అరకులోయ, అక్టోబర్ 26: అరకులోయ ఘాట్ రోడ్డును కమ్ముకున్న దట్టమైన పొగమంచు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజన ఉపాధ్యాయుడి ప్రాణాన్ని కాపాడడానికి వెళ్లిన 108 అత్యవసర వాహన డ్రైవర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టాల్సి రావడం పలువురిని తీవ్రంగా కలిచివేసింది. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం అరకులోయ ఘాట్‌లో గురువారం అర్థరాత్రి అనంతగిరికి చెందిన 108 అత్యవసర వాహనం లోయలో పడిపోవడంతో వాహన డ్రైవర్ బి.రాంమోహనరావు దుర్మరణం పాలుకాగా, ఇందులో ఉన్న మెడికల్ టెక్నీషియన్ జె.మురళీకృష్ణ తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. మండలం కొత్తబల్లుగుడకు చెందిన డి.కృష్ణ కరకవలస గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలకు దసరా సెలవులు కావడంతో కొత్తబల్లుగుడలో నివాసం ఉంటున్న కృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆసుపత్రికి వెళ్లేందుకు కృష్ణ 108 అత్యవసర వాహనాన్ని ఆశ్రయించగా, అరకులోయ వాహనం మరమ్మతులకు గురై అందుబాటులో లేకపోవడంతో అనంతగిరికి చెందిన 108 అత్యవసర వాహనం కృష్ణను గురువారం రాత్రి అరకులోయ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చింది. రోగిని ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం గురువారం అర్థరాత్రి రెండు గంటల సమయంలో తిరిగి అనంతగిరి వెళుతుండగా గాలికొండ ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో లోయలోకి బోల్తా పడింది. రాత్రి సమయంలో ఘాట్‌లో దట్టమైన పొగమంచు వ్యాపించి ఉండడంతో దారి సరిగ్గా కనిపించకపోవడంతో వాహనం అదుపు తప్పి దాదాపు వెయ్యి అడుగుల లోయలోకి పడిపోవడంతో వాహన డ్రైవర్ రాంమోహనరావు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వాహనంలో ఉన్న మెడికల్ టెక్నీషియన్ మురళీకృష్ణ తీవ్రగాయాలకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన వాహనంలోనే ఉదయం వరకు మురళీకృష్ణ అపస్మారక స్థితిలో పడి ఉండగా, శుక్రవారం ఉదయం కొంతమంది గిరిజనులు దీనిని గమనించి ఈ ప్రాంత వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది పాడేరు అగ్నిమాపక దళ కేంద్రం, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల సూచనల మేరకు గిరిజనులు లోయలో పడి ఉన్న డైవర్ మృతదేహాన్ని, తీవ్రంగా గాయపడిన టెక్నీషియన్‌ను తాళ్ల సహాయంతో బయటకు తీశారు. ఈ సంఘటనలో గాయపడిన మురళీకృష్ణ్ణను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహిస్తుండడంతో ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. సంఘటనలో మృతి చెందిన డ్రైవర్ రాంమోహనరావు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి ఆయన బంధువులకు సమాచారం అందించారు. ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి గ్రామానికి చెందిన వారు కాగా, గాయపడిన మురళీకృష్ణ విజయనగరం జిల్లా చీపురపల్లికి చెందిన వారుగా తెలుస్తోంది. ఈ సంఘటనపై అరకులోయ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా 108 అత్యవసర వాహనం బోల్తాపడిన లోయలో గతంలో ఓ లారీ కూడా పడిపోయి డ్రైవర్ దుర్మరణం చెందగా, క్లీనర్ గాయపడ్డారు. ప్రమాదభరితంగా మారిన ఈ ప్రాంతంలో రహదారికి ఆనుకుని లోయ భాగాన రక్షణ గోడలు లేకపోవడమే తరచూ ప్రమాదాలకు కారణమని చెప్పవచ్చు. ఈ విషయమై అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని ఘాట్‌లో రక్షణ గోడలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.
మయూరిలో నిలిచిపోయిన సేవలు
* పర్యాటకుల ఇక్కట్లు
అరకులోయ, అక్టోబర్ 26: అరకులోయలో పర్యాటక అభివృద్ధి సంస్థ హరిత హిల్ రిసార్ట్స్(మయూరి)లో బస చేసే పర్యాటకులకు సేవలు మృగ్యమయ్యాయి. ప్రకృతి అందాలను వీక్షించేందుకు వచ్చి రిసార్ట్స్‌లో బస చేస్తున్న వివిధ ప్రాంతాల పర్యాటకులకు గత మూడు రోజులుగా కనీస సేవలు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మయూరిలో పనిచేస్తున్న సిబ్బందిలో కొందరు దసరా పండుగకు సెలవులపై వెళ్లిపోవడంతో పర్యాటకులకు సేవలు కరువయ్యాయి. చాలీ చాలని సిబ్బందితో గదులు శుభ్రపరచడం, ఆహార పదార్థాలు అందించడం జరగడం లేదు. అదేవిధంగా గదులలో అమర్చిన ఎయిర్ కూలర్స్ కూడా పనిచేయకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పర్యాటక అతిథిగృహంలో నెలకొన్న ఈ పరిస్థితిపై మండిపడుతున్న పర్యాటకులు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు టెలిఫోన్ ద్వారా సమాచారం అందించి హరిత రిసార్ట్స్ పరిస్థితిపై ఫిర్యాదు చేస్తున్నారు. ఈ రిసార్ట్స్‌లో 53 ఎ.సి. గదులు, 12 నాన్ ఎ.సి.గదులు ఉండగా, వీటిలో 30 గదులకు ఎ.సి. పనిచేయడం లేదు. దీంతో పలువురు బెంగాలీ పర్యాటకులు తాము చెల్లించిన అద్దెలలో కొంత సొమ్మును వాపసు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి అసౌకర్యం గల రిసార్ట్స్‌లలో బస చేయడం తమదే తప్పని పలువురు వాపోతున్నారు. పర్యాటక శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకుని పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.