విజయనగరం, అక్టోబర్ 30: ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దేవత, భక్తుల పాలిట కల్పవల్లిగా పూజలందుకుంటున్న విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగవైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు హాజరైనప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవంగా ప్రశాంతంగా ముగిసింది. పూజారి తాళ్ళపూడి భాస్కర రావు సిరిమానును అధిరోహించి అమ్మవారి చదురుగుడి నుంచి పూసపాటి వంశీయుల నివాసమైన కోటను మూడుసార్లు చుట్టిరాగా హాజరైన వేలాది మంది భక్తులు పరవశించారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో పూజారి భాస్కర రావు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దేవాదాయశాఖ సహాయ కమిషనర్ భ్రమరాంబ, దేవాలయ ఇఓ శ్యామలాదేవి సిరిమానును లాంఛనంగా నడిపించారు. తొలుత అమ్మవారి అంగరక్షకులుగా పాలధార, తెల్లఏనుగు, అంజలి రథం, జాలరివల ముందునడవగా సిరిమాను యాత్ర హుందాగా ప్రారంభమైంది.
పూజారి ఠీవిగా అశీనులైన సిరిమాను అమ్మవారి గుడి నుంచి కోట వరకూ ముమ్మారు తిరగడంతో ఉత్సవం పూర్తయింది. కోట బురుజుల నుంచే పూసపాటి వంశీయులు ఆనందగజపతిరాజు, అశోక్‌గజపతి రాజు కుటుంబ సమేతంగా ఉత్సవాన్ని వీక్షించారు. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపి ఝాన్సీ, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, ఎమ్మెల్సీ జి శ్రీనివాసులు నాయుడు, జిల్లా కలెక్టర్ ఎం వీరబ్రహ్మయ్య దంపతులు హాజరయ్యారు. ఎస్పీ కార్తికేయ సిరిమానోత్సవాన్ని స్వయంగా పర్యవేక్షించారు.
ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దేవత, భక్తుల పాలిట కల్పవల్లిగా పూజలందుకుంటున్న విజయనగరం పైడితల్లి
english title:
v
Date:
Wednesday, October 31, 2012