే కళాశాలలో పిడిగా పని చేస్తున్న ఎస్ రవికుమార్ (47)లు మృతి చెందారు. మృతదేహాలను పొల్లూరుకు తరలించి రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఘటనా స్థలాన్ని భద్రాచలం సబ్ కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా సందర్శించి మృతుల కుటుంబాలను పరామర్శించారు.
ద్వారకాతిరుమలలో ప్రేమజంట ఆత్మహత్య
ద్వారకాతిరుమల, అక్టోబర్ 23: పశ్చిమగోదావరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో మంగళవారం ఒక ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. గత 15 రోజులుగా స్థానికంగా ఒక సత్రంలో గది అద్దెకు తీసుకుని ఉంటున్న ఈ జంట మంగళవారం పురుగులమందు తాగి స్పృహ కోల్పోయి ఉండటాన్ని గమనించిన సత్రం యజమాని హుటాహుటిన వారిని 108 అంబులెన్స్ ద్వారా ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారిరువురు మృతిచెందారు. వీరిని తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం విశే్వశ్వరాయపురం గ్రామానికి చెందిన చెల్లుబోయిన జగపతిబాబు అనే మహేంద్రబాబు (22), యశోధాదేవి (18)గా గుర్తించారు. వీరిరువురు దగ్గరి బంధువులు. వీరి వివాహానికి పెద్దలు నిరాకరించడంతో ఈ చర్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు.
ముగ్గురు పిల్లల్ని చంపి మహిళ ఆత్మహత్య
కె.కోటపాడు, అక్టోబర్ 23: ఆడపడుచుపై కోపంతో ఆమె కూతురి పిల్లలు ముగ్గురిని బావిలో తోసి చంపిన ఒక మహిళ తాను కూడా అదే బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. విశాఖ జిల్లా కె కోటపాడు మండలం ఎ భీమవరం గ్రామంలో జరిగిన ఈ దారుణం తీవ్ర కలకలం రేపింది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. వనంశెట్టి మంగకు ఒబ్బిన అప్పలనర్స ఆడపడుచు. వీరి మధ్య సఖ్యత లేదు. అప్పలనర్స కుమార్తె బోను మంగ తన భర్త, ముగ్గురు పిల్లలు సత్యవేణి (7), అరుణ (4), తరుణ్ (3)తో కలిసి గత మూడేళ్లుగా తల్లి వద్దే ఉంటూ ఆమెకు పొలం పనుల్లో చేదోడువాదోడుగా ఉంటోంది. ఇది జీర్ణించుకోలేని వదిన మంగ తరచూ ఆమెతో గొడవ పడుతుండేది. ఈ నేపథ్యంలో మంగళవారం అప్పలనర్స, ఆమె కుమార్తె పొలం పనులకు వెళ్లిన సమయంలో ముగ్గురు పిల్లల్ని పొలాల్లోని నేలబావిలోకి తోసేసిన మంగ తాను కూడా అదే బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రానికి మంగ, తరుణ్ మృతదేహాలు బయటపడ్డాయి.