హైదరాబాద్, అక్టోబర్ 28: పేద వర్గాలకు ‘దీపం’ పథకం కింద ఇచ్చిన సిలిండర్లు పెద్దల చేతుల్లోకి మారుతున్నాయి. దీపం పథకం లబ్దిదారులకు సబ్సిడీ మీద అదనంగా ఇచ్చే మూడు సిలిండర్లు కూడా పెద్దల పరమవుతాయి. రాష్టవ్య్రాప్తంగా ఈ విధంగా పదిలక్షల వరకు దీపం సిలిండర్లు పెద్దల చేతుల్లోకి మారినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందింది. చేతులు మారిన దీపం సిలిండర్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.
దీపం పథకం కింద ఇప్పటి వరకు ఇచ్చిన 39.71 లక్షల గ్యాస్ కనెక్షన్లలో దాదాపు 10 లక్షలకు పైగా ఇతరుల చేతుల్లో ఉన్నట్టు సమాచారం. అసలైన లబ్దిదారులు కాకుండా ఇతరుల చేతుల్లో దీపం కనెక్షన్ సిలిండర్లు ఉంటే వాటిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసలైన లబ్దిదారుల చేతుల్లో ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి? ఎన్ని కనెక్షన్లు చేతులు మారాయి? అన్న వివరాలను రాష్టవ్య్రాప్తంగా సేకరించే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. ఈ అంశంపై రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బిపి), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పి) కంపెనీలు రంగంలోకి దిగాయి. ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్లు ఉన్న లబ్దిదారుల వివరాలు సేకరిస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్న వారికి తాజాగా ఈ కంపెనీలు వారివారి ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపించి, లబ్దిదారులు ఫొటో గుర్తింపుకార్డులు, ఎల్‌పిజి కనెక్షన్ మంజూరు చేసిన కాపీలు, బిపిఎల్ (పేదలు)కు సంబంధించిన రేషన్‌కార్డులు లేదా ఇతర డాక్యుమెంట్లు వెంటనే తీసుకురావాలని సమాచారం అందించారు. ఈ వివరాలు అందించకపోతే తదుపరి గ్యాస్ బుకింగ్ చేసినప్పటికీ సిలిండర్లు పంపించబోమని వెల్లడించారు. సుమారు నెలలోగా దీపం పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది.
ఇలాఉండగా, దీపం కనెక్షన్లపై అంతా గందరగోళం నెలకొంది. 1999 జూలై 9న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ‘దీపం’ పథకాన్ని ప్రారంచినప్పటి నుంచి ఈ పథకం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. 1999లో తొలుత 10 లక్షల మంది మహిళలకు దీపం పథకం కింద ఎల్‌పిజి కనెక్షన్లను ఇచ్చారు. గత 13ఏళ్ల నుంచి ఈ పథకం కింద ఇస్తున్న గ్యాస్ కనెక్షన్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. అంత్యోదయ అన్నయోజన, అన్నపూర్ణ, డ్వాక్రా, డిడబ్ల్యుసియుఎ, త్రిఫ్ట్ గ్రూపులు, వనసంరక్షణ సమితి తదితర సంస్థలకు చెందిన మహిళల పేరుతో దీపం కనెక్షన్లను ఇస్తూ వస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో 39.71 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఏటా ఎనిమిది లక్షల కనెక్షన్ల చొప్పున మూడేళ్లపాటు అదనంగా మరో 24 లక్షల కనెక్షన్లను ఇవ్వాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 2011 ఆగస్టు 17న కేంద్రానికి లేఖ రాశారు. అయితే ఈ లేఖపై ఎలాంటి స్పందనా రాలేదు. దీపం పథకం కింద ఉన్న 39.71 లక్షల కనెక్షన్లపై ప్రభుత్వం మోస్తున్న భారం 40 కోట్ల రూపాయలకు మించడం లేదు. ఈ పథకం కింద సగటున ఒక్కో కుటుంబం ఏటా నాలుగు సిలిండర్లకు మించి వాడటం లేదు.
ఇలాఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో 160 లక్షల ఎల్‌పిజి కనెక్షన్లు ఉండగా, ఏటా 840 లక్షల సిలిండర్లను ఆయా కంపెనీలు వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. ఒక్కో సిలిండర్‌పై పాతిక రూపాయల చొప్పున సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది. అంటే ఏటా 210 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం మోస్తోంది.
చేతులు మారిన పది లక్షల కనెక్షన్లు సిలిండర్ల రద్దుకు సర్కారు నిర్ణయం వివరాల సేకరణపై అధికారుల కసరత్తు
english title:
pedala
Date:
Monday, October 29, 2012