మహబూబ్‌నగర్, అక్టోబర్ 31: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పరిపాలనపై అవగాహన లేదని, ఆయన మాటలు చూస్తుంటే రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రైతులను అవహేళన చేసినట్లు ఉందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా జిల్లాలో తొమ్మిదవ రోజు యాత్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. మద్దూరు, చిన్నచింతకుంట, ఏదులాపురం, చిన్నవడ్డెమాన్, వడ్డెమాన్, దమగ్నాపూర్ గ్రామాలలో చంద్రబాబునాయుడు బుధవారం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రికి పరిపాలన చేయడం తెలియదని, ఆయన అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. నేను రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెబుతుంటే ముఖ్యమంత్రి మాత్రం అది ఎలా సాధ్యమవుతుందని అనడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. 2004లో తాను రైతుల పక్షాన నిరంతరంగా రుణాలు మాఫీ చేయాలని పోరాటం చేస్తే నా పోరాటం స్ఫూర్తితో అప్పటి యుపిఏ ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, ఆ కదలికతోనే 2008లో రాష్ట్రంలోని రైతుల రుణాలు మాఫీ చేశారని తెలిపారు. ఓ సారి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రైతుల రుణాలు ఎలా మాఫీ అయ్యాయో తెలుసుకుంటే బాగుంటుందని బాబు హితవుపలికారు. పరిపాలన తెలియని సిఎం రైతులపై ఆలోచన ఎలా ఉంటుందని ఎద్దేవా చేశారు. తొమ్మిది సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజానీకానికి సుపరిపాలన అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. తనకు పరిపాలన నేర్చుకోవల్సిన అవసరం లేదని, అధికారంలోకి వస్తే రైతుల రుణాలు ఎలా మాఫీ చేయాలో నాకు బాగా తెలుసని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని, రైతుల రుణాలు మాఫీ చేయడం తథ్యమని, మొదటి సంతకం రైతుల రుణ మాఫీ ఫైల్‌పైనే ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాట పేరిట ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని, రైతులు కష్టాలలో ఉంటే ఆయన మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇందిరమ్మ బాటకు స్వస్తిపలికి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పత్తి రైతులు పడుతున్న బాధలను ముఖ్యమంత్రి తెలుసుకుంటే బాగుంటుందని హితవుపలికారు. వ్యవసాయానికి జాతీయ ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయకుంటే టిడిపి అధికారంలోకి వచ్చాకా ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయం లాభసాటిగా ఉండాలనే నా తపన అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దోపిడీకి అలవాటుపడి పందికొక్కులా మెక్కుతున్నారని ఆరోపించారు. రైతుల బాధలు చూస్తుంటే కన్నీరు వస్తుందని తెలిపారు. జిల్లాలో టిడిపి హయాంలోనే అభివృద్ధి జరిగిందని, జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీయేనని తెలిపారు. రైతుల రుణాలు మాఫీ చేస్తే బ్యాంకులు దివాలా తీస్తాయనడంలో ముఖ్యమంత్రికి ఉన్న అవివేకం బయట పడిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి దాచిపెడుతుండే బ్యాంకులు దివాలా తీయలేవా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆదాయం రూ. 1.50 లక్షల కోట్లు ఉందని తెలిపారు. ఈ ఆదాయం కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి పోకుంటే ప్రజల కష్టాలన్ని తీరిపోతాయని తెలిపారు. చదువుకున్న యువకులకు ఉద్యోగం రాకుంటే, ఉపాధి లేకుంటే నిరుద్యోగ భృతి కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని పదేపదే చెబుతున్నా నన్ను ఇబ్బంది పెట్టడం ఏమిటని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యాత్రలో తెలంగాణ తెలుగుదేశం ఫోరం అధ్యక్షుడు ఎర్రబెలి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు సీతాదయాకర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, టిడిపి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు తదితరులు పాల్గొన్నారు.
బాబు యాత్రకు తెలంగాణ సెగ
* తెలంగాణవాదులపై తెలుగు తమ్ముళ్ల దాడి
* ఒంటిపై కిరోసిన్ పోసుకున్న నిరసనకారుడు
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, అక్టోబర్ 31: టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం యాత్ర బుధవారం దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా చిన్నచింతకుంట గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు పాదయాత్రను నిరసిస్తూ జెఎసి నాయకులు చిన్నచింతకుంట గ్రామంలో ఇళ్లపై నల్ల జెండాలను కట్టి నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకోకు దిగారు. రాస్తారోకో చేస్తున్న తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేయడంతో మరింత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జెఎసి నాయకుడు రమేష్ భవనంపైకి ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటానని, అరెస్టు చేసిన తెలంగాణ వాదులను విడుదల చేయకుంటే నిప్పంటించుకుంటానని పోలీసులను బెదిరించారు. జెఎసి నాయకుడు భవనంపైకి ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆందోళనకు దిగడంతో ఆయనకు మద్దతుగా గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. అరెస్టు చేసిన వారిని ఇతర ప్రాంతాలకు తరలించడం ఏమిటని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దాదాపు రెండు గంటల తర్వాత అరెస్టు చేసిన వారిని పోలీసులు తిరిగి తమతమ వాహనాలలో చిన్నచింతకుంటకు తీసుకువచ్చి వదిలిపెట్టారు. అప్పుడు ఆందోళనకు దిగిన జెఎసి నాయకుడు కిందకు దిగివచ్చారు. అంతలోపే కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అక్కడికి వచ్చారు. ఆయనను చూసిన తెలంగాణ వాదులు ఒక్కసారిగా నోటికి నల్లగుడ్డలు కట్టుకుని కళ్లకు కంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ ఆయనను చుట్టుముట్టారు. దాంతో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఒక్కసారి ఖంగుతిన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తున్నారని వాగ్వివాదానికి దిగారు. చంద్రబాబునాయుడితో తెలంగాణకు జై అనిపించాలని నిలదీశారు. ఇంతలోపే మద్దూరు నుండి చిన్నచింతకుంటలోకి చంద్రబాబు పాదయాత్ర రానే వచ్చింది. ఒకపక్క తెలుగు తమ్ముళ్లు, మరోపక్క తెలంగాణ వాదులు నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణ వాదులు చంద్రబాబు పాదయాత్రలోకి దూసుకువచ్చారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వారిని అక్కడి నుండి చెదరగొట్టారు. మరోపక్క తెలుగు తమ్ముళ్లు కూడా తెలంగాణ వాదులు పెట్టిన నల్ల జెండాలను తొలగించడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇటు తెలంగాణ వాదులను, అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు సముదాయించడానికి నానా తిప్పలు పడ్డారు. ఇంతలోపే ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోతూ తెలంగాణ వాదులపైకి దూసుకువచ్చారు. దాంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంతలోపే చంద్రబాబు కాన్వాయ్‌లో ఉన్న కొందరు టిఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు, చంద్రదండు కార్యకర్తలు తెలంగాణ వాదులపై దాడి చేశారు. పోలీసులు తెలుగు తమ్ముళ్లను చెదరగొట్టారు. తమపై దయాకర్‌రెడ్డి అనుచరులు దాడి చేశారని తెలంగాణ వాదులు మరోసారి ఆందోళనకు దిగారు. గద్వాల డిఎస్పీ మహేష్‌కుమార్, గద్వాల సిఐ నర్సిములు తెలంగాణ వాదులను సముదాయించారు. ఒకపక్క నిరసనలు కొనసాగుతుండగా మరోవైపు చంద్రబాబునాయుడు సభ కొనసాగింది. ఆ సభలో చంద్రబాబు మాట్లాడుతూ నన్ను ఇబ్బంది పెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని, తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. టిడిపి హయాంలోనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని, అందుకు ఎక్కడైనా చర్చ పెడితే సిద్ధమని, నా సవాల్‌ను ఎవరైనా స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఏదిఏమైనా చిన్నచింతకుంటలో వస్తున్నా మీకోసం యాత్ర ఉద్రిక్తతలకు దారి తీయడం, తెలంగాణ వాదులపై తెలుగు తమ్ముళ్లు దాడి చేయడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
చంద్రబాబు పాదయాత్రకు విశేష స్పందన
* దోచుకో.. దాచుకో అనే పద్ధతిలో కాంగ్రెస్ పాలన
* టిడిపి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్
కోయిలకొండ, అక్టోబర్ 31: వాస్తవాలను ప్రజలకు చెబుతూ ప్రజాసమస్యలను ప్రతినిత్యం తెలుసుకుంటూ నిరుపేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తీసుకోవల్సిన చర్యలను సిద్ధం చేసుకుంటూ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని టిడిపి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్ అన్నారు. మంగళవారం కోయిలకొండ మండలంలో వస్తున్నా మీకోసం పాదయాత్ర రూట్ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములుతో కలిసి చంద్రబాబు పాదయాత్ర చేసే గ్రామాలను పరిశీలించారు. అనంతరం కోయిలకొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు మనోహర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని తొమ్మిది సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబుకు ప్రపంచంలోనే ఎంతో గుర్తింపు ఉందని అన్నారు. చంద్రబాబు చేపట్టిన అనేక కార్యక్రమాలు నేడు మహావృక్షాలై రాష్ట్రాన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దోచుకో.. దాచుకో అన్న పద్ధతిలో ముందుకుసాగుతున్నారే తప్ప ప్రజాసంక్షేమాన్ని గాలికి వదలడం జరిగిందని అన్నారు. జలయజ్ఞం, సెజ్‌ల పేరుతో వేల కోట్ల రూపాయలను కాజేయడం జరిగిందని ఆయన ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు జగన్మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లినా ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పాదయాత్రలో చేస్తున్న వాగ్దానాలను ఆచరణలో సాధ్యమేనని అన్నారు. రైతుల రుణాల మాఫీ చేయడం ఎంతో సులువని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసిన కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు రైతు రుణాల మాఫీ చేస్తామని చెబితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థంకావడం లేదని అన్నారు. గత తొమ్మిది రోజులుగా జిల్లాలో చంద్రబాబు కొనసాగిస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. నారాయణపేట నియోజకవర్గంలో పూర్తికానున్న బాబు పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా కోయిలకొండ మండలంలో చంద్రబాబు పాదయాత్ర గుర్తిండిపోతుందని అన్నారు. విలేఖరుల సమావేశంలో టిడిపి నారాయణపేట నియోజకవర్గ సమన్వయ కర్త శ్రీనివాస్‌రెడ్డి, మండల ప్రచార కార్యదర్శి జి.రవీందర్, నాయకులు భీంరెడ్డి, వెంకట్‌నారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు.
రక్షిత కౌలుదారు రైతులకు న్యాయం చేస్తాం
* జాయింట్ కలెక్టర్ భారతి లక్పతినాయక్
మక్తల్, అక్టోబర్ 31: మక్తల్ మండలంలోని యర్సన్‌పల్లి గ్రామానికి చెందిన రక్షిత కౌలుదారు రైతులకు న్యాయాన్ని చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ భారతి లక్పతినాయక్ అన్నారు. బుధవారం యర్సన్‌పల్లి గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జెసి భారతిలక్పతినాయక్ ఆగ్రామానికి చెందిన రక్షిత కౌలుదారు రైతులకు జరిగిన అన్యాయంపై పూర్తిస్థాయి విచారణ జరిపించారు. కౌలుదారు రైతుల భూములను తప్పుడు రికార్డులు సృష్టించి కాజేయాలని చూసిన ఆగ్రామ రెవెన్యూ అధికారి మల్లిఖార్జున్, భూస్వామి జితేందర్‌రావులపై రైతుకూలి సంఘం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో స్పందిన కలెక్టర్ జెసిని విచారణ నిమిత్తం పంపించారు. కర్ని శివారులోగల సర్వేనెంబర్ 528, 530, 531, 531పైకి గల మొత్తం 30.08 ఎకరాల భూములను రక్షిత కాలుదార్లు, ప్రస్తుతం సాగుచేస్తున్న రైతులు గత రెండు తరాలుగా దాదాపు 40 సంవత్సరాలుగా వారి స్వాధీనంలో ఉందని రైతుకూలి సంఘం నాయకులు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ నిమిత్తం వచ్చిన జెసి చుట్టుపక్కల పొలాల రైతులను, గ్రామ పెద్దలను అడిగి సమాచారాన్ని తెలుసుకున్నారు. టెనెంట్ పట్టా నాగప్ప పేర ఇవ్వడం వల్ల హిస్సాదారులైన చిన్ననాగన్న, గోవిందమ్మ, ఎల్లప్ప, తిప్పన్నలు మోకాపై ఉండి సాగుచేస్తున్నట్లు జెసి విచారణలో తేలింది. కౌలు రైతులకు తెలియకుండా విఆర్‌ఓ మల్లిఖార్జున్ పై సర్వేనెంబర్‌గల భూములను తాను కొనుగోలు చేసినట్లు చుట్టు పక్కల పొలాల రైతులు జెసికి చెప్పడంతో రైతుల నుండి వాస్తవ విషయాలను లిఖిత పూర్వకంగా జెసి వ్రాయించుకున్నారు. అన్ని కోణాల్లో విచారించి కౌలురైతులకు న్యాయం చేస్తామని జెసి హామీ ఇవ్వడం జరిగింది.
పార్టీ బలోపేతానికి కార్యోన్ముఖులు కండి
* బిజెపి జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండురెడ్డి
మక్తల్, అక్టోబర్ 31: గ్రామ స్థాయి నుండి బిజెపిని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కార్యోన్ముఖులై ముందడుగు వేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండురెడ్డి అన్నారు. బుధవారం మక్తల్‌లోని అర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన బిజెపి తాలూకాస్థాయి సమావేశానికి జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండ్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.కొండయ్యలు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. బిజెపి సభ్యత్వం, క్రియాశీల సభ్యత్యం రాష్ట్రంలోనే అత్యధికంగా మక్తల్ నియోజకవర్గంలో చేయడం అభినందనీయమని అన్నారు. నవంబర్ ఒకటవ తేదీ నుండి 20వ తేదీ వరకు బిజెపి గ్రామకమిటీలు, మండల కమిటీలు పూర్తిచేయాలని వారు కోరారు. ప్రస్తుతం తెలంగాణ విషయంలో టిడిపి, కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలు పూర్తిగా విఫలం కావడంతో ప్రజలు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది ఒక్క బిజెపి ఒక్కటేనని అన్నారు. సమాజంలోని ప్రజలను చైతన్యం చేసి బిజెపిని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో, శాసనసభ ఎన్నికల్లో బిజెపిని గెలిపించే విధంగా ప్రజలను చైతన్యవంతులుగా చేసే బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఎంతో ఉందని అన్నారు. సమసమాజ నిర్మాణం కోసం ప్రతి బిజెపి కార్యకర్త ముందుండాలని అన్నారు. ఎఫ్‌డిఐకి నిరసనగా అన్ని మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వారు పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న తొమ్మిది సంవత్సరాలలు రాష్ట్ర ప్రజలను మోసంచేసి దోచుకుని మొసలి కన్నీరు కారుస్తూ మళ్లీ పొంతనలేని హామీలు ఇవ్వడంలో అర్థంలేదని అన్నారు. ఆ సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు నింగిరెడ్డి, జిల్లా నాయకులు బాల్‌రాజ్, శాంతికుమార్, అమర్‌కుమార్, నాగభూషణం, సోమశేఖర్‌గౌడ్, నారాయణ, భీంరెడ్డి, నాగప్ప, సత్యనారాయణ, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అధికారం ఇస్తే వ్యవసాయ రుణాలు మాఫీ
వస్తున్నా మీకోసం యాత్రలో చంద్రబాబు భరోసా
చిన్నచింతకుంట, అక్టోబర్ 31: రాబోయే ఎన్నికల్లో టిడిపిని బలపర్చి అధికారంలోకి తెస్తే రైతులకు వ్యవసాయ రుణాలు మాఫీచేస్తానని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు భరో సా ఇచ్చారు. బుధవారం ఆయన మీకోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా చిన్నచింతకుంట మండలంలోని మద్దూరు గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు వేసుకున్న పంటలు ఎరువుల ధరలు పెరిగి, గిట్టుబాటు ధరలు రాక అప్పుల పాలవుతున్నారని, నాలుగు ఎకరాల ఆముదం పంట సాగుచేసుకున్న రైతుకు పంట చేతికి అందకపోవడంతో లక్షవరకు నష్టపోయాడని, చెరువులలో నీరులేక మత్య్సకార్మికులు తీవ్ర ఇబ్బందులతో జీవనోపాధిని పొందలేకపోతు వలసలువెళ్లే పరిస్థితి ఏర్పడిందని వడ్రంగి, కమ్మరి వృత్తులకు ఆదరణ కరువై వారి కుటుంబాలు దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారని అన్నారు. చిన్నచింతకుంట మండలం పేరుచెబితేనే బీడికార్మికులు గుర్తుకు వస్తారని, 24గంటలు కష్టపడితే వెయ్యి బీడీలు చుడుతారని, కానీ వారికి వచ్చేది వందరూపాయలేనని, పిఎఫ్ కూడా రాదని తెలిపారు. ఉద్యోగులకు సైతం కనీసవేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మ్యాదరి కులస్తులు బుట్టలు అల్లుకుని జీవితాన్ని కొనసాగించేవారిని, నేటి పరిస్థితిలో ప్లాస్టిక్ వస్తువులు రావడంతో మ్యాదరుల జీవితాలు అగమ్యగోచరంగా తయారైందని అన్నారు. మత్య్సకార్మికుల అభ్యున్నతి కోసం ప్రాజెక్టులు పూర్తిచేసి చెరువులకు నీరు నింపి ఉపాది కల్పిస్తామని, అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. పదివేల కోట్లతో ప్రత్యేక నిధులను ఏర్పాటుచేసి బీసి అభ్యున్నతికి ఖర్చుచేస్తానని, రాబోయే ఎన్నికల్లో బీసిలకు 100సీట్లు కేటాయిస్తానని, నామినేటెడ్ పదవుల్లో బీసిలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని, సామాజిక న్యాయం తెచ్చిన ఘనత టిడిపిదేనని ఆయన అన్నారు. అధికార పార్టీ పైరవీకారులను పెంచిపోషిస్తున్నదని, అమాయకప్రజలను ఆసరాగా తీసుకుని అందినంత దండుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలకు, విద్యార్థులకు అండగా ఉంటానని, వారి అభ్యున్నతికోసం టిడిపి నిరంతరం కృషిచేస్తుందని ఆయన తెలిపారు. అంతకు ముందు పాదయాత్రలో పొలాల్లో గెర్రెల కాపర్లదగ్గరికి వెళ్లి వారి కష్టనష్టాలు అడిగి తెలుసుకున్నారు. మద్దూరులో కమ్మరి కొలిమిదగ్గరకు వెళ్లి గుణపాన్ని సుత్తెతోకొట్టి ఆవృత్తిలో కష్టనష్టాలను అడిగితెలుసుకున్నారు. బీడికార్మికుల స్థితిగతులపై బీడీలు చుట్టి బీడికార్మికుల కష్టనష్టాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడినుండి పాదయాత్ర మండలకేంద్రానికి చేరుకుంది.
చంద్రబాబుకు ఘన స్వాగతం
రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వస్తున్న మీకోసం పాదయాత్ర మండల కేంద్రానికి చేరుకోగానే మండలంలోని వివిధ గ్రామాల తెలుగుతమ్ముళ్లు, తెలుగు మహిళా నాయకురాల్లు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. అక్కడినుండి భారీ ఊరేంగింపుగా పాదయాత్ర కొనసాగింది. మండల కేంద్రం పసుపుమయంగా మారింది. ఈకార్యక్రమంలో టిడిపి మండల అద్యక్షులు వజీర్‌బాబు, నాయకులు మోహన్‌గౌడు, మహదేవన్‌గౌడు, ఉమామహేశ్వర్ రెడ్డి, జనార్థన్, మాసన్న, మనె్నంగౌడు, చెన్నగౌడు, శ్రీనుచారి, బుడ్డన్న, వివిధ గ్రామాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు.