విశాఖపట్నం, అక్టోబర్ 23: భారత్ కిసాన్ సభ ఆధ్వర్యంలో నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలో భారత్ కిసాన్ ర్యాలీ నిర్వహించనున్నట్టు సిపిఐ జాతీయ కార్యదర్శి, ఎంపి డి.రాజా తెలియచేశారు. మంగళవారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మన్మోహన్‌సింగ్ సర్కార్ అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిందన్నారు. దేశంలో ఆర్థిక, రాజకీయ అనిశ్చితి ఏర్పడిందన్నారు. సామాజిక భద్రత కరువైందని, నిరుద్యోగం విలయతాండవం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన్మోహన్ సర్కార్ అవలంబిస్తున్న నూతన ఆర్థిక విధానాల వలన సామాన్యులు చితికిపోతున్నారని రాజా అన్నారు. ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతోందని, ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, చమురు కంపెనీలపై నియంత్రణ లేకపోవడం వలన రోజు రోజుకు పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. వ్యవసాయం సంక్షోభంలో పడిందని, వారిని ఆదుకోవల్సిన ప్రభుత్వాలు నూతన ఆర్థిక విధానాలు అవలంబిస్తూ, దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చుతున్నారని ఆయన అన్నారు. కుంభకోణాలతో ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెపుతారని రాజా అన్నారు. రైతాంగ సమస్యలు, వ్యవసాయ సంక్షోభంపై ఈ ప్రభుత్వాన్ని కదిలించేందుకు నవంబర్ ఒకటో తేదీన కిసాన్ ర్యాలీ నిర్వహించనున్నామని రాజా తెలియచేశారు. అలాగే నవంబర్ 10న దేశ వ్యాప్తంగా దళిత, గిరిజన హక్కులపై పోరాటం నిర్వహిస్తామని అన్నారు. దేశీయ చిల్లర మార్కెట్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తే ఇక్కడి చిరు వ్యాపారులు దారుణంగా దెబ్బతింటారన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
భారత్ కిసాన్ సభ ఆధ్వర్యంలో నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలో
english title:
kisan rally
Date:
Wednesday, October 24, 2012