Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఐకెపి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

$
0
0

చిట్యాల, అక్టోబర్ 31: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఇందిరా క్రాంతి పథం ఆధ్వర్యంలో బుధవారం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనాయ. ధాన్యంలో తేమ శాతాన్ని లెక్కించి తూకాలు వేశారు. సంఘబంధం సభ్యులు దాసరి నీలమ్మ, కొంతం సులోచన, అంతటి సత్తమ్మ, బోయ యాదమ్మ, కొమిడాల రాజ్యలక్ష్మి, కడకంచి అండాలు, ఏళ్ళ కవిత, గుమ్మి స్వాతి, విబికెలు నర్సిరెడ్డి, సైదులు పాల్గొన్నారు.
చిట్యాల మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లు
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతుల నుండి ఎఫ్‌సిఐ, ప్రభుత్వం, ఐకెపి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆంధ్రభూమిలో ఎఫ్‌సిఐ ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడం లేదు అనే శీర్షికన ప్రచురించిన కథనంపై స్పందించి ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోళ్లు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే గత సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యం పుష్కలంగా ఉండడంతో ఈసీజన్‌లోని ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎఫ్‌సిఐ మొగ్గుచూపడం లేదు. ఎఫ్‌సిఐ నిర్ణయంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పండించిన ధాన్యానికి వచ్చే ధర కొద్దిగానైనా రాదేమోనని ఎఫ్‌సిఐ కొనుగోలుచేసే తమకు మద్ధతు ధర ఖచ్చితంగా వస్తుందని ఆశించిన రైతులు దిగులు చెందుతున్నారు. చివరకు ఐకెపి ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో రైతుల ఆశలు చిగురించాయి.
కార్మికులు ఐక్య ఉద్యమాలకు కలిసి రావాలి
* సిపిఐ జిల్లా కార్యదర్శి ఆదిరెడ్డి
నల్లగొండ రూరల్, అక్టోబర్ 31: కార్మికులు ఐక్య ఉద్యమానికి కలిసి రావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి ఎఐటియుసి నాయకులు పల్ల దేవేందర్‌రెడ్డి, ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి కెఎస్ రెడ్డి అన్నారు. బుధవారం ఎఐటియుసి 93వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బస్టాండ్ ముందు ఎఐటియుసి జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎఐటియుసి అనేక పోరాటాలు చేసి హక్కులు, సౌకర్యాలు సాధించకుందని నిరంతరం కార్మికులకు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు పెట్టు బడి దారులకు అనుకూలంగా సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల అమలుకు పూనుకుంటుందన్నారు. ఆర్టీసీ పేదల రవాణ అని దాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వాలు సమాయత్తమవ్వుతున్నాయని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులు ఐక్యంగా వుండి మరొక మారు ఉద్యమాలకు సిద్ధపడి కలసి రావాలని కోరారు. కార్యక్రమంలో ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎం.నందం, నాయకులు సత్యం, జానీపాషా, సయ్యద్, ఆర్‌ఎం రెడ్డి, లూర్దమ్మ, నర్సింహ్మ, కార్మికులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూముల రక్షణలో హైకోర్టు తీర్పును అమలు చేయాలి
వినియోగదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు హిమగిరి
నల్లగొండ టౌన్, అక్టోబర్ 31: జిల్లాలోని చండూర్ మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 202లోని అన్యక్రాంతమైన 36గుంట ప్రభుత్వ భూమిని హైకోర్టు తీర్పును అమలు చేస్తు జిల్లా కలెక్టర్‌తోపాటు రెవెన్యూ అధికారులు పరిరక్షించాలని జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఎ.హిమగిరి డిమాండ్ చేశారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హైకోర్టు తీర్పు ఉత్తర్వులను విడుదలచేసి మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని రక్షించి అక్రదారులపై చర్యలు తీసుకోవాలని గత మూడు సంవత్సరాలుగా కలెక్టర్‌తోపాటు డిఆర్‌వో, నల్లగొండ ఆర్డీవో, చండూర్ తహాశీల్థార్‌లకు మోరపెట్టుకున్న ఫలితంలేకపోవడంతో హైకోర్టులో ప్రజవాజం కింద ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులు లంచాలకు పాల్పడుతు తప్పుడు సమాచారం అందిస్తున్నారని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సంబంధిత అధికారులపై సస్పెన్షన్ విధించాలని డిమాండ్ చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో సమాఖ్య సభ్యులు చిలుకూరి శ్రీనివాస్, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

సాగర్ ఎడమ కాల్వ రైతులకు నీరు ఇవ్వాలి
* మంత్రికి జూలకంటి వినతి
నల్లగొండ రూరల్, అక్టోబర్ 31: నాగార్జున్ సాగర్ ఎడమ కాల్వకు ప్రస్తుత ఖరీఫ్ పంటలను కాపాడుకునేందుకు, రానున్న రబీ పంటల సాగుకు వీలుగా వెంటనే నీటి విడుదల చేయాలని సిపిఎం శాసన సభ పక్షనేత జూలకంటి రంగారెడ్డి, జిల్లా పార్టీ కార్యదర్శి నంద్యాల నర్సింహ్మరెడ్డి ఎపి రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు కత్తి లింగారెడ్డి, కాల్వ పరిధిలోని పలువురు రైతులు బుధవారం రాష్ట్ర బారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డికి వినతి పత్రం అందించారు. సాగర్ ఎడమ కాల్వ రైతులకు గత రబీలో, ఈ ఖరీఫ్‌లో నీరు ఇవ్వకపోవడంతో 4లక్షల ఎకరాలలో పంటలు నష్ట పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని ప్రస్తుతం ప్రాజెక్టులో 105టి ఎంసిల నీటిని వాడుకునే అవకాశం ఉన్నందున వెంటనే నీటిని విడుదల చేసి రైతాంగం పంటలు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. జిల్లాలో వరుసగా రెండు సంవత్సరాలు కరువు పరిస్థితి నెలకొంనందున రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు వీరెపల్లి వెంకటేశ్వర్లు, ధరవత్ మంగ్యానాయక్, సిహెచ్ సత్యనారాయణ, భూక్యా సైదులు నాయక్, సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని రైతులు, ఎఎమ్మార్పీ పరిధిలోని రైతులు పాల్గొన్నారు.

బడుగు, బలహీనవర్గాల ఆశజ్యోతి ఇందిర
* మాజీ మంత్రి కోమటిరెడ్డి, ఎంపి గుత్తా
నల్లగొండ టౌన్, అక్టోబర్ 31: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహానీయురాలు స్వర్గీయ ఇందిరా గాంధీ అని మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు అన్నారు. బుధవారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా జిల్లా కేంద్ర సమీపంలోని పానగల్ బైపాస్‌లోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూల మాలువేసి ఘనంగా నివాళుల్పరించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ ఘరీబ్‌హఠావ్ అనేపేరుతోపాటు బ్యాంకుల జాతీయకరణచేసి పేదలకు అవకాశాలు కల్పించారని తెలిపారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఇందిరా గాంధీ పేరుతో పేదలకు ఇండ్లను నిర్మించడంతోపాటు పలు సంక్షేమ పథకాలను అందించారని తెలిపారు. కేంద్రం డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి తెలంగాణ ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో తెలంగాణలో కాంగ్రెస్ పతనం ఖాయమన్నారు. నేడు నిర్వహించే రాష్ట్రాఅవతరణ అధికారిక వేడుకలను బహిష్కరించి నిరసనలు తెలియచేస్తామన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పుల్లెంల వెంకట్‌నారాయణగౌడ్, మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు, డిఇ గయాస్‌మోహినోద్దీన్, సానిటరీ ఇన్స్‌స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, స్థానిక నాయకులు బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, బొంత వెంకన్న, పల్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, సూర శ్రీను, నాగరత్నంరాజు తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ రికార్డులను పకడ్భందీగా నమోదుచేయాలి
* జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్
మిర్యాలగూడ, అక్టోబర్ 31: రెవెన్యూ రికార్డులను సక్రమంగా నమోదుచేయాలని, ప్రజలకు, రైతులకు రెవెన్యూ కార్యదర్శులు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎస్విగార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో మిర్యాలగూడ డివిజన్ స్థాయి రెవెన్యూ కార్యదర్శుల ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ అన్ని శాఖలకు సంబంధించి అవగాహన కలిగి ఉండాలని, గ్రామ వ్యవస్థనుపటిష్టపర్చాలని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు గ్రామ రికార్డులను అప్‌డేట్ చేస్తుంటే సమస్యలు రావని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌డేలో క్షేత్రస్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలే వస్తున్నాయని, వాటిని రాకుండా క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని ఆయన సూచించారు. రెవెన్యూ కార్యదర్శులు గ్రామాల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రభుత్వ భూముల వివరాలను సమగ్రసమాచారంతో కలిగి ఉండాలని ఆయన సూచించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన భాధ్యత రెవెన్యూ కార్యదర్శులపైనే ఉందని, అందువల్ల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను తూచాతప్పకుండా కార్యదర్శులు పాటించాలని ఆయన అన్నారు. గ్రామాల్లోని రెవెన్యూ కార్యదర్శులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని ఆరోపణలు వస్తున్నాయని, రైతులకు సంబంధించిన సమస్యలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే గ్రివెన్స్‌డేలో అధికంగా ఫిర్యాదులొస్తున్నాయని వాటిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లోనే రైతులకు సంబంధించిన భూసమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు. సక్రమంగా పనిచేస్తే గ్రామాల్లో సమస్యలు ఉత్పన్నం కావని, అందువల్ల కార్యదర్శులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆయన అన్నారు. రెవెన్యూ రికార్డులను పకడ్భందీగా నిర్వహించాలని, గ్రామాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని, ఇతర శాఖాధికారుల సమన్వయంతో గ్రామాలాభివృద్దికి పాటుపడాలని ఆయన అన్నారు. డివిజన్‌లోని పనితీరు సక్రమంగా లేని మూడు మండలాలను గుర్తించి ఆ గ్రామాల్లోని కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతినెల చివరి పనిదినం రోజు సామాజిక హక్కుల దినంగా ప్రకటించి సామాజిక సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు. గ్రామాల్లోని పంటల వివరాలను రికార్డు చేయాలని, పంటల బీమా తదితర వాటిపై రైతులను చైతన్యవంతం చేయాలని ఆయన సూచించారు. పనితీరులో ప్రతిభకనబర్చినప్పుడే ప్రజల్లో గుర్తింపు వస్తుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పిసిఇఓ కోటిరెడ్డి, ఆర్డీఓ దవాల్‌పూర్ శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్ రమాదేవి, రిటైర్డ్ తహశీల్దార్ మోహన్‌రెడ్డి, ఆర్‌ఐ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రబీలో సాగునీటి విడుదలపై త్వరలో ప్రకటన
హాలియా, అక్టోబర్ 31: నాగార్జునసాగర్ ఎడమకాల్వకు రబీ పంటకు నీటి విడుదల విషయంపై రెండుమూడు రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. బుధవారం హాలియాలో నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటి నిల్వల సామర్ధ్యాన్ని పరిశీలించి నీరు వాడకంపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని అన్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో ఆరుతడి పంటలు పండవని కాబట్టి నీటిని ఎంతవరకు ఉపయోగించుకోవచ్చును అనే విషయంపై కసరత్తు చేస్తామని అన్నారు. రైతులు రెండుపర్యాయాలు నీటి విడుదల చేయకపోవడంతో ఆహార కొరత, పశుగ్రాస కొరత తీవ్రంగా ఉందని, రైతు ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేస్తామని అన్నారు.
పాదయాత్రలకు విలువలేదు
రాష్ట్రంలో నాయకులు చేస్తున్న పాదయాత్రలకు విలువలేదని మంత్రి జానారెడ్డి అభిప్రాయపడ్డారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, వైఎస్‌ఆర్‌సిపి నాయకురాలు షర్మిల చేస్తున్న పాదయాత్రలనుద్దేశించి జానారెడ్డి పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాదయాత్ర చేయడం కేవలం కాగితాలకే పరిమితమని అలాంటివాటిని ఎవరు పట్టించుకోరని అన్నారు. పనిచేసేవారికే గుర్తింపు ఉంటుందని జానా అభిప్రాయం వ్యక్తం చేశారు.

గిడ్డంగుల కొరత నివారణకు కరువైన ముందుచూపు
మద్దతు ధరకు..ఆహార భద్రతకు ఇబ్బందులు
మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల నిల్వకు గోదాంల కొరత
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, అక్టోబర్ 31: దేశ ఆహార భద్రత అవసరాలకు, ధాన్యం మద్దతు ధర అమలుకు కీలకమైన గిడ్డంగుల నిర్మాణాలపై పాలకులలో కొరవడిన ముందుచూపు ధాన్యం కొనుగోలు..నిల్వ, క్రయవిక్రయాలతో పాటు ధరల నియంత్రణలపై దుష్ఫలితాలను చూపుతుంది. మార్కెటింగ్ శాఖ, గిడ్డంగుల సంస్థలు కొత్త గోదాంల నిర్మాణాల్లో ఇంతకాలంగా ప్రదర్శించిన నిర్లక్ష్యం అంతిమంగా రైతుకు మద్దతు ధరను అందకుండా, పేదోడి ఆహార భద్రతకు చిల్లు పెట్టేలా మారుతుండటం విమర్శలకు దారితీస్తుంది. దేశంలో ప్రస్తుతం ఏటా 25కోట్ల ఆహార ధాన్యాల దిగుబడి సాగుతుండగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలన్ని కలిపి ఉన్న గోదాంల్లో నిల్వ సామర్ధ్యం 10.87కోట్లు మాత్రమే. రాష్ట్రంలో ఏటా 2.10కోట్ల టన్నుల ధాన్యాల దిగుబడి సాగుతుండగా గోదాంల్లో నిల్వ సామర్ధ్యం నాలుగోవంతు. జిల్లాలో ఆహార ధాన్యాల దిగుబడి ఏటా 10లక్షల టన్నులకుపైగా ఉంటుండగా గోదాంల నిల్వ సామర్ధ్యం 6లక్షల 47వేల 780టన్నులు మాత్రమే ఉంది. అంటే మరో మూడున్నర లక్షల ఆహార ధాన్యాల దిగుబడులకు గిడ్డంగుల కొరత ఎదురవుతుండటం సమస్య తీవ్రతకు నిదర్శనం.
పేరుకుపోతున్న బాయిల్డ్ రైస్ నిల్వలు
గోదాంల్లో స్థలభావం..మద్దతు ధరకు గండి
జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ల పరిధిలోని 21గోదాంలలో 70,365మెట్రిక్ టన్నుల సామర్ధ్యం, సిడబ్ల్యుసికి చెందిన రెండు గోదాంల్లో 6200టన్నులు, ఎస్‌డబ్ల్యుసికి చెందిన 9గోదాంల్లో 108100టన్నులు, ఎఫ్‌సిఐకి చెందిన రెండు గోదాంల్లో 1,26,450టన్నులు, 11ప్రైవేటు గోదాంల్లో 2లక్షల 94వేలు, పిఎసిఎస్‌కు చెందిన గోదాంలలో 3,665టన్నుల నిల్వ సామర్ధ్యం ఉన్నట్లుగా అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఆక్టోబర్ 31వ తేది నాటికి అందుబాటులో ఉన్న ఆయా శాఖల 32గోదాంలలో 6,37,140టన్నులు నిల్వ సామర్ధ్యానికిగాను 6,53,936టన్నుల ధాన్యం నిల్వలతో గోదాంలు నిండిపోయాయి. అందులో కూడా సామర్ధ్యానికి మించి నిల్వ చేసి, ఆరుబయట షెడ్‌లలో పెట్టి, పాలిథిన్ కవర్లు వంటివి వేసి నిల్వ చేయడం జరిగింది. ఇంత చేసిన 3శాతం నిల్వ అధికంగా ఉండగా ప్రస్తుతం ఖరీఫ్‌లో ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసే ధాన్యం 1.50లక్షల టన్నులతో పాటు సేకరించాల్సిన 2లక్షల టన్నుల పచ్చి బియ్యం ఎక్కడా పెట్టాలన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ధాన్యం, బియ్యం నిల్వలకు తగిన స్థలం ఉంటేనే మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేందుకు, మద్ధతుధర ఇచ్చేందుకు, బియ్యం లేవి ఇచ్చేందుకు వీలుండగా గోదాంల కొరత ఇందుకు ఆటంకాలు కల్పిస్తుంది. గతంలో మాదిరిగా గోదాంల నుండి ఎగుమతులు సకాలంలో సాగకపోతుండటం గోదాంల సమస్యను మరింత జఠిలం చేస్తుంది. జిల్లాలో ఎక్కువగా బాయిల్డ్ రైస్ సేకరణ..ఎగుమతులను ఎఫ్‌సిఐ సాగిస్తుంది. ప్రస్తుతం గోదాంల్లోని 6,53,934టన్నుల్లో నిల్వలో 5,98,734టన్నులు బాయిల్డ్ రైస్ ఉండటం గమనార్హం. గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బీహార్, యూపి వంటి రాష్ట్రాలకు జిల్లా నుంచి బాయిల్డ్ రైస్, రారైస్ ఎక్కువగా ఎగుమతి జరుగగా ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లోని వరి పంటల సాగు విస్తీర్ణం పెరిగిపోవడంతో జిల్లా బియ్యం ఎగుమతులు తగ్గి గోదాంల ఖాళీ సమస్య అధికమవుతుంది. గతంలో నెలకు 50నుండి 60ర్యాక్‌ల ఎగుమతి జరుగగా ప్రస్తుతం 17కు పడిపోయిన తీరు క్షీణించిన ఎగుమతులకు నిదర్శనం. గతంలో నెలకు 50వేల వరకు గోదాంల ఖాళీ జరుగాల్సింది ప్రస్తుతం 18వేల టన్నుల మేరకు కూడా ఖాళీకాక గోదాంలలో స్థలభావానికి కారణమవుతుంది. ఈ పరిస్థితులను బేరీజు వేసుకుని ప్రభుత్వం ధాన్యం సేకరణ, బియ్యం ఎగుమతులు, గోదాంల సామర్ధ్యాలను సమీక్షించుకుని కొత్త విధానాలతో ముందుకు రావాల్సిన అవసరముంది.
నూతన గోదాంల నిర్మాణాలపై నిర్లక్ష్యం !
రోజురోజుకు ఎదురవుతున్న గోదాంల కొరత సమస్యలను ఎదుర్కోనేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకోవడంలో ప్రభుత్వం, గిడ్డంగులు, మార్కెటింగ్ శాఖలు నిర్లక్ష్యం కనబరుస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా 10శాతం ధాన్యం నిల్వలు సరైన గోదాం వసతులు లేక పందికొక్కులు, పశువులు, చేపల దాణాగా వినియోగిస్తున్న తీరుపైన సుప్రీం కోర్టు సైతం విస్మయం వ్యక్తం చేస్తు గోదాంల వసతి, ఆహార భద్రతపై ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. రాష్ట్రంలో గోదాంల కొరత కారణంగా రైతులకు మద్ధతు ధర అందడం లేదంటు మోహన్‌కందా కమిటీ నివేదించినా..ఆహార అవసరాలకు అనుగుణంగా గోదాంలు లేక ఆహార ధాన్యాల ధరలు పెరుగుతున్నాయంటు నిపుణులు హెచ్చరించిన ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం గత రెండేళ్లలో 4వేల కోట్ల మేరకు కొత్త గోదాంల నిర్మాణాలకు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటిలో 2శాతం నిధులు కూడా సాధించకపోగా ప్రైవేటు రంగంలోనూ గోదాంల నిర్మాణాలను తగినంతగా ప్రోత్సహించడంలో విఫలమైందని విమర్శిస్తున్నాయి. రైతులు మార్కెట్‌కు తెచ్చే దిగుబడుల విలువలో వసూలు చేస్తున్న ఒక శాతం మార్కెట్ ఫీజు సొమ్ము కోట్లలో ఉన్నా మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థలు కొత్త గోదాంల దిశగా తమకు వచ్చే ఆదాయాన్ని వెచ్చించడంలో శ్రద్ధ చూపకపోవడం విమర్శనార్హం. ఒక్క నల్లగొండ జిల్లా నుండే ఏటా 40కోట్ల మేరకు మార్కెట్ ఫీజు ప్రభుత్వానికి రాబడిగా వస్తుంది. జిల్లాలో గోదాంల కొరత అధిగమించేందుకు, ఐకేపి ధాన్యం నిల్వల సమస్యలు తీర్చేందుకు 45కోట్లతో చేపట్టిన 116మినీ గోదాంల నిర్మాణం రెండేళ్లుగా స్థల సేకరణకే పరిమితమైంది. దీంతో 1లక్ష 45వేల మెట్రిక్ టన్నుల గోదాంల వసతి దూరమైంది. కేంద్ర సబ్సిడీలతో ప్రైవేటు రంగంలో మేళ్లచెర్వు వద్ధ చేపట్టిన 50వేల టన్నుల గోదాంల నిర్మాణం మూలపడగా, నాగిరెడ్డిపల్లిలో నిర్మిస్తున్న 50వేల టన్నుల గోదాంల నిర్మాణం సాగుతుంది. ఇవిగాక సిడబ్ల్యుసి జిల్లాలో నాలుగుచోట్ల నిర్మిస్తున్న 4గోదాంలతో 41వేల టన్నులు, ఎపిఎస్‌సిఎస్‌సి నిర్మించ తలపెట్టిన 17మినీ గోదాంలతో 15వేల టన్నుల నిల్వ వసతి అందుబాటులో రానుండటం కొంత ఊరటనిచ్చేదిగా కనిపిస్తుంది.

ఐకెపి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>