Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

97వ రాజ్యాంగ సవరణ ద్వారా సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తి

$
0
0

వరంగల్, అక్టోబర్ 31: సహకార సంఘాలకు 97వ రాజ్యాంగ సవరణ ద్వారా స్వయం ప్రతిపత్తి కలగనుందని జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి తెలిపారు. బుధవారం నగరంలోని జిల్లా పరిషత్ హాలులో 97వ రాజ్యాంగ సవరణ సహకార సంఘాల స్వయం ప్రతిపత్తిపై జరిగిన సభకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 97వ రాజ్యాంగ సవరణ ద్వారా సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తి కల్పించిందని, ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ సహకార చట్టం 1964, ఆంధ్రప్రదేశ్ మాక్స్ చట్టం 1995లకు 97వ రాజ్యాంగ సవరణ ద్వారా మార్పు చేసి 2012 జనవరిలో ఆమోదించారని అన్నారు. 2012 ఫిబ్రవరిలో ఈ చట్టం అమలులోకి వచ్చిందని తెలిపారు. జిల్లాలోని సహకార సంఘాలతో చర్చించి ఈ సదస్సు ద్వారా సభ్యుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించనున్నామని తెలిపారు. అన్ని జిల్లాలలో ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామని, సంఘ సభ్యులు చేసిన ప్రతిపాదనలు పరిశీలించి డిసెంబర్ వరకు పూర్తి సవరణలు చేసి అనంతరం 2012 ఫిబ్రవరిలో పూర్తిస్థాయిలో ఈ చట్టం అమలులోకి వస్తుందని అన్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త చట్టంలో కొన్ని మార్పులు జరిగాయని, ఇందులో సహకార సంఘాలు ఏర్పడడం ఒక ప్రాథమిక హక్కుగా చేర్చబడిందని పేర్కొన్నారు. సహకార సంఘంలోని పాలక సభ్యుల సంఖ్య 21కి మించరాదని, అందులో ఎస్సీ-1, ఎస్టీ-1, మహిళలకు రెండు సీట్లు కేటాయించాలని అన్నారు. ఆ కేటగిరి వారు మెంబర్లుగా ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పారు. పాలకమండలి, ఎన్నికల నిర్వహణ జనరల్ బాడీ మీటింగ్, ఏడాదికి ఒకసారి ఆడిట్ నిర్వహించడం, అఫెక్స్ సంఘాల ఆడిట్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కొత్త చట్టంలో ఉన్నాయని, అలాగే అనైతికమైన చర్యలకు పాల్పడిన పాలకమండలిని సస్పెండ్ చేసే అధికారం ఈ చట్టానికి ఉందని తెలిపారు. వివిధ సంఘ సభ్యులు చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సదస్సు అనంతరం పంపిస్తామని, సహకార చట్టాలు సభ్యులు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందడానికి తోడ్పడుతాయని పేర్కొన్నారు. సహకార సంఘాలకు ఉపయోగపడే విధంగా చట్టాలు ఉంటేనే సంఘాలకు మనుగడ ఉంటుందని, ఈ చట్టంలో రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం అభినందనీయమని అన్నారు. కాగా 1995 ఆక్ట్‌లోని ఎన్నికలు, సూపర్‌వైజింగ్ ఆడిట్ అలాగే కొనసాగాలని సభ్యులు ప్రతిపాదించారు. ఈ సదస్సులో సహకార బ్యాంకు జనరల్ మేనేజర్ సురేందర్, డిసిసిబి డైరెక్టర్లు అర్జున్‌రావు, రమేష్, నర్సింహరెడ్డి, డిఎల్ సిఓ పూల్‌సింగ్, పుల్లారావు, వివిధ సహకార సంఘ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

అనుమానాస్పద
స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతి
*ఆలయ కోనేరులో వెలుగుచూసిన మృతదేహం *ప్రేమ పేరిట వేధింపులే కారణమని తల్లి ఆరోపణ * కేసు నమోదు
నర్సింహులపేట, అక్టోబర్ 31: గత నాలుగు రోజుల కిందట కనిపించ కుండా పోయన డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో బుధవారం స్థానిక ఆలయ కోనేరులో శవమై తేలగా, తన కూతురును తమ గ్రామానికే చెందిన డిగ్రీ విద్యార్థి ప్రేమ పేరుతో నమ్మించి చంపి ఉంటాడని తల్లి ఆరోపణ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామ శివారు నిదానపురం గ్రామానికి చెందిన మల్లెపాక ఉప్పలయ్య, సావిత్రమ్మ కుమార్తె మమత(19) తొర్రూరులోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈమె గత నాలుగు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయి కనపించడం లేదని కుటుంబీకులు చెబుతున్నారు. ఆమె కోసం అన్నిచోట్ల వెదుకుతున్న క్రమంలో దేవాలయ కోనేరులో మృతదేహం ఉన్నట్లు పలువురు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మహబూబాబాద్ డిఎస్పీ ఎ. రమాదేవి, తొర్రూరు సిఐ బాలస్వామి, స్థానిక ఎస్సై వినయ్‌కుమార్, విఆర్‌ఓ సుధాకర్ సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకుని విచారించారు. సంఘటన స్థలంలో మృతురాలి చెప్పులు, సెల్‌ఫోన్, చుడిదార్ లభ్యం కావడంతో సెల్‌ఫోన్‌లో తల్లి పేరు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. దాంతో తల్లిదండ్రులు వచ్చి మృతదేహాన్ని చూసి తమ కుమార్తె అని గుర్తించి బోరున విలపించారు. తన కూతురు మమతను తమ గ్రామానికి చెందిన తొర్రూరులో డిగ్రీ చదివే కరుణాకర్ అనే యువకుడు ప్రేమపేరుతో వేధిస్తున్నాడని, ఇటీవలే పెద్దమనషుల సమక్షంలో పంచాయితీ జరిపి అతన్ని మందలించామని, అతనే నమ్మించి చంపి ఉంటాడని తల్లి సావిత్రి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్‌కుమార్ విలేఖరులకు తెలిపారు. విద్యార్థిని మృతిపై అన్ని కోణాల నుండి దర్యాప్తు చేసి నిందితుడిని త్వరలో పట్టుకుంటామని డిఎస్పీ రమాదేవి తెలిపారు.

మిల్లర్ల నుండి లెవీ బియ్యం సేకరణ
* సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండి వరప్రసాద్
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, అక్టోబర్ 31: ఖరీఫ్ సీజనల్‌లో రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఏడు జిల్లాలలోని మిల్లర్ల నుంచి లెవీ బియ్యాన్ని సేకరిస్తామని సివిల్ సప్లయి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వరప్రసాద్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాలులో ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం, బియ్యం సేకరణపై అధికారులతో ఎండి సమీక్షించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లెవీ బియ్యం సేకరణకు రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్, నల్గొండ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో మిల్లర్ల నుండి బియ్యం సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పౌరసరఫరాల శాఖ రేషన్ కార్డుదారులకు బియ్యం సరఫరా చేయడానికి వరంగల్ జిల్లాకు ఏడాదికి రెండులక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని, ఈ బియ్యాన్ని సేకరించనున్నామని తెలిపారు. దాంతో గోడౌన్ స్థలం కలసిరావటమే కాకుండా రవాణా ఖర్చులు తగ్గుతాయని అన్నారు. ఖరీఫ్ సీజన్‌లో ధాన్యాన్ని సేకరించడానికి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో 650 కోట్ల రూపాయల విలువైన బియ్యం, ధాన్యం సేకరణ జరుపుతారని అన్నారు. లక్ష మెట్రిక్ టన్నుల సాధారణ ధాన్యాన్ని, 50వేల మెట్రిక్ టన్నుల సోనా మసూరి ధాన్యాన్ని, రెండులక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనున్నారని తెలిపారు. రేషన్ కార్డుదారులకు నాణ్యమైన బియ్యాన్ని అందించడమే కాకుండా ప్రభుత్వానికి గోడౌన్ స్థలం ఖర్చు, రవాణా ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. జిల్లాలో ధాన్యం సేకరణకు అవసరమైన గోడౌన్ స్థలం 128, 304మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను ఇంకా పెంచి రైతులు ధాన్యాన్ని విక్రయించుకోవడానికి వీలు కల్పిస్తారని తెలిపారు. అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా మారుస్తారని అన్నారు. సోనామసూరికి 1500 రూపాయలు, సాధారణ రకానికి 1250 రూపాయలు, ‘ఎ’ గ్రేడ్ రకానికి 1280 రూపాయలు మద్ధతు ధరను రైతులకు చెల్లిస్తారని తెలిపారు. మిల్లర్ల నుండి బియ్యం సేకరించడానికి, నాణ్యత పరిశీలనకు ఇతర జిల్లాల నుండి సాంకేతిక (మిగతా 3వ పేజీలో)

(1వ పేజీ తరువాయి) సిబ్బందిని వరంగల్ జిల్లాకు డిప్యూటేషన్‌పై పంపుతున్నారని తెలిపారు. 41 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన మూడురోజులలోపు రైతులకు ధాన్యం ధరను చెల్లిస్తారని తెలిపారు. రెవెన్యూ అధికారులు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తారని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ జిల్లాలో రైతుల నుండి ధాన్యం సేకరించేందుకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. త్వరలో మిల్లర్ల వద్ద నుండి లేవీ బియ్యం సేకరణ ప్రారంభిస్తామని చెప్పారు. జనగామ ప్రాంతంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌కు నెలకు 18 వేల ఎంటియు బియ్యం అవసరం అవుతాయని అన్నారు. ఏడాదికి అవసరమైన మొత్తం బియ్యాన్ని మిల్లర్ల ద్వారా సేకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఎఫ్‌సిఐ నుండి తొమ్మిది, ఎఎంసి నుండి మూడు గోడౌన్లను అద్దెకు తీసుకుంటున్నారని చెప్పారు. అవసరాన్ని బట్టి ప్రైవేటు గిడ్డంగులను అద్దెకు తీసుకుంటారని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.అంజయ్య, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్, సివిల్ సప్లయ్ డిఎం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
గోదావరి జలాల రాకతో గ్రామస్థుల హర్షం
రఘునాథపల్లి, అక్టోబర్ 31: రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్వగ్రామమైన మండలంలోని ఖిలాషాపురం గ్రామానికి దేవాదుల కాలువ ద్వారా గోదావరి జలాల రాకతో గ్రామస్థులు హర్షం వెలిబుచ్చారు. బుధవారం ఖిలాషాపురం గ్రామంలో రిజర్వాయర్ కాలువ ద్వారా వచ్చిన గోదావరి జలాలను జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పొన్నాల వైశాలిమురళీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెట్టప్రాంతాలైన జనగామ, చేర్యాల ప్రాంతాలకు నీటిని తీసుకురావడానికి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎంతో కృషి చేశారని ఆమె అన్నారు. అపార భగీరథ యాగం చేసి వాగ్దానాలకే పరిమితం కాకుండా తనేమిటో ఋజువుచేసుకున్నారని ఆమె అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మంత్రి పొన్నాల చేస్తున్న అభివృద్ధిని ఎన్నటికీ మరిచిపోరని ఆమె అన్నారు. గ్రామానికి గోదావరి జలాలు రావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుందని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడుతుందని ఆమె అన్నారు. మొదట్లో కాలువల ద్వారా నీరు అందించడం సాధ్యం కాదని ఎద్దేవా చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు ఏం మోహం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తారని ఆమె ప్రశ్నించారు. జనగామ డివిజన్‌లో పాడిపరిశ్రమ అభివృద్ధికి మంత్రి పొన్నాల కృషి చేస్తున్నారని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ వై. సుధాకర్, వైస్ చైర్మన్ డి. అంజిరెడ్డి, నాయకులు జి. రమణ, శ్రీనివాస్ రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, సదానందం, రమేష్, ఉపేందర్, ఈశ్వరయ్య, మనోహర్, బోస్, కొంరయ్య, పెద్దపురం పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములను పరిశీలించిన తహశీల్దార్
సంగెం, అక్టోబర్ 31: మండలంలోని పల్లారుగూడ, నల్లబెల్లి, మొండ్రాయి గ్రామాలలో బుధవారం మండల తహశీల్దార్ బి.చెన్నయ్య పర్యటించి ప్రభుత్వభూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వభూముల పరిరక్షణకు ప్రజలు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వభూములను కబ్జా చేస్తే ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. భూకబ్జాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా మొండ్రాయి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనపథకం అమలుతీరును పరిశీలించారు. అనంతరం పదవతరగతి తెలుగు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు తహశీల్దార్ భౌతికశాస్త్రం విద్యాబోధన చేశారు. పదవతరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించేందుకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌ఐ గిరిబాబు, విఆర్వో శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సింగరావు పాల్గొన్నారు.
ప్రజల యోగక్షేమాలు ఆలోచించేవారే నిజమైన పోలీసులు
బాలసముద్రం, అక్టోబర్ 31: ప్రజల యోగక్షేమాల గురించి ఆలోచించేవారే నిజమైన పోలీసులని వరంగల్ రూరల్ ఎస్పీ రాజేష్‌కుమార్ సిబ్బందికి తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసుశాఖలో విధులు నిర్వహించి పదవీవిరమణ చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ఘనంగా సన్మానించి వారికి శాఖపరమైన బకాయిలను అందజేశారు. పదవీవిరమణ చేసిన వారిలో ఎస్సై చంద్రయ్య, ఆర్‌ఎస్సై హబీబ్, ఎఎస్సై సాంబయ్య, ఎఆర్ ఎఎస్సై జార్జ్, హెడ్ కానిస్టేబుల్ మీర్జా కమల్, కానిస్టేబుల్ రాంచందర్ ఉన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసుశాఖలో విధులు నిర్వహించే సిబ్బంది ప్రతి ఒక్కరు గర్వపడాలని, పోలీసు సిబ్బంది తమ కర్తవ్య నిర్వహణలో సిబ్బంది కుటుంబ సభ్యుల సహకారం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఓఎస్డీ డాక్టర్ సాయిశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

దేవాదుల ఎత్తిపోతలతో రైతులకు ఒరిగిందేమీలేదు
* ఎమ్మెల్యే రాజయ్య
స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 31: దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన రిజర్వాయర్ల నిర్మాణంతో ఈప్రాంత రైతాంగానికి ఒరిగింది ఏమీ లేదని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. బుధవారం మండలకేద్రంలోని టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ఒక్క ఎకరాకు కూడా సాగు నీరందించిన దాఖలాలు లేవని ఆరోపించారు. నియోజకవర్గంలోని ఘన్‌పూర్, ధర్మసాగర్, మల్లన్నగండి, అశ్వరావుపల్లి రిజర్వాయర్లలో నాణ్యత లోపించిందని, ఆయా రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి కానప్పటికి ఆగమేఘాలతో గోదావరి జలాలను పంపింగ్ చేయించిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య తన నియోజకవర్గానికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మల్లన్న గండి రిజర్వాయర్‌కు కనీసం మత్తడి, తూములు కూడా ఏర్పాటు చేయకుండా అందులోని నీటిని తరలించే ప్రయత్నంలో అధికారులు ఉన్నారని అన్నారు. మల్లన్నగండి రిజర్వాయర్ దిగువ గ్రామాలైన ఫతేపూర్, తాటికొండ, కొత్తపల్లి, పల్లగుట్ట, కృష్ణాజిగూడెం తదితర గ్రామాల రైతులకు సాగునీరు దక్కని పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం, అదికారులు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. దిగువ గ్రామాలకు సాగునీరు అందిస్తూ, మత్తళ్లు, కాలువలు నిర్మించాలని డిమాండ్, చేస్తూ నవంబర్ 3న మల్లన్నగండి రిజర్వాయర్ వద్ద టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీఎత్తున దీక్షా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. నవంబర్ 1న తెలంగాణ విద్రోహ దినంగా పాటించి, నల్లబ్యాడ్జీలు ధరించాలని పిలుపునిచ్చారు. విలేఖరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రమేశ్, వెంకటనర్సు పాల్గొన్నారు.

ఇందిరాగాంధీకి ఘన నివాళులు
వరంగల్ బల్దియా, అక్టోబర్ 31: స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 28వ వర్థంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ శ్రేణులు బుధవారం ఘన నివాళులు అర్పించారు. నగరంలోని 21వ డివిజన్ గోవిందరాజుల గుట్ట ప్రాంతంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పిసిసి కార్యదర్శి మందా వినోద్‌కుమార్, వరంగల్ తూర్పు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బస్వరాజ్ శ్రీమాన్, మాజీ ఎఎంసి చైర్మన్ టి.రమేష్‌బాబు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పిసిసి కార్యదర్శి మందా వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ భూసంస్కరణలు చేసి బలహీనవర్గాలకు చేయూత అందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు సదానందం, శరత్, చందర్, వేణు, శ్రీనివాస్ పాల్గొన్నారు. అదే విధంగా స్వాతంత్య్ర సమరయోధుల, వారసుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరమ్మ వర్థంతి, సర్థార్ వల్లబాయి పటేల్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని లక్ష్మిటాకీస్ సెంటర్‌లోగల మొగిలయ్మహాలులో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇందిరమ్మ, సర్థార్ వల్లబాయి పటేల్ చిట్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘం కోశాధికారి ఓడపెల్లి వెంట్రామనర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్వాతంత్య్ర సమరయోధుల వారసుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా, కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా దేశానికి ఎనలేని సేవ అందించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుల సంఘం, వారసుల సంఘం నాయకులు చంద్రారెడ్డి, వెంకటయ్య, కృష్ణమూర్తి, జనార్థన్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అర్బన్ అధ్యక్షుడు తాడిషెట్టి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో...
స్టేషన్ ఘన్‌పూర్: స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరమ్మ ఆశయాలను కొనసాగించాలని కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజారపు ప్రతాప్ పిలుపునిచ్చారు. ఇందిరమ్మ వర్థంతిని పురస్కరించుకుని బుధవారం మండలకేంద్రంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆరోగ్యకేంద్రంలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ నిరుపేదవర్గాలకు ఇందిరమ్మ చేసిన సేవలు మరువలేనివని, అలాంటి మహోన్నత వ్యక్తి ఆశయాలకనుగుణంగా ప్రతిఒక్కరూ ముందడుగు వేయాలని కోరారు.

97వ రాజ్యాంగ సవరణ ద్వారా సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తి
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>