జి.కె.వీధి. అక్టోబర్ 30: ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పోలీస్ స్టేషన్లపై మావోయిస్టుల దృష్టి పడింది. గత కొంత కాలంగా వౌనంగా ఉన్న సి.పి. ఐ. మావోయిస్టులు ఏదొక విధ్వంసంతో బయటపడాలని చూస్తున్నారు. ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతంలో తమకు అనుకూలంగా ఉన్న పోలీస్ స్టేషన్లపై అకస్మిక దాడులు చేసి తమ ఉనికిని చాటుకోవాలని చూస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. గతంలో గూడెంకొత్తవీధి మండలం సీలేరు, గూడెం పోలీస్ స్టేషన్లపై మావోయిస్టులు దాడులు నిర్వహించారు. అలాగే చింతపల్లి మండలంలోని అన్నవరం, చింతపల్లి పోలీస్ స్టేషన్లపై తమ ఉనికిని చాటుకునేందుకు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే గూడెంకొత్తవీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్‌పై మావోయిస్టులు రాకెట్ లాంఛర్లను సైతం ప్రయోగించారు. దీంతో పోలీస్ వర్గాల్లో కొంత కలవరం మొదలైంది. అప్పటి నుండి సరిహద్దు ప్రాంతంలో ఉన్నపోలీస్ స్టేషన్లకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్లపై దాడులకు మావోలు వ్యూహం పన్నుతున్నారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ అది ఆచరణ సాధ్యం కాలేదని చెప్పవచ్చు. ఇటీవల సరిహద్దు ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్‌పై దాడులు చేసేందుకు మావోయిస్టు యాక్షన్ టీమ్ ఐదు రోజుల పాటు రెక్కీ నిర్వహించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఆయా పోలీస్ స్టేషన్లకు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. అయితే గూడెంకొత్తవీధి మండలంలోని చీపురుగొంది, సంపంగి గొంది గ్రామంలో మావోయిస్టులపై పోలీసులు అకస్మిక దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో పదుల సంఖ్యలో కిట్ బ్యాగ్‌లు కోల్పోవడమే కాకుండా ఐదుగురు మావోయిస్టులను సజీవంగా పోలీసులు పట్టుకున్నారు. అప్పటి నుండి మావోయిస్టుల జాడ కోరుకొండ, గాలికొండ ఏరియా ప్రాంతాల్లో కనిపించడం లేదు. ఆయా ప్రాంతాల్లో మావోయిస్టు మిలీషియా సభ్యుల సంచారం తప్పా ప్రముఖ నాయత్వం తిరిగిన జాడలు లేవని పోలీస్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. అయితే ఏదో ఒక విధ్వంసంతో తమ ఉనికిని చాటుకోవాలని మావోయిస్టులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. పోలీస్ స్టేషన్లపై దాడులు నిర్వహించి జిల్లా పోలీస్ యంత్రాంగానికి సవాల్‌గా మారాలని మావోయిస్టులు చూస్తున్నట్లు సమాచారం. సరిహద్దు ప్రాంతంలో ఉన్న ప్రధాన పోలీస్‌స్టేషన్‌పై పెద్ద ఎత్తున ఆకస్మిక దాడి నిర్వహించి తమ ఉనికిని చాటుకోవాలని సి.పి. ఐ. మావోయిస్టులు చూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
* ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం * అప్రమత్తమైన పోలీసులు
english title:
border police stations
Date:
Wednesday, October 31, 2012