హైదరాబాద్, అక్టోబర్ 31: సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో వార్డెన్ల నియామకాలకు త్వరలోనే రిక్రూట్‌మెంట్ జరుగుతాయని, జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటిని భర్తీ చేయడం జరుగుతుందని రంగారెడ్డి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ సురేష్‌రెడ్డి వెల్లడించారు.
డయల్ యువర్ అధికారి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉపకారవేతనాలు, వసతి గృహాలు తదితర సంక్షేమ శాఖల అంశాలపై ప్రజల నుండి ఫోన్ ద్వారా సమస్యలను స్వీకరించారు. ఈ సందర్భంగా చేవెళ్ల మండలం ఆలూరు నుండి ఓ వ్యక్తి ఫోన్ చేసి మూడు హాస్టళ్లకు కలిపి ఒకే వార్డెన్ విధులు నిర్వహిస్తున్నాడని అందువల్ల సాంఘిక సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కరించడంలో ఎంతో జాప్యం జరుగుతుందని ఫిర్యాదు చేశారు. అదేకాకుండా ఆలూరు యస్పీ హాస్టలు భవనంలో టాయిలెట్లు నిర్మించాలని, మంచినీటి వసతి కూడా కల్పించాలని కోరారు. ఇందుకు స్పందిస్తూ జెడి ప్రభుత్వ వార్డెన్ పోస్టుల భర్తీకై చర్యలు తీసుకుంటుందని, త్వరలోనే ప్రక్రియ పూర్తిచేసి ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. వసతి గృహంలోని సమస్యలు పరిష్కరించుటకు సంబంధిత సహాయ సాంఘిక సంక్షేమ అధికారిని పంపుతామని తెలిపారు.
వికారాబాద్ మండలం నుండి మురళీధర్ అనే బిసి విద్యార్థి ఫోన్ చేసి తనకు 2008-09 సంవత్సరం మెస్‌చార్జీలు విడుదలయ్యాయని, ట్యూషన్ ఫీజు రిలీజు కాలేదని ఫిర్యాదు చేశారు. ఇందుకు జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి రమణారెడ్డి బదులిస్తూ ట్యూషన్ ఫీజుకు సంబంధించిన నిధులు ఇటీవలనే ప్రభుత్వం మంజూరు చేసిందని, వెంటనే ఫీజు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పరిగి మండలం నుండి చంద్రశేఖర్ అనే బిసి విద్యార్థి ఫోన్‌చేసి డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నానని తనకు కూడా స్కాలర్‌షిప్ రాలేదని ఫిర్యాదు చేశాడు. ఇందుకు స్పందిస్తూ బిసి డబ్ల్యుఓ దరఖాస్తు నెంబరు చెబితే తనిఖీ చేస్తామని అన్నారు. కందుకూరు నుండి విద్యామయి జూనియర్ కాలేజి యాజమాన్యం ప్రతినిధి ఫోన్ చేసి 2011-12 సంవత్సరానికి సంబంధించి డిగ్రీ మొదటి సంవత్సరం స్కాలర్‌షిప్‌లు రాలేదని ఫిర్యాదుచేశారు. ఇందుకు సమాదానమిస్తూ ఆయన గతంలో మంజూరు చేసిన స్కాలర్‌షిప్‌లకు సంబంధించి పంపిణీ చేసినట్లు ధృవీకరిస్తూ రసీదులు పంపాలని అవి అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 32 ఫిర్యాదులు అందాయి. వీటిలో 14 సంక్షేమ శాఖలకు సంబంధించినవికాగా, మిగిలినవి హౌజింగ్, రెవెన్యూ, పౌర సరఫరాలు, గ్రామీణ నీటిపారుదల తదితర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఎడి వెంకట్‌రెడ్డి, యస్సీ కార్పొరేషన్ ఇడి ఉమామహేశ్వరి, ల్యాండ్ ప్రొటెక్షన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, హౌజింగ్ డిఎం మోహన్, పౌర సరఫరాల కార్పొరేషన్ డిఎం ప్రభు, ఎఎస్‌ఓ తనూజ, ఎన్‌ఎన్‌యస్ తహశీల్దారు విక్టర్ తదితరులు పాల్గొన్నారు.
దేనికైనారెడీ చిత్రయూనిట్‌పై కేసు నమోదు
నేరేడ్‌మెట్, అక్టోబర్ 31: దేనికైనారెడీ చిత్రం నిర్మాత మోహన్‌బాబు, దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి, నటులు విష్ణువర్థన్, బ్రహ్మనందంపై కోర్టు ఉత్తర్వుల మేరకు కేసు నమోదు చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల విడుదలైన దేనికైనారెడీ చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, వాటినివెంటనే చిత్రంలో నుండి తొలగించి చిత్రం యూనిట్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన వారు మల్కాజిగిరి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు చిత్రయూనిట్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని మల్కాజిగిరి పోలీసులను అదేశించినట్టు పోలీసులు తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సిఐ తెలిపారు.
చిత్రాన్ని నిలిపివేయాలని ఆందోళన
శేరిలింగంపల్లి, అక్టోబర్ 31: ‘దేనికైనారెడీ’ చిత్రాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బ్రాహ్మణసంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేసారు. బిహెచ్‌ఇఎల్ పురోహిత సంఘం సభ్యులు బుధవారం సాయంత్రం భెల్ జంక్షన్ వద్ద చిత్ర నిర్మాత మోహన్‌బాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. అక్కడినుంచి ర్యాలీగా చందానగర్ శ్రీదేవి టాకీసు వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. వెంటనే చిత్రాన్ని నిలిపివేయకుంటే మోహన్‌బాబు ఇంటి ముందు, థియేటర్ల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా చిత్రీకరించే హక్కు వారికెక్కడిదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్‌శర్మ, వ్యాసమూర్తి, శశికాంత్‌శర్మ, రామదత్తు తదితరులు పాల్గొన్నారు.
చిత్ర నిర్మాతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి
ఉప్పల్, అక్టోబర్ 31: ఒక కులాన్ని కించపరిచేవిధంగా, అవమానించేవిధంగా రూపొందిస్తున్న చిత్ర నిర్మాతలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి డిమాండ్ చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షుడు శ్రాస్తుల రఘురాంశర్మ, అధ్యక్షుడు బి.కృష్ణమూర్తిశర్మ, ప్రధానకార్యదర్శి లక్ష్మణప్రసాద్‌శర్మ, కోశాధికారి శ్యాంమోహన్‌శర్మ మాట్లాడుతూ మొన్న బ్రాహ్మణిజం, నేడు దేనికైనా రెడీ సినిమాలు బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేవిధంగా అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సన్నివేశాలను సెన్సార్ బోర్డు ఎందుకు తోలగించలేదని ధ్వజమెత్తారు. బ్రాహ్మణులు అడుక్కుతినేవారని నిందించే సినీ నిర్మాతలు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు శ్రీ్ధర్‌రాధామోహన్‌శర్మ, వై.రామకృష్ణశర్మ, మహాదేవశర్మ, దామోదర సత్యనారాయణశర్మ, మహాదేవరశర్మ తదితరులు పాల్గొన్నారు.
రైలు నుంచి కిందపడి మహిళ మృతి
శేరిలింగంపల్లి, అక్టోబర్ 31: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ రైలు నుంచి కిందపడి మరణించింది. తాగిన మైకంలో ఉన్న ఓ వ్యక్తిని ప్రయాణికులు దేహశుద్ధి చేసి రైల్వే పోలీసులకు అప్పగించారు. హఫీజ్‌పేట ప్రాంతానికి చెందిన ఎండి ఖలీల్ (50) బుధవారం రాత్రి తప్పతాగి ఎంఎంటిఎస్ రైలు ఎక్కాడు. రైలు వెళ్తుండగా ఓ మహిళను తోసేశాడు. ఆమె పేరు జ్యోతి అలియాస్ బుజ్జి(40) అని, తానే తోసేశానని చెప్పడం గమనార్హం. కాగా, స్టేషన్ రాకముందే దిగబోయి మతృచెందిందని రైల్వే పోలీసులు చెప్పడం గమనార్హం.
ఎదురెదురుగా గూడ్సు రైళ్లతో ప్రయోగం
తాండూరు, అక్టోబర్ 31: సాంకేతిక లోపం, మానవ తప్పిదం మరేయితర కారణాలవల్లగాని ఇకముందు ఒకే రైలు ట్రాక్‌పై పొరపాటున ఎదురెదురుగా రైళ్లు దూసుకువస్తే రైళ్లు వాటంతటవే ఆగిపోయేలా అత్యాధునిక యంత్రం ‘డ్రైవర్ ఇంటర్ ఫేస్ మిషన్’తో ప్రయోగాలు మెరుగైన ఫలితాలు సాధించినట్లు ద.మ. రైల్వే డిఆర్‌ఎం మిశ్రా పేర్కొన్నారు. అక్టోబర్ రెండవ వారంలో దేశంలో మొదటిసారిగా తాండూరు- వాడి సెక్షన్‌ల మధ్య ప్యాసింజర్ రైళ్లతో ప్రయోగం చేసామన్నారు. మంగళవారం ఆయన తాండూరు రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. స్థానిక ప్రయాణికుల సౌకర్యాలు త్వరలో పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.
రైల్వే లోకోషెడ్ ఏర్పాటుకు కృషి: ప్రసాద్‌కుమార్
వికారాబాద్, అక్టోబర్ 31: మన రాష్ట్రం నుండి రైల్వే శాఖ సహాయ మంత్రిగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన దరిమిలా గతంలో వికారాబాద్‌లో ఏర్పాటుకావాల్సి ఆగిపోయిన రైల్వే లోకోషెడ్ ఏర్పాటుకు కృషి చేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి, చిన్నతరహా పరిశ్రమల శాఖా మంత్రి జి.ప్రసాద్‌కుమార్ తెలిపారు. బుధవారం పట్టణ పరిధిలోని రాజీవ్‌గృహకల్ప కాలనీలో రూ 2.10 కోట్లతో ఏర్పాటు చేయనున్న సిసిరోడ్లు, మురికికాలువల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వేల కోట్లతో నిర్మించనున్న లోకోషెడ్‌లో ఎంతోమందికి ఉపాధి లభిస్తుందన్నారు. 132 కెవి సబ్‌స్టేషన్ ఏర్పాటుకు మార్గం సుగమమైందని, త్వరలో శంకుస్థాపన జరగనుందన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పట్టణ పేదల కోసం రాజీవ్‌గృహకల్పను నిర్మించారని, అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల కృషి లేకపోవడంతో అసంపూర్తిగా పనులు జరిగాయన్నారు. మున్సిపాలిటి రాజీవ్‌గృహకల్పను స్వాధీనం చేసుకుని పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, వీధిదీపాలు ఏర్పాటు చేయాలని, మంచినీటి సమస్యను పరిష్కరించాలని కమీషనర్ జైత్‌రాంను ఆదేశించారు. మంజీరా నీటికి నెలకు 10 లక్షల రూపాయలు ఖర్చవుతున్న దరిమిలా నెలకు ప్రస్తుతమున్న 60 రూపాయల నల్లాబిల్లును 120 లేక 150 రూపాయలు ప్రజలు చెల్లించేలా వార్డుల్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని సబ్‌కలెక్టర్‌కు సూచించనున్నట్లు తెలిపారు. కాలనీ వాసుల ప్రతినిధిగా లక్ష్మణ్, మహిళలు మంత్రి ప్రసాద్‌కుమార్‌కు సమస్యలు విన్నవించారు. అందుకు స్పందించిన మంత్రి ప్రసాద్‌కుమార్ స్మశానవాటిక ఏర్పాటుకు ఎసిడిపి నుండి నిధులు కేటాయిస్తామని, రుణం కొద్దికొద్దిగా చెల్లించాలని సూచించారు. వికారాబాద్, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌లు ఎల్.శశాంక్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, హౌసింగ్ ఇఇ ప్రకాశ్, పిసిసి కార్యదర్శి వి.సత్యనారాయణ, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు జి.చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ బి.పెంటయ్య, మండల పార్టీ అధ్యక్షులు భాస్కర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్, మైనార్టీ సెల్ నాయకులు రహీం తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమి ఆక్రమణపై లోకాయుక్తలో కేసు
శేరిలింగంపల్లి, అక్టోబర్ 31: ప్రభుత్వ భూమి ఆక్రమణపై లోకాయుక్తలో చేసిన ఫిర్యాదును స్వీకరించి అధికారులను ఆదేశించినట్టు జనం కోసం సంస్థ అధ్యక్షుడు కె.్భస్కర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మియాపూర్‌లోని సర్వే నెం.28లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాగా అధికారులు తప్పుడు సర్వే చేసారని ఫిర్యాదు చేసారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, గ్రామ నక్ష ఆధారాలతోసహా లోకాయుక్త కోర్టుకు సమర్పించగా వాటిని పరిశీలించి కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్, సర్వేయర్‌లపై కేసు నమోదుచేసి దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు.
వచ్చే ఏడాది ముంపు ప్రాంతాలపై ప్రత్యేక చర్యలు
దిల్‌సుఖ్‌నగర్, అక్టోబర్ 31: వచ్చే ఏడాది వర్షాకాలం వరకు ఎల్‌బినగర్ నియోజకవర్గంలోని ముంపునకు గురయ్యే ప్రాంతాలకు లేకుండా చేయడమే ధ్యేయమని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గడ్డిఅన్నారం డివిజన్‌లో వర్షం నీటి తాకిడికి చాలా కాలనీలు ముంపునకు గురవుతున్నాయని, వచ్చే ఏడాదికి పరిస్థితిని రూపుమాపేందుకు తగు చర్యలు చేపడతానని అన్నారు.
షర్మిల యాత్రతో ఇతర పార్టీలకు దడ
కుత్బుల్లాపూర్, అక్టోబర్ 31: షర్మిల యాత్రతో కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వైఎస్‌ఆర్ సిపి జిల్లా యూత్ కన్వీనర్ జి సురేశ్‌రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సురేశ్‌రెడ్డి, కొలను శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలోనగేష్ యాదవ్ దాదాపుమూడువందల మంది యువకులతోకలిసి వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. అనంతరం సురేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి నగేష్‌యాదవ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆర్థిక సహాయం అందలేదు
మేడ్చల్, అక్టోబర్ 31: స్వైన్‌ఫ్లూతో మృతిచెందిన మేడ్చల్ వాసి రింకూదేవి వైద్యం ఖర్చు ప్రభుత్వం భరించిందని మండల వైద్యాధికారి ఆనంద్ ప్రకటన అవాస్తవమని మృతురాలు బంధువులు పేర్కొన్నారు. వైద్యం ఖర్చు అంతా తామే భరించామని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
ఉచిత కంటి పరీక్షలు
మెడ్చల్, అక్టోబర్ 31: పట్టణంలోని హరిజనవాడలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బుధవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. చిన్నారి చూపు కార్యక్రమంలో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించారు. సమన్వయకర్త సంధ్యరాణి, ఎంఇవో లక్ష్మారెడ్డి, హెచ్‌ఎం మస్తాన్‌వలీ పాల్గొన్నారు.
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
మేడ్చల్, అక్టోబర్ 31: క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఎండిపివో కె.శోభ సూచించారు. బుధవారం పట్టణశివారులోని సెయింట్ క్లారెట్ పాఠశాలలో శామీర్‌పేట, మేడ్చల్ మండలాలకు చెందిన అండర్-14, 16 విద్యార్థి క్రికెట్ క్రీడాకారుల ఎంపిక పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.
ఇందిరాగాంధీకి ఘన నివాళి
కుత్బుల్లాపూర్, అక్టోబర్ 31: ఇందిరాగాంధీ కన్న కలలను నిజం చేయాలని ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. బుధవారం ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా గాజులరామారం చౌరస్తాలోని ఇందిరాగాంధీ విగ్రహానికి శ్రీశైలంగౌడ్ పూలమాలవేసి, ఘనంగా నివాళులు ఆర్పించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కెపిహెచ్‌బి కాలనీలో..
కెపిహెచ్‌బి కాలనీ: కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని భరత్‌నగర్‌లోని పోచమ్మ గ్రౌండ్‌లో బుధవారం ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ నాయకుడు పి.నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వడ్డేపల్లి నర్సింగరావు విచ్చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పెంటయ్య, స్వరూప, సత్యం, సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.
కంటోనె్మంట్‌లో..
కంటోనె్మంట్: భారత రత్న ఇందిరాగాంధీ సేవలను దేశ ప్రజలు మరువలేరనీ గ్రేటర్ హైద్రాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్ ఎం.నర్సింహయాదవ్ అన్నారు. బుధవారం ఆమె 27వ వర్ధంతిని పురస్కరించుకుని బోయిన్‌పల్లి డివిజన్ కార్యాలయం ముందు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అల్వాల్ ఇందిరానగర్‌లోని విగ్రహానికి గ్రేటర్ కో ఆప్షన్ సభ్యుడు నందికంటి శ్రీ్ధర్ ఆద్వర్యంలో పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్పొరేటర్ టి.గీతారాణి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఓల్డు అల్వాల్ చౌరస్తాలోని ఇందిరాగాంధీ వర్ధంతిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఉప్పల్‌లో..
ఉప్పల్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని బుధవారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు టి.బిక్షపతియాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొమ్మక్ గోపీనాధ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. ఉప్పల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ముశ్యం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక సర్వే ఆఫ్ ఇండియా చౌరస్తాలో నిర్వహించిన ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే రాజిరెడ్డి, కార్పొరేటర్ సుగుణాదయాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు నర్సింహారెడ్డి, కృష్ణ, ప్రభాకర్, రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొని ఇందిర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆమె దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
నేరేడ్‌మెట్‌లో..
నేరేడ్‌మెట్: భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ అన్నారు. ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా నేరేడ్‌మెట్ చౌరస్తాలోని ఆమె విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరియమ్మచాకో తదితరులు పాల్గొన్నారు.
మల్కాజిగిరిలో..
మల్కాజిగిరి: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని మల్కాజిగిరిలో బుధవారం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కాంగ్రెస్ జిల్లా నాయకులు కె.ఎం.ప్రతాప్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
బేగంపేటలో..
బేగంపేట: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చేసిన సేవలు దేశానికి మరవరానివని నగర కాంగ్రెస్ సీనియర్ నాయుకుడు షేక్‌గౌస్ అన్నారు. బుధవారం బేగంపేట డివిజన్ ప్రకాష్‌నగర్ చౌరస్తాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సనత్‌నగర్ బి-బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పూర్ణానందం, నాయకులు రంగనాయకులు, మహ్మద్ సలీం, కృష్ణ, తుకారాం పాల్గొన్నారు. మోండామార్కెట్‌లో ఇందిరా విగ్రహం వద్ద వర్ధంతి వేడుకల్లో మర్రి శశిధర్‌రెడ్డి తనయుడు మర్రి ఆదిత్యరెడ్డి, కార్పొరేటర్ కిరణ్మయి, బేగంపేట, సనత్‌నగర్ కార్పొరేటర్లు మహేశ్వరి, ఆయుబ్‌ఖాన్, స్థానిక నేతలు పాల్గొన్నారు.
చాంద్రాయణగుట్టలో..
చాంద్రాయణగుట్ట: మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 28వ వర్థంతిని పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో బుధవారం నిర్వహించారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.పి.క్రాంతికుమార్ జంగంమ్మెట్‌లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
జీడిమెట్లలో..
జీడిమెట్ల: ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె.ఎం.ప్రతాప్ అన్నారు. బుధవారం జగద్గిరిగుట్టలోని ఇందిరాగాంధీ వర్ధంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు, వికలాంగులకు, విద్యార్థులకు ప్రతాప్ పండ్లు, బ్రెడ్‌లను పంపిణీ చేశారు. ఇందిర సూచించిన బాటలోనే ప్రతి ఒక్కరు నడవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పలువురు పాల్గొన్నారు.
వనస్థలిపురంలో..
వనస్థలిపురం: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.రామ్మోహన్‌గౌడ్ పలు ప్రాంతాల్లో ఇందిరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
దేశానికి ఇందిర, వల్లభాయ్ సేవలు మరువలేనివి
వికారాబాద్: భారతదేశానికి ఇందిరాగాంధీ, సర్ధార్ వల్లభాయ్‌పటేల్ చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర చేనేత, జౌళి, చిన్నతరహా పరిశ్రమల శాఖా మంత్రి జి.ప్రసాద్‌కుమార్ అన్నారు. బుధవారం ఇందిరాగాంధీ వర్థంతి, సర్ధార్‌వల్లభాయ్ పటేల్‌ల జయంతి సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇద్దరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులు రెండు నిమిషాలు వౌనం పాటించారు.
మహేశ్వరంలో..
మహేశ్వరం: రాజకీయాలకు అతీతంగా సమాజసేవతోపాటు దేశాభివృద్ధికి యువజన సంఘాలు పాటుపాడాలని నెహ్రూ యువజన కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ వెంకటేశం, తహశీల్దార్ ఎంవి రమణ, ఎంపిడివో నీరజ పేర్కొన్నారు. సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకొని బుధవారం మండల పరిధిలోని కొంగర రావిర్యాల గ్రామంలో సర్దార్ పటేల్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎన్‌వైకె, రెడ్‌క్రాస్ సొసైటీల సౌజన్యంతో 50 మంది యువకులు రక్తదానం చేశారు.
పటేల్‌కు సాయన్న నివాళి
కంటోనె్మంట్: భారతజాతి ఉక్కుమనిషి సర్దార్ పటేల్ సేవలను దేశ ప్రజలు మర్చిపోలేరనీ జి.సాయన్న తెలిపారు. బుధవారం ఆయన జయంతిని పురస్కరించుకుని రసూల్‌పురాలోని వల్లభాయ్‌పటేల్ కాలనీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
శేరిలింగంపల్లిలో..
శేరిలింగంపల్లి: భారతదేశంలో 565 సంస్థానాలు విలీనం కావడానికి కృషిచేసిన మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయిపటేల్ సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఆహ్వానం సంస్థ ఆధ్వర్యంలో కీర్తన అనాధాశ్రమంలో పటేల్ జయంతి వేడుకలు బుధవారం జరిపారు. టి.రామస్వామి యాదవ్ హాజరై వృద్ధులకు పండ్లు పంచిపెట్టారు. పటేల్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని యువతకు సూచించారు.
బ్రాహ్మణిజాన్ని అవహేళన చేయొద్దు
కెపిహెచ్‌బి కాలనీ, అక్టోబర్ 31: బ్రాహ్మణిజాన్ని అవహేళన చేస్తే సహించేదిలేదని బ్రాహ్మణ శ్రీ వైష్ణవ సేవా సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాండూరి నరేంద్రచార్య, శేషాచార్యులు హెచ్చరించారు. సనాతన ధర్మాలను అనుసరించకపోయినా అవహేళన చేయడానికి వీల్లేదని వారు కోరారు. ఇటీవల విడుదలైన దేనికైనా రెడీ చిత్రంలో బ్రాహ్మణిజాన్ని, సనాతన వేద ధర్మాన్ని అవమాన పరిచేలా నిర్మించారని, దానిని నిషేధించాలని డిమాండ్ చేశారు. యజ్ఞ యాగాలు, హోమాలు వాటి విశిష్టతపై సరైన అవగాహన లేకుండా వికృత చేష్టలతో కూడిన హాస్యాన్ని సినిమాల్లో జోడిస్తున్నారని, ఇది మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్రహ్మణ సేవా సంఘం ధర్నా
వనస్థలిపురం: దేనికైన రెడీ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ వనస్థలిపురం బ్రహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం వనస్థలిపురంలోని సుష్మా థియేటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సినిమాలో బ్రహ్మణ కులస్థులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, నిర్మాత మోహన్‌బాబుపై కేసు నమోదు చేయాలని సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మణ సేవా సంఘం సమాఖ్య జిల్లా కార్యదర్శి మంగపతి, గ్రేటర్ కాంగ్రెస్ కార్యదర్శి సిరిపురం అప్పారావు పాల్గొన్నారు.
బాబు యాత్ర విజయవంతం కావాలని ‘తమ్ముళ్ల’ పూజలు
మల్కాజిగిరి, అక్టోబర్ 31: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న పాదయాత్రలు విజయవంతం కావాలని మల్కాజిగిరిలోని వసంతపురిలో గల దుర్గాదేవి ఆలయంలో బుధవారం టిడిపి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓల్డ్‌మల్కాజిగిరి డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు జలంధర్‌రెడ్డి, శ్రీ్ధర్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజలకు కార్పొరేటర్లు వై.ప్రేమ్‌కుమార్, సుమలతారెడ్డి, మంజుల గౌడ్ పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్‌లో హరీశ్వర్‌రెడ్డి రాక హర్షణీయం
తాండూరు, అక్టోబర్ 31: టిడిపి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడం హర్షణీయమని తాండూరు పట్టణ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆయుబ్‌ఖాన్, నియోజకవర్గ ఇన్‌చార్జి బైండ్ల విజయ్‌కుమార్ వ్యక్తం చేశారు.
సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలి
పరిగి, అక్టోబర్ 31: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేవిధంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్టహ్రోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం పరిగి నియోజకవర్గంలో 12 కోట్ల 57 లక్షల ప్రభుత్వ పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిగి, వికారాబాద్, చేవేళ్ళలలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరిగి నుంచి తునకలగడ్డకు వెళ్లే దారిలో బ్రిడ్జి, గండ్వీడ్ మండలం సాలార్‌నగర్ దగ్గర బ్రిడ్జి నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. పిసిసి కార్యదర్శి టి రాంమోహన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలను ఎప్పటికప్పుడు హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం వలన సమస్యలు పరిష్కరించగలుగుతున్నామని పేర్కొంటూ హోంమంత్రికి కృతజ్ఞతలు తెలపారు. డిసిసి ఉపాధ్యక్షుడు సుభాష్, నారాయణ్‌రెడ్డి, దోమ రాంచంద్రరెడ్డి, దామోదర్‌రెడ్డి, నస్కల్ అశోక్, నర్సింహ్మరావు, అశోక్‌రెడ్డి, పరిగి, పూడూరు, దోమ, కుల్కచర్ల, గండ్వీడ్, మండలాల నాయకులు పాల్గొన్నారు.
పాఠశాలలో మొక్కలు నాటిన కార్పొరేటర్
కెపిహెచ్‌బి కాలనీ, అక్టోబర్ 31: డివిజన్‌లోని హైదర్‌నగర్ హెచ్‌ఎంటి హిల్స్ వీకర్ సెక్షన్ ప్రభుత్వ పాఠశాలలో శిల్పా బృందావనం కాలనీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా వారి సౌజన్యంతో ఏర్పాటుచేసిన పవర్‌బోర్, మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ భానుప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న పచ్చదనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సురేఖ, రవీందర్, బాలరాజు, లక్ష్మి, రాము తదితరులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి భూమి పూజ
కుత్బుల్లాపూర్, అక్టోబర్ 31: డి.పోచంపల్లి పరిధిలోని స్వామి వివేకానందకాలనీలో పోచమ్మ ఆలయ నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుడు మాధవ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆలయకమిటీ చైర్మన్ బి.ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, బుచ్చయ్య, రాముగౌడ్, రామ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ విద్యార్థులకు నగదు పురస్కారాలు
సైదాబాద్, అక్టోబర్ 31: ఉత్తమ ప్రతిభ కనబరిచిన సగర కులస్థుల విద్యార్థులకు నగదు పురస్కారాలు అందచేయనున్నట్లు అఖిల భారత సగర మహాసభ అధ్యక్షుడు శ్రీరాల శ్రీరాములు సాగర్ తెలిపారు. బుధవారం సైదాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాల, కళాశాల, సాంకేతిక విద్యలలో ప్రతిభ కనబరిచిన సగర విద్యార్థులకు ఈనెల 4న సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని స్కంగగిరి దేవాలయంలో అఖిల భారత సగర మహాసభ, సగర క్షత్రియ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో సగర మహాసభ ఉపాధ్యక్షుడు దేవేందర్ సాగర్, ప్రధానకార్యదర్శి పార్థసారథి సాగర్ పాల్గొన్నారు.
కార్మికులకు గుర్తింపు కార్డుల అందజేత
సైదాబాద్, అక్టోబర్ 31: గుర్తింపు కార్డులు పొందడం ద్వారా భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందవచ్చని టిఎన్‌టియుసి రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఘట్టమనేని లక్ష్మినారాయణ అన్నారు. బుధవారం మలక్‌పేటలో రాష్ట్ర లేబర్ కమిషన్ ద్వారా జారీ అయిన గుర్తింపు కార్డులను ఆయన కార్మికులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహ, నాయకులు ఎం.వెంకటేశ్, ప్రదీప్‌కుమార్, శ్రీధర్ ముదిరాజ్ పాల్గొన్నారు.
సర్వేకు స్వాగత ఏర్పాట్లు
వనస్థలిపురం, అక్టోబర్ 31: కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పదవీ స్వీకరించి నగరానికి వస్తున్న సందర్భంగా 5వేలమందితో ర్యాలీగా వెళ్లి స్వాగతం పలకనున్నట్లు హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.రాంమోహన్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.