విశాఖపట్నం, అక్టోబర్ 26: విశాఖ జిల్లా రాంబిల్లి, ఎస్.రాయవరం మండలాల్లో ఎన్‌ఎఒబి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సిహెచ్.నరసింగరావు మాట్లాడుతూ గ్రామ సభల్లో ఆమోదించిన లబ్ధిదారులందకీ నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రోజులు తరబతడి కార్యాలయాలచుట్టూ తిప్పుతూ గ్రామసభలో ఆమోదించిన జాబితాను కూడా బ్రోకర్లు, అధికారుల ప్రమేయంతో మారుస్తున్నారని, దీనివల్ల నిజమైన లబ్ధిదారులు నష్టపోతున్నారన్నారు. ఇంకా ఇంటి యజమానులకు, మేజరైన కుమారులు, వితంతువులకు నష్టపరిహారం ఇవ్వనేలేదన్నారు. మత్స్యకార వృత్తిపై ఆధారపడి చేపలు అమ్ముకునే మహిళలు అనేకమంది ఉన్నారన్నారు. వీరిని కూడా గ్రామసభలో పేర్లు ఖరారు చేశారని, ఈవరికి ఎపుడు నష్టపరిహారం చెల్లిస్సారో తెలియని పరిస్థితి ఉందన్నారు. మత్స్యకార యువకులకు సెక్యురిటీ గార్డుల కింద గతంలో పనిచేసేవారని, ఇతర ఏజేన్సీలకు ఇచ్చామనే పేరుతో వారిని సెక్యురిటీల నుండి తొలగించారన్నారు. ఎన్‌ఎఒబిలో నిర్మాణ పనులకు స్థానికంగా ఉన్న యువతీ, యువకులకు ఉపాధి కల్పిస్తామన్నారు. అయితే ఇపుడు ఆ హామీని అమలు చేయకుండా నిర్లక్ష్యదోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. వాడరాంబిల్లి మత్స్యకారులు కూడా శారదా, వరాహ నదుల్లో వేట మీద ఆధారపడి జీవించేవారని, కొంతమంది స్వార్థ రాజకీయ ప్రయోజనాల వల్ల ఎన్‌ఎఒబి ప్రాజెక్టులో ఈ గ్రామాన్ని గుర్తించలేదని, నోటిఫికేషన్‌లో కూడా దీనిని చేర్చలేదన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక ప్రతినిధులు కె.లక్ష్మణ, జి.దేముడునాయుడు, ఎస్.వరహాలరావు, ఎస్.నరేష్ తదితరులు పాల్గొన్నారు.
* మత్స్యకార్మిక సంఘం నిరసన
english title:
fishermen's protest
Date:
Saturday, October 27, 2012