వరంగల్, నవంబర్ 1: రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోటీ పడుతూ వరంగల్ జిల్లా ప్రగతిపథంలో దూసుకెళ్తోందని కలెక్టర్ రాహుల్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం హన్మకొండ కెడిసి గ్రౌండ్‌లో కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా సంతృప్తికరమైన వర్షపాతం నమోదైందని, ఖరీఫ్ సాగు విస్తీర్ణం దాదాపు 50వేల హెక్టార్లలో పెరిగిందని వివరించారు. జిల్లాలో 4.70లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి మించి మొత్తంగా 5.16లక్షల హెక్టార్లలో రైతులు ఖరీఫ్ పంటలు సాగుచేస్తున్నారని, 2.74లక్షల హెక్టార్లలో పత్తి, 1.38లక్షల హెక్టార్లలో వరి వేసారని తెలిపారు. రైతులకు గిట్టుబాటు కల్పించేందుకు 125్ధన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగమైన పాడిపరిశ్రమ అభివృద్ధిలో భాగంగా జిల్లాలో పశుక్రాంతి పథకం కింద 2053గేదెలను అందజేసి జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందని అన్నారు. ప్రస్తుతం డిఆర్‌డిఎ ద్వారా 258 మినీడైరీలను ప్రారంభించబోతున్నామని, ఇప్పటి వరకు 170యూనిట్లు ఏర్పాటయ్యాయని తెలిపారు. 1305కోట్ల రూపాయల వ్యయంతో రైతులకు నిరాఘాటంగా ఉచిత విద్యుత్ అందుతోందని అన్నారు. ఆరవవిడత భూపంపిణీకి కార్యాచరణ సిద్ధం చేశామని, జిల్లాలో 4431మంది లబ్ధిదారులకు 5500 ఎకరాల భూమిని పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. ఇందిర జలప్రభ కింద 1066 ఎకరాలకు సాగు వసతి కల్పించామని, ఉపాధిహామీ కింద 155కోట్ల రూపాయలతో 6.33లక్షల కూలీలకు పనికల్పించామని అన్నారు. గిరిజన గ్రామాల్లో 30కోట్ల రూపాయలతో వివిధ పనులు పురోగతిలో ఉన్నాయని, కొత్త స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు నాబార్డు ద్వారా 10వేల రూపాయలను గ్రాంట్‌గా అందజేసే అవకాశాన్ని మహిళలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాజీవ్ యువకిరణాల్లో 2877మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించామని, ప్రజలకు వివిధ ధృవీకరణ పత్రాల కోసం ఏర్పాటు చేసిన మీ సేవా కార్యక్రమంలో జిల్లా రాష్ట్రంలో ఎనిమిదవ స్థానంలో ఉందని చెప్పారు. ఆరోగ్యశ్రీలో 228కోట్ల రూపాయలతో 89వేల మందికి వైద్య చికిత్సలు అందించామని, 1.82లక్షల మంది పిల్లలు, 58వేల మంది గర్భిణీలకు ఐసిడిఎస్ ద్వారా పోషకాహారం ఇస్తున్నామని అన్నారు. ఓరుగల్లు నగరాన్ని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దే సంకల్పంతో చేపట్టిన క్లీన్‌సిటీ కార్యక్రమం విజయవంతమైందని, సేకరించిన చెత్తను బయోగ్యాస్ ఉత్పత్తికి వినియోగిస్తున్నామని అన్నారు. జిల్లాలో 10.19లక్షల కుటుంబాలకు రూపాయికి కిలో బియ్యం పథకం అందజేస్తున్నామని అన్నారు. పర్యాటక అభివృద్ధికి కృషిచేస్తున్నామని, ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుండి ప్యాకేజి టూర్ల నిర్వహణకు పర్యాటక సంస్థ ప్రణాళిక రూపొందించిందని, హన్మకొండలో నిర్మించిన హరిత హోటల్ కాకతీయ ఉత్సవాల నాటికి ప్రారంభం అవుతుందని అన్నారు. ఏడాది పొడుగున కాకతీయ ఉత్సవాలను నిర్వహించబోతున్నామని అన్నారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ శాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్లను కలెక్టర్ తిలకించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రద్యుమ్న, వరంగల్ అర్బన్ ఎస్పీ శ్యాంసుందర్, అదనపు జెసి సంజీవయ్య, డిఆర్వో శేషాద్రి, నగరపాలక సంస్థ కమిషనర్ వివేక్‌యాదవ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అవత‘రణం’.. నిరసనల హోరు
టిఆర్‌ఎస్, జెఎసిల ఆధ్వర్యంలో భారీగా ఆందోళనలు * జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు * ప్రభుత్వ కార్యాలయాలపై నల్లజెండాలు
వరంగల్, నవంబర్ 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విద్రోహ దినంగా పాటించాలని టిఆర్‌ఎస్, రాజకీయ, ప్రజాసంఘాల జెఎసి ఇచ్చిన పిలుపుమేరకు వరంగల్ జిల్లాలో గురువారం భారీఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధంతో హోరెత్తించారు. వరంగల్ నగరంతోపాటు జిల్లాలోని పలుప్రాంతాలలో నిరసన కార్యక్రమాల సందర్భంగా పోలీసులు పలువురు తెలంగాణవాదులను అరెస్టుచేశారు. రాష్ట్రావతరణ దినోత్సవానికి వ్యతిరేకంగా టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో హన్మకొండ చౌరస్తా నుండి ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌తోపాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాలీ కాంగ్రెస్ భవన్ వద్దకు చేరుకున్న సమయంలో టిఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ భవన్‌లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వీరి ప్రయత్నాన్ని అడ్డుకున్న సందర్భంలో తోపులాట, వాగ్వివాదం జరిగింది. ఇదే సందర్భంలో ఒక టిఆర్‌ఎస్ కార్యకర్త కాంగ్రెస్ భవన్‌పైకి ఎక్కి నల్లజెండా ఎగరవేశారు. దాంతో రెచ్చిపోయిన పోలీసులు కాంగ్రెస్ భవన్ వైపు తోసుకువస్తున్న తెలంగాణవాదులపై స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఈ సందర్భంలో రంజిత్ అనే కార్యకర్తను పోలీసులు కుళ్లబొడిచారు. మరికొందరు కార్యకర్తలకు బలమైన గాయాలు తగిలాయి. తీవ్రంగా గాయపడిన రంజిత్‌ను హుటాహుటిన ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దాష్టికాన్ని చూసిన రోడ్డుపక్కన పండ్లు అమ్ముకునే మహిళలు పోలీసులను అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంలో హన్మకొండ సిఐ వెంకటేశ్వరబాబు, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగింది. జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించి నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. నల్లజెండా ఎగరవేసేందుకు న్యాయవాదులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసు వలయాన్ని చేధించుకుని న్యాయవాదులు జిల్లా కోర్టు భవనంపై నల్లజెండా ఎగరవేశారు. కోర్టు ఆవరణలోకి పోలీసులు ప్రవేశించడాన్ని నిరసిస్తూ జిల్లా కోర్టులో బైఠాయించి ఆందోళనకు దిగారు. జిల్లా జడ్జి లీలావతి న్యాయవాదులను సముదాయించి అక్కడి నుండి పంపించివేశారు. పోలీసులు జిల్లా కోర్టులోకి ప్రవేశించి న్యాయవాదుల పట్ల అనుచితంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ కొందరు న్యాయవాదులు కోర్టు ఆవరణలోని న్యాయ సహాయక కేంద్రంలోకి వెళ్లి తలుపులు వేసుకుని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అవతరణ దినోత్సవానికి వ్యతిరేకంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కెయు క్రాస్‌రోడ్ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రాలలో అవరతణ దినోత్సవాల సందర్భంగా టిఆర్‌ఎస్, వివిధ జెఎసిల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జనగామ పట్టణంలో టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో నల్లజెండాలను ఎగురవేసి నిరసన తెలిపారు. జనగామ కోర్టులకు చెందిన న్యాయవాదులు విధులు బహిష్కరించి, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మహబూబాబాద్ పట్టణంలోని వివిధ కోర్టులలో పనిచేసే న్యాయవాదులు విధులు బహిష్కరించి నల్లజెండా ఎగురవేయగా, టిఆర్‌ఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్లజెండాలను ముఖాలకు కట్టుకుని భారీ ప్రదర్శన నిర్వహించి సమైఖ్య ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్థం చేశారు. జెఎసి కన్వీనర్ డోలి సత్యనారాయణ, టిఆర్‌ఎస్ నాయకుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. కురవి, నర్సింహులపేటలో తహశీల్ కార్యాలయం, ఎంపిడిఓ కార్యాలయం, బస్టాండ్ సెంటర్లలో నల్లజెండాలు ఎగురవేశారు. భూపాలపల్లి ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అవతరణ దినోత్సవానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ నల్లజెండాలు ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్ అజ్మీర చందులాల్, మండల అధ్యక్షుడు కుటుంబరావు ఆధ్వర్యంలో ములుగు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నల్లజెండా ఎగరవేసి, ఏటూరునాగారం-వరంగల్ జాతీయ రహదారిపై ర్యాలీ, ధర్నా నిర్వహించారు. స్టేషన్ ఘన్‌పూర్ మండలకేంద్రంలో జరిగిన మోటార్‌సైకిల్ ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య పాల్గొన్నారు.
రైతుల్లో ‘నీలం’ దడ!
* వర్షంతో దెబ్బతింటున్న పంటలు
వరంగల్, నవంబర్ 1: ‘నీలం’ తుపాను వరంగల్ జిల్లా రైతులను వణికిస్తోంది. తుపాను కారణంగా జిల్లాలోని అనేక చోట్ల బుధవారం రాత్రినుండి మధ్యమధ్యలో కొంత సమయం తెరిపినిస్తూ గురువారం రాత్రి వరకు జిల్లా అంతటా వర్షం కురిసింది. వర్షంతో జనజీవనం స్తంభించిపోగా.. మరోవైపు రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. పొట్టదశకు వచ్చిన వరి పంటతోపాటు పలు వ్యవసాయ ఉత్పత్తులు తడిసిపోయే ప్రమాదం ఏర్పడిందని అన్నదాత రోదిస్తున్నాడు. గత రెండు వ్యవసాయ సీజన్లలోను కష్టాలనష్టాలు చవిచూసిన అన్నదాతను అడపాదడపా కురుస్తున్న అకాల వర్షాలు దెబ్బతీస్తూనే ఉన్నాయి. తాజాగా నీలం తుపాను కారణంగా జిల్లాలోని నర్సంపేట, ములుగు, పరకాల, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో బుధవారం రాత్రినుండి కురుస్తున్న వర్షం పంటలను దెబ్బతీస్తోంది. జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో మూడులక్షల హెక్టార్లలో వరిపంట, దానికి కాస్త అటుఇటుగా పత్తిపంట సాగుచేస్తున్న రైతుల గుండెల్లో ‘నీలం’ వణుకు పుట్టిస్తోంది. వరి పంట పొట్టదశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ధాన్యం ఇంటికి చేరుకోవలసిన తరుణంలో పడుతున్న వర్షం కారణంగా తమకు నష్టమే మిగిలే ప్రమాదం ఏర్పడిందని రైతులు విలపిస్తున్నారు. అల్పపీడన ధ్రోణి ప్రభావం మరో 24 గంటలు లేదా ఇంకో రెండురోజులపాటు ఉండే అవకాశం ఉన్నందున.. విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని మరోవైపువాతావరణ శాఖ అధికారులు చేస్తున్న ప్రకటన కూడ రైతులను అయోమయానికి గురిచేస్తోంది. వర్షం ఎడతెరిపి లేకుండా కురిస్తే మాత్రం పంటలకు ఈ పర్యాయం కూడా తీవ్రనష్టం తప్పకపోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు కూడా అంటున్నారు. ఇక మిర్చి, పసుపు, మొక్కజొన్న పంటలకు కూడా నష్టమే కలగనున్నది. ఇదిలా ఉంటే వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు ఆటంకం కలుగుతోంది.
రైళ్లకు ‘నీలం’ ఎఫెక్ట్
మహబూబాబాద్, నవంబర్ 1: నీలం తుపాన్ ప్రభావం రైలు ప్రయాణికులపైనా పడుతోంది. విజయవాడ-నెల్లూరు-చెన్నై మార్గాల్లో రైలు సర్వీసులను మళ్లిస్తున్న తరుణంలో గురువారం వరంగల్-విజయవాడ రూట్‌లో రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఎడతెరపి లేకుండా గురువారం మధ్యాహ్నం నుండి వర్షంతో రైల్వేట్రాక్‌లకు ఆనుకుని ఉన్న వాగుల పరిస్థితిని అంచనా వేస్తూ రైళ్లను నెమ్మదిగా నడిపించారు. హైదరాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నిర్ణిత సమయం కన్న 40నిమిషాలు ఆలస్యంగా నడవగా, తుపాన్ కారణంగా రాకపోకలను నియంత్రించడంతో వరంగల్ రైల్వేస్టేషన్ నుండి మహబూబాబాద్‌కు గంట వ్యవధిలో చేరవలసిన ఈ రైలు గంటన్నర పైగా దాటింది. కాజీపేట-్భద్రాచలం మణుగూరు ప్యాసింజర్, సికింద్రాబాద్-విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్, అప్‌లైన్‌లో ఇంటర్‌సిటి, చెన్నై-అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అరగంట నుండి గంట ఆలస్యంగా నడిచాయి. తుపాన్ కారణంగా బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం మరో 24గంటలు ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ వర్షం తమను దెబ్బతీస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొట్టదశకు చేరుకున్న వరిపంట నీట మునిగే ప్రమాదం ఉండగా, పత్తి, మిర్చి, పసుపు తదితర చేన్లలో కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
ఉద్రిక్తతల మధ్య జిల్లా కోర్టులో నల్లజెండా
వరంగల్ , నవంబర్ 1: తెలంగాణను ఆంధ్రలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ గురువారం నవంబర్ 1న రాష్ట్రావతరణ దినోత్సవాన్ని తెలంగాణ విద్రోహ దినంగా పేర్కొంటూ న్యాయవాదులు జిల్లా కోర్టులో తీవ్ర ఉద్రిక్తతల మధ్య నల్లజెండాలను ఎగరవేశారు. తెలంగాణ విద్రోహదినంగా పేర్కొంటూ నల్లజెండాలు ఎగరవేసి నిరసన తెలపాలని జాక్ పిలుపుమేరకు జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కోర్టులో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. అనంతరం నల్లజెండాలు, నల్లబెలూన్‌లు చేతబూని న్యాయవాదులు రాష్ట్రావతరణ తెలంగాణకు విద్రోహమే అంటూ నినాదాలు చేశారు. కోర్టు మొత్తం కలియతిరుగుతూ జిల్లా కోర్టుపై నల్లజెండాను ఎగరవేయడానికి విఫలయత్నం చేశారు. కోర్టు ముందు నల్లజెండాను కట్టెకు చుట్టి జెండాను ఎగరవేశారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాళ్లపెల్లి జనార్థన్‌గౌడ్ అసొసియేషన్ హాలు ముందు పెద్దఎత్తున గుమిగూడి నల్లజెండా ఎగరవేస్తుండగా అప్పటికే పెద్దఎత్తున మోహరించిన పోలీసులు జెండా ఎగరవేతను అడుగడుగునా అడ్డుకోవడం, పోలీసులను చేధించుకుంటూ న్యాయవాదులు జెండాలు ఎగరవేయడంతోపాటు న్యాయవాదులను పోలీసు కెమెరాలో చిత్రీకరిస్తుండగా కోపోద్రిక్తులై కెమెరా లాక్కున్నారు. దీంతో సుబేదారి సిఐ, ఎస్సైలు న్యాయవాదులపై దౌర్జన్యం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు న్యాయవాదులకు మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. దీంతో కొందరు న్యాయవాదులు పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జిల్లా కోర్టులోకి ప్రవేశించారు. జిల్లా కోర్టులో బైఠాయించి పోలీసుల తీరుపై నిరసన తెలిపారు.
యువత దేశానికి వెనె్నముక
* మంత్రి సారయ్య
వరంగల్ బల్దియా, నవంబర్ 1: యువత దేశానికి వెనె్నముక అని బిసి సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. గురువారం రాత్రి నగరంలోని పోచమ్మమైదాన్‌లోగల ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బస్వరాజు శ్రీమాన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సారయ్య యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు ఐడికార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి సారయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీలో చేసిన కృషిని గుర్తించి నేడు తనకు మంత్రి పదవి ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కేంద్రప్రభుత్వం తప్పకుండా ఇస్తుందని తెలిపారు. అనంతరం యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి సారయ్య, ఎంపి రాజయ్యలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపి సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్‌పార్టీ నాయకులు మంద వినోద్‌కుమార్, శ్రీనివాస్, రాజు, శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.
ఎంజిఎంను పరిరక్షించాలని లక్ష సంతకాల సేకరణ
వరంగల్ , నవంబర్ 1: పేదల ధర్మాసుపత్రి ఎంజిఎంను పరిరక్షించి నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఎంజి ఎం ఆసుపత్రిలో ఎంజిఎం పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పరిరక్షణ సమితి కన్వీనర్ భూపతి కృష్ణమూర్తి తొలి సంతకం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంజిఎం ఆసుపత్రికి నిత్యం వేలాదిగా వచ్చే రోగులకు ఆసుపత్రిలో వౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోగులు అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. సరైన సిబ్బంది, పరికరాలు లేకపోవడంతో మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆసుపత్రిలో వౌలిక సదుపాయలు కల్పించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ సమితి నాయకులు గుడిమళ్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.