విశాఖపట్నం, అక్టోబర్ 26: చేపలవేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల అవసరాలకు సరిపడే డీజిల్ సబ్సిడీని ప్రభుత్వం అందివ్వడంలేదు. అసలే సబ్సిడీ తక్కువ, అదీ కొందరికే ఇస్తున్నారని మత్స్యకారులు అంటుంటే, దీని మంజూరులో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో దీనినే నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులు రోడ్డున పడుతున్నారు. డీజిల్ ధరలు పెరుగుతున్నా ఆ మేరకు సబ్సిడీ శాతాన్ని పెంచాల్సిన ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ కొంతమందికే పరిమితం చేసింది. రాష్టవ్య్రాప్తంగా మెకనైజ్డ్ బోట్లు 1409 ఉండగా, ఒక్క విశాఖ జిల్లాలోనే 647 బోట్లు ఉన్నాయి. అలాగే మోటరైజ్డ్ బోట్లు 8951 వరకు ఉండగా, విశాఖ జిల్లాలో 1800 బోట్లు ఉన్నాయి. సాంప్రదాయ మత్స్యకారులు ఉపయోగించే బోట్లు 14507 వరకు ఉండగా, ఇందులో విశాఖ జిల్లాలోనే 1600 బోట్లను నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం నాలుగు మోటరైజ్డ్ బోట్లు, మరో 350 మెకనైజ్డ్ బోట్లకు మాత్రమే సబ్సిడీపై డీజిల్‌ను సరఫరా చేస్తోంది. 9వ పంచవర్ష ప్రణాళిక ప్రకారం 2002 మార్చి 31 నాటికి రిజిస్టర్ అయిన మోటారైజ్డ్, మెకనైజ్డ్ బోట్లకు మాత్రమే డీజిల్ సబ్సిడీ ఇవ్వడంతో 1800 మోటరైజ్డ్ బోట్లలో నాలుగింటికి మాత్రమే డీజిల్ సబ్సిడీ అందుతుంది. అలాగే మెకనైజ్డ్ బోట్లకుగాను 350 బోట్లకే ఈ సబ్సిడీని మంజూరు చేసింది. దీనివల్ల అత్యధిక శాతం మంది మత్స్యకారులు పెట్రోల్ బంక్‌ల్లో మార్కెట్ ధరకే డీజిల్ కొనుగోలు చేసుకుంటూ చేపలవేటకు వెళ్తున్నారు. విశాఖ జిల్లా భీమిలి, రాంబిల్లి, పాయకరావుపేట, నక్కపల్లి, తదితర మండలాలకు సంబంధించి 40 వేల మంది మత్స్యకారులు కేవలం చేపలవేట పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం మత్స్యకారులకు ఆర్థికపరమైన కష్టాలను తెచ్చిపెడుతోంది. ఇలాఉంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కూడా స్వల్పమే. లీటర్ డీజిల్‌కు ఆరు రూపాయల 30 పైసలు మాత్రమే సబ్సిడీ కింద మంజూరు చేస్తోంది. ఈ విధంగా మోటరైజ్డ్ బోట్లకు నెలకు 300 లీటర్లు, మెకనైజ్డ్ బోట్లకు నెలకు మూడు వేల లీటర్ల వంతున డీజిల్ సబ్సిడీ మంజూరవుతోంది. అనేకసార్లు పెరిగిన డీజిల్ ధరలకనగుణంగా ఈ సబ్సిడీని పెంచాల్సింది పోయి కొనే్నళ్ళుగా ఒక్క పైసా సబ్సిడీని కూడా పెంచలేదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే దేశంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీయే లేదని మత్స్యశాఖ సహాయ సంచాలకులు పి కోటేశ్వరరావు ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది అమలవుతోందని, ప్రస్తుతం ఉన్న సబ్సిడీ త్వరలో పెరగనుందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పంపామన్నారు. వ్యాట్, అమ్మకపు పన్ను పెరిగినందున డీజిల్ సబ్సిడీని కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. గత ఏడాది డిసెంబర్‌లో ఏర్పడిన తానా తుపానుతో దెబ్బతిన్న వలలు, బోట్లకుగాను త్వరలో నష్ట పరిహారం మంజూరు కానుందన్నారు.
* అదీ కొంత మందికే * డీజిల్ సబ్సిడీపై మత్స్యకారుల ఆవేదన * పట్టించుకోని ప్రభుత్వం
english title:
asale swalpam.. aa paina jaypam
Date:
Saturday, October 27, 2012