శృంగవరపుకోట, అక్టోబర్ 26: తీసుకున్న పరిహారం తిరిగి చెల్లిస్తే రైతులకు భూములు ఇవ్వాల్సిందేనని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన వెనుక కుట్ర ఉందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభ హైమావతి అభిప్రాయపడ్డారు. రైతులు పరిహారం తిరిగి చెల్లించలేరని తెలిసి వారి పేరిట పరిహారం చెల్లించి భూములను దక్కించుకునే పన్నాగం ఉందని ఆమె చెప్పారు. ఇక్కడ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతుల భూములు కాజేసేందుకు మంత్రి బొత్స కుట్ర పన్నారని, దీనిలో భాగంగానే పరిహారం తిరిగి చెల్లించిన వారికి భూములు ఇవ్వాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రైతులు సొమ్ము తిరిగి చెల్లించలేరని, తామే ఆ సొమ్మును చెల్లించి భూములు పొంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయవచ్చన్న అపోహలున్నాయని పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, జిల్లామంత్రి బొత్స సత్యనారాయణ కలసి రైతులను మోసం చేసి పచ్చటి పొలాలను పరిశ్రమకు కట్టబెట్టారని ఆరోపించారు. జిందాల్ భూసేకరణను తెలుగుదేశం పార్టీ అప్పట్లోనే వ్యతిరేకించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పరిశ్రమ రాదని తెలిసి ఇప్పుడు అధికార పార్టీ నేతలు నాటకాలాడుతున్నారని పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
పాదయాత్రకు విశేష స్పందన: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని హైమావతి పేర్కొన్నారు. ప్రజల స్పందనతో జిల్లాల వారీగా పాదయాత్ర పొడిగింపు జరుగుతోందన్నారు. అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పాదయాత్రకు ప్రజలు స్పందించిన తీరే ఇందుకు అద్దం పడుతోందన్నారు. చంద్రబాబుకు ప్రజలు తమ కష్టాలతో స్వాగతం చెపుతున్నారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారన్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుం వైకాపా తరపున షర్మిల పాదయాత్ర చేస్తోందని విమర్శించారు. పార్టీ పదవి కూడా లేని ఆమె ప్రజ సమస్యలను ఏహోదాతో పరిష్కరిస్తారని, ప్రజలకు హామీలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సమావేశంలో రెడ్డి వెంకన్న, జి.ఎస్.నాయుడు, మల్లేశ్వర రావుతదితరులు పాల్గొన్నారు.
ఫ్ల్లాప్ సినిమాకి ప్రచారం
విజయనగరం, అక్టోబర్ 26: జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య నేతృత్వంలో జరుగుతున్న గ్రామసందర్శన కార్యక్రమం అట్టర్‌ప్లాప్ సినిమాకి అనూహ్య పబ్లిసిటీ మాదిరి ఉందంటూ పార్లమెంట్ మాజీ సభ్యుడు డాక్టర్ డివిజి శంకరరావు శుక్రవారం నాడిక్కడ వాఖ్యానించారు. వంద వారాలపాటు గ్రామసందర్శన పేరిట యాత్రలు చేయడం సంతోషకరం. అయితే ఈ గ్రామసందర్శన వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని అభిప్రాయపడ్డారు. 100 వారాల గ్రామసందర్శనలో ప్రజలు ఇచ్చిన వినతుల్లో ఎన్నింటికి పరిష్కారం దొరికిందని ఆయన ప్రశ్నించారు. అధికార యంత్రాంగం హాస్టళ్ళలో నిద్రచేసినా విద్యార్థుల అనారోగ్యం, మరణాలు మాత్రం తగ్గలేదన్నారు. పిహెచ్‌సిలను సందర్శించినా మందుల విషయంలో ఎటువంటి మార్పులేదని విమర్శించారు. మలేరియా, డెంగీ, స్వైన్‌ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాధులు విజృంభించి ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో చోటుచేసుకుంటున్న అవనీతి పెచ్చుమీరుతోంది తప్ప తగ్గలేదని ఆరోపించారు. యంత్రాంగం చిత్తశుద్ధి, నిబద్ధతతో పనిచేస్తేనే ప్రగతి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తే ఫలితం శూన్యమని పేర్కొన్నారు.