విజయనగరం, అక్టోబర్ 26: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లెక్కల తీరే వేరు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహించే సమీక్షల్లో ఆశాఖ ఇచ్చే నివేదిక చూస్తే అసలు జిల్లాలో ప్రజానీకానికి సాధారణ రోగాలు కూడా లేనట్టు కన్పిస్తుంది. అయితే వాస్తవంలో మాత్రం డెంగ్యూ, మలేరియా, స్వైన్‌ఫ్లూ, డయోరియా వంటి ప్రాణాంతక వ్యాధులతో మరణాలు మాత్రం ఆగకుండా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో జిల్లాలో సంభవించిన మరణాలు, వాటి తీరును పరిశీలిస్తే డెంగ్యూ వ్యాధి తీవ్రస్థాయిలో విజృంభించినట్టు ప్రాధమిక అంచనాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీకం జ్వరం తదితర ఆరోగ్య సమస్యలు వస్తే ముందుగా అందుబాటులో ఉన్న వైద్యుని సంప్రదించడం సాధారణం. అయితే రోగం ముదిరిన తర్వాత వీరు తమ వల్ల కాదంటూ చేతులేత్తేస్తే మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖకు తీసుకెళ్ళగా వారు మరణిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ ఎనిమిది మంది విష జ్వరంతో మరణించారు. వీరంతా విశాఖలో చికిత్స పొందుతూ మరణించిన వారే. తీవ్రమైన జ్వరంతో ప్లేట్‌లెట్ (రక్తంలో కణాల సంఖ్య) పడిపోవడంతోనే మరణాలు సంభవించినట్టు చికిత్స చేసిన వైద్యులు పేర్కొంటున్నారు. అయితే జిల్లా ఆరోగ్య శాఖ మాత్రం దీనికి కొత్త భాష్యం చెబుతోంది. ప్లేట్‌లెట్స్ తగ్గిన ప్రతి కేసు డెంగ్యూ కాదన్న విషయాన్ని గుర్తించాలని స్థానిక వైద్యాధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 3,17,701 మందికి మలేరియా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 4386 మందికి మలేరియా పాజిటివ్‌గా తేలింది. గతేడాది 3,20,623 మందికి పరీక్షలు చేయగా 4267 మందికి మలేరియా ఉన్నట్టు గుర్తించారు. గత రెండేళ్ళలోను ఒక్కరు కూడా మలేరియా కారణంగా మరణించలేదన్నది వైద్యఆరోగ్యశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం స్పష్టం అవుతోంది. ఇక గతేడాది 96 డెంగ్యూ కేసులు నమోదు కాగా అయిదుగురికి వ్యాధి ఉన్నట్టు నిర్ధారించారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 242 కేసులు నమోదు కాగా 16 మందికి వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈవ్యాధి కారణంగా కూడా ఏఒక్కరూ మరణించలేదు. గతేడాది, ఈ ఏడాది కూడా ఒక్క స్వైన్‌ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదు, ఈ వ్యాధితో ఒక్కరు కూడా చనిపోలేదన్నది వైద్యాధికారుల నివేదిక. అయితే గతేడాది తీవ్రమైన జలుబుతో పాటు స్వైన్‌ఫ్లూ వంటి లక్షణాలతో చోటుచేసుకున్న మరణాలు ఈ లెక్కలోకి రాలేదు. తాజాగా విజయనగరం పట్టణంలో గర్భిణి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఘోషాసుపత్రిలో చేరగా అనుమానిత కేసుగా పరిగణించి విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. ఆమెకు స్వైన్‌ఫ్లూ లేదని, గర్భిణి బిడ్డను ప్రసవించి క్షేమంగా ఇంటికి చేరుకుందని జిల్లావైద్య యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. విశాఖపట్నం వైద్యులు మాత్రం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన అయిదుగురికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయిందని, వీరి నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పంపినట్టు వెల్లడించారు.
ఈ నేపధ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి జాడలు లేవని, ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదంటూ ప్రకటన జారీ చేశారు. అనుమానిత గర్భిణి కేసు కూడా స్వైన్‌ఫ్లూ కాదని తేలిందని పేర్కొన్నారు. దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడేవారు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవచ్చని, ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేశామని ప్రకటించారు. అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు మందులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
మాతా, శిశు మరణాల నిరోధమే లక్ష్యం
డెంకాడ, అక్టోబర్ 26 : మాతృ, శిశు మరణాలు తగ్గించడమే ప్రస్తుతం ముందున్న లక్ష్యమని జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలోని చింతలవలస 5వ బెటాలియన్‌లో జరిగిన 100వ గ్రామ సందర్శన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రానున్న రెండేళ్లలో జిల్లాలో మాతృ, శిశు మరణాలు తగ్గించేందుకు కృషి చేస్తామని, సంపూర్ణ పారి శుద్ధ్యం దిశగా కృషి జరుగుతోందని చెప్పారు. వచ్చే మూడు నెలల్లో లక్ష మరుగు దొడ్ల్ల నిర్మాణం 150 గ్రామాల్లో చేయడానికి లక్ష్యం పెట్టామన్నారు. గ్రామ సందర్శనలు ఎంతో విజయ వంతంగా నిర్వహించిన అధికారులందరికి ధన్యవాదాలు తెలిపారు. ఆశించిన విధంగా ప్రభుత్వ పథకాలు అమలుకు గ్రామ సందర్శనలు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. ఈ సందర్భంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో మొదటి గ్రామ సందర్శ 100 వ గ్రామ సందర్శన ఘనంగా నిర్వహించడజ చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం మహిళలకోసం పావలావడ్డీ, అభయహస్తం, స్కాలర్‌షిప్‌లు, అంగన్వాడీలు వంటి పథకాలు అమలు చేస్తుందన్నారు. 3 కోట్ల్ల రూపాయతో నియోజకవర్గం పలు అభివృద్ధి పనులు అమలు చేశామని చెప్పారు. జిల్లాకు మొత్తం 7కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. పోలీసు బెటాలియన్‌లో 1000 మీటర్లు రహదారి కావాలని, గొస్తనీ నది నుండి నీటి సరఫరా, డంపింగ్ యార్డు కావాలని కలెక్టర్‌కి వినతి పత్రం ఇచ్చారు. అంతకుముందు బెటాలియన్‌లో 50 లక్షలు విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్రీరాములనాయుడు, గత డిఆర్‌డిఎ పిడి వాసుదేవరావు, జిల్లా పరిషత్ సిఇఓ మోహనరావు, డిఎంహెచ్‌ఒ స్వరాజ్యలక్ష్మి, ఎంపిడిఒ నిర్మలాదేవి, తహశీల్దార్ రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.