రాజమండ్రి, అక్టోబర్ 23: రాష్ట్రానికి రావాల్సిన ఉద్యానపంటల పరిశోధనా కేంద్రాలు ఒక్కొక్కటిగా చేజారుతున్నాయి. జాతీయస్థాయిలో సరయిన లాబీయింగ్ చేయలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో విస్తారంగా ఉన్న ఉద్యాన పంటలకు సంబంధించిన పరిశోధనా కేంద్రాలు కూడా దక్కని పరిస్థితి పరిస్థితి ఏర్పడింది. సుమారు రెండు నెలల క్రితమే మొక్కజొన్న పరిశోధనా కేంద్రాన్ని పంజాబ్ రాష్ట్రం తన్నుకుపోగా తాజాగా ఫ్లోరీ కల్చర్ రీసెర్చ్ డైరక్టరేట్‌ను కూడా ఎగరేసుకుపోయేందుకు కొన్ని రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత వ్యవసాయ పరిశోధనామండలి పర్యవేక్షణలో వివిధ పంటలకు సంబంధించిన పరిశోధనా డైరక్టరేట్లు పనిచేస్తుంటాయి. దాదాపు ప్రతి పంటకు ఒక డైరక్టరేట్ ఉంటుంది. ఇలాంటి పరిశోధనా డైరక్టరేట్లలోని మొక్కజొన్న పరిశోధనా డైరక్టరేట్ రెండు నెలల క్రితం పంజాబ్ రాష్ట్రం తన్నుకుపోయింది.
వాస్తవానికి మొక్కజొన్న పంటలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ నాణ్యమైన మొక్కజొన్నను పండించటంలో పశ్చిమగోదావరి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. పంట విస్తీర్ణంలోను, దిగుబడి, నాణ్యతలో మంచి పేరున్న మన రాష్ట్రం ఈ విషయంలో వెనుకబడి పోయింది. ప్రస్తుతం ఫ్లోరీ కల్చర్ పరిశోధనా డైరక్టరేట్ విషయంలో అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. పువ్వులు, వివిధ అలంకార మొక్కల పరిశోధనలో ఢిల్లీ వాతావరణం సహకరించటం లేదు. దాంతో అనువైన వాతావరణం ఉన్న ప్రాంతానికి ఫ్లోరీ కల్చర్ పరిశోధనా డైరక్టరేట్‌ను తరలించేందుకు ఐసిఏఆర్ సిద్ధంగా ఉంది. ఐసిఏఆర్ మహారాష్ట్ర, కర్నాటక, హర్యానా, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు కూడా లేఖలు రాసింది. పూలు, అలంకార మొక్కలు, పండ్ల మొక్కల విషయంలో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించిన కడియం లేదా రాజమండ్రి ప్రాంతం ఫ్లోరీ కల్చర్ పరిశోధనా డైరక్టరేట్‌ను నెలకొల్పేందుకు అనుకూలమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. డైరక్టరేట్ కోసం కడియం నర్సరీలు రాష్ట్ర ఉద్యానశాఖ మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా సిఎంను కూడా కలిసి వచ్చారు. రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఫ్లోరీ కల్చర్ డైరక్టరేట్ రాష్ట్రానికి మంజూరయ్యేలా కనిపించటం లేదు.
*చేజారుతున్న పరిశోధనా కేంద్రాలు
english title:
andani phalalu
Date:
Wednesday, October 24, 2012