పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు
ఉద్యమకారులను దూరం పెట్టిన హైకమాండ్
కేంద్ర కేబినెట్ విస్తరణతో స్పష్టమైన సంకేతం
ఎమ్మెల్యేలు, మంత్రుల్లో కొత్త గుబులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 28: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఘట్టం ముగియడంతో హైకమాండ్ ఇక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై దృష్టిపెట్టనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ మార్పుల్లో అధిష్ఠానం వైఖరి ఏమిటన్నది స్పష్టంగా తెలియడం లేదు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కీలకపాత్ర వహించిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, సోనియా కుమారుడు రాహుల్ గాంధీ పాత్ర కూడా రాష్ట్ర వ్యవహారాల్లో కచ్చితంగా ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరో ఏడాదిన్నరలో రానున్న సాధారణ ఎన్నికలను ఎదుర్కొనేందుకు వీలుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో భారీ మార్పులు తీసుకురావాలన్న ఆలోచనతో అధిష్ఠానం ఉన్నట్టు స్పష్టంగా చెబుతున్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ పెద్దల్ని కలిసినపుడు ఈ విషయాన్ని వారికి చెబుతున్నారు. అయితే మార్పుల విషయంలో అధిష్ఠానం మనసు ఏమిటన్నది కచ్చితంగా తెలియకపోవడంతో పార్టీ నేతలు ఎవరికి తోచినవిధంగా వారు ఊహించుకుంటున్నారు. పిసిసి అధ్యక్షుడిని, ముఖ్యమంత్రిని కూడా మారుస్తారా? పిసిసి అధ్యక్షుడిని మాత్రమే మార్చి రాష్ట్ర కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరిస్తారా? అన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడంలో అధిష్ఠానం అనుసరించిన వైఖరి, స్పష్టం చేసిన సంకేతాలు రాష్ట్ర కాంగ్రెస్‌లో కొందరికి ఆందోళన కలిగిస్తున్నాయి. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరిగితే తమకు మంత్రి పదవి లభిస్తుందా? లేదా? అని ఎమ్మెల్యేలు, మంత్రివర్గంలో కొనసాగుతామా? లేదా? అని కొందరు మంత్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోను, సమైక్యాంధ్ర ఉద్యమంలోను చురుగ్గా పాల్గొంటున్న ఎంపీలను మంత్రివర్గంలోకి తీసుకోకుండా హైకమాండ్ దూరం పెట్టింది. ఇదే విధానాన్ని రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలోనూ అనుసరిస్తే తమకు మంత్రి పదవి కష్టమేనన్న ఆందోళన కొందరు ఆశావహుల్లో కనిపిస్తోంది. అదేవిధంగా మంత్రులుగా ఉంటున్న కొందరు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలోను, సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమంలోను చురుగ్గా వ్యవహరిస్తుండటంతో తమను మంత్రివర్గంలో కొనసాగిస్తారా? అన్న అనుమానం వారిలో మొదలైంది.
కాంగ్రెస్‌లోని కొందరి కథనం ప్రకారం ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఇద్దరినీ అధిష్ఠానం మార్పు చేయవచ్చని తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతం వారికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి పిసిసి అధ్యక్షునిగా కొత్తవారికి అవకాశం ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. పిసిసి కార్యవర్గం ఏర్పాటు విషయంలో, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో అధిష్ఠానం వైఖరే ఇందుకు నిదర్శనమని వారంటున్నారు. పిసిసి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలంటూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అధిష్ఠానవర్గాన్ని పలుమార్లు కోరారు. చివరకు ఇటీవలే పిసిసి కార్యవర్గం జాబితాను అధిష్ఠానానికి అందించారు. అయినా అధిష్ఠానంలో ఎటువంటి స్పందన కనిపించలేదు. అదేవిధంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వ్యవహారాన్ని కూడా అధిష్ఠానం వాయిదా వేస్తూ వస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ మంత్రివర్గంలో పని చేయలేనని, రాజీనామా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన అధిష్ఠానం రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, త్వరలోనే అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పినట్టు డిఎల్ తన సన్నిహితులకు చెప్పారు. ముఖ్యమంత్రి మార్పు తప్పదని కూడా డిఎల్ గట్టిగా వాదిస్తున్నారు.
మరో వర్గం కథనం ప్రకారం, ముఖ్యమంత్రిని మార్చినా పెద్దగా ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదని, పదేపదే ముఖ్యమంత్రుల్ని మారుస్తారన్న విమర్శలు కాంగ్రెస్‌పై వస్తాయని, అందువల్ల మంత్రివర్గాన్ని మాత్రం పునర్వ్యవస్థీకరించి పిసిసి అధ్యక్షుడిని మాత్రం మారిస్తే సరిపోతుందన్న ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర మాత్రమే గడువుందని, ఇపుడు ముఖ్యమంత్రిని మార్చినట్లయితే పాలనపై పట్టుసాధించడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని, ఇక ఎన్నికలకు ఆరు నెలల గడువు మాత్రమే ఉంటుందని అధిష్ఠానం భావిస్తున్నట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు కాబట్టి పిసిసి అధ్యక్ష పదవిని తెలంగాణ ప్రాంతం వారికి ఇచ్చినట్లయితే కాంగ్రెస్ తెలంగాణ నాయకుల్ని కూడా కొంత సంతృప్తి పరచినట్లవుతుందని అనుకుంటున్నట్టు చెబుతున్నారు. అధిష్ఠానం ఎపుడు చెబితే అపుడు పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు బొత్స కూడా సిద్ధంగా ఉన్నారని, వాస్తవానికి ఈ విషయాన్ని హైకమాండ్‌కు కూడా బొత్స చెప్పినట్టు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో, ప్రభుత్వంలో మార్పులు చేసే విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉండేందుకు వీలుగా అధిష్ఠానం చెబితే ముందుగానే పిసిసి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని బొత్స అధిష్ఠానం పెద్దలకు చెప్పినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలియజేశాయి.