ఈ రోజుల్లో రజనీకాంత్, కమల్‌హాసన్, సూర్య, విక్రం నటించిన అనువాద చిత్రాలు ఏ విధంగా తెలుగువారి ఆదరణకు నోచుకున్నాయో, 1955-75 మధ్యకాలంలో యం.జి.రామచంద్రన్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ నటించిన తమిళ చిత్రాలు తెలుగులోకి అనువదింపబడి విజయవంతమయ్యాయి. 1962లో యం.వి.రామన్ దర్శకత్వంలో సావిత్రీ, జెమినీ గణేశన్ ప్రధాన పాత్రధారులుగా తమిళంలో నిర్మించబడ్డ చిత్రం ‘కొంజుం సెలంగై’ దర్శకుడు యం.వి.రామన్ ఏ.వి.యం. సంస్థకు జీవితం, సంఘం, వదిన చిత్రాలకు దర్శకత్వం వహించారు. వైజయంతిమాలను తమిళ, హిందీ, తెలుగు చిత్ర రంగాలకు పరిచయం చేసారు. కిశోర్‌కుమార్, వైజయంతిమాల కాంబినేషన్‌లో హిందీ చిత్రం ‘ఆశా’ రూపొందించారు. అందులోని హిట్ సాంగ్ ‘ఈనామీనాదీకా’. చిత్రం తమిళ వెర్షన్ ‘అతిశయ పెద్దార్’లో హీరో నాగేశ్వరరావు.
‘కొంజుం సెలంగై’ చిత్రం సంగీత, నృత్య ప్రధానమైంది. తమిళంలో విజయవంతం కాగానే దేవీ ఫిలిమ్స్‌వారు ‘మురిపించే మువ్వలు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. అనువాద చిత్ర రచనలో చేయి తిరిగిన ఆరుద్ర (అంతకుముందు ప్రేమలేఖలు, అలీబాబా 40 దొంగలు చిత్రాలకు అద్భుతమైన సాహిత్యాన్ని లిప్ సింక్‌కు తగ్గట్టు వ్రాసారు) రుూ చిత్రానికి రచన చేసారు. ఎస్.ఎం.సుబ్బయ్యనాయుడు సంగీతాన్ని అందించారు.
ఆయన తమిళంలో చిరస్మరణీయంగా రూపొందించిన పాట ‘సింగరమేన్‌దేదా’ నాదస్వరం ప్రధానంగా వినిపిస్తుంది. చాలామంది గాయనీమణుల సామర్థ్యాన్ని అంచనావేసి చివరకు ఆ పాటను ఎస్.జానకి చేత పాడించారు. నాయిక పాత్రధారిణి సావిత్రిపై చిత్రీకరించారు. లిప్ సింక్ సరిపోయేలా ‘నీ లీల పాడెద దేవా’ అంటూ గీతాన్ని వ్రాసారు ఆరుద్ర. ఆ ఒక్క పాట గాయనిగా ఎస్.జానకి జీవితాన్ని మార్చేసింది. అటు తమిళనాడులోనూ యిటు ఆంధ్రదేశంలోనూ ఆమె ఎక్కడ సంగీత కచేరీ చేసినా ప్రేక్షకులు పాట అడిగి మరీ పాడించుకొనేవారు. ఈ పాటకు అందం తెచ్చింది, ప్రాణంపోసింది ప్రముఖ నాదస్వర విద్వాంసుడు కారైకురిచ్చి అరుణాచలం వినిపించిన నాదస్వరం, గాయని జానకి పాడిన టాప్‌టెన్ సాంగ్స్‌లో యిది వుండి తీరాల్సిందే! సంగీత దర్శకుడు చక్రవర్తి అసలు పేరు అప్పారావు. ఆయన రుూ చిత్రంలో ‘శాంత ముఖంలో సంతతం’ అనే హాస్య గీతాన్ని పాడారు. నాయకుడు జెమినీ గణేశన్‌కు ఘంటసాల పాడిన విషాద గీతం ‘నా ఆశ నీవు తీర్చుమా’. చిత్రంలోని ఇతర గీతాలను పి.లీల, పి.సుశీల, మాధవపెద్ది గానం చేసారు.
ఫ్లాష్‌బ్యాక్@50
english title:
flash back @ 50
Date:
Friday, October 26, 2012