అనంతపురం, అక్టోబర్ 30: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 8వ రోజుకు చేరింది. మంగళవారం ఆమె అనంతపురం నగర శివారులోని కళ్యాణదర్గం రోడ్డు, సిండికేట్ నగర్, పిల్లిగుండ్ల, రాచానపల్లి, కొడిమిక్రాస్, మీదుగా కూడేరు మండలంలో ప్రవేశించారు. కార్యక్రమంలో జనం భారీగా వచ్చారు. ఈ సందర్భంగా షర్మిల సిండికేట్ నగర్‌లోని చేనేత కుటుంబాలను పరామర్శించారు. కార్మికులతో కలిసి చేనేతమగ్గంపై చీరనేత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు చేనేత కార్మికులు చీరను బహూకరించారు. వారి అభిమానానికి షర్మిల చలించి పోయారు. వైకాపా అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. దారి పొడవునా వృద్ధులను పరామర్శించారు. పిల్లలను ఎత్తుకుని ముద్దాడారు. పిల్లిగుండ్ల కాలనీ వద్ద చెట్టు కింద కూర్చుని మహిళలతో మమేకమై ముచ్చటించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఆమె మాట్లాడుతూ పాలకుల ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. ప్రతిపక్షం బాధ్యతాయుతంగా పని చేయకపోవడం వల్ల ప్రభుత్వ పాలన కుంటుపడిందన్నారు. జిల్లాలోని పిఎబిఆర్ ప్రాజెక్టు పనులు వైఎస్ హయాంలో 90 శాతం పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోందన్నారు. అనంతపురం జిల్లాకు తుంగభద్ర నుండి పదిహేను టిఎంసిల నీరు విడుదల చేయాలని వైఎస్ హయాంలో జారీ చేసిన జీవోకు తిలోదకాలిచ్చి జిల్లాలో కరవు తీవ్రతను పెంచుతున్నారన్నారు. ఉపాధి లేక జిల్లా నుండి వందల కుటుంబాలు వలస పోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రాజన్న పాలన తెచ్చే సత్తావున్న జగన్ బయటకు వస్తే తమ మనుగడకు ముప్పు వస్తుందని అధికార విపక్షాలు సిబిఐని ప్రభావితం చేస్తున్నాయన్నారు. అసమర్థ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే బి కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే గురునాథరెడ్డి, అధికార ప్రతినిథి వాసిరెడ్డి పద్మ, రాప్తాడు వైకాపా ఇంచార్జి ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.
సీమలో పాదయాత్రల హోరు
కర్నూలు: పాదయాత్రలతో నెల రోజులుగా రాయలసీమ జిల్లాలు హోరెత్తుతున్నాయి. చంద్రబాబు ‘వస్తున్నా మీ కోసం’ పేరుతో అక్టోబరు 2న అనంతపురం జిల్లా హిందూపురంలో పాదయాత్రను ప్రారంభించారు. అనంతపురం జిల్లా దాటి కర్నూలు జిల్లాలో కూడా యాత్ర పూర్తి చేసి ప్రస్తుతం తెలంగాణా జిల్లాలకు వెళ్లారు. బాబు నడక ప్రారంభించిన రోజే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ ‘రాయలసీమ ఆత్మగౌరవ యాత్ర’ పేరుతో రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజ శేఖర రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. కర్నూలు, కడప జిల్లాల్లో యాత్ర ముగించుకొని ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. వీరిద్దరి తరువాత ఈ నెల 18న వైకాపా తరుఫున దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ‘మరో ప్రజాప్రస్థానం’ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు.
‘కెసిఆర్‌ను రానీయం’
విశాఖపట్నం, అక్టోబర్ 30: పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ కుమార్తె పెళ్ళికి హాజరవుతున్న టిఆర్‌ఎస్ నేత కెసిఆర్ పర్యటనకు నిరసనగా బుధవారం ఛలో విజయనగరం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సమైక్యాంధ్ర రాజకీయ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ జెటి రామారావు తెలిపారు. విశాఖలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నవంబర్ 2న కెసిఆర్ వస్తున్న సందర్భంగా విజయనగరంలో జెఏసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉంటుందన్నారు. కెసిఆర్ టిఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి సాధారణ ఎంపీగానే ఇక్కడకు రావాలని, పార్టీ కండువాను కూడా ధరించరాదని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో బయలుదేరే ముందు సీమాంధ్ర ప్రజల ఆస్తులపైన దాడులు జరపబోమని ఒప్పందంపై సంతకం చేసి ఆ తరువాతనే విజయనగరం రావాల్సిందిగా సూచించారు. ఒక ఎంపిగా కెసిఆర్‌కు దేశంలో ఎక్కడైనా పర్యటించే హక్కు ఉంటుందన్నారు. అయితే పదేపదే ఆంధ్ర పాలకులపై ఆరోపణలు చేస్తూ, సీమాంధ్ర ప్రజలు దోచుకుంటున్నారంటూ చేసిన విమర్శలకు హైదరాబాద్‌లో బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఇద్దరూ కెసిఆర్ కోవర్టులేనన్నారు. ఈ రోజు కెసిఆర్ అని వదిలేస్తే రేపు కోదండరామ్, ఎల్లుండి హరీష్‌రావులు వస్తారన్నారు.