విజయనగరం , అక్టోబర్ 26: గ్రామాలలోని ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఆరోగ్యన్ని కాపాడుకోవాలని మండల ప్రత్యేకాథికారి, విజయనగరం డివిజన్ రెవిన్యూ అధికారి జి.రాజకుమారి హితవు పలికారు. మండలంలోని బియ్యాలపేట గ్రామంలో శుక్రవారం వందరోజులు గ్రామ సందర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత అన్ని ప్రభుత్వ కేంద్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. రహదారిలో బహిరంగ మల విసర్జన చేయడం గ్రామ ప్రజలు మానుకొవాలన్నారు. వ్యక్తిగత మరుగుదోడ్ల నిర్మాణానికి ప్రధాన్యత ఇచ్చి ప్రభుత్వం ఆదేశాలు వెలువడిన వేంటనే నిర్మించేందుకు గ్రామస్తులు సిద్దం కావాలన్నారు. గ్రామంలో నిర్వహించిన సందర్శన కార్యక్రమంలో సిసిరోడ్లు నిర్మించాలని ఇచ్చిన వినతులనుకు సుమారు 12 లక్షల రూపాయిలు మండల పరిషత్ నిధులను మంజూరు చేసి నిర్మించినట్లు తెలిపారు. గ్రామంలో సమస్యలు అధికంగా లేనట్లు గుర్తించారు. 45 శాతం దాటిన అర్హులైన వికలాంగులకు, 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు పించన్లు, అర్హులైన వారికి రెషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేసిన వేంటనే అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. గ్రామ సందర్శనలో భాగంగా ఒక్క ఆడపిల్లతో శస్తచ్రికిత్స చేసుకున్న వారికి లక్ష రూపాయిలు, ఇద్దరు ఆడ పిల్లలతో శస్త్ర చికిత్సలు చేసుకున్న వారికి 60వేల రూపాయిల బాండులను 163 మందికి అందించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఎస్.ఇందిరారమణ, మండల తహశీల్ధార్ పెంటయ్య, మండల ఎపిఒ బాగ్యలక్ష్మి, హౌసింగ్ అధికారి సూర్య ప్రకాష్, ఐకెపి అధికారి గీతా, ఐసిడిఎస్ అధికారి ఉమబారతి, సాక్షరాబారత్ మండల కోర్డినేటర్ అప్పన్నబాబు, గ్రామ మాజీ సర్పంచ్, పెద్దలు నాయకులు, అధిక ప్రజలు పాల్గొన్నారు.
‘రోడ్లు, కాలువల నిర్మాణానికి చర్యలు’
విజయనగరం , అక్టోబర్ 26: పట్టణంలో రోడ్లు, కాలువలు, కల్వర్టుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజారోగ్యశాఖ ఎస్‌ఇ గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. పట్టణంలో శుక్రవారం సాయంత్రం గంటస్తంభం, రామనాయుడురోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గంటస్తంభ ప్రాంతంలో ఉన్న ప్రధాన డ్రైనేజిని పరిశీలించారు. ఇక్కడ 40లక్షల రూపాయల వ్యయంతో కాలువ, కల్వర్డులను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చేనెల మొదటివారంలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఆక్రమణలు ఎక్కువగా ఉన్నందున నిర్మాణపనుల ప్రారంభంలో జాప్యం జరుగుతోందన్నారు. అందువల్ల ఆక్రమణలను తొలగించాలని మున్సిపల్ అధికారులను కోరారు. అదేవిధంగా 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రామానాయుడురోడ్డులో రోడ్డు, కాలువలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. 17లక్షల రూపాయల వ్యయంతో ఈ పనులు చేపడతామన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి మాట్లాడుతూ రామానాయుడు రోడ్డులో బిపిఎస్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్యశాఖ ఇఇ వేణుగోపాలరావు, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్లు కెవి భాస్కరరావు, పి.వెంకటరావు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి భానుమూర్తి, టౌన్ సర్వేయర్ పి శ్రీనివాసరావు పాల్గొన్నారు.