Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కొప్పోల్ పీఠాధిపతి శివైక్యం

$
0
0

పెద్దశంకరంపేట, అక్టోబర్ 31: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కొప్పోల్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సహజానంద సరస్వతీస్వామి (80) బుధవారం శివైక్యం చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురయ్యారు. ఉదయం 11.40 గంటలకు ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. ఆశ్రమంలో సమాధి కార్యక్రమాలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో తొగుట పీఠాధిపతి మాదవానంద సరస్వతీస్వామి, నాగులాపురం ఆశ్రమ పీఠాధిపతి శివానందస్వామి, బర్దీపూర్ ఆశ్రమపీఠాధిపతిలు ప్రత్యేక కార్యక్రమాల అనంతరం సమాధి చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు లింగారెడ్డి, రాయిని విఠల్, కొత్త ప్రభులు, ప్రభాకర్‌రావుతో పాటు పెద్దయెత్తున బ్రాహ్మణులు, ఆశ్రమ శిష్య బృందం నివాళులర్పించారు.

అధికారం కోసం బాబు అసాధ్య హామీలు
సదాశివపేట, అక్టోబర్ 31: అధికార దాహం కోసమే టిడిపి నేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నారని, 85 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తానని ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఇందిరమ్మబాట మూడవ రోజు సందర్భంగా సదాశివపేట పట్టణంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇదిగో పులి అదిగో తోక అన్నట్లుగా నమ్మించి అధికారంలోకి రావడానికి చంద్రబాబు అనేక విధాలుగా ప్రజలను మోసం చేయడానికి తంటాలు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 1.56 వేల కోట్లని, ఇందులో రూపాయి కిలో బియ్యం, ఉచిత కరెంటు, రుణాలపై బ్యాంకు వడ్డీలు, ఉద్యోగస్థుల జీత భత్యాలు తదితర వాటన్నింటిని చంద్రబాబు రద్దు చేస్తారా ఎలా సాధ్యపడుతుందో చెప్పాలని ఆయన సవాల్ చేసారు. వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 వేల కోట్ల రూపాయల వడ్డీని భరిస్తోందని, దాన్ని జీర్ణించుకోలేకనే చంద్రబాబు రుణ మాఫీ మాటలు చెబుతున్నారని, అది ఎంత మాత్రం సాధ్యకాదని ఖండించారు. బాబు అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు. బిసి డిక్లరేషన్ అంటున్నారని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిసిలకు కేవలం 156 కోట్లు కేటాయించారని, తాము మాత్రం బిసిలకు 3 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నామని అన్నారు. మైనార్టీ బడ్జెట్‌ను 489 కోట్లకు పెంచామని, ఎస్సీ, ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ నేతృత్వంలో సబ్ కమిటీ వేసి 12 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌లంతా ఐక్యమత్యంతో ప్రజారంజకమైన పాలనను అందించారని, వారి బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా, చేరితే కొత్తగా కావాల్సినవి ఏమిటి, వారి సమస్యలు ఎమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రజలకు మరింత మేలు చేయాలని ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. ఇప్పటికే 8 జిల్లాలు పూర్తయ్యాయని, మెదక్ జిల్లాతో తొమ్మిది పూర్తి కావస్తున్నాయని అన్నారు. మెదక్ జిల్లా ప్రజలు కాంగ్రెస్‌కు అండగా నిలబడి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారనే అభిమానంతో ప్రతి నియోజకవర్గానికి 60 కోట్ల నిధులు అదనంగా కేటాయించినట్లు తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించడానికి 600 కోట్లు కావాల్సి వస్తే ఇప్పటికే 200 కోట్ల పైచిలుకు నిధులు విడుదల చేసినట్లు వివరించారు. గత పది సంవత్సరాలతో పోల్చితే ఇప్పుడు మహిళలు ఆర్థిక స్వాతంత్రాన్ని పొందారని, అది కేవలం ఒక మన రాష్ట్రంలోనే ఉందన్నారు. దేశంలో బ్యాంకులు ఇచ్చే రుణాల్లో సగ భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కేటాయిస్తున్నాయని అన్నారు. 13 వేల కోట్లు మహిళలకు రుణాల కింద ఇస్తున్నాయని, మహిళలు చేస్తున్న పొదుపు, తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లిస్తూ ప్రపంచ బ్యాంకు ద్వారా ప్రశంసలు పొందారని అన్నారు. ప్రతి సంవత్సరం బ్యాంకు రుణాలకు మహిళలు 13, 14 శాతం వడ్డీ చెల్లించే వారని, ఇప్పుడు వడ్డీలేని రుణాలు పొందుతున్నారని తెలిపారు. 2004 సంవత్సరంలో 8 వేల కోట్లు మాత్రమే వ్యవసాయ రుణాలు పొందే వారని, ఇప్పుడు 52 వేల కోట్లు ఇస్తున్నామని, ఇందులో 40 వేల కోట్ల రూపాయలు కేవలం పంట రుణాలే అన్నారు. రైతులకు యేడాదికి లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నామని, మహిళలకు ఐదు లక్షల వరకు ఇస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానంతోనే ఇంత మంది జనం సభకు తరలివచ్చారని, మీరు చూపించిన అభిమానాన్ని జీవితాంతం మర్చిపోనని అన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అడిగినవన్ని మీకోసం తప్పకుండా ఇస్తానని హామి ఇచ్చారు.

పత్తితో సిఎంకు తులాభారం
సదాశివపేట, అక్టోబర్ 31: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం వినూత్న రీతిలో బుధవారం నాడు నూతన గోదాముల్లో తులాభారం చేసింది. ముఖ్యమంత్రి బరువుకు తగిన పత్తితో తులాభారం చేసారు. సుమారు నాలుగు బస్తాల పత్తిని ముఖ్యమంత్రి తులాభారానికి ఉపయగించగా పత్తి తేలికగా ఉంటుందని అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు అనగా తాను 70 కిలోలకుపైగానే బరువు ఉంటానని ముఖ్యమంత్రి అనడంతో అక్కడున్నవారంతా నవ్వారు.

జిల్లా చిన్ననీటి పారుదలరంగాభివృద్ధికి
రూ. వంద కోట్ల ప్యాకేజీ
* సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, అక్టోబర్ 31: జిల్లాలో చిన్ననీటి పారుదల రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకుగాను వంద కోట్ల రూపాయల ప్యాకేజీ గతంలో ప్రకటించడం జరిగిందని ఆ నిధుల విడుదలకు చర్యలు తీసుకోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమారెడ్డి వెల్లడించారు.ఈ పనుల కోసం శాటిలైట్ సర్వేను కూడా నిర్వహింసచడం జరుగుతుందన్నారు. రెగ్యులర్‌గా వచ్చే పథకాలకు ఈ ప్యాకేజీ అదనమని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో ఇందిరమ్మబాట ద్వారా 400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం జరిగిందని మరెన్నీ వౌలిక రంగాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ప్రభుత్వం ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. పూర్తి స్థాయిలో జిల్లాను విద్యా కేంద్రంగా మలిచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులోభాగంగానే ఐఐటి హైదరాబాద్,ఇతర విద్యా కేంద్రాలను ఈ జిల్లాలో అభివృద్ధి పర్చడం జరుగిందని వెల్లడించారు. అన్ని అంశాల్లో అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

రైతుకు
గిట్టుబాటు ధరేదీ?
* టిడిపి నేతల విమర్శ
గజ్వేల్, అక్టోబర్ 31: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైనట్లు టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. బుదవారం గజ్వేల్ మార్కెట్ యార్డు సందర్శించి రైతులతో మాట్లాడిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఆరుగాలం కష్టించి పంటలు సాగుచేసినప్పటికి యంత్రాంగం దళారులను ప్రోత్సహిస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆరోపించారు. కాగా పత్తికి క్వింటాల్‌కు రూ.7వేలు, వరి ధాన్యం, మొక్కజొన్నకు రూ.2వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఇబ్బందులు రైతులను తీవ్రంగా వేధించగా, అతికష్టంపై దిగుబడులు సాధించినట్లు స్పష్టం చేశారు. రైతుల కష్టానికి తగిన గిట్టుబాటు ధర అందించడం కోసం టిడిపి వారికి అండగా నిలిచి పోరాటం చేస్తుందని తెలిపారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యదర్శితో ఆయన వాగ్వాదానికి దిగగా, రైతులకు న్యాయం చేయని పక్షంలో ఊరుకోమని హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి మైనార్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి విరాసత్ అలి, మండల టిడిపి అధ్యక్షులు ఉప్పల మెట్టయ్య, మాజీ జెడ్పిటిసి బొల్లారం ఎల్లయ్య, పట్టణ టిడిపి అధ్యక్షులు ఆర్‌కె శ్రీనివాస్, నేతలు మతీన్, నయ్యర్ పఠాన్, సూరం నాగులు, హన్మంతరెడ్డి, మస్న నాగులు తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధిపై
హామీ ఏదీ?
* సిఎం పర్యటనపై మెదక్‌వాసుల పెదవి విరుపు
మెదక్, అక్టోబర్ 31: ఇందిరమ్మబాట కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. మెదక్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని చెప్పడం తప్ప మెదక్ నియోజకవర్గానికి ఎలాంటి వరాలు కురిపించలేదు. ముందుగా మంజూరు చేసిన పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మినహా కొత్తగా ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు సోమవారం రాత్రి మెదక్‌లోని బస చేసి మరుసటి రోజు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న విషయం తెల్సిందే. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసి మురిసిపోయారు. నాయకులు, కార్యకర్తలు పెద్దయెత్తున ముఖ్యమంత్రికి సమస్యలతో స్వాగతం పలికారు. నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌రెడ్డి సైతం గ్రామానికి 5 లక్షల రూపాయల విలువైన సిసి రోడ్లు మంజూరు చేయాలని, బొల్లారం మత్తడి నుంచి కోంటూరు పెద్ద చెర్వుకు ఎత్తిపోతల పథకం మంజూరుతో పాటు మరికొన్ని విజ్ఞప్తులు చేశారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఎలాంటి హామీలు కురిపించకపోవడంతో కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. సభాముఖంగా ప్రకటించకపోయినా అందజేసిన విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి స్పందిస్తారని, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి సాధించుకువస్తారన్న ధీమాను నాయకులు, కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.

గోతిలో పడి
ఇద్దరు చిన్నారులు మృతి
శివ్వంపేట, అక్టోబర్ 31: గోబర్ గ్యాస్ గోతిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పెద్దగొట్టిముక్కుల పంచాయతీ పరిధిలోని దేవమ్మగూడెం తండాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం తండాకు చెందిన రవి, లలితల కూతురు చంద్రు(3), సంజీవ్, అంజలీల కుమారుడు ప్రవీణ్(5)లు తమ ఇళ్ల పక్కనే ఆడుకుంటున్నారు. సాయంత్రం వేళ పక్కనే గల రాంసింగ్ గోబర్‌గ్యాస్‌లో ఆడుకుంటూ ప్రమాదవ శాత్తు అందులో పడిపోయారు. చీకటవుతు న్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో గాలించగా గోబర్‌గ్యాస్‌లో పడి ఉన్న చిన్నా రుల మృతదేహాలను గుర్తించి వెలికితీశారు. కుటుంబ సభ్యులతో పాటు తండావాసులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

దేశ సౌభాగ్యాన్ని కోరేవారిని కించపరుస్తారా?

గజ్వేల్, అక్టోబర్ 31: సినీ పరిశ్రమలో స్వార్థ చింతన, వ్యాపార దోరణి తీవ్రతరం కాగా, దేశ సౌభాగ్యాన్ని కోరే బ్రాహ్మణ జాతిని నిర్మాతలు, దర్శకులు కించపరిచే విధంగా చిత్రీకరిస్తుండడం ఎంత మాత్రం సహించమని బ్రాహ్మణ పరిషత్ జిల్లా అధ్యక్షుడు శాస్త్రుల కృష్ణమూర్తిశర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో నెలకొన్న రుగ్మతలు, సాంఘిక దురాచారం నిర్మూలించడంలో శ్రమించిన కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావులాంటి బ్రాహ్మణ మేధావులను మరిచి పోతుండగా, చిత్ర ముహూర్తం షాట్‌కు బ్రాహ్మణులను పిలిచి సినిమా నిర్విగ్నంగా పూర్తవడంతోపాటు మంచి లాభాలు రావాలని పూజలు చేయించుకునే నిర్మాతలు బ్రాహ్మణ వేషధారణలో వెకిలి చేష్టలు చేయించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. ముఖ్యంగా సమాజంలో ఉన్నత స్థానంలో నిలిచిన బ్రాహ్మణులను నీచంగా అభివర్ణించడం సెన్సార్ బోర్డుకు కనిపించకపోవడం సిగ్గుచేటు కాగా, బ్రాహ్మణులు ఐక్యంగా ఆందోళన చేస్తే సదరు నిర్మాత చందాలిస్తాను రండి అంటూ మాట్లాడడం దురదృష్టకరమని స్పష్టం చేశారు. ముఖ్యంగా తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే విధంగా వ్యవహరిస్తున్న కుమారులను చూసి కళామతల్లి హృదయం తల్లడిల్లిపోయే విధంగా ప్రవర్తిస్తుండడం బ్రాహ్మణులను వేదనకు గురిచేయడమే అవుతుందని తెలిపారు. అయితే ప్రభుత్వం స్పందించి సినిమాను నిలిపివేయడంతోపాటు నిర్మాతను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయగా, కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నేతలు దేశపతి రాజశేఖర శర్మ, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ వాదుల అరెస్టు
జిన్నారం, అక్టోబర్ 31: జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ఇందిరమ్మ బాటను నిర్వహిస్తున్నందున పలువురు తెలంగాణ వాదులను పోలీసులు మందుగానే అరెస్టు చేశారు. బుధవారం జిన్నారం మండల టిఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పటాన్‌చెరువులో సాయంత్రం ఇందిరమ్మ బాట వుండటంతో జిల్లా టిఆర్‌ఎస్ యువత విభాగం అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గౌరీశంకర్‌గౌడ్, మండల నాయకుడు యాంజాల సంజీవరెడ్డిలను ఉదయమే పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ముందస్తూ అరెస్టులపై టిఆర్‌ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఇందిరమ్మబాటతో సిఎం దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణపై తేల్చనిదే సిఎం కిరణ్‌కు తెలంగాణలో పర్యటించే హక్కు లేదని విమర్శించారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరిలేని కాంగ్రెస్, టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిల యాత్రలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో టిఆర్‌ఎస్ నాయకులు చిటుకుల వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.

పేటపై సిఎం వరాల జల్లు
సదాశివపేట, అక్టోబర్ 31: రైతులకు పెట్టింది పేరైన సదాశివపేట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారని తప్పకుండా పత్తి మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని పట్టణంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరడంతో వెంటనే పత్తి మార్కెట్‌ను ముఖ్యమంత్రి మంజూరు చేశారు. ఇళ్లు లేని వారెంత మంది ఉన్నారో చేతులెత్తాలని సిఎం కోరగానే వేలాది మంది మహిళలంతా చేతులెత్తడంతో ఇళ్లు లేనివారందరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. సదాశివపేట పట్టణానికి 32 కోట్లతో చేపడుతున్న మంజీర నీటి పథకం పనులకు అదనంగా 50 కోట్లు ఇస్తానని సిఎం హామీ ఇవ్వడమే కాకుండా జగ్గారెడ్డి ఎప్పుడు వచ్చిన నా సదాశివపేట, నా సంగారెడ్డి అంటూ సమస్యలను చెబుతుంటారని ఆయన అడిగినవన్నీ తప్పకుండా ఇస్తానని చెప్పారు.

కొప్పోల్ పీఠాధిపతి శివైక్యం
english title: 
d

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>