పరిణితి చోప్రాని చూసి మనసు పారేసుకున్న కుర్రకారులో ఎవరైనా ఆమె దగ్గర ‘మ్యారేజ్ ప్రపోజల్’ తెస్తారేమో? జాగ్రత్త. కాస్త అటూ ఇటూ చూసి అడుగు వేయండి. ఎందుకంటే - ఆమెకి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదట. సహ జీవనం సంగతి తెలీదు. ప్రేమకు టైం లేదుట. ఇన్ని ‘ట’ల మధ్య కెరీర్‌ని ఇప్పుడే స్టార్ట్ చేశాననీ, కాబట్టి మరో దశాబ్దం పాటు ఎవరైనా ఆగగలిగితే.. తన కోసం ఆగవచ్చంటూ ‘ఆప్షన్’ ఇచ్చింది. ఇటు నటననూ.. అటు మోడలింగ్నీ కెరీర్‌గా ఎంచుకొని ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న ‘పరిణితి’ మాటల్లో పరిణితి కనిపిస్తోంది. మొన్నామధ్య విల్స్ లైఫ్ స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్‌లో తళుక్కున మెరిసి అనేకానేక ప్రశంసల్ని సొమ్ము చేసుకున్న పరిణితి చోప్రా ‘ఇష్క్‌జాదే’ చిత్రంతో ముందంజ వేస్తోంది. త్వరలోనే మనీహ్ శర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతోంది. ఇప్పటికే డిజైనర్ మహెకా మిర్పురి నేతృత్వంలో మరిన్ని ఫ్యాషన్ షోలలోనూ కనిపించనుంది. సో.. కొన్నాళ్లు ఆగమంటే.. ఆడువారి మాటలకు అర్థాలె వేరులె అంటూ పాత అర్థాలు చెప్పుకోకుండా వేచి ఉండటమే ఉత్తమం.
ఇదేం చోద్యం?
ఈ చోద్యం ఎక్కడైనా ఉందా? ముచ్చట పడి లగ్జరీ కారు కొంటానంటే ఇవ్వం పొమ్మంటారా? అంటూ రుసరుస లాడుతోంది మల్లిక వర్సెస్ షెరావత్. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్ లోకి వెళితే - కొద్ది నెలల క్రితం రోడ్డు మీద ఓ లగ్జరీ కారు చూసి - ఈ కంపెనీ కారు నాక్కూడా ఉంటే ఎంత బావుణ్ణు? అనుకుందిట మల్లిక. అనుకున్నదే తడవుగా ఆర్డర్ చేయటానికి కంపెనీకి వెళ్తే ‘టఠ్! అస్సలు కుదర్దు. మా కంపెనీ కార్లు బడాబడా వ్యాపారవేత్తలకూ.. ఒక స్టేటస్‌ని మెయిన్‌టెయిన్ చేసేవాళ్లకి మాత్రమే. మీకు ఇవ్వంగాక ఇవ్వ’మంటూ చెప్పటంతో ఖంగు తిన్న మల్లిక నోరెత్తకుండా అక్కడ్నుంచీ వచ్చేసి - ఆనక నోరు పారేసుకుంది. నేనొక సెలబ్రిటీని. ఇటు బాలీవుడ్‌లోనూ అటు హాలీవుడ్‌లోనూ నేనంటే ఎరగని వారు లేరు. అటువంటిది కారు కొంటానంటే ఇవ్వనంటారా? అంటూ వాపోయింది. ఎన్ని మాటలు అన్నా.. చెవిటివాని ముందు శంఖం ఊదినట్లేనని పరిశ్రమ వర్గాల మాట. ఇప్పటికీ కంపెనీ వారు ఎందుకు ఇవ్వ నిరాకరించారో? తెలీదు. ఒక సెక్స్ సింబల్‌గా తమ కంపెనీ కారు ఉండటానికి ఇష్టపడకేనేమో?!
మళ్లీ తెరపైకి?
పాకిస్తానీ సూపర్ మోడల్ మెహ్రీన్ సయ్యద్ మళ్లీ తెర మీదికి రాబోతోంది. లండన్‌లో జరిగిన ఒక యాక్సిడెంట్ ఆమె జీవితాన్ని అర్థంతరంగా ఆపివేసింది. దాంతో ‘లాహోర్’ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ చిత్ర నిర్మాత సంజయ్ పూరన్‌సింగ్ చౌహాన్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఇన్నాళ్లలో ఆమె ప్రస్తావన ఎప్పుడూ రాలేదు. ఐతే ఆమె మళ్లీ తెరపైకి వస్తుందన్న వార్తల్ని చూసిన సంజయ్‌లో కొత్త ఆలోచనలు మొలకెత్తాయి. అప్పట్లో ఆమె కోసమే సృష్టించిన కథని మళ్లీ తీయాలన్న నిర్ణయానికి వచ్చాడు. కానీ - ట్రెండ్ మారింది. కథలో మార్పు లేకపోయినా - మెహ్రీన్లో మార్పులు వచ్చి ఉండొచ్చు. అవి కథకి సూట్ అవుతాయా? లేదా? అన్నది చూసుకోవాలి.