నర్సీపట్నం, అక్టోబర్ 26: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు పూర్తి స్థాయిలో మంచినీటిని అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు సుమారు 89 కోట్ల రూపాయలతో భారీ మంచినీటి పథకాన్ని నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలను మున్సిపల్ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. తాండవ జలాశయం నుండి తాగునీటిని తీసుకువచ్చేందుకు అధికారులు ఒక ప్రణాళికను రూపొందిస్తున్నారు. జలాశయం నుండి నీటిని తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించేందుకు మున్సిపల్ ప్రజారోగ్యశాఖ రాష్ట్ర ఛీప్ ఇంజనీర్ పాండురంగారావు వచ్చేనెల మొదటి వారంలో ఇక్కడకు వస్తున్నారు. ప్రస్తుతం దుగ్గాడ వద్ద నిర్మించిన భారీ మంచినీటి పథకం, ఉత్తర వాహిని వద్ద ఉన్న మరో మంచినీటి పథకం ద్వారా నర్సీపట్నం, బలిఘట్టం, పెదబొడ్డేపల్లి గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ పథకాలకు తరచూ మరమ్మతులు రావడంతో మంచినీటి సరఫరా కష్టసాధ్యంగా మారింది. వేసవికాలంలో మూడు నుండి ఐదు రోజుల వరకు కుళాయిల ద్వారా నీరు సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈనేపధ్యంలో పట్టణ ప్రజల మంచినీటి అవసరాలను తీర్చేందుకు వీలుగా ఏలేరు కాలువ నుండి నీటిని తీసుకురావాలని అధికారులు భావించారు. దీనికి సంబంధించి అధికారులతో చర్చలు జరపగా, ఏలేరు కాలువ నుండి తాగునీటికి మళ్ళించేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో ఐదు మండలాల రైతాంగానికి సాగునీటిని అందిస్తున్న తాండవ రిజర్వాయర్ నుండి నీటిని తీసుకురావాలని మున్సిపల్ అధికారులు ప్రతిపాదిస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఈ ప్రతిపాదనలకు సంబంధించి నీటిపారుదల శాఖ, తాండవ జలాశయం ఉన్నతాధికారులతో మాట్లాడారు. తాండవ జలాశయం కాలువ నుండి పైపులైన్లు ద్వారా పట్టణానికి తాగునీటికి తీసుకురావాలనేది అధికారుల నిర్ణయం. జలాశయం నుండి నీటిని తీసుకువచ్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రజా ఆరోగ్య శాఖ రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ పాండురంగారావు వచ్చేనెల మొదటివారంలో ఇక్కడకు వస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
* రూ. 89 కోట్లతో ప్రతిపాదనలు * వచ్చేనెల మొదటి వారంలో రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ రాక
english title:
tandava
Date:
Saturday, October 27, 2012