అనంతపురం, అక్టోబర్ 23 :రాష్ట్రంలో సంకుచిత పాలన సాగుతోందని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల అన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలోభాగంగా ఆమె మంగళవారం సాయంత్రం అనంతపురం జిల్లాలోని తాడిమర్రి మండలం దాడితోట గ్రామంలో జిల్లా పర్యటన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల పట్ల కిరణ్ సర్కారు సంకుచిత వైఖరి అవలంభిస్తోందన్నారు. జిల్లాకు సంబంధించి హంద్రీనీవా ప్రాజెక్టుకు 45 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే జిల్లా ప్రజలకు సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు. హంద్రీనీవాకు సంబంధించి 30 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. నిధులను విడుదల చేయకుండా ప్రభుత్వం జిల్లా ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తోందన్నారు. వైఎస్ హయాంలోప్రారంభించిన అభివృద్ధి పథకాలకు తూట్లు పొడుస్తోందన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాల్సిన ప్రతిపక్షం మొద్దు నిద్రలో ఉందన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సలహాదారుగా పనిచేస్తున్నారని విమర్శించారు. బాబు పాదయాత్రలో చిత్తశుద్ధి లేదన్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ పనితీరుపై అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేశారు. సొంతమామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన బాబుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే మనస్తత్వం లేదన్నారు. మనసులోని మాట పుస్తకం ద్వారా ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారన్నారు. ఆ పుస్తకంలో వ్యవసాయం దండగ అని పేర్కొన్నారన్నారు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదని దాని వల్ల ప్రజలు సోమరిపోతులుగా మారిపోతారని, ప్రాజెక్టులు కట్టకూడదని రాసుకున్నారన్నారు. చంద్రబాబు హయాంలోసాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.10 వేలు కూడా ఖర్చు చేయలేదన్నారు. ఆయన హయాంలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు.
===============
కడపపై సర్కారు సవతి తల్లి ప్రేమ:షర్మిల
కడప, అక్టోబర్ 23: తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన టిడిపి అధినేత చంద్రబాబు అడుగుజాడల్లో కిరణ్‌కుమార్ రెడ్డి పాలన సాగుతోందని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల విమర్శించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంగళవారం అనంతపురం జిల్లాకు వెళ్తూ సరిహద్దులోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పరిశీలించారు. అక్కడ ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి కోసం అలమటిస్తున్న పులివెందుల ప్రాంతంలో 107 గ్రామాలకు, పులివెందుల పట్టణ ప్రజలకు సిబిర్ నుండి బురదనీరు సరఫరా చేస్తున్నారన్నారు. పలుసార్లు అనంతపురం అధికారులను సంప్రదించినా స్పందించ లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు రిజర్వాయర్ పరిశీలన నిమిత్తం వస్తే ఇక్కడ ఉన్నతాధికారులు మచ్చుకైనా కనిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సరఫరాలో నిర్లక్ష్యంపై డిఇ విజయకుమార్, మరికొందరు అధికారులను ఆమె నిలదీశారు. అనంతరం ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో పెంచిన విద్యుత్ చార్జీల భారం మోయలేక నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ప్రస్తుతం కిరణ్ కుమార్‌రెడ్డి విద్యుత్ కోతలతో రైతులను ఆత్మహత్యలకు గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు కిరణ్ కుమార్‌రెడ్డి సిబిఐ ఉచ్చు నుండి తప్పించుకునేందుకు చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్నారు. వైఎస్‌ఆర్ జిల్లాపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కురిపిస్తోందన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు ప్రత్యేక ప్యాకేజీలు అమలు చేస్తామన్నారు. తన తండ్రి వైఎస్ కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు జలయజ్ఞం ప్రవేశపెట్టి పలు ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేశారన్నారు.
రాష్ట్రంలో సంకుచిత పాలన సాగుతోందని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల
english title:
sharmila
Date:
Wednesday, October 24, 2012