అనంతపురం, నవంబర్ 3: రాష్ట్రంలోని వివాదరహిత భూములను పేదలకు పంచుతామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో శనివారం ఆయన ఆరవ విడత భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కోర్టుల్లో వివాదాలు లేని భూములను సేకరించి పేదలకు పంపిణీ చేస్తామన్నారు. రాబోయే ఆరు మాసాల్లో ఎక్కడెక్కడ వ్యవసాయ సాగు భూమి ఉందో తెలుసుకుని అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామన్నారు. భూమి లేని వారికి భూమితో సమాజంలో హోదా, గౌరవం, మర్యాద ఏర్పడుతాయన్నారు. రాష్ట్రంలో 2004 వరకూ 52 లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐదు విడతల్లో ఆరు లక్షల 80 వేల ఎకరాల భూమి పంపిణీ చేశామన్నారు. ఆరవ విడత భూ పంపిణీలో భాగంగా మరో 80 వేల ఎకరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. రైతుకు పని, హోదాతో పాటు అన్నం పెట్టేది భూమి మాత్రమేనన్నారు. ఇందిర జలప్రభ పథకం ద్వారా ఒక్కో రైతుకు ఎకరాకు రూ.1.80 వేలు ఖర్చు చేస్తున్నామన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థానంలో ఉండేలా తీర్చిదిద్దామన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల పావలా వడ్డీ బకాయిలు సుమారుగా రూ. 600 కోట్ల వరకూ ఉంటాయని, వాటిని త్వరలో మంజూరు చేస్తామన్నారు. జూలై నుంచే మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి మూడు నెలల నుంచి ఎస్‌హెచ్‌జిలకు ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.25 వేల కోట్ల రుణాలు ఇస్తే, ఒక్క మన రాష్ట్రంలోనే రూ.13 వేల కోట్లు అందించామన్నారు. అనంతపురం జిల్లాకు వరదాయినిగా ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టుకు రూ. 6,500 కోట్లు ఖర్చు చేశామన్నారు. దీని ద్వారా జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. కోటి మంది రైతులకు ఈ ఖరీఫ్ నుంచి వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. అంతకుముందు లబ్దిదారులకు భూమి పట్టాలను ముఖ్యమంత్రి వేదికపై అందజేశారు. రూ.128 కోట్ల రుణాలను మహిళలకు పంపిణీ చేశారు. సభలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, రెవెన్యూమంత్రి రఘువీరారెడ్డి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్, ప్రభుత్వ విప్ వై. శివరామిరెడ్డి, ఎమ్మెల్యేలు పల్లె రఘునాథరెడ్డి, అబ్దుల్ ఘనీ, మధుసూదనగుప్తా, సుధాకర్, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు గేయానంద్, గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు.
సాయి సమాధిని దర్శించుకున్న సిఎం
పుట్టపర్తి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని శనివారం దర్శించుకున్నారు. బహిరంగసభ ముగియగానే నేరుగా ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మండపానికి చేరుకున్నారు. అక్కడ సిఎంకు ట్రస్టు కార్యదర్శి ప్రసాదరావు, ట్రస్టు సభ్యులు రత్నాకర్, చక్రవర్తి తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం సత్యసాయి మహాసమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి ప్రణమిల్లారు పుట్టపర్తి సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు సంపూర్ణ సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సత్యసాయి శివైక్యం అనంతరం భక్తుల్లో అభద్రతా భావం నెలకొందని మంత్రులు తన దృష్టికి తీసుకువచ్చారని, ఈ విషయంలో తగుచర్యలు తీసుకుంటామన్నారు. (చిత్రం) పుట్టపర్తిలో శనివారం మహిళా లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తున్న సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి. మంత్రులు గంటా శ్రీనివాసరావు, రఘువీరా, శైలజానాథ్
పుట్టపర్తిలో 6వ విడత పంపిణీకి ముఖ్యమంత్రి శ్రీకారం
english title:
cm
Date:
Sunday, November 4, 2012