Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఎకరానికి 25 లక్షలు నష్టపరిహారం

$
0
0

అచ్యుతాపురం, అక్టోబర్ 30: ఎకరానికి 25 లక్షలు రూపాయల నష్టపరిహారం చెల్లిస్తేనే బార్క్ కాలనీకి భూములు ఇస్తామని దోసూరు పంచాయతీ నిర్వాసితులు అధికారులకు వెల్లడించారు. మంగళవారం పంచాయతీ శివారు రాయిపాలెం రెవెన్యూ పరిధిలోగల నిర్వాసితులతో స్పెషల్ డిప్యూటీ కలెక్టరు నారాయణ సమావేశం అయ్యారు. గతంలో దొప్పెర్ల గ్రామం వద్ద బార్క్ నిర్వాసితులకు కాలనీ నిర్మాణం కోసం అధికారులు భూములు సేకరించారు. అక్కడ రైతులతో ఏర్పడిన వివాదం కారణంగా దోసూరు శివారు రాయిపాలెం రెవెన్యూలో బార్క్ కాలనీకి భూములు సేకరణ కోసం 9 (1) నోటీస్‌లను అధికారులు జారీ చేశారు. మంగళవారం స్పెషల్ కలెక్టరు నారాయణ రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఎకరానికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం, బార్క్‌లో భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి శాశ్వత ఉపాధి కల్పించాలని, నిర్వాసితులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్వాసితులు డిమాండు చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నారాయణ మాట్లాడుతూ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. ప్రభుత్వం ఎకరానికి 7 లక్షలా 80 వేల రూపాయల నష్టపరిహారంతోపాటు, 3 లక్షలా 20 వేలు ప్యాకేజీ కింద మొత్తం కలిపి సుమారు 11 లక్షల రూపాయలు నష్టపరిహారం అందిస్తామన్నారు. దీనికి రైతులు అంగీకరించక పోవడంతో అధికారులు వెనుతిరిగారు. ఈ సమావేశంలో నిర్వాసితుల నాయకులు రాజాన రమేష్‌కుమార్, గండి హరి, రొంగలి అప్పారావు పాల్గొన్నారు.

ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు తప్పనిసరి
* ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కె.శ్రీకాంత్
పాడేరు, అక్టోబర్ 30: ఆరోగ్య కేంద్రాలలో గిరిజన గర్భిణులు ప్రసవం చేసుకునే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి కె.శ్రీకాంత్ ప్రభాకర్ ఆదేశించారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో వైద్యాధికారులు, సూపర్‌వైజర్లతో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన గర్భిణులు ఆసుపత్రిలో ప్రసవాలు చేసుకోకుండా తమకు తోచిన విధానాలను అనుసరిస్తుండడం వలన ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆసుపత్రిలో ప్రసవాలపై వారిలో అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. గర్భవతులకు విధిగా మాతా,శిశు సంరక్షణ కార్డులను జారీచేసి వారికి అందిస్తున్న వైద్య సేవలను ఎప్పటికప్పుడు ఇందులో నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. గర్భిణులను తప్పనిసరిగా వైద్యాధికారులు పరీక్షించి వారి ప్రసవ సమయాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. గిరిజన ప్రాంతంలో మాతా,శిశు మరణాలను నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందన్నారు. ఏజెన్సీలో మాతా, శిశు మరణాలు సంభవిస్తే వైద్యాధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మాతా,శిశు సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని శ్రీకాంత్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సి.హెచ్.స్వప్నకుమారి, డి.ఐ.ఒ. విజయలక్ష్మి, డి.టి.టి. పి.ఒ. శాస్ర్తీ, ఎస్.పి.హెచ్.ఒ.లు వంపూరి మోహనరావు, సుజాత, అన్ని ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, హెల్త్ ఎడ్యుకేటర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మత్స్యకారులకు గుర్తింపు కార్డులు
* మత్స్యశాఖ జె.డి. కోటేశ్వరరావు
నర్సీపట్నం, అక్టోబర్ 30: తీర ప్రాం త మత్స్యకారులకు డిసెంబర్ నుండి గుర్తింపు కార్డులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మత్స్యశాఖ జా యింట్ డైరెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఇక్కడ మత్స్యకార సంఘాల ప్రతినిధులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో 38,628 మంది తీర ప్రాంత మత్స్యకారులను గుర్తించామన్నారు. వీరిలో 23,965 మందికి ఫొటో లు తీశారని, మిగిలిన వారికి కూడా ఫొటోలు తీస్తామన్నారు. సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు మెరైన్ కోస్ట్‌గార్డు పోలీసులు అడిగితే గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుందన్నారు. 2008 సంవత్సరంలో జరిగిన ముంబై దాడుల నేపధ్యంలో తీర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్ళే వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందని ఆయన అన్నారు. జిల్లాలో 466 మెకనైజ్డ్ బోట్‌లు ఉన్నాయన్నారు. వీటికి నెలకు మూడువేల లీటర్ల డీజిల్‌ను సబ్సిడీపై అందజేస్తున్నామన్నారు. లీటర్‌కు 6.03 రూపాయల సబ్సిడీ ఇస్తుందన్నారు. 1,065 వరకు మోటార్ బోట్‌లు ఉన్నాయని, సాంప్రదాయ వేటకు వెళ్ళే బోట్‌లు 1,675 ఉన్నాయని వివరించారు. 2012 మార్చి 30వ తేదీ నాటికి నమోదు చేయించుకున్న మెకనై జ్డ్ బోట్‌లుఉన్న వారికే డీజిల్‌పై సబ్సిడీ ఇస్తామని వివరించారు. యాజమాన్య పథకంలో భాగంగా మత్స్యకారులకు చేపల వేటపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని కోటేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ ఇన్‌స్పెక్టర్ నిర్మలకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.

ఇసుక ర్యాంపులకు గండ్లు
కొట్టిన రెవెన్యూ అధికారులు
బుచ్చెయ్యపేట, అక్టోబర్ 30: మండలంలో జోరుగా సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు కొరడా ఝలిపించారు. తహశీల్దార్ వసంతకుమారి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి, మంగళవారం వడ్డాది తదితర గ్రామాల్లో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో పెద్దయెత్తున ఇసుక కుప్పలను సీజ్ చేశారు. వడ్డాదిలోని సంతబయలు వద్ద పెద్దేరు నుండి ఇసుకను తవ్వి ఎడ్ల బండ్లతో ఒడ్డుకు తెచ్చి లారీలకు అమ్ముకుంటుండగా తహశీల్దార్ దాడిచేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా పలు ఇసుక కుప్పలను సీజ్ చేయడంతోపాటు వాహనాలు ఇసుక ర్యాంపు గుండా పెద్దేరులోకి దిగకుండా రహదారికి పెద్ద గండి కొట్టారు. ఈ సందర్భంగా తహశీల్దార్ వసంతకుమారి మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలోని విఆర్‌ఒలందరూ తమతమ గ్రామాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై తనకు నివేదిక ఇవ్వాలని కోరారు. ఎవరూ ఇసుక అక్రమ తవ్వకాలకు, రవాణాకు పాల్పడకుండా విఆర్‌ఒలు దాడులు జరపాలని, అవసరమైతే ఇసుక తవ్వకందార్ల వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారుల విధులకు ఎవరు ఆటంకం కలిగించినా అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ వసంత కుమారి హెచ్చరించారు.

తుపానుతో చేపల వేటకు వెళ్లని మత్స్యకారులు
పరవాడ, అక్టోబరు 30: తుఫాన్ హెచ్చరికతో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లలేదు. బంగాళాఖాతంలో ఏర్పిడిన వాయుగుండం కారణంగా భారీ తుఫాన్ వచ్చే అవకాశం ఉందని అధికారులు ముందుగానే హెచ్చరించడంతో మండలం ముత్యాలమ్మపాలెం మత్స్యకారులు చేపల వేటకు వెళ్లలేదు. ఈ భారీ వాయుగుండం విపత్తులకు దారితీసే అవకాశం ఉందన్న విషయాన్ని అధికారులు హెచ్చరించారు. దీంతో మత్స్యకారులు తీరంలోగల పడవలను ఎతైన ప్రదేశాలకు తరలించారు. ప్రస్తుతం మత్స్యకారులు ఇంటివద్దే వలలు అల్లిక చేసుకుంటున్నారు. మరికొంతమంది పడవలకు, బోట్లను, వలలకు మరమ్మతులు చేపడుతున్నారు. పారిశ్రామిక వ్యర్థ జలాలు సముద్ర గర్భంలో కలవడం కారణంగా అసలే వేట సాగని ఈ తరుణంలో తుపానులు మత్స్యకారులు కడుపు కొడుతున్నాయని వారంతా వాపోతున్నారు. తుఫాన్ సమయంలో ప్రభుత్వం మత్స్యకారులకు జీవన భృతి అందించడం లేదన్న బాధను మత్స్యకారుల వ్యక్తం చేస్తున్నారు.
200 కిలోల గంజాయితో
ఆరుగురు స్మగ్లర్ల అరెస్ట్
మాడుగుల, అక్టోబర్ 30: గిరిజన ప్రాంతం నుండి మైదాన ప్రాంతానికి తరలించేందుకు సిద్ధం చేసిన 200 కేజీల గంజాయితోపాటు ఆరుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్టు మాడుగుల ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సూర్యారావు తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎం.కోడూరు, గరికబంద మార్గంలో రూట్‌వాచ్ చేస్తుండగా ఎం.కోడూరు పొలాల సమీపంలో ఎనిమిది బస్తాలలో ఉంచిన సుమారు 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న కిముడు వెంకటరావు, తూబె రాంబాబు, కిముడు శివప్రసాద్, బుజ్జిబాబు, లక్ష్మణ, కీళ్ల నక్కల్‌లను అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు. గంజాయితో పట్టుబడిన ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్టు ఆయన చెప్పారు.

రేపటి నుంచి పాదయాత్ర
* ఎమ్మెల్యే సివేరి సోమ
అరకులోయ, అక్టోబర్ 30: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రకు మద్దతుగా అరకులోయ నియోజకవర్గంలో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి పాదయాత్ర చేపడుతున్నట్టు శాసనసభ్యుడు సివేరి సోమ తెలిపారు. పార్టీ పాదయాత్ర పోస్టర్‌ను మంగళవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చేనెల ఒకటో తేదీన హుకుంపేట మండలం బాకూరు గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్నట్టు సోమ చెప్పారు. బాకూరు నుండి చీకుమద్దుల, గనే్నరుపుట్టు, మెరకచింత, 2వ తేదిన జి.బొడ్డాపుట్టు, మత్స్యపురం, ఓల్డా, రాప, సంతారి, 3న గత్తుం, పట్టాం, రంగశీల, 4న అడ్డుమండ, గడికించుమండ, నీలంపుట్టు, సూకూరు, 5న కొంతెలి, ములియాపుట్టు, గూడ, మఠం 6న తీగలవలస, తడిగిరి, మట్టుజోరు గ్రామాల మీదుగా పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు. అరకులోయ నియోజకవర్గం పరిధిలోని అరకులోయ, డుంబ్రిగుడ, పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి మండలాల్లో సుమారు 450 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని ఆయన తెలిపారు. గిరిజన గ్రామాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని సోమ చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు శెట్టి బాబూరావు, సివేరి అబ్రహం, జి.బాబూరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

* బార్క్ నిర్వాసితుల డిమాండ్
english title: 
compensation demand

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>