ఉరవకొండ, నవంబర్ 3: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశ పెట్టిన 108 సేవలను ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్లే టిడిపి నాయకుడు ఎర్రన్నాయుడు మృతి చెందారని, దీనికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బాధ్యత వహించాలని వైఎస్ షర్మిల అన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 12 వరోజు అనంతపురం జిల్లా ఉరవకొండలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ రోడ్డు ప్రమాదంపై 11 సార్లు 108కి ఫోన్ చేసినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. అదే వైఎస్ హయాంలో ఒక్కసారి ఫోన్ చేస్తే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేవన్నారు. 108తో పాటు పేదల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీలో నేడు వైద్య సేవలు అందడం లేదన్నారు. రోగులను తిప్పి పంపుతున్నారన్నారు. వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆమె ధ్వజమెత్తారు. టిడిపి హయాంలో పంటలు పండక రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. అయినా వారి కుటుంబాలను బాబు ఏమాత్రం పరామర్శించలేదన్నారు. కాంగ్రెస్, టిడిపిలకు రైతులను పూర్తిగా విస్మరించాయన్నారు. సరైన సమయంలో రెండు పార్టీలకు బుద్దిచెప్పాలన్నారు.
- వైఎస్ షర్మిల డిమాండ్ -
english title:
sharmila demand
Date:
Sunday, November 4, 2012