Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వెడలిపోయన ‘రొమాంటిక్ రారాజు’

$
0
0

కథలు ఎక్కణ్ణుంచో పుట్టవు. మధ్యతరగతి బతుకుల్లోంచి పుడతాయి. భావోద్వేగాలతోనూ.. మానసిక సంఘర్షణలకూ.. ప్రేమాప్యాయతలకూ ఆ జీవితాలే వేదికలు - ఈ మాట ఆయన నరనరాల్లోనూ జీర్ణించుకొని ఎన్నో కథాలోచనాల్ని పుట్టించాయి. ఆయన జీవితం కూడా అట్టడుగు నుంచే మొదలైంది. తన జీవితంలో తరచి చూసిన అనేకానేక సంఘటనల సమాహారం అతడి స్క్రిప్ట్‌లో వొదిగి ఎన్నో కథలకు జీవం పోశాయి. ప్రాణ ప్రతిష్ఠ చేశాయి. ఆయన ‘స్క్రిప్ట్’లోని ‘మత్తు’ గురించి చెప్పాలంటే - ముంబైలోని ఒకానొక థియేటర్‌ని అడిగితే చెబుతుంది. అతడు నిర్మించిన ‘దిల్‌వాలే...’ చిత్రం సుదీర్ఘంగా కొన్నాళ్లపాటు ప్రేక్షకుల నీరాజనాలందుకొని సినీ చరిత్రలోని పుటల్ని తిరగరాసింది. ఒక్కమాటలో చెప్పాలంటే- ఆ సినిమాలోని కథ నాయికా నాయకుల్లో తమని ఊహించుకున్నారు. ప్రేమ తాలూకు జల్లులో తడిసి ముద్దై... ఆ అనుభూతి చిరుజల్లులను మనసులోనే దాచేసుకొన్నారు. ఒక విత్తు మొలకెత్తి.. మహావృక్షమైనట్టు - ఆ తడి ఆరని రుచి ఇప్పటికీ ప్రేక్షకుల్ని పలకరిస్తూనే ఉంది.
అతడే యశ్‌చోప్రా - భారతీయ ఫిల్మ్ చరిత్రని తనదైన శైలితో ఒక అక్షర మాలని రూపొందించాడు. ఒక డైరెక్టర్‌గా.. స్క్రిప్ట్ రైటర్‌గా - ఫిల్మ్ ప్రొడ్యూసర్‌గా - అతడి ప్రస్థానం మొదలవక ముందు - ఐ.ఎస్. జోహర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన పనిని మొదలుపెట్టాడు.
బ్రిటీష్ ఇండియాలోని లాహోర్‌లో 1932, సెప్టెంబర్ 27న ఒక పంజాబీ కుటుంబంలో జన్మించిన యశ్ చోప్రా - ఆ కుటుంబంలోని ఎనిమిది మందిలో ఒకడు. తనకంటె ముప్పై ఏళ్లు పెద్దవాడైన అన్నయ్య బి.ఆర్.చోప్రా అతడికి స్ఫూర్తి. అతడొక ఫిల్మ్ జర్నలిస్ట్. చదవాల్సిన లక్ష్యం ఇంజనీరింగ్ అయినప్పటికీ - తరచూ అన్నయ్యతో జరిగే సంభాషణల్లో ‘సినిమా’ తాలూకు ముచ్చట్లు ‘యశ్’ని ఆ వైపు లాక్కెళ్ళాయి. 1945లో జలంధర్ వెళ్లినప్పుడే అతడిలో ఒక ఆలోచన రూపుదిద్దుకో నారంభించింది. అదే సినీ పరిశ్రమ వైపు అడుగు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా అన్నయ్య బి.ఆర్.చోప్రాతోనూ.. ఐ.ఎస్.జోహర్‌తోనూ కలిసి పని చేసింత్తర్వాత - 1959లో ఓ సోషల్ డ్రామా చేయటానికి అవకాశం దొరికింది. అదే ‘్ధల్ కా ఫూల్’. మాలా సిన్హా - రాజేంద్ర కుమార్.. లీలా చట్నీస్ లాంటి నటీనటులతో ఆరంభమైన ఆ సినిమా ఒక కొత్త మజిలీకి శ్రీకారం చుట్టింది. మరోవైపు విమర్శకుల ప్రశంసలతోపాటు.. కమర్షియల్‌గా ఆ చిత్రం ఆనాటికి అత్యధిక వసూళ్లను సాధించింది. ఆ విజయంతో ‘యశ్’ వెనక్కి తిరిగి చూళ్లేదు. తనది ఆరంభ శూరత్వం కాదనీ.. మరో ప్రస్థానానికి నాంది అని చాటి చెబుతూ 1961లో ‘ధర్మపుత్ర’ అనే మరో సామాజిక అంశాన్ని తెర మీదికి తెచ్చాడు. భారత్ - పాక్ విభజన.. హిందూత్వ సమాజంలో పొడసూపిన కొన్ని సమస్యలతో కథని రూపొందించాడు. ఈ చిత్రంలో శశికపూర్ కథానాయకుడు. దేశ విభజన పట్ల తన భావాలనూ.. తీవ్రతనూ ఖండిస్తూ రాసిన ఆ కథ ‘రాజకీయ’ నాయకులకు నచ్చలేదు. రాజకీయుల్లో కలకలం బయల్దేరింది. థియేటర్ల వద్ద ఆందోళనకు దిగారు. వారి ఆగ్రహానికి గురయ్యాడు. కానీ తన సిద్ధాంతాలనూ.. నిర్దిష్ట అభిప్రాయాలనూ వదులుకో దలచలేదు. ఐతే - సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే - తనకున్న ఏకైక మార్గం -రాజీ. అందువల్లనేనేమో - అతడి సినీ జీవితంలోకి మళ్లీ మరో ‘రాజకీయ’ కథ రాలేదు. అప్పట్నుంచీ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఆ చిత్రం ఆ ఏటి మేటి ఉత్తమ చిత్రంగా ఎంపిక కావటం కొసమెరుపు.
1965 నాటి మాట. చోప్రా కొలాబరేషన్‌లో మంచి చిత్రాలు వస్తాయన్న అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చేశారు. వారి అంచనాలకూ.. ఆలోచనలకూ తగ్గట్టుగానే ‘వక్త్’ సినిమా విడుదలైంది. సునీల్ దత్, రాజ్‌కుమార్, శశికపూర్, సాధన, బల్‌రాజ్ సహానీ, మదన్ పురి.. షర్మిలా ఠాగూర్, అచలా సచ్‌దేవ్, రెహమాన్ లాంటి భారీ తారాగణంతో రూపొందిన ఆ చిత్రం కలకలం సృష్టించింది. ఇటు పాటల రూపేణా.. అటు కుటుంబ కథాపరంగా ఆ చిత్రం ఎనె్నన్నో ప్రశంసలను తెచ్చిపెట్టింది. ఈ చిత్ర క్లైమాక్స్ గురించి అప్పట్లో ఏ నోట విన్నా అదే మాట. అదీగాక అదొక మల్టీ స్టారర్ చిత్రం కావటం ఇంకో విశేషం.
ఆ తర్వాత మల్టీస్టారర్ మాట తలపెట్టకుండా.. స్వీయ దర్శకత్వంలో ఒక గుజరాతీ నాటకానికి తెర తీశాడు. అదే ‘ఇత్త్ఫాక్’. లోబడ్జెట్‌తో.. కేవలం ఒక్క నెలలో తీసిన చిత్రం అది. ఇంటర్వెల్ లేకుండా.. ఎటువంటి పాటలూ లేకుండా.. కేవలం డైలాగ్స్.. నేపథ్యం సంగీతంతో సాగిన ఆ కథ ఒక రాత్రి జరుగుతుంది. ఈ చిత్రంతో మళ్లీ హిట్ కొట్టాడు యశ్. అంతేకాదు - బెస్ట్ డైరెక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా పొందటం మరో సంగతి.
ఇది 1971 నాటి మాట. చోప్రా ‘యశ్ రాజ్’ ఫిలిమ్స్ పేరిట సంస్థని స్థాపించాడు. ఆ సంస్థ నుంచి మొదటిగా విడుదలైన చిత్రం ‘దాగ్’. ఇదీ చక్కటి మెలోడ్రామానే. ఇద్దరు పెళ్లాల - ముద్దుల మొగుడు కథ ఇది. ఈ చిత్ర విజయం తర్వాత - చోప్రా.. ఒక స్థిర నిర్ణయానికి వచ్చేశాడు. అతడికొక టీం అంటూ ఏర్పడింది. అమితాబ్ బచ్చన్ నటన.. సలీం జావేద్‌ల కథ కలగలిసి ఎన్నో చిత్రాలను సృష్టించింది. ఒక ‘దీవార్’ గురించీ... ‘త్రిశూల్’ గురించీ ఇప్పటికీ చెప్పుకుంటున్నామంటే అదే కారణం. అమితాబ్‌కి ఒకానొక ఇమేజ్‌ని తెచ్చిపెట్టిన చిత్రాలవన్నీ. ఆ క్రెడిట్ ఎప్పుడూ చోప్రాకే దక్కుతుందంటాడు అమితాబ్. ‘దీవార్’ చిత్రంతో అమితాబ్‌ని యాంగ్రీ యంగ్‌మేన్‌గా నిలబెడితే.. దర్శకుడిగా చోప్రా ఫిల్మ్ ఫేర్ అవార్డుని దక్కించుకున్నాడు. అప్పట్నుంచీ ‘మెలోడ్రామా’లకు స్వస్తి చెప్పి.. ఇక ‘రొమాంటిక్ డ్రామా’ల వైపు దృష్టి పెట్టాడు చోప్రా. 1976 నుంచీ 1981 వరకూ వచ్చిన ‘కభీ కభీ’ ‘సిల్‌సిలా’ చిత్రాలే అందుకు కొన్ని ఉదాహరణలు. ఇప్పటికీ ఏ సందర్భంలోనైనా బాలీవుడ్ గురించి ప్రస్తావించుకుంటే చోప్రా చిత్రాల్లోని పాటల ప్రస్తావన లేందే ఆ మాటలకు అర్థం లేదన్నది మరొక అంశం.
చోప్రా జీవితంలో అధిరోహణలే కాదు.. అక్కడక్కడ అవరోహణల అపశృతులు ఉన్నాయనటానికి 1984లో నిర్మించిన ‘మషాల్’ చిత్రం ఉదాహరణ. దిలీప్ కుమార్‌తో నిర్మించిన ‘ఆషారూంచీ జాలీ ఫూలె’ చిత్రం విమర్శకులను మెప్పించినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టలేకపోయింది. ఇదొక మరాఠీ నాటకం. ఆ తర్వాత సరిగ్గా సంవత్సరానికి తేరుకొని నిర్మించిన ‘్ఫస్లే’ చిత్రం కూడా అనుకున్నంత విజయం సాధించలేదు. సునీల్ దత్, రేఖ, రోహన్ కపూర్‌లతో రూపొందించిన ఈ చిత్రం తన జీవితంలో చెప్పుకోలేని బాధగా మిగిలిందని అంటూ చోప్రానే ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ‘విజయ్’ చిత్రం. 1988 వరకూ ఇదే పరిస్థితి.
అతడొక అలుపెరుగని జీవి అనటం సబబేనేమో?! ఇన్ని అపజయాల తర్వాత నిలదొక్కుకోవటం అంటే మాటలూ కాదు. తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని అతడు పడిన శ్రమ కృషి ఫలించి ‘చాందినీ’ రూపంలో సాక్షాత్కరించింది. ‘యశ్ చోప్రా స్టైల్’ కనిపించిందంటూ ప్రేక్షకులు మెచ్చుకోవటమే కాదు- కమర్షియల్‌గానూ హిట్ చేశారు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా కావటం.. పాటలన్నీ ఫారిన్ లొకేషన్‌లో పిక్చరైజ్ అవటం.. సంగీతపరంగానూ అలరించటంతో ‘చాందినీ’ గురించి ఇప్పటికీ చెప్పుకొంటున్నారు. ఈ చిత్రంతో శ్రీదేవి ఒక స్థాయికి ఎదగటం ఆమె బాలీవుడ్ జీవితానికి మరో అధ్యాయం. అంతేకాకుండా ఆ సంవత్సరం బెస్ట్ పాపులర్ చిత్రంగా నిలవటం ఇంకో హైలైట్.
అక్కడ్నుంచీ - యశ్ ప్రయాణం మళ్లీ మొదలైంది. 1993లో ఇండస్ట్రీకి పరిచయమైన షారూఖ్ ఖాన్.. జూహీ చావ్లా.. సన్నీ డియోల్‌తో తీసిన ‘డర్’ చిత్రం జనం గుండెల్లో దడ పుట్టించింది. అప్పటికే మరొకరితో నిశ్చితార్థం అయిన అమ్మాయి గుండెల్లోకి ‘ప్రేమ’ బాణం దూసుకెళ్లి మరో వ్యక్తితో జీవించటానికి సిద్ధపడటం అన్న కానె్సప్ట్ సరికొత్తగా ఉండటంతో ‘క్లాసిక్’ తెరతోపాటు షారూఖ్‌ని నటుడిగా నిలబెట్టిందీ చిత్రం. 1997 - ‘దిల్ తో పాగల్ హై’ అంటూ ఖాన్ ప్రేమాయణం మళ్లీ మళ్లీ జనం చూసేట్టు చేసింది. జర్మనీలో చిత్రీకరించిన మొట్టమొదటి చిత్రం ఇది. మాధురీ దీక్షిత్.. కరిష్మా కపూర్.. ఖాన్‌ల నటనా ప్రతిభతో వచ్చిన ఈ చిత్రం అత్యధిక మార్కులు కొట్టేయటంతోపాటు వసూళ్లనూ సాధించింది.
2004 - మళ్లీ చరిత్రను తిరగరాసిన సంవత్సరం. అప్పటివరకూ ఎన్నో చిత్రాలకు నిర్మాణ సారథ్యం వహించిన యశో చోప్రా దర్శకుడిగా మళ్లీ అవతారమెత్తాడు. అదే ‘వీర్‌జారా’ చిత్రం. షారూఖ్‌ఖాన్‌తోపాటు ప్రీతిజింతా, రాణీ ముఖర్జీ నటించిన ఆ చిత్రం 940 మిలియన్ వసూళ్లు చేయటమే కాదు.. 55వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు అందుకుంది. ‘ప్రేమకి సరికొత్త నిర్వచనం ఇవ్వటం ఒక్క యశ్‌కి తెలిసినట్టు మరెవ్వరికీ తెలీదంటూ’ పత్రికలు అక్షరాలను పొదిగాయి. 2012 సెప్టెంబర్‌లో తన ’80వ పుట్టినరోజు సందర్భంగా షారూఖ్‌తో ‘జబ్ తక్ హై జాన్’ తన ఆఖరి చిత్రమని ప్రకటించాడు.
1970లో పమేలా సింగ్‌ని పెళ్లి చేసుకొన్న యశ్ తన ప్రస్థానంలో తన పిల్లలు ఆదిత్యకూ ఉదయ్‌కూ చోటు కల్పించి... తన అడుగుజాడల్లో పయనించేట్టు చేశాడు.
ఒక ‘దాగ్’ కభీకభీ.. త్రిశూల్.. నూరీ.. ఇలా తన ప్రొడక్షన్‌లో 53 మజిలీలు.. దర్శకుడిగా మరో 22 సినిమాలు.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా మూడు చిత్రాలతో సినీ జగత్తులో తనకంటూ ఓ స్థానాన్ని పదిలపరచుకొని తెలీని లోకాలకు వెళ్లిపోయినా.. మరిన్ని దశాబ్దాల వరకూ ‘యశ్’ ఆయా చిత్రాల ద్వారా మనల్ని పలకరిస్తూనే ఉంటాడు.

కథలు ఎక్కణ్ణుంచో పుట్టవు. మధ్యతరగతి బతుకుల్లోంచి పుడతాయి
english title: 
romantic raaraaju
author: 
-బిఎన్కే

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>