విశాఖపట్నం, అక్టోబర్ 26: విశాఖ నగరంలో తెలుగుతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సమైక్యాంధ్ర రాజకీయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ జెటి రామారావు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయులు కాలం నుంచి శ్రీకృష్ణ కమిటీ నివేదిక వరకు తెలుగు వారంతా ఐక్యంగా ఉన్నారని తెలియజెప్పేందుకు మిగిలి ఉన్న ఏకైక సాక్ష్యంగా ఉన్న తెలుగుతల్లి విగ్రహాన్ని విశాఖలో వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. రాబోయే తరలా వారికి గుర్తించిపోయేలా తెలుగుతల్లి ప్రభావాన్ని గౌరవాన్ని ఈ ప్రభుత్వం విస్మరించడం అన్యాయమని, సాక్షాత్తు రాష్ట్ర రాజదానిలోనే తెలుగుతల్లి హత్యకు గురైందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ హత్యకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతోనే రూపొందించిందన్నారు. విశాఖ నగరంలో తెలుగుతల్లి విగ్రహం ఏర్పాటు కోసం ప్రజా సంఘాలు అనుమతి కోరిన జివిఎంసి స్పందించకోవడం సిగ్గుచేటని, అనర్హులకు, అక్రమార్కులకు వందలు వేలాది ఎకరాలు ధారాదత్తం చేసే ఈ ప్రభుత్వం తెలుగుతల్లి విగ్రహం ఏర్పాటుకు నాలుగు అడుగుల స్థలం కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు తెలుసుకుని వ్యవహరించాలని, తెలుగు కవులు, కళాకారులు, రచయితలు మనస్థాపం చెందేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, వచ్చేనెల ఒకటన ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలుగుతల్లి విగ్రహం ఏర్పాటు చేయకపోతే తామే చందాలు వేసుకుని దీనిని నెలకొల్పుతామన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ కన్వీనర్ పలకా శ్రీరామ్మూర్తి, బిసి నేత నరవ రాంబాబు, ఆర్.శ్రీనివాస్ కె.రామచంద్రమూర్తి, మసిళా జెఏసి నేతలు చెక్కా రమాదేవి, వజ్రపులెవియా, కల్చరల్ కన్వీనర్ బొబ్బాది అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
* కలెక్టరేట్ వద్ద సమైక్యాంధ్ర జెఏసి నిరసన
english title:
telugu talli
Date:
Saturday, October 27, 2012